Pages

Sunday, November 22, 2009

అదే వాన...


జోరుగా మొదలైన వాన
ఆగకుండా..నిలకడగా పడుతూనే ఉంది..
మన పరిచయంలానే!

రోడ్డు చివరి ఒంటరి పాకలో
తగిలీ తగలకుండా...

హడావిడి పడుతున్న చీకటిలో
నింపాదిగా తడుస్తున్న కొండని చూస్తూ..

ఒకరికొకరమని తెలుస్తున్న తొలినాళ్ళవి..

ఉరుము ఉలికిపాటుకి
తగులుతున్న భుజం
సంకోచపు సరిహద్దుని
చెరిపి వేస్తుంటే..

అవసరమైన సందేశమేదో అందినట్టు
గాలితెర దీపం కళ్ళు మూసింది..
ఉన్నట్టుండి వంద పారిజాతాల
వత్తిడి.. పెదవులపైన!

హృదయాన్ని వెలిగించి
శరీరాన్ని మండించిన ఒక జ్వాల!
అప్రయత్నంగా ఇద్దరం వాన కింద..

జీవితానికి కొత్తచిరునామా నిర్ణయమైన క్షణాలవి!

ఇప్పుడూ అదే వాన.. కిటికీ అవతల..

పుస్తకం చదువుకుంటూ..
కాలివేళ్ళతో నా చేతిగాజులు లెక్కబెడుతూ..
పక్కనే నీ వెచ్చటి ఉనికి!

అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!


(తొలి ప్రచురణ ఆవకాయలో...)

Monday, November 9, 2009

జలపాతం


దేవతలు ధరణి పైకి
జారవిడిచిన ఒక ధవళవస్త్రం..
తడబడుతూ.. తేలుతూ.. పరుగులు పెడుతూ..

మబ్బులు మురిపెంగా జార్చిన
చినుకు పోగులను కలుపుకుంటూ
అడుగు అడుగుకీ
తుళ్ళిపడుతున్న చిలిపిదనం..

తన్మయత్వంతో తాకబోతే
మనసంతా తడిపేసింది..

కదలని బండరాయి కరుకుదనం..
రాలిపడిన పూల నైరాశ్యం..
వేటినీ అంటనీయక
ఎగుడుదిగుడుల అనుకోని మలుపుల్లోకి
అలవోకగా జారిపోతోంది!

ఆకతాయిగా అడ్డుకుంటున్న
రాళ్ళగుట్టలపై అలిగి..
ఆకుపచ్చని ఆత్మీయత ఒడిలోకి
అధాటున దూకేస్తుంటే
పయ్యెద సర్దుకుంటూ ప్రకృతి
ఫక్కున నవ్వుతోంది!


కాంతిగారూ, చాలా రోజులకి పూసిన పువ్వు.. ఇది మీకోసం :-)
(తొలి ప్రచురణ ఆవకాయలో...)

Tuesday, May 26, 2009

మనోనేత్రం



తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కవిత...

రెండేళ్ళ చిట్టి నవ్వినప్పుడల్లా
తెల్లదనం తెరలు తెరలుగా విచ్చుకుంటుంది

కొసరి తినిపించే
అమ్మ చేతివేళ్ళ మీదుగా
పసుపు పవిత్రంగా అతుక్కుంటుంటే

కాలికి గుచ్చుకున్న ముల్లు నొప్పి
గుండెకి చేరనివ్వని నేస్తం స్పర్శ
హరితమై ప్రవహిస్తుంది..

తుంటరి చినుకుల చక్కిలిగింతలకి
తుళ్ళిపడుతున్న సెలయేరు
నీలాలు రువ్వుతోంది..

గ్రీష్మ కిరణాల
గాఢ చుంబనమే కదా ఎరుపంటే!

అపజయం పరిహసించినప్పుడల్లా
కాషాయం అభిమానంగా చుట్టుకుంటుంది..

సన్నజాజి సందెగాలుల ప్రణయావేశం
తలత్ గజల్ తో కలిసినప్పుడేగా
ఊదారంగు వింతహొయలేమిటో తెలిసేది!

ఇక..అన్ని రంగులూ కలిసిన నలుపు
కళ్ళెదురుగా కావాల్సినంత!!

మనోఫలకం పై చెక్కుకున్న
ఈ వర్ణమాలికని తాకినవారెవరనగలరు
నాకు చూపులేదని!?


Friday, April 10, 2009

పుష్పవిలాసం

గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనాఎంచుకోలేదు!

ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..

రంగో.. రూపమో.. లోపమెక్కడుందో!

అస్పష్ట సందేహమేదో

ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..

తల్లిపొదనే తనువు చాలించే
స్వేచ్ఛ ఇపుడు నా సొంతమనే
కోయిల సందేశం చేరుతుండగానే
తుమ్మెద తొలిముద్దు పెట్టింది!


(పొద్దు వారి ఉగాది వచన కవి సమ్మేళనం 'తామస విరోధి' కొరకు వ్రాసిన కవిత.. చిన్న మార్పుతో)

Thursday, March 26, 2009

కవిత్వం నుంచి కవిత్వంలోకి..




టాగోర్ Stray Birds కు బొల్లోజు బాబా గారు చేసిన తెలుగు అనువాదం 'దారి తప్పిన పక్షులు ' పై పొద్దు లో ప్రచురించబడిన సమీక్ష...

కవిత్వం నుంచి కవిత్వంలోకి.. 'దారి తప్పిన పక్షులు '


ఈ కవితా సంకలనం మొత్తం ఇక్కడ చదవొచ్చు..
మూలము - Stray Birds
అనువాదము - దారి తప్పిన పక్షులు




Friday, January 23, 2009

'జాజుల జావళి' పై భావకుడన్ గారి సమీక్ష



పువ్వులు.. వెన్నెల.. చిట్టితల్లి.. చందమామ.. ఏకాంతం.. ఆవేదన.. విషయం ఏదైనా దానిని హృదయం అనుభవించగానే కొన్ని కవితలు పుట్టాయి.. కొందరు చాలా బావున్నాయన్నారు.. ఇంకొందరు పర్వాలేదంటే మరికొందరు ఇంకా బాగా రాయొచ్చన్నారు.. పాఠకుల స్పందన ఏదైనా చాలా సంతోషంగా అనిపించేది.. 'ఇదే కదా గుర్తింపంటే!' అనిపించేది.. ఇంతకన్నా ఎక్కువగా ఆశించలేదు.. అసలు వస్తుందనీ అనుకోలేదు!

ఉన్నట్టుండి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ సాహితీ ప్రేమికుడైన 'భావకుడన్ ' గారు జావళి ఆలపిస్తున్న ఈ కవితలను అనూహ్యమైన రీతిలో సమీక్షించి వాటికొక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు భాగాలుగా సాగిన సమీక్ష నా కవితల్లో నాకే అందని ఎన్నో విషయాలని తెలియజేసింది.. కొత్త కోణాలను స్పృశిస్తూ సమీక్షించిన భావకుడన్ గారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనలు తెలుపుకుంటున్నాను.


నిషిగంధగారి "జాజుల జావళి" :-కవితా సమీక్ష -మొదటిభాగం

"జాజుల జావళి"-సమీక్ష, రెండవ భాగం

నిషిగంధగారి "జాజుల జావళి" :-కవితా సమీక్ష-3 జాజుల జావళిలో ప్రకృతి-స్త్రీ

నిషిగంధగారి "జాజుల జావళి"-సమీక్ష-4 జాజుల జావళిలో "సహచర్యం"

'ఊసులాడే ఒక జాబిలట!' పూర్తి నవలా రూపంలో..

కౌముది వారు విన్నూత్నంగా ప్రవేశపెట్టిన 'ఇంటింటా కౌముది ఉచిత గ్రంధాలయం' అనే అంశంలో భాగంగా 'ఊసులాడే ఒక జాబిలట!' లోని అన్ని భాగాలు కలిపి, చక్కని ముఖచిత్రంతో ఒకే పి.డి.ఎఫ్ ఫైలుగా మార్చి, పుస్తక రూపంలో అందిస్తున్నారు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.