Pages

Friday, February 17, 2023

నా నేను...

 
తెల్ల పేజీల మీదున్న ఎగుడుదిగుడు జీవితాన్ని
రూళ్ళ పేజీల  పుస్తకంలోకి ఎక్కిస్తున్నప్పుడల్లా
ఒక దీపాన్ని అరచేతిలో ఎత్తి పట్టుకుంటావుగా

అప్పుడు అనుకుంటాను...
ఆ గరుకు చెంపల మధ్య వాలిన కుదురైన నవ్వుని చూస్తూ
చాలా గట్టిగా అనుకుంటాను....

నేనెవరో ఆ నా నించి పారిపోవాలని!

కొన్ని నిస్సహాయతలూ.. అనేక చీకట్లూ
కలిసి వేసిన తోవల వెంట
అపసవ్యాల బలవంతపు అడుగులూ
ఈ ఆనవాళ్ళన్నీ
విరిగిన అద్దంలోకి విసిరేసి
మెల్లగా నా నించి నేను తప్పించుకుపోవాలని...

నీకు తెలియడం కోసమే జీవితం మొదటి కంటా వెళ్ళి
మళ్ళీ బతికి రావాలనీ
కేవలం అందుకోసమే నా నించి నేను వెనక్కి పారిపోతుంటానా...

వేసవి వెళ్ళాక కూడా భళ్లున నవ్వుకుంటూ పూచే బొండుమల్లెల్లా
ఇక్కడో నేనూ.. అక్కడో నేనూ

సీమచింతకాయల వాటాలేస్తూ
కొత్త రిబ్బన్ల కోసం మారాం చేస్తూ
అమ్మకోసం గవ్వలేరుతూ
వోణీ కొంగు కింద వానలో తడుస్తూ
నానమ్మ చేతికర్రనవుతూ
గాబు నీళ్ళలో జాబిల్లిని ముద్దు చేస్తూ

పదిలంగా దాచుకుని అప్పుడప్పుడూ
ముచ్చటగా  చదువుకునే వాక్యాల్లాంటి నేను...

ఆ పరుగులో ఎదురవుతున్నాను!

వదిలేయాల్సినవి సరే... మరి వొడిసి పట్టుకుని
ఎప్పటికీ అట్టిపెట్టేసుకోవాల్సిన... నాక్కావాల్సిన నేను

వాయిల్ చీర కుచ్చిళ్ళలో వెన్నెల పాటలు పాడుతున్న నీకు
మరొక్కసారి పరిచయమవ్వనీ!

నేనంటే తప్పొప్పుల నేనని
అర్ధమవ్వనీ!!

ఉదారంగా గదిలోకి వీస్తున్న నిమ్మచెట్టు గాలిని
కాస్త ముఖానికి రాసుకుంటూ
పైకి లేచి ముద్దు పెట్టుకున్నావు చూడూ...

ఎందుకనో కాస్త చెప్పవూ!?

----
మొదటి ప్రచురణ - ATA సావనీర్ జులై 2022