Pages

Wednesday, January 26, 2011

అనగనగా ఒకరోజు..

(మొదటి ప్రచురణ మాలిక పత్రికలో )

"రేపు బోల్డంత పని ఉంది.. తలచుకుంటేనే నీరసం వస్తుంది!"
"ఇప్పుడేగా చేపల పులుసు బావుందంటూ అన్నం తిన్నారు! నీరసమై ఉండదు.. భుక్తాయాసమేమో?! మీరసలే తెలుగులో వీక్."
"నా తెలుగుకొచ్చిన ప్రోబ్లెమేమీ లేదు కానీ రేపు నేను గరాజ్ క్లీనింగ్ చేసుకోవాలి."
"దాందేముంది.. నేను హెల్ప్ చేస్తాను.. మీరు కూడా క్లీనింగ్ లో ఓ చెయ్యేయండి.. మీరే అంటారుగా టీం వర్క్ టీం వర్క్ అని."
"అమ్మో, నువ్వు మాత్రం నా పనిలో చేయి పెట్టకు.. అంతకుముందు నేను ఊర్లో లేనప్పుడు చూసి నా టూల్స్ అన్నిటినీ సర్దేశావ్.. ఆ తర్వాత ఏది ఎక్కడుందో వెతుక్కోలేక నేనైపోయాను.. నా పని నేను చేసుకుంటాను కానీ రేపొక్కరోజు మాత్రం you have to manage all the cleaning and mopping!"
"వెతుక్కోలేక మీ పని అయిపోయిందా? ట్రాన్స్పరెంట్ బాక్స్ లు తెచ్చి అన్నిటిని ఆర్గనైజ్డ్ గా సర్ది బయట లేబుల్స్ కూడా అతికించాగా?"
"అదే, ఆర్గనైజ్డ్ గా అని నువ్వనుకుంటావు.. నీకసలు టూల్స్ గురించేమీ తెలీదు.. ఒకేలా కనిపించాయి కదా అని ఒక బాక్స్ లో పెట్టేస్తావు."
"ఓ! ఒకేలా కనబడితే వాటిని వేరే వేరే బాక్సుల్లో పెట్టి, కొన్ని వంటిట్లో నా పోపుల డబ్బా పక్కన, ఇంకొన్ని బాత్రూం లో మీ షేవింగ్ కిట్ కింద పెట్టాలి కాబోలు!"
"ఛ నీకంతా వేళాకోళమే.. అయినా ఆ బండ పనులు నీకు చెప్పడం నాకిష్టంలేదు."
"అవును! జీడిపప్పు, బాదాం పప్పు వేరుచేసినట్లు ఒక చోట కూర్చుని ఆ నట్లూ బోల్ట్లూ వేరు చేయడం బండ పని.. ఇల్లంతా వాక్యూం చేసి, మాప్ చేయడం.. తళతళాలాడేలా బాత్రూం లు తోమడం నాజూకు పని!"
"నట్లూ, బోల్ట్లూ నా! అసలు వాటి విలువ తెలుసా నీకు!"
"విలువేమో కానీ వయసు మాత్రం బాగా తెలుసు! మా అమ్మమ్మ బారసాలప్పుడు తయారు చేసినవేమో అవి!"
"వాటినే యాంటీక్స్ అంటారే పిచ్చిమొహమా!"
"ఓ యాంటీక్ స్క్రూ డ్రైవర్, రెంచ్ లూ కూడా ఉంటాయన్నమాట.. ఎప్పుడో మీరు లేని రోజు చూసి వేలం వేసి పడేస్తా!"
"ఓయ్ అంతపని చేశేవు.. మళ్ళీ తర్వాతెప్పుడో నా మీద కోపమొచ్చి నువ్వు తట్టాబుట్టా సర్దుకునెళ్ళిపోతే నీకు రావాల్సిన భరణం నువ్వే పోగొట్టుకున్నట్లుంటుంది!"
"ఛ అదేం కాదు."
"నాకు తెల్సమ్మా.. ఎప్పటికీ నీ తోడూ నీడా నేనే అనుకుంటావని.. నన్నొదిలి వెళ్ళవనీ."
"గాడిద గుడ్డేం కాదూ!ఆ పాత ఇనప సామాను ఇస్తారా నాకు భరణం కింద!"
"నువ్వు చాలా ఎదిగిపోతున్నావే!"
"బాబూ, ఈ గొడవంతా ఎందుకుగానీ మీ పని మీరు చేసుకోండి.. ఏవో తంటాలు పడి ఇంట్లో పనంతా నేను చేసుకుంటాను.. ఏదో మన గెస్ట్ లు వచ్చేది ఎల్లుండే కదా, రేపొక్కరోజు తప్ప పనంతా చేయడం కుదరదని మీమీద ఆశ పెట్టుకున్నాను."
"వాళ్ళు గెస్ట్ లేంటి.. మన ఇంట్లో వాళ్ళే కదా.. వాళ్ళొస్తుంటే కూడా సర్దడం అవసరమా? అయినా పోయిన శనివారమే కదా క్లీన్ చేశాము!"
"నిజమే మరీ ప్రతీ వారం ఎందుకులేండీ ఇల్లు తుడుచుకోవడం.. సీజన్ కోసారి చేసుకుంటే సరిపోతుంది.. సర్లే నాకు నిద్రొస్తోంది.. పడుకుందామా?"
"నువ్వెళ్ళు నేను కాసేపు క్రికెట్ చూసొస్తాను."                                                            ********

"గుడ్ మార్నింగ్ హనీ, బ్రేక్ ఫాస్ట్ బయటనించి తీసుకురానా?"
"అక్కర్లేదు, దోసెలు పిండి ఉంది."
"ఆ మళ్ళీ అంతసేపు నించుని ఏం వేస్తావులే.. అసలే మనకి చాలా పనుంది ఈ రోజు."
"ఆమాటేదో నిన్న రాత్రి టూల్సూ వాటి విశిష్టత గురించి మాట్లాడుతునప్పుడే చెప్పొచ్చు కదా.. పొద్దున్నే లేచి ఆ కొబ్బరి పచ్చడి చేసిన టైంని వేరేదానికి వాడుకునేదాన్ని!"
"ఎలా అయినా టైం మేనేజ్మెంట్ నీదగ్గర నించే నేర్చుకోవాలి.. అవునూ, అదేం వర్డ్ హనీ, 'విశిష్టతా'.. భలే ఉందే!అర్ధం ఏమిటంటావ్?"
"ఓవర్ యాక్షన్ తో పొద్దున్నే వికారం తెప్పించకండి.. మీరు మీ గరాజ్ లోకి కదిలితే నేను దోసెల పని కానిస్తాను."
"సరే సరే.. ఓ కప్పు కాఫీ తీసుకుని I'll be out of your way."


                                                         ********


“ఇదేంటీ, నానారాకాల టూల్సూ, వాటికి సంబంధించిన డబ్బాలూ నేలంతా పరిచేశారు? నాకైతే సర్దుతున్నట్లనిపించడం లేదు.. ప్లే ఏరియాలో ఆడుకుంటున్నట్లుంది!"
"చూశావా! ఎంత పని ఉందో చూడు.. చెప్తే అర్ధం చేసుకోవు."
"అదేంటీ, ఎందుకలా వాటన్నిటినీ అలా మూలకి తోస్తున్నారు?"
"కింద డర్టీగా ఉంది.. ఒకసారి గబగబా ఊడ్చేసి అప్పుడు సర్దడం మొదలుపెడతాను."
"ఓ అవన్నీ కింద పరిచాకగానీ మీకర్ధం కాలేదా నేలంతా దుమ్ము ఉందని?!"
"అబ్బా! నా పని నన్ను చేసుకోనీ.. మధ్యలో నీ నసేంటి.. నేనెలాగో చేసుకుంటాను కానీ నీ పని నువ్వు చేసుకో వెళ్ళి."
"....చేసేదేం లేదు కానీ మళ్ళీ ఆ కోపమొకటి!"


                                                              *********


(ఒక ఇరవై నిమిషాలయ్యాక..)
"బంగారాలూ, ఏం చేస్తున్నావూ?"
“ ……”
"నిన్నే హనీ."
"విషయం చెప్పండి!"
"డిన్నర్ ఇటాలియన్ ఆర్డర్ చేసుకుందామా?"
"పొద్దున్నే పదకొండింటికి డిన్నర్ సంగతెందుకుగానీ అసలు విషయం చెప్పండి.. నాకు పని ఉంది."
"అదేదో నీ బాక్స్ అనుకుంటా, ఫ్లవర్ వేజ్ లా ఉంది."
"అవును, మా కోవర్కర్ బర్త్ డే గిఫ్ట్ అది.. ఉండండి కార్లో పెట్టేసుకుంటాను."
"అది కాదు బంగారాలూ.. బాక్స్ పైన బొమ్మ చూస్తే యాష్ ట్రే లా కనిపించింది."
"ఫ్లవర్ వాజ్ మీకు యాష్ ట్రే లా అనిపించిందా?!?!"
"అంటే కరెక్ట్ గా అలానే కాదనుకో.. కానీ తీసి చూస్తే పోలా అనిపించి బయటకి తీసి చూశాను."
"అప్పుడైనా మీ సందేహం తీరిందా? ముందది కార్లో పెట్టేయండి మహానుభావా!"
"అక్కడికే వస్తున్నా.. చూసి పక్కన పెట్టి మళ్ళీ నా పనిలో పడిపోయాను.. అంతలో చేయి తగిలి పడింది.."
"ఏంటీ!! పడిందా? పగిలిందా??"
"పూర్తిగా పగల్లేదనుకో.. జస్ట్ గ్లాస్ క్రాక్ అయింది."
"జస్ట్ క్రాక్ అయిందా! ఇంక అదెందుకు పనికి వస్తుంది.. అసలు మీ పని మీరు చూసుకోక నా వస్తువుల జోలికి ఎందుకు వెళ్ళారు??"
"ఎందుకలా అరుస్తావ్? ఏదో అక్కడుంది కదాని తీసి చూశాను.. నువ్వు ఎక్కడబడితే అక్కడ పడేసి 'ఎందుకు తీశావ్.. ఎందుకు చూశావ్' అంటే ఎలా? అయినా ఇల్లంతా సరిపోలేదా? ఈ వేజ్ లూ బొచ్చెలూ తెచ్చి తెచ్చి గరాజ్ లో పెట్టడానికీ?"
"అంటే గరాజ్ లో మీ వస్తువులొక్కటే ఉండాలా?"
"అలా అన్నానా? అదేదో జాగ్రత్తగా పక్కన పెట్టుకోవచ్చుగా?"
"నిజమే, మా ఇంట్లో మూడు పదులు దాటేసిన ముక్కుపచ్చలారని పసిపిల్లాడు ఉన్నాడు, వస్తువులన్నీ అందకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్న విషయం నేనే మర్చిపోయాను."
"అదిగో ఇప్పుడు నేనేమన్నాననీ అంత కోపం?"
"మీతో నాకు వాదనలొద్దుగానీ నేను కాసేపు బయటికెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకుంటాను."
"సరే.. ఎదో ఒకటి చెయ్యి.. నా పని ఎక్కడిదక్కడే ఉంది."


                                                                    *********

"హల్లో హనీ! ఇంకా రాలేదే! మిస్సింగ్ యు, యూ నో!"
"మళ్ళీ ఏం కావాలీ?"
"అసలు సిసలు బెటర్ హాప్ఫ్ నువ్వే హనీ,నా అవసరాలన్నీ టక్కున పట్టేస్తావ్."
"సుత్తాపి విషయం చెప్పండీ."
"ఏం లేదు, ఇంకా స్టొర్ లోనే ఉన్నావా?"
"అవును.. ఏం?"
"నీ లంచ్ సాలడ్స్, అలానే ఫ్రూట్స్ తెచ్చుకోవడం మర్చిపోకు.. ఇప్పుడు ఫ్రెష్ గా పైనాపిల్స్ వస్తున్నాయి."
"అదే చేత్తో మీకోసం ఓ పనసకాయ కూడా తెస్తున్నా!"
"పనసకాయా? ఎందుకూ? పప్పులో వేస్తావా?"
"లేదు ఊరగాయ పెడతాను.. ఇంతకీ అసలు సంగతి చెప్తారా?"
"ఏం లేదు, కాస్త నా బీర్ తీసుకు రా ప్లీజ్"
"బీరా! ఐ కాంట్.. నా ఐడీ ఇంట్లోనే వదిలేసొచ్చాను"
"సో.... నిన్నెందుకు ఐడి అడుగుతారు?"
"అంటే?"
"చిన్నపిల్లలా కనిపిస్తే డౌటొచ్చి ఐడి అడుగుతారు హనీ!"
"అదే, మీ ఉద్దేశ్యం ఏంటీ అని?!"
"అంటే నువ్వు... ఓ.. ఓ.. మై! ఛ నా ఉద్దేశ్యం అస్సలది కానే కాదు.. ప్లీజ్."
"హ్మ్మ్.. బీరొక్కటేనా? ఇంకో ఐదునిమిషాలాగి 'అగ్గిపెట్టె హనీ' అని మళ్ళీ కాల్ చేస్తారా?"
"నాకింకేమీ అక్కర్లేదు కానీ నువ్వు ఐస్క్రీం కూడా తెచ్చుకో.. చాలారోజులైంది తిని పాపం."
"నేను ఏమేమి ఎన్నెన్ని రోజులు తింటున్నానో గమనిస్తున్నారన్నమాట! గుడ్ టు నో! ఇంక ఉంటా!"

                                                              *********

"ఇంకా సర్దడం అవ్వలేదా?"
"ఇంకెంతసేపు.. ఇదిగో అలా sort చేసి ఇలా సర్దేస్తాను."
"నేను బయటకెళ్ళినంత సేపూ ఏం చేశారు?!"
"జేన్ ఏదో హెల్ప్ కావాలంటేనూ వాళ్ళింటికెళ్ళి చేసొచ్చాను."
"ఆవిడొచ్చి అడిగిందా?"
"లేదే పాపం ఆవిడెందుకు అడుగుతుంది? డాగ్ ని వాక్ కి తీసుకెళ్తుంటే చూసి నేనే పలకరించి అడిగాను, ఏమన్నా పనుంటే చెప్పమని."
"మీరే అడిగారా????"
"అవునే, పాపం ఈసారి మనకి క్రిస్మస్ గిఫ్ట్ అందరికంటే ముందే ఇచ్చేసింది కదా! అందులో పెద్దావిడ కూడా"
"..........."
"అంత కోపమెందుకు? చిన్న పనే.. డెకరేషన్ లైట్లేవో సరిచేయాల్సొచ్చింది."
"వాటెవర్.. ఇంకా ఇంట్లో సగం పని అలానే ఉంది.. చివర్లో కాస్తన్నా చెయ్యేస్తారా?"
"నువ్వలా వెళ్ళి చేస్తుండు.. అరగంటలో వచ్చేస్తా."

                                                      *********
"హనీ.. హనీ.. "
"Is that you? Where are you?"
"I'm here at Chris's place, can you please pass the flash light I bought the other day?"
"what the !@#$%, అక్కడేం చేస్తున్నారూ?"
"అమ్మో, అదేంటీ అలా బూతులు తిడతావ్? వీడి టివి సౌండ్ పనిచేయడంలేదంట.. కాస్త చూడమని కాల్ చేశాడు."
"అదే మరి! తమరు మన కమ్యూనిటీ హెల్ప్ డెస్క్ మానేజర్ కదా.. ఒక నిమిషంలో అక్కడ వాలిపోయుంటారు!"
"అది కాదే, పాపం ఇంకాసేపట్లో పేట్రియాట్స్-రెడ్ స్కిన్స్ గేం ఉంది... అందుకే వచ్చాను."
"ఇంకేం తమరు కూడా గేం చూసి, అక్కడే తిని, తొంగోండి."
"అంత విసుగెందుకు చెప్పు.. కాస్త ఆ ఫ్లాష్ లైట్ నా మొహాన పడేస్తే వెళ్ళి ఒక్క నిమిషంలో వాడి పని చూసొస్తాను."
"మీతో ఇక మాటలనవసరం."
"పడెయ్యమమంటే విసిరెయ్యడమే! GOD! you're too much!!”

                                                         *********


"ఇవాళ డిన్నర్ సంగతేంటీ?"
"ఇటాలియన్ అని తమరే సెలవిచ్చారుగా!"
"అబ్బా, ఇప్పుడు ఆ బయట ఫుడ్ మీద అస్సలు మూడ్ లేదు.. చక్కగా ఇంట్లోవే తినేద్దాము.. ఫ్రిజ్ లో ఏమేం కూరలున్నాయి?"
"గుత్తి గుమ్మడికాయ.. బగారా బంగాళదుంప."
"you mean no proteins!!!"
"sorry, మర్చిపోయా.. ఆ డబ్బాలో కిలో కందిపప్పు కూడా ఉంది!"
“పొద్దున్నించీ పనిచేసి అలిసిపోయిన మొగుడికి చక్కని చికెన్ కూరతో తిండి కూడా సరిగ్గా పెట్టలేవన్నమాట!"
"......."
"అదేంటీ, అంత కోపం!! btw, కోపంలో నీ ఫేస్ అస్సలు బాగోదు.. యాక్."
"whaaaat!!!"
"am just being honest. నేను ఏమన్నా నీ మంచి కోసమే హనీ!"
"........"
"ఇంకా కోపమేనా? చెప్పా కదా నేను చేసేవన్నీ నీ మంచి కోసమే అని!"
"ఇంటెడు పని నామీద పడెయ్యడం నా మంచి కోసమా?!?!"
"మరి! నామీద కోపంతోనే కదా అన్ని పనులు.. అవసరమైనవీ, అవసరంలేనివీ టకటకా చేసేసుకున్నావ్.. ఇక నీకు వారం వరకూ ఎక్సర్సైజ్ అవసరం లేదు.. మన గెస్ట్స్ వెళ్ళేవరకూ నీ Curves జిమ్ము మొహం చూడక్కర్లేదు. అసలు నీ curves కి ఏం తక్కువైనాయని మళ్ళీ ఆ జిమ్ముకి పడీ పడీ వెళ్తావ్?"
"తక్కువై కాదు ఎక్కువై వెళ్తున్నా!"
"Seriously honey, you look perfect."
"ఇప్పుడే ఏదో యాక్.. థూ.. ఛీ.. అన్నట్లు గుర్తు?!"
"అబ్బా, అది కాదు కానీ పొద్దున్న నేను మధ్యలో ఏదో పని మీద ఇంట్లోకొచ్చినప్పుడు హగ్ చేసుకోలేదూ?ఎందుకూ, క్యూట్ గా కనిపించావనే కదా?"
"అప్పుడు నేను బాత్రూం సింక్ లు కడుగుతున్నట్టు గుర్తు!"
"మల్లెపూలూ, తెల్లచీరా కట్టుకున్నప్పుడు బావున్నావని లొట్టలేస్తూ అందరూ చెప్తారమ్మా!"
"జిడ్డోడుతున్నప్పుడు చెప్పడమే మీ స్పెషాలిటీ అంటారు!"
"నిజం హనీ, అలా పనులన్నీ చక చక చేసేస్తూ, ఇంటి మహరాణిలా కనబడుతుంటే ఎంత ముద్దొస్తావో తెలుసా?"
"చిన్నప్పుడు చందమామలు చదవని ఎఫెక్ట్ అన్నమాట! లేకపోతే మహారాణి చేత బాత్రూం సింక్ లు
కడిగించేవారా?”
"అప్పుడు చదవకపోతేనేం.. ఇప్పుడు నువ్వు చెప్పు, రోజూ రాత్రి పడుకునేప్పుడు.. నా మహారాణిని ఎంతబాగా చూసుకోవాలో నేర్చుకుంటాను"
"(చిరునవ్వు)"
"wow! ages అయినట్లుంది నీ నవ్వు చూసి!"
"వీటికేం తక్కువలేదు.. పనంతా నాతో చేయించి చివర్లో ఇలా బటర్ పూయడం"
"అది కూడా 'I can't believe it's not Butter' హనీ"
"(నవ్వు)"
"బైదవే, పొద్దున్న జేన్ వాళ్ళ పోర్చ్ మీద లైట్స్ ఫిక్స్ చేస్తుంటే ఆవిడ నీకో కాంప్లిమెంట్ ఇచ్చింది"
"ఏంటంట"
"నువ్వు చాలా లక్కీ అంట"
"ఎందుకో?"
"ఇంకెందుకూ, నాలాంటి అన్ని పనులూ తెల్సిన హజ్బెండ్ దొరకడం వల్ల"
"(!$%#^*(!@#(*$^)"
"అదిగో మళ్ళీ ఆ ఫేసేంటీ.. అలా?!?! సర్లే, ఇప్పుడు ఆవిడ సంగతెందుకు గానీ గుత్తి పనసకాయ కూరేదో ఉందన్నావు కదా, దాంతో తినేద్దాం.. ఇవాళ్టికి ప్రోటీన్స్ వద్దులే.. సరేనా?"
"....................................................................................................................."

                                                                 *************

27 comments:

ప్రసూన said...

అబ్బ ఎన్నాళ్ళకెన్నాళ్ళకి?
నిషీ , నేను గుర్తున్నానా? ఏమైపొయావ్? ఎన్ని ఇ మెయిల్స్ ఇచ్చాను? ఎందుకు ఎప్పుడూ reply ఇవ్వలెదు?

Anonymous said...

:))

Anonymous said...

good narration..

పద్మ said...

:)))))))))))))) :))))))) :)))))))))

విరిబోణి said...

abba maa intlo kooda ilaane jarigiddi andi.. antha maa intlo jarigedi chuci rasinattu vundi:)) baga raasaru :)

Ennela said...

avunu kaanee, nenu yee post chadivi commentaanu kadaa?(konni rojula krinda.) adi yekkada?
naa comment ekkado tappipoyindandee....vaa...vaa...vaa....

కొత్త పాళీ said...

brilliant.
శ్రీపాదవారి షట్కర్మయుక్తా గుర్తొచ్చింది.

భావకుడన్ said...

V nice sublimation :-)

అన్నమాచార్య కీర్తనలు తెలుగులో said...

nice one

Vasu said...

ఇది నేనొప్పుకోను. ఇదేంటండీ మీరు కథల్లోకి దిగి అక్కడే ఉండిపోతున్నారు. మీ ఫాన్లం కవితలు కోరుకుంటున్నాం. మలి కవిత ఎప్పుడు ?

మీరు కథ కూడా కవిత లాగే రాసుంటారు అందుకే ఇంత ఫాలోయింగ్ . చదివి మళ్ళీ కామెంట తాను

Vasu said...

Simple but beautiful or should I say simply beautiful.

మురారి said...

మీ టపా భలే నవ్వించింది. చదువుతుంటే కళ్ళముందు జరుగుతున్నట్టే అనిపించింది. అంత సహజంగా రాసారు. ఇంత subtle గా humor ని, romance ని పండించడం బావుంది.

నిషిగంధ said...

:)ప్రసూనా... అలిగితివా సఖీ? ఆ మధ్య కొన్నిరోజులు భవసాగరంలో పడి ఊపిరాడక చాలామందికి ఈమెయిల్స్ ఎగ్గొట్టాను.. క్షమించేయ్ ఈసారికి..

ధన్యవాదాలు అను గారు, Anonymous, పద్మ :-)

ధన్యవాదాలు విరిబోణి గారు.. అవునండి మన ఆడలేడీస్ అందరివీ దాదాపుగా ఇలాంటి కష్టాలే.. చెయ్యేస్తున్నట్టే నమ్మిస్తూ మొత్తం పని మనచేతే చేయించేస్తారు ఈ మగమహారాజులు :-)

నిషిగంధ said...

ఎన్నెలా, మీ మొదటి కామెంట్ ఇక్కడ బ్లాగ్ లోనే రాసారా లేక మాలిక లో రాసారా? అది తప్పిపోయినందుకు నాక్కూడా చాలా బాధగా ఉందండి.. ప్చ్, ఎంతలా పొగిడేసి ఉంటారో కదా నన్ను! :)) ధన్యవాదాలు..

కొత్తపాళీ గారు, మీరు భలే పట్టేశారండీ.. ఈ టపాకి ప్రేరణ శ్రీపాద వారి శైలే! ధన్యవాదాలు :-)

ధన్యవాదాలు భావకుడన్, అన్నమాచార్య కీర్తనలు తెలుగులో :-)

నిషిగంధ said...

వాసు, చాలా రోజులైంది మీ పలుకరింపు విని.. అంతా కుశలమే కదా.. ప్రస్తుతం నా కవితా కన్యక ఎందుకో అలిగిందండి.. ఋతువులు మారుతున్నా అక్షరాలలో కదలిక లేదు.. 'ఎవరో రావాలీ' లా ఏదో జరిగితేగానీ మలికవిత పుట్టదేమో.. అందాకా ఇలాంటి కధలతో వేగక తప్పదు.. ధన్యవాదాలు :-)

మురారి, దైనందిన జీవితంలో humor ఒక పెద్ద టానిక్ కదా.. దానికి touch of romance జతచేస్తే ఇక ఆనందమానందమాయే :)) nice to see your comment.. Thank you!

Ennela said...

ఈ మధ్య కొంచెం ఖాళీ దొరికింది లెండి...బ్లాగ్పరిశోధనలు చేసీ చేసీ, ఎక్కడ, ఏమిటి, ఎలా లాంటివన్నీ అర్థం కావట్లే.లింకుల్లోంచి దార్లు కలుపుకుంటూ చదివెయ్యడమే..అందుకని అప్పుడప్పుడు తప్పిపోతున్నా...హహహ....అయినా ఫర్వాలేదు..మళ్ళీ వ్రాస్తాగా కామెంటు...
కథ..బాగుంది.శైలి సూపర్...మరి ఎంచుకున్న టాపిక్కూ...ఎవర్ గ్రీనే గ్రీనూ...వెరసి సువాసనలు వెదజల్లే 'నిషి గంధ"

మురళి said...

నాకు మాత్రం శ్రీరమణ 'మిధునం' గుర్తొస్తూనే ఉంది, చదువుతున్నంత సేపూ.. అప్పదాసునీ, బుచ్చిలక్ష్మినీ ఫారిన్ పంపిస్తే ఇలాగే ఉండేవారేమో అనిపించింది..

ప్రణీత స్వాతి said...

వచ్చేశారా..హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..హ్హ..

వికటాట్టహాసం కాదండోయ్..ఇప్పుడే మీ టపా చదివా కదా ఆ ఎఫ్ఫెక్ట్.

యశోదకృష్ణ said...

em cheppali. nenu manasulo feel ai maatallo pettaleni daani meeru raasaru. anduku thanks. idi intinti ramayanam.anni panulu nerchukunna adhunika vanithala kashtalu.

మధురవాణి said...

:) :) :)
ఇలా కనీసం ఒక వందైనా స్మైలీలు పెట్టాలనిపించింది చదివాక.. :)

మంచు said...

:-))))))))))))))))

Anonymous said...

hahahahahha nice 1

Telugu Songs Free Download said...

your way of narrating the story is good

Unknown said...

chala chala bavundi. simple and humorous.

http:/kallurisailabala.blogspot.com

Chandu S said...

ఇది ఎన్ని సార్లు చదివానో తెలియదు, చూడకుండా రాయగలనేమో ట్రై చెయ్యాలి

బాల said...

భలే ఉందండీ. ఎలా కాకా పట్టాలో నేర్చుకోవచ్చు.....

sarita said...

Excellent post ; inti inti ramayanam laga....