Pages

Tuesday, September 3, 2013

ఖాళీ ఉత్తరం...



నువ్వొదిలెళ్ళిన క్షణాలు...
సావకాశపు సాయంత్రపు నీడల నాటివి

కాసిని గుల్‌మొహర్ చెట్టు కిందా...
ఇంకాసిని మోటబావికెళ్ళే రోడ్డు పొడవునా
ఇప్పటికీ తారట్లాడుతూనే ఉంటాయి..
పాతబడవూ.. పరిమళం వదలవూనూ!


తడి వెంట్రుకల్లో చిక్కుకుపోయిన
గుసగుసలూ..
చెవి వెనుకే అంటుకుపోయిన
వేలికొసల కంపనలూ..
రహస్య బహుమతులెన్నెన్నో!

ఆకాశం మోయలేక
జారవిడచిన నల్లమబ్బొకటి
గుమ్మం బయట నర్తిస్తుంటే...

మారిన ఋతువుల రాగాలేవో
సరిచూసుకుంటూ
జ్ఞాపకాల జుగల్బందీ మొదలవుతుంది!

పదం పదం పొందికగా కూర్చి
అప్పటికప్పుడు నీకేదో రాద్దామనుకుంటాను..

మనసైన ఏకాంతాలన్నీ
కదిలీ.. మెదిలీ.. దిగ్గున చెదిరెళ్ళిపోయీ
వేసవి మధ్యాహ్నపు వీధిలాంటి
మనోఫలకాన్ని మిగుల్చుతాయి..
అనుకున్నదంతా చెప్పగలిగే
అక్షరాలన్నీ అదృశ్యమౌతాయి!

చివరి చుక్క వరకూ చేరుకోని అభావ వాక్యమొకటి
బెంగగా రాలిపడుతుంది!
 
అసలంటూ ఏవీ లేకుండా కాదులే...
కళ్ళ కొలకుల జారుతున్న బిందువుల సాంద్రతనైనా
కొలిచి పంపిస్తాను!!




ఈ నెల కౌముదిలో...