Pages

Thursday, May 20, 2010

తప్పని వీడ్కోలు-2

   

..... ఆఖరి పెట్టె కూడా కనుచూపుమేర నించి అదృశ్యమైపోయినా ఏదో అత్యాశ.. ఇంకొన్ని క్షణాల్లో పట్టాల పక్కనున్న గడ్డిపూలు కోసుకుంటూ కనిపించే మలుపులోంచి తను నడిచి రావడం కనిపిస్తుందని! అవును, నేను ఇక్కడే వేచిఉంటానని తెలిసి ఏ క్షణాన్నైనా తను వచ్చేస్తుంది.. ఇందాకటివరకూ మాకాశ్రయమిచ్చిన బెంచీ మౌనంగానే నన్నాహ్వానించింది.. అప్పటిదాకా ఉన్న రంగుల వసంతాన్ని పంపేసి చుట్టూ శిశిరం సర్దుకుంది! ఋతువులు వెనక్కి నడవడంలేదుకదా?! ....


తెలుగుజ్యోతి జనవరి-ఫిబ్రవరి(2010) సంచికలో ప్రచురించబడిన చిన్న కధ... పూర్తిగా...
  
   

Saturday, March 6, 2010

ఒక చిన్నమాట... మీకు చెప్పాలని.. (అసలు సంగతి)

  
Part 1: ఒక చిన్నమాట... మీకు చెప్పాలని… (ముందో చిన్న కధ)


......... నామీద నాకు ఒక తప్పు అభిప్రాయం ఉండేది; సమయం, మూడ్ రెండూ ఉంటే నేను రాయగలనని.. కానీ ఈ కవితలపై కసరత్తు చేస్తున్నప్పుడు అర్ధమైంది ఆ రెండూ ఉన్నా నేను రాయలేనని!! ఒకసారి వెనక్కి వెళ్ళి పాతవన్నీ చదువుకుంటూ అవి రాసినప్పటి మనఃపరిస్థితిని గుర్తు చేసుకుంటుంటే తెలిసింది వాటిలో ఎక్కువభాగం జ్ఞాపకాలకీ, పొందిన అనుభవాలకీ, చూసిన సంఘటనలకీ మనసు ఉన్నట్టుండి మరల స్పందించడంవల్ల రాసినవే కానీ రాయాలన్న తపనతో శ్రమించి రాసినవి కావని!!


మొన్నొకరోజు "ఫ్రీక్వెంట్ గా రాయడానికికి నాకు కుదరడం లేదండీ!" అని నా మీద నేనే జాలిపడిపోతూ ఒక సన్నిహితుని దగ్గర వాపోతే ఆయన "గంగిగోవు పాలు సామెత గుర్తు తెచ్చుకోండి" అన్నారు... "ఏంటో ఆయన అభిమానం!" అనుకుంటూ నాపని నేను చేసుకోబోతుండగా ఒక్కసారిగా ఆయనలానే అభిమానంగా నా రాతల్ని పలుకరించే పాఠకులందరూ గుర్తొచ్చారు!

నేను రెండు నెల్లకో, నాలుగు నెల్లకో నా సమయమూ, మూడ్, స్పందన ఇత్యాది గ్రహాల కలయికకి అణుగుణంగా ఒక పదిలైన్లు రాసి 'ఇదుగోండహో' అని అందించగానే ఎంతో అభిమానంగా స్పందించే పాఠకులందరికీ అంటే మీ అందరికీ నేనెంతో ఋణపడిఉన్నాను.. నాకు పదివేలు, నాకు ఏభై అని మళ్ళీ మీరందరూ రెడీ అయిపోతారేమో అందుకే ముందే చెప్తున్నాను, "ఈ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనిది!" నిజ్జంగా!!

ఉద్యోగినిగా, గృహిణిగా ఏదో నాపని నేను చేసుకుంటూ గుంపులో కొట్టుకుపోతున్న నన్ను మీ అభిమానపూర్వక స్పందనలు ప్రత్యేకంగా నిలబెట్టాయి.. నాకెంతో ఇష్టమైన పుస్తక/రచనా ప్రపంచంలో నేనూ ఓ భాగమవ్వగలననే ఆత్మవిశ్వాసం కలిగించారు!! పాఠకులు అభిమానులయ్యారు.. అభిమానులు ఆప్తమిత్రులుగా మారితే.. ఆప్తమిత్రులు సన్నిహితులై కుటుంబ సభ్యుల్లా ఒదిగిపోయారు!! ఇలా కుటుంబంలో భాగంలా మారిపోయిన కొందరి గురించి ఇంకోసారి తప్పక రాస్తాను కానీ అసలు ఈ టపా ముఖ్యోద్దేశ్యం, నిషిగంధగా నాకో అస్థిత్వాన్నిచ్చిన మీ అందరినీ పేరుపేరునా తలచుకుని కృతజ్ఞతలు చెప్పడం!

అదే నే చెప్పాలనుకున్న చిన్నమాట...... Thank you! Thank you all very much!!

ఇక నేనెవరెవర్ని తల్చుకున్నాను అనేది చూడాలంటే కాఫీ/టీ లేదా మీకిష్టమైన పానీయం తెచ్చుకుని ఈ ఇమేజెస్ క్లిక్కండి :-)
నా జ్ఞాపకశక్తి మీద నాకున్న ప్రగాఢ నమ్మకంతో చెప్తున్నాను, తప్పకుండా కొన్నిపేర్లు మర్చిపోయి ఉంటాను.. వారికి నా ముందస్తు క్షమాపణలు... కానీ అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది అస్సలు కాదనీ, ఈమధ్య వదలకుండా నా కొంగుపట్టుకు తిరుగుతున్న మతిమరుపు కారణంగా అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ చెప్తున్నాను..

అలా మర్చిపోయినవారందరికీ మా పండు గాడితో నా స్పెషల్ థాంక్స్ పంపుతున్నాను..

అందరినీ ఒకసారి తలుచుకుని కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఈ Thanksgiving టపా రాయడం వెనుక వేరే కారణమేమీ లేదని నొక్కి వక్కాణిస్తూ.. సెలవు...
:-)
  
   

Thursday, March 4, 2010

ఒక చిన్నమాట... మీకు చెప్పాలని.. (ముందో చిన్న కధ)

   
  
ఆ మధ్య ఓ వారాంతం సాయంత్రం సమయమేంటో ఎటూ జారిపోకుండా నాపక్కనే బుద్దిగా కూర్చుంది.. నీక్కావాల్సినంతసేపు ఉంటానని కూడా మాటిచ్చేసరికి నా పాదపూజ చేసుకునే అవకాశం కాఫీటేబుల్ కి ఇచ్చేసి, తీరిగ్గా వెనక్కి జారగిలబడి, ఎన్నాళ్ళకో చేతికి చిక్కిన టివి రిమోట్ ని అపురూపంగా చూసుకుంటూ ఆన్ చేశాను.. సౌండ్ మొదలయ్యి, బొమ్మ కోసం నా కళ్ళు పత్తికాయల్లా విచ్చుకుని వేచి చూస్తుంటే ఉన్నట్టుండి టిక్ టిక్ టిక్ అని ఎవరో స్విచ్ ఆన్ ఆఫ్ చేసిన శబ్దం మొదలయ్యింది.. Mr.India లా ఎవరన్నా కనబడకుండా టివి పవర్ బటన్ ని నొక్కుతూ నన్ను ఆటపట్టిస్తున్నారేమోనన్న ఆశతో గాల్లో చేతులు ఆనందంగా ఆడించాను.. ఏం తగల్లేదు! పోనీ నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళముందుంటాడేమో అని గుడ్డిదానిలా తడుముకుంటుంటే కాఫీ టేబుల్ అంచుకి మోకాలు తగిలి నేను బాధతో 'అమ్మా!' అని అరిస్తే, పక్కింటి కుక్కపిల్ల సానుభూతిగా భౌమంది.. ఇంతలో ఆ టిక్కు టిక్కు శబ్దం కూడా ఆగిపోయింది.. అప్పుడు పక్కకి తిరిగి పడుకున్న బుర్రని తట్టి లేపి ఆలోచిస్తే అసలు విషయం అర్ధమైంది! మావారు ఇంట్లో లేనప్పుడల్లా ఎలక్ట్రానిక్ వస్తువులు వంతుల వారీగా పెద్దగా చిటికెలు వేసుకుని, ఆవులించి మరీ గాఢనిద్రలోకి జారుకుంటాయని, ఇప్పుడు జరిగింది కూడా ఆ కుట్రలో కూడా భాగమేననీ!!

'నువ్వు పనిచేస్తే ఎంత లేకపోతే ఎంత.. నీ అమ్మమ్మ లాంటి టివి తెచ్చుకుని నీ కళ్ళముందే దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తాను' అని నిరశనగా చూసి గరాజ్ లో మావారి టివిని అక్కడి కనెక్షన్లన్నీ ఊడబెరికి లివింగ్ రూంలోకి మోసుకొచ్చాను.. అది నిజంగా అమ్మమ్మ లాంటి టివినే!! మావారు యుఎస్ కి వచ్చాక కొనుక్కున్న మొట్టమొదటి టివి.. అది కూడా స్టోర్ లో తళాతళలాడేది కాదు, ఎవరో వృద్ధ దంపతులు పెట్టిన గరాజ్ సేల్లో కొన్నది!!

సో, ఇక్కడి వైర్లన్నీ మళ్ళీ దీనికి రీకనెక్ట్ చేసి, ఆయాసపడుతూ ఆన్ చేస్తే నల్లగచ్చు మీద ఎవరో ముగ్గు పిండి పారబోసినట్లు స్క్రీన్ అంతా తెలుపు చుక్కల మయం.. పక్కనున్న కుర్ర టివి నిద్రలో కూడా కిసుక్కున నవ్విన అనుమానం వచ్చి ఇంకాస్త పట్టుదలతో ఆ వైర్లన్నిటినీ సరిచూడటం మొదలుపెట్టాను.. నాకెందుకో టివి/ఎంటర్టైన్ మెంట్ సెంటర్ వెనకాల ఉండే వైర్లని చూస్తే వారాల తరబడి స్నానపానాదులు లేకుండా దుమ్ము కొట్టుకుపోయి ఉండే ఇక్కడ నల్లవాళ్ళు వేసుకునే జడలు గుర్తొస్తాయి!!

సో, ముందు వాటన్నిటినీ క్లోరాక్స్ వైప్స్ తో క్లీన్ చేశేసి (మనలో మన మాట, ఈ పని కానీ మాఆయన చూసుంటే stand up on the bench అని నన్ను డైనింగ్ టేబుల్ ఎక్కించేసేవారు!! వైర్లకి తడి తగిలించడం అంత మహాపాపం వేరేది లేదు ఆయన దృష్టిలో!), అతి జాగ్రత్తగా మళ్ళీ కనెక్ట్ చేసి పవర్ బటన్ నొక్కాను.. అది మళ్ళీ ఫ్రెష్ గా పిండి పారబోసుకుంది తప్ప వేరే ప్రోగ్రెస్ కనిపించలేదు!

ఇక తప్పక ఆయనకి కాల్ చేశాను.. 'దాని మేల్ కనెక్షన్ దీని ఫిమేల్ కనెక్షన్కి ఇచ్చావా? ఆ యెల్లో ఎండ్ ఈ బ్లూ ఎండ్ పక్కనే ఉందా?' లాంటి ప్రశ్నలన్నిటికీ స్లిప్పులు రాసుకుని, పరీక్షకి సిద్ధమై ఆయన 'హలో' అనగానే సమస్య చెప్పాను.. ఏ ఉపోద్ఘాతమూ, భగవద్గీత శ్లోకాలూ వినిపించకుండా 'గరాజ్ లోంచి టివి మోసుకొచ్చావా? ఎందుకూ, బెడ్ రూం లో చూసుకోవచ్చుగా?!' అన్నారు!! ఆ క్షణాన ఎవడు కొడితే మైండ్ బ్లాకై ఎట్సెట్రా ఎట్సెట్రా జరుగుతుందోలాంటి పోకిరిలు నాకు ఆయనలో కనిపించారు!! నాకు ఖచ్చితంగా తెలుసు, నాలో ఆయనకి ఇలియానా కాదు, బహ్మి కనిపించి ఉంటాడని!! ఆ వేదనతో మారుమాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను...

ఇంత పెద్ద ఎత్తున ఉపోద్ఘాతం ఇచ్చింది మా ఇంట్లో ఎన్ని టివిలు, ఏ ఏ గదుల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి ఎంత మాత్రమూ కాదనీ, ఎప్పుడూ 'టైం లేదు మొర్రో' అని గింజుకునే నాకు ఉన్నట్టుండి బోల్డంత టైం దొరికితే ఎలా వృధా చేస్తానో చెప్పడానికి!! నాకు టైం మేనేజ్మెంట్ బానే తెలుసు.. కానీ అస్సలు తెలీందల్లా తీరిక మేనేజ్మెంట్!!

అర్ధరాత్రుల వరకూ ఆఫీసుకి కనెక్ట్ అయ్యి పని చేస్తున్నప్పుడూ, ఎక్కడైనా ఒక మంచి రచన చదవగానే నాకూ ఏదో ఒకటి రాయాలన్న ఆవేశం వచ్చినప్పుడూ ఇలాంటి తీరిక కోసమే నేను కలవరించేది! అంతెందుకూ, నన్నెవరన్నా 'ఏంటమ్మాయ్, నీ తర్వాత రచన ఎప్పుడూ?' అని అడగడం పాపం వెంటనే నాకు లేని తీరిక గురించీ తద్వారా నా దరికి రాని మూడ్ గురించీ సోదాహరణంగా వివరిస్తాను.. కానీ ఆ తీరికే అధాటున వచ్చి నా వళ్ళో వాలితే ఇదిగో ఇలా సావిత్రమ్మని (మా తమ్ముడంటాడు ఇప్పటి టివిలు కత్రినా కైఫ్ లా స్లిమ్ముగా గ్లామరస్ గా ఉంటే ఆనాటి టివిలు 'దేవత'లో సావిత్రిలా ముద్దుగా బొద్దుగా ఉంటాయని!) ఇంట్లో ఆ మూల నించి ఈ మూలకి మోసుకు తిరగడం, వైర్లన్నిటికీ తలస్నానాలు చేయించడం లాంటి పనులతో కాలం గడిపేస్తాను!!

అసలు ఊసుపోక రాసుకోవడం వేరు.. రెండు వాక్యాలు రాసి అలిసిపోయిన ఫీలింగ్ తెచ్చేసుకుని రెండు గంటలు కునుకు తీయొచ్చు.. కానీ ఎవరైనా మనమీద ఒకపాటి నమ్మకం/గౌరవం లాంటి ఉన్నతభావం ఉంచుకుని "మా ఫలానా కార్యక్రమానికీ/సంపుటికీ మీరో కవిత రాస్తే బావుంటుంది" అని అడిగినప్పుడు ఆ విషయాన్ని ఎంత బాధ్యతగా తీసుకోవాలి!! మళ్ళీ అలా అడిగింది ఏమాత్రం పరిచయంలేని వాళ్ళు కాదు.. నేనెంతో అభిమానించేవాళ్ళే! ఒకరు నాకిష్టమైన అంతర్జాల పత్రికైతే, ఇంకొకరు నాకు ఎంతో నచ్చే కవిగారు.. నాకు ఆయనంటే ఉన్న అభిమానానికీ, గౌరవానికీ అసలు ఆయన అడగడం అదృష్టంగా భావించి, ఆ రాత్రికి రాత్రి ఒక అందమైన కవితని సృష్టించి, భక్తిగా ఆయనకి సమర్పించుకోవాలి! ఆ రాత్రి కాదు కదా కనీసం రెండుమూడు రాత్రులవరకూ ఒక్క లైను కూడా రాయలేకపోయాను!!

సమయాభావం వల్ల కుదరలేదని మనసుకి సర్ది చెప్పుకున్నా వీలున్నప్పుడల్లా దేనిమీద రాద్దామా అని కవితావస్తువు కోసం వెదుక్కుంటూనే ఉన్నా! రెండు మూడు తోచాయి.. ఇది పత్రిక వారి కార్యక్రమానికి బావుంటుంది, అది కవిగారివ్వడానికి బావుంటుంది అని అంపకాలు కూడా విజయవంతంగా ముగిసాయి.. ఆ తర్వాత ఒకరాత్రి కూర్చుని ఒకదానిమీద కవిత పూర్తి చేశాను.. సంతోషంగా ఒకసారి ఒళ్ళు విరుచుకుని ఆ కవిత మొత్తంగా అలా చదివాను.. ఏం చెప్పమంటారు? నేను ఐదోతరగతిలో రాసిన "నీమీదొట్టు, నిన్ను మర్చిపోలేదు" కవిత దీనికంటే వెయ్యిరెట్లు నయం! 'ఐదోతరగతిలోనే అలాంటి కవితా!' అని మీరు నన్ను అదోలా చూడకండి మరి! వర్షాలు పడి చాన్నాళ్ళైందని మా అమ్మా, అమ్మమ్మ మాట్లాడుకుంటుంటే విని నాకు వాన మీద అకస్మాత్తుగా పుట్టిన బెంగతో అలా రాసానన్నమాట!

సరే, అసలు విషయంలోకి వస్తే.. ఆ రెండూ కవితా వస్తువుల్నీ మార్చి మార్చి మనసులో ఊహించుకుని, సరికొత్తగా అనుభూతి చెందడానికి ప్రయత్నించి, ఆ భావాల్ని ఎన్ని వర్షన్స్ లో రాసినా నాకస్సలు నచ్చడంలేదు.. అంతే! ఇంక వాటి గురించి ఆలోచించడం మానేశాను.. ఎక్కడో చదివాను, ఒక కవి/రచయిత మనసులోని భావావేశం కమనీయ కల్పనగా రూపుదిద్దుకోవడానికి ఒకసారి ఆరునిమిషాల్లో జరిగిపోతే ఇంకోసారి ఆరునెల్లు కూడా పట్టొచ్చంట!!


.........................................

చిన్నమాట అని రెండుపేజీలు చదివించింది ఇంతకీ ఆ మాటేమిటీ? ఎక్కడుంది అని వెతుక్కుంటున్నారేమో.. ఆ మాటేదో, అసలు స్వగతాల జోలికి పోని నేను రాసిన ఈ టపా ముఖ్యోద్దేశ్యమేమిటో తరువాతి భాగంలో చెప్తాను.. ఎంత.. జస్ట్ ఒకటీ రెండు రోజులు ఓపిక పట్టండి, ప్లీజ్ :-)


సశేషం......


Saturday, January 30, 2010

Thursday, January 28, 2010

ఒట్టేసి చెప్పవా!

      
నువ్వు ముందా? రాత్రి ముందా?
సాయంసంధ్యతో నా రహస్య పందెం...

ఫలితం ముందే తెలిసినట్టు
మరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది!

ఆకాశదీపాలన్నీ వెలిగాక
నీ ఆనవాలేదో
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది..

కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది...
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..

మెడ వంపులోనో నడుము మడతపైనో
నడిరేయిన వేలికొసల పలకరింపులు..
నిర్లిప్తత వాగు దాటాలంటే
శరీరాలు మాట్లాడుకోక తప్పదనుకుంటా!

స్పర్శ ఇచ్చిన భరోసానేమో
హఠాత్తుగా నా హృదయమంతా నీ ఊపిరి!

నిద్రదుప్పటి కప్పుతున్న నీ పరిమళం సాక్షిగా
ఒక్కమాట తీసుకోనీ..

చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!


(తొలి ప్రచురణ ఆవకాయలో...)