Pages

Tuesday, October 13, 2015

ఒకే ఒక్క శబ్దం 13 - ఈ అలవాట్లు కూడా ఎంత చిత్రమైనవో!

తలుపులన్నీ తెరిచి ఉన్నా బయటకి ఎగిరివెళ్ళక లైటు చుట్టూనే రెక్కలు తపతప కొట్టుకుని కొట్టుకుని మరణిస్తాయి కొన్ని పురుగులేవో!
విషాదం లోంచీ, నొప్పుల్లోంచీ, చీకటి వలయాల్లోంచీ నడుస్తూ ‘అబ్బా, ఈ ఊపిరాగిపోతే బాగుండు!’ అని విసుగ్గా అనుకుంటూనే తెలీకుండా ఇంకాస్త గట్టిగా శ్వాస తీసుకుంటాం!

పోరాడీ పోరాడీ విరిగిన రెక్కలతో, రాలుతున్న పూవులని చూస్తూ కూడా మరుసటి రోజుకి మొగ్గల్ని యధాలాపంగా లెక్క వేసుకుంటాం!

కరుకు కాలాల బారినుండి అతిరహస్యంగా తప్పించుకుందామనుకుంటూనే అవసరంగానో, అప్రయత్నంగానో మళ్ళీ మంచి ఘడియలేవో దరిదాపుల్లోనే ఉన్నాయనుకుంటూ అక్కడే ఆగిపోతాము..

అలవాట్లు నిజంగానే చాలా విచిత్రమైనవి! బహుశా, ఇవే కొన్నిసార్లు మనుషుల్ని చీకట్లో సైతం వెలిగించగలుగుతాయి!



అలవాట్లు


ఊపిరి తీసుకోవడం కూడా ఎలాంటి అలవాటో!
బ్రతుకుతూ ఉండటం కూడా ఒక తంతులాంటిదే
ఎలాంటి శబ్దాలు లేవు శరీరంలో ఎక్కడా కూడా
ఏ నీడలూ లేవు కళ్ళల్లో
అడుగులు తడబడుతున్నాయి, నడక మాత్రం ఆగదు
ఈ ప్రయాణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది
ఎంత కాలం నించో, ఎన్ని ఏళ్ళుగానో
జీవిస్తూ ఉన్నాము, జీవిస్తూనే ఉన్నాము
ఈ అలవాట్లు కూడా ఎంత చిత్రమైనవో!


మూలం:
Aadaten

Saans Lena Bhi Kaisi Aadat Hai
Jiye Jaana Bhi Kyaa Ravaayat Hai

Koi Aahat Nahin Badan Men Kahin
Koi Saaya Nahin Hai Aankhon Men

Paanv Behis Hain, Chalte Jaate Hain
Ik Safar Hai Jo Bahta Rahta Hai

Kitne Barson Se, Kitni Sadiyon Se
Jiye Jaate Hain, Jiye Jaate Hain

Aadaten Bhi Ajeeb Hoti Hain


మొదటి ప్రచురణ సారంగలో...