Pages

Sunday, November 23, 2014

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?


సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు
లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.
 
ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?


మర్చిపోయాననుకున్న నవ్వుల్నీ
మామూలైపోయానుకున్న బెంగల్నీ
ఇష్టమైన పాటలోని నచ్చిన పదాల్లాగా
మళ్ళీ మళ్ళీ వినిపించకపోతేనేం!?


నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?


వద్దు వద్దు ఈవేళప్పుడొద్దని మొత్తుకుంటున్నా
మొదలయ్యే వాన..
మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
లోపలంతా ఒకటే వాన
తడిచి తడిచి చిత్తడి అయినా
మట్టిపాత్ర దాహాన్ని తీర్చనూలేక.. ఒడుపుగా మూయనూలేకా
ఎందుకొస్తాయో కొన్ని రాత్రిళ్ళు!


ఏదో లేనితనమా లేక ఏమీ మారనితనమా?

సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని
చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో… 

ఆకుల మధ్యలో గాలీ
గూళ్ళల్లో పక్షులూ
విత్తనం చిట్లిన చప్పుడూ
అన్నీ సద్దుమణుగుతాయి.


లీలగా మెదిలే పేదరాసి పెద్దమ్మ కధ
మగత మబ్బులో మెల్లగా చుడుతుండగానే
ఉన్నట్టుండి అమ్మ గుర్తొస్తుంది
అమ్మ కొచ్చిన జొరమూ గుర్తొస్తుంది!
ఒక్కసారిగా వణికించిన దిగులుకైనా తెలుసో లేదో
కొన్ని రాత్రుళ్ళు ఎందుకొస్తాయో?
వచ్చి వలయాలై ఎందుకు తిరుగుతాయో!?

 
మొదటి ప్రచురణ సారంగలో.......