Pages

Thursday, December 11, 2008

ఊసులాడే ఒక జాబిలట! - కార్తీక ఉత్తరాలు



అభిమానిగా పరిచయమై.. ఆత్మీయంగా పలుకరించి.. అందమైన స్నేహాన్ని అందించి.. అల్లరి చిందించి.. అంతలోనే అనూహ్యంగా మాయమైన కార్తీక అసలు సిసలైన హృదయాక్షరాలివి!!

అడగగానే మనందరితో తన నేస్తం చెప్పిన కొన్ని ఊసులను పంచుకోవడానికి అంగీకరించిన కిరణ్ ప్రభ గారికి, స్కాన్ చేసి పంపిన కాంతి గారికీ కృతజ్ఞతలు!









నాకెంతో ఇష్టమైన.. ఈ కధకి తగిన టైటిల్ని అందించిన పాట..


Tuesday, December 2, 2008

ఊసులాడే ఒక జాబిలట! (నవంబర్ & డిసెంబర్ 2008)



"......మా కార్తీకకి మీ అంతటి ఆప్తులైన స్నేహితులు లేరు.. మీమధ్య ఏర్పడిన ఆత్మీయత కేవలం ఉత్తరాల ద్వారానే అంటే నమ్మశక్యం కాదసలు! తనకి మీరంటే వల్లమాలిన గౌరవం, అభిమానం.. ఎప్పుడూ చెప్తుంది, 'నేను దిగులుగా ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు కేవలం స్నేహితుడిగానే కాకుండా ఒక గైడ్ గా నాకు సహకరించిన మాస్టారు మా కవిగారూ అని! మరి మీ సహకారం ఇప్పుడు కొంచెం కావాలి మాస్టారూ.. ఈసారి మాఇద్దరికీ!!...

..... నాకు అది కావాలి, ఇది కావాలి అని ప్రత్యేకంగా దేవుడికి మొక్కుకున్న సందర్భం లేదు. లేని దాని గురించెప్పుడూ ఆలోచించకుండా అవసరంలో ఉన్నవాళ్ళకి నాకు వీలైనంత సాయం చేయడమే నాకు తెల్సిన పూజైనా, పునస్కారమైనా. కానీ ఈరోజు కార్తీక బాధని చూస్తూ నిస్సహాయంగా నిల్చోవడం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాను....."

నవంబర్ పార్ట్ - పూర్తిగా...


".... ఈ ఆనందం మనసుని చేరి పారవశ్యంగా మారేలోపే మళ్ళీ సన్నగా నొప్పి మొదలవుతుంది.. హర్షని పట్టుకున్న చేతివేళ్ళ బిగువు సడలిపోతుంది.. కళ్ళు బాధతో అరమూతలవుతుంటాయి.. అంతలో "నొప్పిగా ఉందా?" అంటూ తల మీద అతి మృదువుగా వికాస్ నిమురుతుంటారు.. నా కంటినీళ్ళని తుడుస్తూ తన కళ్ళు చెమరుస్తున్న సంగతే తలంపుకి రాదు.. ఇంతకన్నా నరకం కూడదనిపిస్తుంది.. ఒక అందమైన బంధాన్ని పరిచయం చేస్తూ జీవితంలో మలిపొద్దు మొన్ననేగా మొదలైంది.. ఎన్నెన్ని కొత్త ఆశయాలు.. ఆలోచనలు.. చేతనైనంతగా అసహాయులకి కొత్తదారి చూపించాలనే తాపత్రయం.. బోల్డన్ని కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటుండగానే ఇలా మంచానికి అతుక్కుపోవడంతో అప్పుడే ఆఖరిపొద్దు వచ్చేసిందా అనే ఆందోళనొకటి మనసుని పట్టి ఊపేస్తోంది....."

డిసెంబర్ పార్ట్ - పూర్తిగా...

Friday, October 31, 2008

ఊసులాడే ఒక జాబిలట! (సెప్టెంబర్ & అక్టోబర్ 2008)


"....ఇక ఇంటి పనుల విషయాలకొస్తే రాధికని సంప్రదించొచ్చు.. 'భర్తని సాధించడం ఎలా?' అన్న విషయం తోపాటు ఇంకెన్నో అవసరమైనవి చెప్పగలదు నీకు. నాకు తెల్సు, దగ్గర ఉంటే గనక కత్తీ డాలూ తీసుకుని నా మీద యుద్ధానికి వచ్చేదానివని.. అయినా గానీ నీకు పెళ్ళైపోయిందని తల్చుకుంటే భలే గమ్మత్తుగా ఉంది తెలుసా! ఇక నించీ నువ్వు కూడా అందరి లాగా 'ఈపూటకి ఏం వండాలి.. వడియాలు పెట్టుకోవాలి.. బూజులు దులపాలీ అనుకుంటూ ప్రణాళికల మీద ప్రణాళికలు వేసుకుంటావేమో!....."


సెప్టెంబర్ పార్ట్ - పూర్తిగా...


".....చుట్టూ పచ్చదనం, ఎప్పుడు చూశినా ఇప్పుడే ఊడ్చి తుడిచారా అన్నట్లుండే రోడ్లు, ఆకాశ హర్మ్యాలు, ఆ పక్కనే జలపాతాలు అన్నీ కలిసి ఏదో అల్లావుద్దీన్ సృష్టించిన ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగిస్తాయి.. కానీ కార్తీకా, సాయంత్రం ఆరు దాటంగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా అనిపించేది.. అప్పటి వరకూ ఆడుకున్న పిల్లలంతా వెళ్ళిపోగానే మిగిలిన ఖాళీ పార్క్ లా నిస్తేజంగా అనిపించేది.. కారణం రాధికా వాళ్ళు నాతో లేకపోవడమే కాదు అప్పటి వరకూ ఎంతో క్లోజ్ గా పని చేశిన సహాధ్యాయులు ఐదవ్వగానే ఉన్నట్టుండి అపరిచితులుగా మారిపోతారు.. అక్కడ నించి వాళ్ళ జీవితంలో మనకేమాత్రం ప్రాముఖ్యం ఉండదు! పుట్టిన దగ్గర్నించీ మన చుట్టూ ఉన్నవారితో ఎటాచ్ మెంట్స్ పెంచుకుంటే పెరిగే మనలాంటి వారు ఈ డిటాచ్ మెంట్ కి అలవాటు పడటం కష్టమనిపిస్తుంది!....."

అక్టోబర్ పార్ట్ - పూర్తిగా...

Friday, October 17, 2008

ఆంధ్రజ్యోతిలో నా ప్రేమలేఖ..



ఈ ఇమేజ్ నాగామృతం బ్లాగ్ సౌజన్యంతో..
నాగ్ గారికి, అలానే ముందుగా నాకు ఈ వార్తని తెలియజేసిన రాజేంద్రగారికి ప్రత్యేక ధన్యవాదాలు!




శ్రీవారి ప్రేమలేఖ పూర్తిగా...

Monday, October 13, 2008

ఏకాంతార్ణవం..


అతనితో గడపాలనిపిస్తుంది..

ఎవ్వరూ లేని ఏకాంతంలో..
చీకటి పరిమళాన్ని వెలుగురేఖలు
ఒక్కొక్కటిగా చుట్టుముడుతుండగా...

అనంతమనిపిస్తున్నఅతని అస్థిత్వాన్ని
దోసిళ్ళతో దొంగిలిద్దామని
ముందుకెళ్ళబోతే
అతని చిరునవ్వొకటి
పాదాలని తడిపి వెళ్ళింది!

పొగమంచు వలువల్ని విడుస్తున్న
రెల్లుగడ్డితో పరాచికాలాడుతున్న పిల్లగాలి
అతని నవ్వు హోరుతో కలిపి
వింత సవ్వడి చేస్తుంటే..

వెన్నెల స్నానం చేసిన
తెల్లటి తివాచీ మీద
మెత్తగా వత్తిగిల్లుతూ
తదేకంగా చూస్తున్న నా చూపుల్లోంచి
అతని ఒంటి నీలం
గుండెల్లోకి ఇంకుతున్న అనుభూతి..

చేతనాచేతనాల అవస్థ దాటిన మనసు
అతనిలో మునకలు వేస్తూ
అమరత్వాన్ని అనుభవిస్తుంటే

అప్పుడెప్పుడో మధ్యలో ఆగిపోయిన
స్వప్నమొకటి
అరమోడ్పులైన కనుల వెనుక
మళ్ళీ మొదలైంది!!

Monday, September 29, 2008

ఊసులాడే ఒక జాబిలట! (August 2008)


".... తెల్లరువాఝాము ఐదుగంటలైంది.. తెల్లవారబోతుందనడానికి సూచనగా వెలుగురేఖొకటి తూర్పు నించి దూసుకొస్తోంది.. నిద్ర లేస్తున్న పక్షుల కిలకిలలు మంద్రంగా.. ఇంటిముందు మా సుబ్బులు చల్లుతున్న కళ్ళాపి చప్పుడు.. ఉండుండి వినబడుతున్న గుడిలో గంటలు.. ఇవన్నీ కలిసి వింటుంటే ఎవరో నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు పలికిస్తున్న రాగంలా వినిపిస్తోంది.. చెట్లన్నీ ఆకులు రాల్చేసి కొత్త చిగురు కోసం ఆయత్తమౌతున్నాయి.. శిశిరంలో ప్రకృతి వసంతం కోసం ఎదురుచూస్తున్న విరహణిలా అనిపిస్తోంది.. ఇది స్థబ్ధత కాదు, అద్భుతం కోసం ఎదురు చూస్తున్న నిశ్శబ్దత!...


....అతను కాఫీ తాగుతూ "అబ్బా, ప్రాణం లేచొచ్చిందండీ" అని ఆహ్లాదంగా నవ్వాడు.. ఉన్నట్టుండి చుట్టూ రాత్రి చల్లదనం ఇంకాస్త పెరిగినట్లనిపించింది.. "పాపం పట్టుచీర, నగలతో చాలా ఇబ్బంది పడినట్లున్నారు.. ఏ అలంకరణ లేకుండా ఇలానే చక్కగా ఉన్నారు" గుండె ఒక క్షణం ఆగి కొట్టుకోవడం మొదలుపెట్టింది.. నా అవస్థో, ఆనందమో అతను గమనిస్తున్నాడన్న ఆలోచన ఎందుకో చాలా సంతోషాన్నిచ్చింది.. ఎవ్వరికీ కనబడని వెన్నెల కిరణమొకటి నిశ్శబ్దంగా మనసులో చోటు చేసుకోవడం అర్ధమౌతూనే ఉంది! అప్పుడు నెమ్మదిగా నవ్వేసి అక్కడనించి వచ్చేసినా మా ఇద్దరి మధ్య జరిగిన ఆ కాస్త సంభాషణ తాలూకు భావతరంగాలు నెమ్మదించడానికి కాస్త సమయం పట్టింది....."

పూర్తిగా...




Friday, September 5, 2008

తప్పని వీడ్కోలు!

కాలేజీ జీవితం.. ఎన్నో పరిచయాలు! మామూలు స్నేహాలు.. ప్రాణ స్నేహాలు.. ఆరాధనలు, నిరాశలు.. ఇష్టాలు, ప్రేమలు, గుండె కోతలు! అందులో కొన్ని కాలేజీ తర్వాత నెలల వరకూ కొనసాగితే, కొన్నేమో సంవత్సరాలు.. ఇంకొన్ని మన జీవితంతోనే పెనవేసుకుపోతాయి.. ఇదేమో అక్కడే మొదలై అక్కడే ఆగిపోయిన ఓ 'ఇష్టం' కధ.. 'తెలుగుజ్యోతి ' న్యూజెర్సీ వారి జులై/ఆగస్ట్ సంచికలో ప్రచురితమైన సింగిల్ పేజ్ కధ!

Sunday, August 31, 2008

ఊసులాడే ఒక జాబిలట! (July 2008)


"... ఇక ఊరుకోలేక నాకు రాజారావు పట్ల ఉన్న అయిష్టాన్ని చెప్పి "నీ పెళ్ళంటే నాకెందుకు సంతోషంగా ఉండదు చెప్పు.. కానీ ఆ రాజారావుతో అంటేనే ఎందుకో మనసు ఒప్పుకోవడంలేదు" అన్నాను. "కానీ అతనికి నేనంటే విపరీతమైన ఇష్టమే! నన్ను చూడందే ఉండలేడు.. నాక్కూడా నా చుట్టూ, కేవలం నా చుట్టూ తిరిగే భర్త కావాలి.. నా జీవితాన్ని మా అమ్మలా వేరొకరితో పంచుకునే దురదృష్టాన్ని కల్లోనైనా ఊహించలేను" అని తనవైపు వాదనని చెప్తుంటే నేను ఆవేశంగా "మీ అమ్మ జీవితంలో ఏం జరిగిందో అదే నీ జీవితంలోనూ జరుగుతుందా?" అని ప్రశ్నించాను.తను చిన్నగా నవ్వుతూ "ఆ ప్రశ్న ముందు నీకు నువ్వే వేసుకోవాలని కార్తీకా" అంది.. అప్పుడుకానీ నాకర్ధం కాలేదు నేను ఏ వాదనని నా మనసుకి బలంగా వస్తున్నానో దాన్ని నేనే ప్రశ్నించానని!!.... "


పూర్తిగా...

Friday, August 8, 2008

ఆశాకుసుమం


రేపటి ఉదయానికి
రంగులద్దాలనుకుంటున్న
చిట్టి ఆశని
చినుకు తర్వాత చినుకు
బలంగా అదిమేస్తున్నాయి..

రాత్రంతా పరిహసించిన
పెనుగాలిని లెక్కచేయని
ఆత్మవిశ్వాసం
ఆకుల మధ్య మెల్లగా
విచ్చుకుంటుంటే

సన్నని పరిమళం
మనసుని మెత్తగా
హత్తుకుంది!


(తొలిప్రచురణ)

Tuesday, July 29, 2008

ఊసులాడే ఒక జాబిలట! (June 2008)


.....ఆ సంచుల్లోంచి ఏవో రంగు కాగితాలు, టోపీ, ప్లాస్టిక్ పూల గుత్తులు లాంటివి తీసి బయట పెట్టి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టాడు.. రెండు నిమిషాల్లో అర్ధం అయింది అతను మ్యాజిక్ షో చేయబోతున్నాడని.. లోపల కోపం లావాలా పొంగుతున్నా 'అబ్బో ఇతనికి చాలా కళలే తెలుసే!' అనుకున్నా.. అతనికి కావాల్సినవన్నీ అందిస్తూ చూస్తుండగానే నేనూ పిల్లల కంటే ఎక్కువగా ఆ ప్రదర్శనని ఎంజాయ్ చేయసాగాను.. పిల్లలైతే ఒకటే అరుపులు, చప్పట్లూను!! మొత్తానికి చాలా బాగా జరిగింది అనుకుంటూ అతను తెచ్చిన వస్తువులన్నీ మళ్ళీ లోపల పెట్టేస్తుంటే చూశాను అతని షర్ట్ వెనక ఉన్న రక్తపు మరకల్ని!! కాస్త భయం వేసింది, ఏదైనా యాక్సిడెంట్ లాంటిది జరిగి దెబ్బలేమైనా తగిలాయేమో అని!! మెల్లగా అక్కడ నించి జారుకుని ఆ విషయం సులోచన మేడం కి చెప్పాను.. ఆవిడ "అవునా కనుక్కుంటాను" అన్నారు కానీ నాకే మనసాగక అతని దగ్గరకెళ్ళి "మీకేమన్నా ఫస్ట్ ఎయిడ్ కావాలంటే చెప్పండి" అన్నా.....


పూర్తిగా..

Thursday, July 17, 2008

నీ రాక కోసం..


చేతికంటిన ముళ్ళ గోరింటల
రంగు వెలిసిపోతోంది
ఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..

నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది
మనసు ఆదమరిచేది..

ఒక్కోసారి మంచు తడియారకుండానే
కళ్ళ ముందుంటావ్..
ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?

కాలికింద నలిగిన ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..
ఇంకెన్నిరోజులిలా!?

దిగులుతో బాధేసి, కోపమొచ్చి
ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేస్తుంటే
వినిపించింది నీ ఆగమన రాగం!

కిటికీ అవతల నిశాంతంలో
కొమ్మ కొమ్మకీ కొత్త ఆశల
చిగురులద్దుతూ నువ్వు!

నీ అడుగుల వెనుక
అలుముకుంటున్న రంగుల్లోకి
జారిపోయేముందు
అందరికీ చెప్పిరానీ
నా ప్రియసఖి వసంతమొచ్చిందని!!


తొలిప్రచురణ పొద్దులో..

Monday, June 30, 2008

ఊసులాడే ఒక జాబిలట! (May 2008)



..... అసలు ఇది ఏం చూసి ప్రేమించింది!?!? " అతను మన వాళ్ళే తెలుసా.. సిగరెట్, తాగుడు లాంటి చెడు లక్షణాలేమీ లేవు.. ఆఖరికి వక్కపొడి కూడా వేసుకోడు" ఇందాక మాధురి అన్న మాటలు గుర్తొచ్చాయి.. ఒకే కులం అవ్వడమే అసలైన అర్హతా!? చెడు అలవాట్లు లేనంత మాత్రాన మనిషి మంచివాడైపోతాడా!? ఆలోచిస్తున్నకొద్దీ ఆవేశం అమాంతంగా పెరిగిపోయి దాన్ని అమాంతంగా నిద్ర లేపి ఆ చెంపా ఈ చెంపా వాయించి "ఇలాంటి పిచ్చివేషాలు వెయొద్దని" చెప్పాలన్న కోరికని పళ్ళ బిగువున ఆపుకున్నాను.....

పూర్తిగా..

Friday, May 30, 2008

నేను సైతం



బత్తీబంద్ బ్లాగ్ లో గ్లోబల్ వార్మింగ్ మీద "నేను సైతం" పూరించిన శంఖారావం..



Thursday, May 29, 2008

ఊసులాడే ఒక జాబిలట! (Apr 2008)


...... స్కూల్లో ఎంత ఎక్కువ సమయం గడిపినా ఇంటిదారి పట్టక తప్పదు కదా.. అప్పటివరకూ దగ్గరకు రావడానికి తటపటాయించిన దిగులు మేఘం నేను మా ఊరి బస్ ఎక్కగానే దర్జాగా నన్ను ఆవరించేస్తుంది.. 'నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి నే గౌతమి నైనా' మేఘసందేశంలో పాట అప్రయత్నంగా గుర్తొస్తుంది.. ఇందాక మీ కవితలన్నీ మళ్ళీ మళ్ళీ చదివాక, ఇంకా ఏదో చదవాలనిపించి మీ ఉత్తరాలన్నీ చదివాను.. దక్షిణపు గాలి వెళ్తూ వెళ్తూ మంచి గంధాన్ని నా చుట్టూ చల్లిన అనుభూతి.. ఒకదాంట్లో 'పంతులమ్మ ' అని మీరు సంబోధించడం ఇప్పుడింకా నవ్వు తెప్పించింది.. అందులోనే మీరడిగారు నాకు పాటలంటే ఇష్టమేనా అని.. ఎందుకో నేను ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వలేదు.. అంతలోనే ఒక అనుమానం, ఒకవేళ నేను మీరడిగిన వాటన్నిటికీ జవాబులు చెప్పట్లేదని మీకు వెంట వెంటనే రిప్లై రాయాలన్న ఆసక్తి పోయిందేమోనని.. పిచ్చి ఆలోచనని తెలుస్తూనే ఉంది.. మరి కారణం తెలీనప్పుడు మనసు ఇలానే ఆలోచిస్తుందిగా!..........


పూర్తిగా..




Friday, May 2, 2008

అలిగితివా..


తెలుగుజ్యోతి (తెలుగు కళా సమితి, న్యూజెర్సీ వారి సారస్వత పత్రిక) వారు నిర్వహించిన సర్వధారి ఉగాది రచనల పోటీలో ప్రధమ బహుమతి పొందిన నా కవిత...

తెలుగుజ్యోతి లోని ఇతర రచనల కోసం..
http://www.tfas.net/prema/

(click on the image for the larger size)







Thursday, April 17, 2008

ఊసులాడే ఒక జాబిలట (Mar 2008)


..... అదేం విచిత్రమో.. నాన్న పోయాక అమ్మ ధోరణిలో విపరీతమైన మార్పు వచ్చింది.. చాలా పరధ్యానంగా ఉండేది.. నాన్న విలువ ఆయన పోయాక తెలుస్తుందేమో అనుకున్నా.. కానీ విచిత్రంగా, తనకీ పెళ్ళి చేసి తన జీవితాన్ని నాశనం చేశారని అమ్మమ్మ తాతయ్యలతో ఒకరోజు అనడం విని నాకు బాధ కంటే చాలా ఆశ్చర్యం వేసింది! అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధమేమిటో నాకప్పుడు అర్ధం అయింది.. ఏమీ లేదు! యజమానికి పనిచేశేవాడికీ, అమ్మాయికి అబ్బాయికీ, గురువుకి శిష్యుడికీ ఇలా ఏదో ఒకటన్నా లేదు.. అస్సలంటే అస్సలు లేదు!! పెద్దవాళ్ళు ఇద్దర్నీ ఒకే కప్పు కింద ఉండమన్నారు.. ఉన్నారు.. అంతే! వాళ్ళిద్దరి మధ్యా ఎప్పుడూ దగ్గరతనం లేదు.. ఉండటానికి వాళ్ళే మాత్రంకూడా ప్రయత్నించలేదు! ........

పూర్తిగా...

Monday, March 31, 2008

అది ఒక వెన్నెల రాత్రి..


వెన్నెల రాత్రిని తలుచుకోగానే ఎంత చికాకులో ఉన్నా క్షణకాలమైనా మనసుకి హాయిగా అనిపిస్తుంది.. ఎన్నో వెన్నెలరాత్రులు మనలని పలుకరించి వెళ్ళినా కొన్ని మాత్రం అందమైనవిగా, అపురూపమైనవి గా మనసులో నిలిచిపోతాయి..

చిన్నప్పుడు వెన్నెల రాత్రుల్ని బాగా ఎంజాయ్ చేసింది వేసవి సెలవులలో! చిన్నత్త వాళ్ళ ఊరుకి వెళ్లినప్పుడు నీళ్ళు లేని కృష్ణమ్మ ఇసుక తిన్నెల్లో అంటుకునే ఆట ఆడుకోవడం.. చెరువుగట్టు మీద కూర్చుంటే చంద్రుడు సరిగ్గా చెరువు మీద లైట్ వేసినట్లు నీళ్ళ తళతళలు.. ఆ మెరిసే నీళ్ళల్లోకి ఎవరెక్కువ దూరం విసురుతారో అని పందెం వేసుకుని రాళ్ళు విసరటం..

అదే ఏ ఊరుకీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే రాత్రి భోజనాలవ్వగానే పిల్లలందరం తలా ఒక పళ్ళెం, రసం మామిడికాయ తీసుకుని డాబా మీదకి చేరి చిన్న మామయ్య చెప్పే దెయ్యం కధలన్నీ భయపడుతూనే వళ్ళంతా చెవులు చేసుకుని వినడం.. తర్వాత చేతులు కడుక్కోవడానికి కిందకి ఒక్కళ్ళమే వెళ్ళాలంటే భయం.. వెన్నెల రాత్రి ఇంత వెలుగు ఉంటే మీకేం భయం అన్నా పెద్దవాళ్ళని ఎవరినో ఒకరిని కిందకి లాక్కెళ్ళడం.. ఇలా సరదా సరదాగా ఉండేవి...

యుక్తవయసుకి వచ్చాక అదే వెన్నెలరాత్రి ఆహ్లాదంగానే కాదు మధురంగా కూడా అనిపిస్తుంది.. తెలీకుండానే 'ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి ' అని మనసు ఆలాపిస్తూ ఉంటుంది.. అలాంటి రోజుల్లోదే ఈ వెన్నెల రాత్రి..

అదొక శరద్రాత్రి.. నాకసలు వసంతం కంటే శరదృతువంటే ఎక్కువ ఇష్టమేమో శరదృతువులో వెన్నెల ఇంకా ఇష్టం! నేనప్పుడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నాను.. దీపావళికి చాలా రోజులు సెలవు వస్తే ఇంటికి వచ్చాను.. మా పిన్ని వాళ్ళ అత్తగారి తరుపు ఎవరో చుట్టాల ఇంట్లో పెళ్ళికి వెళ్తూ నన్ను కూడా రమ్మంది.. పెళ్ళంటే నేనూ గెంతుకుంటూ సరే అన్నాను.. అదీకాక మా పిన్నికి వాళ్ళ అత్తగారి తరపువాళ్ళు అల్లుడి హోదాలో మర్యాదలు చేస్తారు.. ఇంక పక్కనే ఉన్న మనం యువరాణీ టైపన్న మాట!! ఇంతకీ మేమెళ్ళేది ఏ ఊరని అడిగితే 'వైజాగ్ దగ్గర ఉన్న పాడేరు ' అని చెప్పింది.. అంతకు మునుపెప్పుడూ ఆ పరిశరప్రాంతాలకి కూడా వెళ్ళి ఉండకపోవటం చేత బాగా ఊషారుగా బయలుదేరాను..

మేము అనకాపల్లిలో ట్రైన్ దిగి, మా బాబాయి వాళ్ళ చుట్టాలు పంపిస్తానన్న జీప్ కోసం ఎదురుచూస్తున్నాము.. గంటన్నరైనా జీప్ జాడ లేకపోయేసరికి బాబాయి ఫోన్ చేసి కనుక్కుంటే అది ఎప్పుడో బయలుదేరి మా కోసం వచ్చిందని చెప్పారు.. మా బాబాయి ఇంక చీకటి పడితే కష్టమని బస్ కి వెచ్చేస్తామని చెప్పారు..

బస్ స్టేషన్ కి వచ్చి మేము ఎక్కాల్సిన బస్ చూసేసరికి నా పై ప్రాణం పైనే పోయింది! గంపలు.. కోళ్ళు.. బస్తాలు.. బొచ్చెలు.. వందల కొద్దీ అన్నట్లు జనాలు.. ఎలాగొలా లోపలికి వెళ్ళామనిపించుకుని పై రాడ్ పట్టుకుని నిల్చున్నాం .. పెళ్ళికి అనగానే టింగురంగా మంటూ వచ్చినందుకు నా మీద నాకే భలే కోపం వచ్చింది.. కానీ బస్ బయలు దేరిన అరగంట తర్వాత అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు నెమ్మదిగా సీట్లలో ఇరుక్కున్నాము..

అలా కూర్చుని కిటికీలోంచి బయటకి చూసిన నాకు ఆశ్చర్యం తో మాట రాలేదు.. ఆ ఊరు బాగా ఎత్తులో కొండ పైన ఉంటుందని విన్నాగానీ అంతటి ప్రకృతి సౌందర్యాన్ని అసలు ఊహించలేదు.. చుట్టూ పచ్చగా, చల్లని గాలి వీస్తూ ఉంటే నన్ను నేనే మర్చిపోతున్న సమయం లో నెత్తిమీద 'టంగ్ ' మని ఎవరిదో మోచేయి తగిలింది.. ఆ నొప్పి తట్టుకోలేక కోపంగా ఏదో అంటానికి నోరు తెరిచేలోగా ఒక మగ కంఠం 'సారీ అండి ' అని సభ్యత గా వినిపించింది.. ఈ బస్ లో ఇంగ్లీషు మాట్లాడేదెవరా అని తలెత్తి చూస్తే నూనూగు మీసాల యువకుడు అభ్యర్ధనగా చూస్తూ కనిపించాడు.. చూడటానికి చదువుకుంటున్న అబ్బాయిలా అనిపించాడు.. పైగా సారీ కూడా చెప్పాడని ఇక పట్టించుకోకుండా తిరిగి నా ప్రకృతి లో మునిగిపోయాను..

మేము ఊరు చేరుకున్న మరుసటిరోజు ఆ ఊర్లో సంవత్సరానికొకసారి జరిగే జాతర రోజని తెల్సింది.. ఆ రోజు సాయంత్రం పెళ్ళికి వచ్చిన చుట్టాలందరం జాతరకి వెళ్ళాలనుకున్నాం.. నా సిటీ ఫ్యాషన్ చూపించి ఫోజు కొట్టాలని నేను పెట్లోంచి చుడీదార్ తీస్తే మా పిన్ని గుర్రుమని చూసింది.. ఇక ఓణీ కట్టుకోక తప్పలేదు! అప్పుడప్పుడే చలి మొదలైనా అది ఏజెన్సీ ప్రాంతం అవ్వటం వలన మాములు కంటే చలి ఎక్కువగానే ఉంది.. రోడ్డుకి రెండు పక్కలా పెద్ద చెట్లు.. చెట్ల మధ్య నించి వెన్నెల మసగ్గా పిండిలా జారుతుంటే, చలికి కాస్త వణుకుతూ వోణీ ని చుట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడవటం మళ్ళీ నేనెప్పటికీ ఆస్వాదించలేని అద్భుతమైన అనుభవం..

జాతర జరిగేచోట అంతా కోలాహలంగా ఉంది.. అంతా అరుపులు, డప్పుల ధ్వని.. అంతలో మా పిన్ని వాళ్ళ అబ్బాయికి బెలూన్ మీద మనసు పోయింది.. పిన్ని వాడిని నాకు అప్పగించేసి ఇక నీ ఖర్మ అన్నట్లు చూసింది.. అ బెలూన్ వాడి దగ్గర బోల్డంతమంది జనం.. మనమేమో పెద్దగా అరిస్తే నామోషీ అనుకునే రకం.. అలా అక్కడే తచ్చట్లాడుతుంటే ఎవరో పక్కనించి వచ్చి 'ఉండండి నేను తెచ్చిస్తాను ' అని అర నిమిషంలో బెలూన్ తో మాముందు ఉన్నాడు.. అమ్మయ్య అనుకుంటూ అతని వంక చూస్తూనే గుర్తు పట్టా, పొద్దున్న బస్ లో నాకు మొట్టికాయ ఇచ్చిన శాల్తీ అని.. వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంటే 'భలేవారే ఈ మాత్రం దానికి డబ్బులు ఎందుకండి ' అంటూ నవ్వాడు.. అబ్బాయిలు కొంటెగా, వంకరగా, అల్లరిగా ఇంకా నానారకాలుగా నవ్వగలరుగానీ అందంగా మాత్రం నవ్వలేరనే నా నమ్మకానికి అదే ఆఖరి క్షణం అనుకుంటా!!

వెన్నెల్లో.. ఆ అబ్బాయి నవ్వు... 'అమ్మో! ఎటో వెళ్ళిపోతోంది మనసు ' అనుకుంటూ అతను ఏదో అంటున్నా వినిపించుకోకుండా మా వాళ్ళు ఉన్నచోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.. కానీ ఆ నవ్వు దగ్గర చిక్కుకుపోయిన నా కళ్ళు వెనక్కి రావడానికి రెండు మూడు రోజులు పట్టింది!!

పెళ్ళైన కొత్తల్లో అంటే ఒకానొక ప్రాచీనకాలంలో ఇలాంటి వెన్నెల రాత్రి సమయంలో నేనూ, మావారూ జర్నీ చేస్తుంటే పై కధంతా చెప్తే 'మరి పెళ్ళికి ముందు నా నవ్వు తెగ నచ్చిందన్నావ్.. ఇప్పుడేమో నాకంటే ముందు ఏవడో బెలూన్ బచ్చాగాడి నవ్వు బావుందంటున్నావ్ ' అని బాధగా, దిగులుగా అన్నారు.. 'అయ్యో, అలా దిగులు పడకండీ మీ నవ్వే ఎక్కువ నచ్చింది. అందుకే మిమ్మల్ని చేసుకున్నా' అని అనునయించాను.. అప్పటినించీ ఆయనకి వెన్నెలరాత్రి నన్ను ఒంటరిగా ఎక్కడికన్నా పంపాలంటే భయం.. మళ్ళీ ఎవరిదన్నా నవ్వు నచ్చిందంటానేమో అని!!

(Posted in Telugupeople.com)

Monday, February 25, 2008

అడుగులో అడుగునై...


నువ్వు వస్తూనే
వెన్నెలకి వింత మెరుపొచ్చింది!

సరుగుడుచెట్ల మధ్య మట్టిరోడ్డొకటి
నిన్నటి వర్షం కబుర్లేవో
చెప్పాలంటుంది
కాస్సేపలా వెళ్ళొద్దామా?

అదిగో.. అలా విసుగ్గా చూడకు
నువ్వేమీ మాట్లాడక్కర్లేదు!

నిద్రపోతున్న గువ్వలజంటనీ
గుడి గూట్లోని సాంధ్యదీపాన్నీ
విచ్చుకోబోతున్న రాధామనోహరాల్నీ
ఇవ్వాళైనా నీతో కలిసి చూడాలనుంది..

రేపొద్దున్న మళ్ళీ బ్రతకడం
మొదలుపెట్టేలోపు
కాస్సేపు జీవించనీ!
కాస్త దూరమే.. నడిచొద్దామా?

నాకు తెల్సు..
వచ్చేప్పుడైనా
నీకూ అర్ధమౌతుంది..

ఊపిరి తాకినంత మాత్రాన
సామీప్యం సాన్నిహిత్యమవ్వదని!!

(తొలి ప్రచురణ)

English Translation by NS Murty gaaru..

 

 

ఊసులాడే ఒక జాబిలట (Feb 2008)


...అక్కడికి కాస్త దూరంలోనే మంచినీళ్ళ బావి.. అక్కడే మీకు మొదటి పలకరింపులు, ప్రశ్నార్ధకాలు ఎదురవుతాయి.. బావికి ఎదురుగా ఎవరిదో స్మృత్యర్ధం అంటూ పెయింట్ వెలిసిపోయి, పెచ్చులూడిపోయిన గోడలు, ఫ్రెష్ గా అంటించిన సినిమా పోస్టర్లతో ఊరి బస్ స్టాప్.. దాని పక్కనే వీరాస్వామి బడ్డీ, సైకిల్ కొట్టు.. ఒక పాతిక అడుగులు వేయగానే ఊరి పెద్దలా హుందాగా పలకరించే మర్రిచెట్టు ఊరి మధ్యగా! అక్కడ నించే పింగళివారి వీధి, చావా వారి సందు, మాల పల్లె ఇలా వీధులు వీధులు గా ఊరు విడిపోతుంది.. పట్టుమని 1000 మంది కూడా ఉండరేమో ప్రతీవాళ్ళూ ప్రతీవారికీ తెలుసు!!...

పూర్తిగా...




Wednesday, February 13, 2008

శ్రీవారికి ప్రేమలేఖ


... అయినా ఇప్పటికీ ఒకరికొకరు కోపం తెప్పించే పనులు చేయడం మానలేదుగా! బయటకెళ్దామని చెప్పిన టైం కి నేనెప్పుడూ రెడీ కాకపోవడం , ఫోన్ లో మాట్లాడేటప్పుడు బిగ్గరగా మాట్లాడటం మీకు కోపం తెప్పిస్తే..

స్నానం చేసి తడి టవల్ మంచం మీద గిరాటు వేసేసి వెళ్ళి పోవడం , వీకెండ్స్ లో టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఒక గంటసేపు పళ్ళు తోముకోవడం నాకు అసహనం కలిగించే విషయాలు!!

కానీ పర్లేదు.. ఇవి భరించడం ఏమంత కష్టం కాదు.. అయినా ఒకరి గురించి ఒకళ్ళు మన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవడానికి ఈ మాత్రం చిన్న చిన్న లోపాలు లేకపోతే బావోదు...

పూర్తిలేఖ


(తొలిప్రచురణ)

Monday, February 11, 2008

నా మొదటి ఆర్టికల్..


పాటలంటే ఇష్టం లేనివారుండరు.. దేశం విడిచి వచ్చాక 'మనవి ' అనుకునే అంశాలమీద ఇష్టం ఇంకాస్త పెరుగుతుంది.. అందులో పాటలు ఒకటి.. హిందీ పాటలు అన్ని దశకాలవీ నెట్ లో దొరికేవి కానీ మన తెలుగు పాటలే ఉండేవి కాదు.. ముఖ్యంగా 70's, 80's పాటలు! ఇక జనరంజనిలో వచ్చే ఆ మనోరంజక గీతాలను వినలేను అనుకున్న తరుణంలో పరిచయమైన సైట్ చిమటమ్యూజిక్! ఆ సైట్ నిర్వాహకులకు నా అభినందనలను తెలియచేస్తూ సంవత్సరం క్రితం రాసిన ఆర్టికల్ ఇది..

Guest editorial on ChimataMusic.com

Tuesday, January 15, 2008

ప్రియమైన శత్రువు


సెలయేరు చేతులు జాచిందో
లేక
చందమామే ముందుకు వంగాడో!

వేలికొసల చిరుస్పర్శలు..
ఎటుమళ్ళాలో తెలీక
పిల్లగాలి తత్తరపాటు..
కిటికీ అవతల
కొబ్బరాకుల దొంగచూపులు..
మందహాసంతో జారిపోతున్న క్షణాలు..

వెన్నెలెప్పుడు నిద్రపోయిందో
తెలీని అచేతనస్థితి!!

మంచం పక్కనే
వదిలేశాననుకున్న నిమిషాలన్నీ
మనసు పొరల్లోకి
ఎలా చేరాయసలు!?

నువ్వు వాకిలి దాటగానే
ఖాళీ చేయాలనుకుంటే
చుట్టూ నీ ఆలోచనల పహారా!

గేటు దగ్గర నిశ్చింతగా
నాట్యమాడుతున్న మాలతీతీవె
నీ నిష్క్రమణ నిజం కాదని
అభయమిస్తూ!!


(తొలిప్రచురణ)

Wednesday, January 9, 2008

ఊసులాడే ఒక జాబిలట (Jan 08)


...చిక్కని వెన్నెల రాత్రి మీ వాన చినుకులలో నిలువెల్లా తడిసిపోతున్నాను.. భావుకత అంటే చంద్రుడినీ, మల్లెల్నే కాదు రాళ్ళనీ, నీళ్ళనీ ఉపయోగించి మనసుని స్పందింపచేయడం.. కదూ! అందుకే మీకు రాయకుండా, నా ప్రశంశలందించకుండా ఉండలేకపోతున్నాను..

అంతే కాదు నాలో ఇంకో అత్యాశ కూడా మొదలయింది.. 'కుదరదేమో.. బాగోదేమో' అని మనసు నసుగుతుంటే చుట్టూ ఉన్న గాలి అలలు మాత్రం 'ఏం పర్లేదు అడిగెయ్యమని ' ముంగురులతో ధైర్యం చెప్పిస్తున్నాయి.. అందుకే అడిగేస్తున్నా, "మీ ఆటోగ్రాఫ్ కావాలి మేడం!"..

పూర్తిగా...