Tuesday, July 29, 2008
ఊసులాడే ఒక జాబిలట! (June 2008)
.....ఆ సంచుల్లోంచి ఏవో రంగు కాగితాలు, టోపీ, ప్లాస్టిక్ పూల గుత్తులు లాంటివి తీసి బయట పెట్టి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టాడు.. రెండు నిమిషాల్లో అర్ధం అయింది అతను మ్యాజిక్ షో చేయబోతున్నాడని.. లోపల కోపం లావాలా పొంగుతున్నా 'అబ్బో ఇతనికి చాలా కళలే తెలుసే!' అనుకున్నా.. అతనికి కావాల్సినవన్నీ అందిస్తూ చూస్తుండగానే నేనూ పిల్లల కంటే ఎక్కువగా ఆ ప్రదర్శనని ఎంజాయ్ చేయసాగాను.. పిల్లలైతే ఒకటే అరుపులు, చప్పట్లూను!! మొత్తానికి చాలా బాగా జరిగింది అనుకుంటూ అతను తెచ్చిన వస్తువులన్నీ మళ్ళీ లోపల పెట్టేస్తుంటే చూశాను అతని షర్ట్ వెనక ఉన్న రక్తపు మరకల్ని!! కాస్త భయం వేసింది, ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగి దెబ్బలేమైనా తగిలాయేమో అని!! మెల్లగా అక్కడ నించి జారుకుని ఆ విషయం సులోచన మేడం కి చెప్పాను.. ఆవిడ "అవునా కనుక్కుంటాను" అన్నారు కానీ నాకే మనసాగక అతని దగ్గరకెళ్ళి "మీకేమన్నా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే చెప్పండి" అన్నా.....
పూర్తిగా..
Thursday, July 17, 2008
నీ రాక కోసం..
చేతికంటిన ముళ్ళ గోరింటల
రంగు వెలిసిపోతోంది
ఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..
నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది
మనసు ఆదమరిచేది..
ఒక్కోసారి మంచు తడియారకుండానే
కళ్ళ ముందుంటావ్..
ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?
కాలికింద నలిగిన ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..
ఇంకెన్నిరోజులిలా!?
దిగులుతో బాధేసి, కోపమొచ్చి
ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేస్తుంటే
వినిపించింది నీ ఆగమన రాగం!
కిటికీ అవతల నిశాంతంలో
కొమ్మ కొమ్మకీ కొత్త ఆశల
చిగురులద్దుతూ నువ్వు!
నీ అడుగుల వెనుక
అలుముకుంటున్న రంగుల్లోకి
జారిపోయేముందు
అందరికీ చెప్పిరానీ
నా ప్రియసఖి వసంతమొచ్చిందని!!
తొలిప్రచురణ పొద్దులో..
Subscribe to:
Posts (Atom)