Pages

Monday, July 20, 2015

ఒకే ఒక్క శబ్దం 2 - అప్పట్లో ఆ కాయితప్పడవ...

కాస్తంత ఊసుపోనితనమూ.. బోల్డంత ఉత్సాహమూ.. చినుకు వాసన తగలగానే, కాసిని వృధా కాగితాలు కనబడగానే!

గబగబా వాటిని సాపు చేసి, గోటితో గీరీ గీరీ అతిజాగ్రత్తగా చదరంగా చింపి, ఇంకెంతో ఏకాగ్రతతో మడతలు పెడుతూ ఒక కాగితం పడవని తయారు చేసుకుని, ఇక ఆ సాయంత్రమంతా కురవబోయే వానలో ముందుగా చేతులు జాచి  అరచేతిలోకి చినుకుల్ని ఆహ్వానించడం!

చిన్నప్పుడనేం కాదు.. ఇప్పటికీ కూడా!

వర్షం పెద్దదయ్యీ, కాస్త నీళ్ళు నిలవగానే మెల్లగా పడవని వదలడం.. అది ఒరగకుండా, మునగకుండా ఆ వర్షపు నీటి అలల్లో మెల్లగా ఊగుతూ నిలకడగా ఉండటం చూశాక ఇక అదో భరోసా. ఈ కొత్త ప్రయాణంలో అది భద్రంగానే ఉండగలదని!

కాసేపయ్యాక కూడా కదలకుండా అక్కడక్కడే తిరుగాడుతూ ఉంటే మెల్లగా చేతుల్తో నీళ్ళని ముందుకు తోయడం, ప్రవాహంలో నడవడవక తప్పదని అప్పట్లో పడవకి అర్ధమైందో లేదో కానీ, తల్చుకుంటే మాత్రం కాలేజీ చదువుకని ఒంటరిగానే రైలెక్కించిన అమ్మ గుర్తొచ్చింది!

పైనా, కిందా చుట్టూ నీళ్ళల్లో.... ముసురు పట్టిన రాత్రిళ్లలో... సుళ్ళు తిరుగుతూ సాగిపోతుందా పడవ, ఒంటరిగా.. ఒక రహస్య సందేశం అందించే గురుతర బాధ్యతని చేపట్టిన సైనుకుడిలా!!!

 
కాగితం పడవ


కూడలి నించి నడచి, మార్కెట్ మీదుగా, బజారు దాటుకుంటూ
ఎర్ర వీధుల్లోంచి వెళ్తోంది కాగితం పడవ
వర్షాకాలపు అనాధ నీళ్ళల్లో ఊగిసలాడుతోంది నిస్సహాయ పడవ!
ఊరిలోని అల్లరిచిల్లర సందుల్లో కలత పడుతూ అడుగుతోంది,
'ప్రతి పడవకీ ఒక తీరం ఉంటుందంటే
మరి నాదైన తీరం ఎక్కడా?'

ఎంతటి అమానుషత్వమో కదా,
ఒక అమాయక బాలుడు
నిరర్ధకమైన కాగితానికి
కాస్త అర్ధాన్ని ప్రసాదించడం!!



మూలం:
Maanii

Chauk se chalkar, mandi se, baajaar se hokar
Laal gali se gujari hain kaagaj ki kashti
Baarish ke laawaris paani par baithi bechaari kashti
Shehar ki aawaaraa galiyon main sehamii sehamii puunch rahii hain
'Har kashTi ka saahil hota hain to --
Mera bhI kya saahil hoga?'

Ek maasoom bachche ne
Bemaanii ko maanii dekar
Raddi ke kaagaj par kaisaa julm kiyaa hain!!


మొదటి ప్రచురణ సారంగలో...



నువ్వుండి వుంటే...


నువ్వుండి ఉంటే బావుండనే సమయాలు కొన్ని ఉంటాయి.. 
 
పొడవాటి యూకలిప్టస్ చెట్ల మధ్యలో
రెపరెపలాడే కాంతి నీడల్లో
వదలలేక.. వదిలి కదల్లేక.. తచ్చట్లాడిన ఆ ఒక రోజుని
మడతలు తీసి
దిగులు సాయంత్రాల ముందరంతా పరుచుకున్నప్పుడల్లా
పక్కన నువ్వుంటే బావుండుననే అనిపిస్తుంది.. 
 
తీరిక లేని పగళ్ళ చివర్లలో
ఏమీ చేయాలనిపించని సమయాలు కొన్నుంటాయి..
సెలయేటి అలల మీద దక్షిణపు గాలి సేదతీరే సమయాలు..
వాగు పక్కన మన పచ్చపూలచెట్టు నీళ్ళల్లోకి తొంగి చూసుకుంటూ
పూలరెక్కల్ని సరిచేసుకునే సమయాలు..
అధాటుగా తగిలి.. ఇంకాస్త తాకి.. అనాలోచితంగానే అరచేతుల్ని ముడివేసి
గలగలమంటూ నడవాలనిపించే అలాంటి సమయాల్లో
నువ్వు లేవని ఎంతో కొంత ఎక్కువగానే బరువేస్తుంది! 
 
వెన్నెల్లో వర్షం కురవదెందుకనీ!?
చీకటి గుత్తులుగా కట్టిన ఒకనాటి ఆకాశాన్ని చూస్తూ అడిగినప్పుడనుకుంటా
పెదవులకు పెదవులు ఆన్చి,
దాటెళ్ళిపోయిన వాననీ
ఇంకా నింగి సరిహద్దుల్లోకి కూడా చేరుకోని వెన్నెల్నీ
అన్నీ కలగలిపిన ఏడుకాలాల స్వప్నాన్నీ
నా కోసం వెదికి తెచ్చి
నీ పాటికి నువ్వు వెళ్లిపోయావ్.. 
 
ఆగి ఆగి సంతోషపెట్టే ఆ చిన్ని కలవరం
చెంపల్ని నిమిరినప్పుడల్లా
పక్కన నువ్వుంటే చెప్పలేనంత బావుండుననే అనిపిస్తుంది!
 
మొదటి ప్రచురణ 20th TANA Conference Souvenir-2015 July
 
 

Thursday, July 16, 2015

ఒకే ఒక్క శబ్దం 1 - కిటికీ వెనక నిశ్శబ్దం

గుల్జార్  కవిత్వం చదువుతున్నప్పుడు నేనెప్పుడూ వొక తోటని ఊహించుకుంటాను.
వేల వర్ణాల పూలతో మాట్లాడుకుంటూ వుంటాను. అనేక రకాల ఆకుల చెక్కిళ్ళని  నా చూపులతో తాకుతూ వుంటాను. పూల మధ్య దూరంలో విస్తరించే పరిమళాన్ని కొలుస్తూ వుంటాను. ఈ తోటలో నడుస్తూ వున్నప్పుడు నా భాష మారిపోతుంది. లోకమంతా వొకే  ప్రతీకగా మారిపోయి కనిపిస్తుంది.
ఎన్ని పూలు..ఎన్ని ఆకులు…ఎన్ని పరిమళాలు…వొకటి ఇంకో దాన్ని అనుకరించనే అనుకరించదు. ప్రతి పూవూ, ఆకూ తనదైన లోకాన్ని తన చుట్టూరా ఆవిష్కరిస్తూ పరిమళిస్తుంది. 
గుల్జార్ అంటే తోట. కాని, గుల్జార్ కవిత్వమంతా ఈ తోటకి పర్యాయ పదమే!
వొక సారి ఈ తోటలోకి అడుగు పెట్టాక వెనక్కి తిరిగి వెళ్లాలని అనిపించదు. వెళ్ళినా, ఈ  తోట మన కలలనీ, వాస్తవాల్నీ వదిలి వెళ్ళదు. ఈ తోటలోని వొక్కో పూవునీ తనదైన ప్రత్యేకమైన ఎంపికతో ఇక నించి వారం వారం మన ముందు వుంచబోతున్నారు నిషిగంధ. 

నిషిగంధ ఇక్కడ కేవలం అనువాదకురాలు మాత్రమే కాదు. గుల్జార్ కవిత్వంతో ఆమెకేదో ఆత్మీయ బంధం వుంది. ఇద్దరిలోనూ వొకే గంధమేదో వుంది. అందుకే, ఈ అనువాదాల్లో రెండు ఆత్మలు వొకే భాషని వెతుక్కుంటున్న నిశ్శబ్దం వినిపిస్తుంది.

గుల్జార్ తేలిక మాటలే ఉపయోగిస్తాడు. అందరికీ తెలిసిన ప్రతీకలే వాడతాడు. సందర్భాలు కూడా మనకి తెలిసినవే కదా అనిపిస్తాడు. కాని, వొక తెలియని మార్మికతని ఆ సందర్భంలోకి లాక్కొని వస్తాడు. మనకి బాగా తెలిసిన లోకమే తెలియనట్టు వుంటుంది అతని భాషలో-  అలాంటి తెలిసీ తెలియని ఆ సున్నితత్వాన్ని నిషిగంధ ఈ అనువాదాల్లోకి చాలా సహజంగా తీసుకువచ్చారు.

అనువాదాలు వొక ఎత్తు అయితే, ఈ రెండీటికి తగ్గట్టుగా ఆ కవిత్వంలోని నైరూప్యతా, ఆప్యాయతా అందుకొని వాటిని రేఖల్లో ఎవరు బంధించగలరా అని ఆలోచిస్తున్నప్పుడు  వెంటనే తట్టిన పేరు సత్యా సూఫీ. కవితని చదువుకుంటూ దానికి రేఖానువాదం చేయడం అంత తేలికేమీ కాదు. ప్రత్యేకమైన తన నలుపూ తెలుపు వర్ణ ఛాయలతో  గుల్జార్ నీ, నిషిగంధనీ వొకే రేఖ మీదికి తీసుకువచ్చిన అరుదైన చిత్రకారిణి సత్యా.
 
– అఫ్సర్

కిటికీలన్నీ మూసి ఉన్నాయి
గోడల హృదయాలూ గడ్డకట్టుకున్నాయి
తలుపులన్నీ వెనక్కి తిరిగి నించున్నాయి
ఆ బల్లా, కుర్చీ అన్నీ
నిశ్శబ్దపు తునకల్లా!
ఆ రోజుకి సంబంధించిన శబ్దాలన్నీ
నేల కింద సమాధి అయ్యాయి.
చుట్టూ అన్నిటికీ తాళాలు..
ప్రతి తాళం మీదా ఒక కరకు నిశ్శబ్దం!

ఒకే ఒక్క శబ్దం నాకు దొరికితే..
నీ స్వరం తాలూకు శబ్దం..
ఈ రాత్రి రక్షించబడుతుంది!
ఇక కలసి మనిద్దరం
ఈ రాత్రిని రక్షించవచ్చు!


మూలం:

Khidkiyan band hai deewaron ke seene tande
Peet phere huye darwaajen ke chehre chup hain
Mej kursee hain ki khamoshi ke dhabbe dhabbe
Pharsh me daphan hain sab aahaten saare din ki
Saare maahoul pe taale se pade hain chup ke
saare maahoul pe pathraayi huyi chup sii lagee hain
Teri aawaaj ki ek jhalak mil jaaye kahin se
Raat bach jaayegii
Milke donon bachaathe hain is raat ko!


మొదటి ప్రచురణ సారంగలో...


Monday, June 22, 2015

రెండే ఋతువులు నాకెప్పుడూ!


సరే కానీ, ఇక్కడున్నట్టు వచ్చేయకూడదూ..

దిగుల్లేని తీరిక అస్సలుండదని తెలిసి
తలుపులన్నీ బార్లా తెరిచి

ఆ మూలా ఈ మూలా రెపరెపలాడుతున్న చీకట్లని
ఊడ్చి తుడిచేసి,
సగం రాసిన ఉత్తరాలన్నీ సర్దిపెట్టి,
వాకిట్లో గాలితెరలు వరుసగా వేలాడదీసుకుంటూ
అదేపనిగా ఎదురుచూడలేను కానీ..
గుమ్మానికి కనురెప్పల్ని అతికించి వదిలేస్తాను!

ఆకాశం ఆ కనిపించే నల్లటి కొండల వెనగ్గా వెళ్ళి
నీలాన్నికొంచెం కొంచెంగా ఒంపేసుకోకముందే
వచ్చేశావనుకో..
వస్తూ వస్తూ..
రహస్య రాత్రుళ్ళకి మనం రాసీ పూసీ మిగిల్చేసిన రంగులూ తెచ్చేశావనుకో
కిటికీ అవతల ముడుచుకు కూర్చున్న సుదీర్ఘ శిశిరానికి
కాసిని ఊగే పూవులూ, ఎగిరే గువ్వలూ అద్దేస్తాను!

నువ్వొచ్చాక ఒకటి.. వచ్చి వెళ్ళాక మరొకటీ
రెండే ఋతువులు నాకెప్పుడూ!
గుర్తుంచుకుందామనుకుని కూడా మర్చిపోతావెందుకో !!

పచ్చిక పొరల మధ్య నించి ఓ పిల్లగాలి
చాలా సేపట్నించే కాళ్ళావేళ్ళా పడుతోంది
పొద్దుటి ఎండ తరపున క్షమాపణలు అడుగుతోంది
వెలుతురు నవ్వులు మోసుకుంటూ ఇక నువ్వు వచ్చేయొచ్చు!

అనుకున్నంత కష్టమేం కాదు కూడా!
అడగాలనిపించని ప్రశ్నల్నీ, అడుగులు పడనీయని అలసటనీ
కాస్త కాస్తా దాటుకుంటూ
కాసేపలా వచ్చి కూర్చుంటే చాలు..
బాకీ ఉన్న జీవితంలోంచి
మనవే అయిన పాటల్లో విచ్చుకునే పూల తోటల్నీ,
వాటినే అంటిపెట్టుకున్న ఇంకొన్ని మసక రాత్రిళ్ళనీ  రాసిచ్చేస్తాను!



మొదటి ప్రచురణ సారంగలో....
 
 

Thursday, April 16, 2015

కవిత ఒకటి...



కవిత ఒకటి మనసునే పట్టుకు వేళ్ళాడుతోంది,
ఆ వాక్యాలన్నీ పెదవుల్నే అంటిపెట్టుకున్నాయి,
ఎగురుతున్నాయి అటూ ఇటూ సీతాకోకచిలుకల్లా
పదాలు కాగితం పైన మాత్రం కుదురుకోకుండా!
ఎప్పట్నించీ కూర్చున్నానో, బంగారం
తెల్ల కాగితం మీద నీ పేరు రాసుకుని..
 
ఒక్క నీ పేరు మాత్రం పూర్తయింది..
అవునూ, ఇంతకన్నా మంచి కవిత్వం ఏముంటుందేమిటీ!? 
    
     
~ గుల్జార్ 
   
    
 

Saturday, March 21, 2015

వసంతోత్సాహం


"మాసానాం మార్గశీర్షోహమ్ ఋతూనాం కుసుమాకరః"
శ్రీకృష్ణుడే చెప్పుకున్నాడు తాను మాసాల్లో మార్గశిరమూ, ఋతువుల్లో వసంతమూ లాంటివాడినని. అంతటి ఉత్కృష్టమైన ఋతువులో వచ్చే పండగ ఉగాది! లేత చివుళ్ళు, పక్షుల కిలకిలరావాలు, కోకిల గానాలూ అత్యంత రమణీమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ జరుపుకునే పండుగ... తెలుగు వారి నూతన సంవత్సరాది! కాకపోతే ప్రకృతిలో మార్పులూ, తెలుగు సాంప్రదాయమూ వంటి విషయాల ప్రాధాన్యత కాలేజీ రోజుల్లోకి వచ్చాక వరకూ పూర్తిగా అర్ధం కాలేదు కాబట్టి అంతకుముందు వరకూ ఉగాది అంటే మహిషాసుర వధ, నరకాసుర వధ వంటి సాహసోపేతమైన పురాణ కధలూ, భోగిమంటల సందడులూ, పత్రితో పాలవెల్లిని అలంకరించాలనే తాపత్రయమూ... ఇలా ఎలాంటి ఉత్సాహభరితమైన నేపధ్యమూ లేని పండగ!

చిన్నప్పుడు ఉగాది అంటే పెద్దవాళ్ళ పండగ అనే ప్రగాఢమైన నమ్మకంతో పాటు, మిగతా పండగల్లాగా ఈ రోజు కోసం అంతగా ఎదురు చూడకపోవడానికి నా వరకూ రెండు ముఖ్య కారణాలు. ఒకటి, ఇది పరీక్షల టైమ్ లో రావడం.. రెండవది, 'మొన్న సంక్రాంతికేగా రెండు జతలు కుట్టించిందీ!' అంటూ ఇంట్లో వాళ్ళు ఈ పండగకి ఎప్పుడూ కొత్తబట్టలు కొనకపోవడం!! కొత్త బట్టలు లేని పండగని అసలు ఒక పండగగా అంగీకరించడానికి మనసేమో ససేమిరా అనేది!  అప్పటికీ, 'తెలుగు న్యూ ఇయర్ కదా, ఈరోజు కొత్తబట్టలు వేసుకుంటే సంవత్సరమంతా వేసుకుంటామంట కదా!' అని సంస్కృతీ సాంప్రదాయాలని మేళవించిన ఒక సెంటిమెంట్ బాణాన్ని ప్రయోగించినా అమ్మ తాపిగా 'మనకేమన్నా బట్టలకొట్టు ఉందా సంవత్సరమంతా కొత్తబట్టలు వేసుకోడానికి? అయినా కొత్తది ఏదో ఒకటి ఉంటే చాలు.' అని రెండు మూడు కొత్త రిబ్బన్లు బయటకి తీసేది!

అయితే 'గారెలూ, పాయసమూ తప్ప ఇంకేముందీ రోజుకి ప్రత్యేకత!?' అని మేము మరీ నిరుత్సాహ పడిపోకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది వేపపువ్వు పంచిపెట్టడం. షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రాశస్త్యం అంతగా తెలియకపోయినా అందులో ఉపయోగించే పదార్ధాలలో వేపపువ్వు చాలా ప్రధానమైనదని తెలుసు. ఇంటి ఆవరణలో ఇంచుమించు ఇంటిని కప్పేసేంత పెద్ద వేపచెట్టు ఉండేది. ఉగాది సమయంలో వేపచెట్టు ఉన్న ఇంటివాళ్ళు హఠాత్తుగా సెలెబ్రిటీలు అయిపోతారు. రెండు మూడు రోజుల ముందునించే చుట్టుపక్కల వాళ్ళ పలకరింపుల్లో అదనపు గౌరవం, ఆప్యాయతలు చేర్చబడతాయి! ఉగాది రోజు పొద్దుపొద్దున్నే మా అమ్మమ్మ బోల్డంత ఉగాది పువ్వు మామయ్య చేత కోయించి, వరండాలో న్యూస్ పేపర్లు పరిచి, చిన్న చిన్న కుప్పలుగా వేరు చేసేది. దానికి నన్ను ముఖ్యాధికారిగా నియమించి, వేపపువ్వు కోసం వచ్చిన వాళ్ళందరికీ తలో కుప్ప పువ్వు ఇవ్వమనేది. ఇక యువరాణీ వారు తమ జన్మదిన సందర్భాన జనాలకి ఉచితంగా పట్టుబట్టలు దానం చేసిన లెవల్లో హుందాతో కూడిన ఆదరంతో ఆ వేపపువ్వును పంచిపెట్టడం చాలా అంటే చాలా ఇష్టమైన కార్యక్రమం.

చైత్ర శుద్ధ పాడ్యమీ... పంచాంగ శ్రవణం అంటూ తాతయ్య ఏవేవో చెప్తుండగానే పక్కింటి స్నేహితుల కోసం పరిగెత్తడం ఇంకా నిన్నా మొన్ననే జరిగినట్లుంది! ఆరోజు ఎవరింటికి ఎవరు వచ్చినా వెళ్ళినా ఉగాది పచ్చడి రుచి చూడటం తప్పనిసరి. పచ్చడి తయారుచేయడానికి అందరూ ఇంచుమించు అవే పదార్ధాలని ఉపయోగించినా రుచి మాత్రం ఏ రెండింట్లోనూ ఒకటిగా ఉండేది కాదు.. కొన్నిట్లో పులుపు ఎక్కువ.. ఇంకొన్నిట్లో చేదు ఎక్కువ... కొంతమందేమో ఇన్నిన్ని చెరుకు ముక్కలు వేసి తీపిగా చేసేవాళ్ళు! అదే విషయం ఇంట్లో చెప్తే ఏ రుచి ఎక్కువ తింటే సంవత్సరమంతా మనకి అలానే ఉండబోతుంది అనేవాళ్ళు!

ఉగాది అంటే ఇంకాస్త ఉత్సాహంగా అనిపించే ఇంకొక కారణం ఈ పండుగ వచ్చిన వారానికి శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి అంటే పందిళ్ళు, పానకాలూ, ఫ్రీ సినిమాలూ!! కజిన్సందరమూ మేడ మీద కూర్చుని పోయిన సంవత్సరం సినిమాలూ, ఈసారి ఏమేం తీసుకువస్తారు అనుకుంటూ చేసిన ఎడతెరిపిలేని సంభాషణల మధ్యలో  ఉగాది మెల్లగా నిష్క్రమిస్తుంది.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకి ఈ పండుగ ప్రతీక అని తెల్సిన తర్వాత మాత్రం ఈ పండుగ అంటే ఇంకాస్త శ్రద్ధ పెరిగిన మాట వాస్తవం. పండుగ ఎలా జరుపుకున్నా ఏదో ఒక కొత్త పని మాత్రం మొదలుపెట్టాలనే ఉత్సాహం తోడయింది. రాశిఫలాల మీద పూర్తి నమ్మకం లేకపోయినా గ్రహాలూ, వాటి స్థానాలు తెలుసుకోవడం సరదాగా అనిపిస్తుంది. ఉగాదికీ, సాహిత్యానికీ ఉన్న అసలు సిసలు సంబంధం ఏమిటో తెలియకపోయినా కవి సమ్మేళనాలు ఆసక్తిగా అనిపించడం మొదలయింది.

ఏ సంస్కృతిలోని అసలుసిసలు అందచందాలు అయినా గోచరమయ్యేది పండుగ సమయాల్లోనే. తలస్నానాలూ, మామిడి తోరణాలూ, కొత్త బట్టలూ వంటి విధిగా చేసే పనులే కాకుండా ఒక్కొక్క పండుగకీ ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది.. వాటి వెనుక వుండే విశిష్టతని అర్ధం చేసుకుని ఆచరించడం... ముందు తరాలకి ఈ ఆచారాలని అందజేయడం మన ప్రధాన బాధ్యత. స్థల కాలాలు మారినా, పండుగలు జరుపుకోవడంలో స్వల్ప తేడాలు వచ్చినా వీలైనంతవరకూ ఈ బాధ్యతని కొనసాగించగలగాలి.


---------------------------
     

మొదటి ప్రచురణ మార్చ్ 2015 తానా పత్రికలో..... 
   
   

Tuesday, March 17, 2015

కహా సే ఆయే బద్‌రా…


అద్భుతాలన్నీ తాత్కాలికాలేనని నమ్ముతాను కానీ అవి పునరావృతమూ అని ఖచ్చితంగా ఎవరూ చెప్పరెందుకనీ!?
ఝూటా
హీ తో సహీ... ఒక భరోసానెందుకివ్వరూ!?!? 


నాకు తెలుసు.. ఈపాటికే వచ్చి ఉంటావనీ... గుప్పెడు గింజలు పోగేసి పెట్టి, అలసటగా ముడుచుకుని కూర్చుని ఉంటావనీ తెలుసు.. ముఖ్యంగా, నే వచ్చేదీ లేదీ తెలియడం నీకు చాలా ముఖ్యమని  కూడా తెలుసు...
కానీ.....
ఇంకా ఏదో తెలియంది మిగిలుందనే చూస్తున్నా! వచ్చే ముందు ఇక్కడ దిగుడు బావిలో వెదుక్కోవాల్సింది ఇంకేదీ లేదని ఇంకోసారి ఖచ్చితంగా తేల్చుకోక తప్పదు! 


అసలు ఎప్పుడైనా అనుకున్నామా!? ఇంత అందమైన ఊరిలో మనిద్దరం కలిసి ఒక ముచ్చటైన ఇల్లు కట్టుకుంటామని!
ఒద్దికగా, ఓపిగ్గా గోడల నిండా మనకిష్టమైన బొమ్మలేసుకున్నాం...
పల్చని మబ్బుల పైకప్పు నించి అనామక పూలతీగల  షాండిలియర్ వేళ్ళాడదీయడానికి ఎన్నెన్ని బద్దకపు మధ్యాహ్నపు నిచ్చెనలు ఎక్కామో!! కిటీకీలన్నిటికీ నీరెండల, చిరుజల్లుల తెరలు కడుతున్నప్పుడల్లా ముందురోజు ఆపిన పాట మొదలుపెట్టమంటావు..
జీవితమేమో లేత వేళ్ళతో అక్కడో దీపం, ఇక్కడో పూలపాత్రా సర్ది పెట్టేది!  
ఇంటికి చేరుకోవడంలో ఎంత ఆత్రుతా... ఆనందమూనూ!
సందు మలుపులోనే కలుసుకుని, కనుబొమ్మలెగరేసి నవ్వుకుని, వేళ్ళల్లో వేళ్ళు జొనిపి, పరుగులాంటి నడకతో ముందు తలుపు తోయడంతోనే కాలం ఆగి, ఊపిరి మొదలవుతుంది!
ముందుగా కూజాలో నీళ్ళు నింపడం నా వంతే.. అప్పుడు గానీ చెప్పడం మొదలుపెట్టవు, ఏదైనా... ఆ, అంతకుముందు నీ వేళ్ళతో నానుదిటి మీద జుట్టుని సరిచేయడం కూడా అవుతుందనుకో! 


వద్దని వారించుకుంటూనే అలలతో అవసరమైనదానికంటే ఎక్కువగా ఆడుకుంటాను కదా!
తిరిగొచ్చి మూలమూలలకీ అంటుకున్న ఇసుకంతా దులుపుకోలేక అవస్థ పడుతుంటే 'సముద్రాన్ని దూరం నించే చూడమని చెప్పలేదూ?' నీ చిన్నపాటి మందలింపూ, చిరునవ్వూ కలిసిపోయి గాలి మువ్వలు కదులుతాయి.
అప్పటికప్పుడు నాలుగు మాటలేవో చాలా ఇష్టంగానూ, బోల్డంత ప్రేమతోనూ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను.. పక్కనెక్కడో ఆకుల్తో ఆడుకుంటున్న పిట్టలూ.. ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న గడ్డిపూవూ కూడా టక్కున నా వంక చూసి 'గుడ్ లక్!' అని ఫక్కున నవ్వేసుకున్నట్లనిపిస్తాయి!!
ఉక్రోషమో.. నిస్సహాయాత్వమో.. కళ్ళల్లోంచి నాలుగు బిందువులు గురుత్వాకర్షణ శక్తికి దాసోహమంటూ చిట్లుకుంటూ నేలరాలతాయి!
అంతా అర్ధమైనట్టే పిడికిలి తెరిచి, అరచేతిలో ముద్దుపెడతావు సరే... మౌనాన్ని మోహనంగా మార్చడం కేవలం నీకు మాత్రమే తెల్సిన మాయాజాలమని చెప్పినట్లే గుర్తులేదు!
 


రోజువారీ అసహనాలూ అసంతృప్తుల్లో నలుగుతూ, నీరసపడుతూ మనల్ని ఇంటికి చేర్చే వంతెన నెర్రులివ్వడం చూసుకోనేలేదు... చూసినప్పుడైనా ఒక ఊదా సాయంత్రాన్ని వెంటేసుకుని బావురుమన్నానే కానీ నీలోంచి నన్నూ, నాలోంచి నిన్నూ కాస్త కాస్తా తవ్వి తీసి పలకలుగా పరుచుకుందామని తోచనేలేదు... నువ్వేమో బాగుచేయడమనేదే బాగోదంటావు! అవతలివయిపు ఉన్ననాలుగు గోడల అంతస్థు మనకోసమేనని ఎప్పటికప్పుడు మార్దవంగానే గుర్తుచేస్తుంటావు.. అట్నించీ బారుగా నన్ను తాకే నీ నీడనీ, దాని వడలిన పాదాలనీ తల్లడిల్లుతూ చూస్తున్నప్పుడే తేల్చేసుకోవాలనిపిస్తుంది, కదలి ముందుకు వెళ్ళడమా? మరలి వెనక్కి వెళ్ళడమా?
ఆ గరుకు ఆలోచనకే గుండెలో ఒక సుదీర్ఘ హేమంత రాత్రినాటి వణుకు!


గుర్తొస్తుంది ఇహ అప్పుడు నీ గొంతు... 'జన్మజ దుఃఖ వినాశక.....' లా నాలోని ప్రాచీన విచారాన్నంతా అలవోకగా అరనిమిషంలో మరుగున పెట్టేసే నీ గొంతు! ఆ సవ్వడి కోసం...దాని జాడ కోసం... అర్ధరాత్రి సముద్రంలో దారితప్పిన జాలరిలా ఆత్రంగా వెదుక్కుంటుంటాను... కానీ, కనుచూపుమేరా పరిచి ఉంచబడింది నీ రాహిత్యమే! దూరం స్పష్టంగా లిఖిస్తున్న దగ్గరతనమే!
మూసిన తలుపుల్లోంచి సునాయాసంగా దారి చేసికొచ్చిన తూనీగలా వెంటనే ఒక విషయం తాకి పోయిందప్పుడే.. చిత్రంగా చిన్న నవ్వూ చేరుతుంది...
లోయల్లో ఇంద్రధనస్సులు వెదుక్కుంటూ... రికామీ రాత్రులకి కురిసెళ్ళిన చినుకుల్ని వేళాడదీస్తూ... అలసిపోయినతనంలో అవసరమైనవి విరామాలు కానీ ముగింపు కాదు!!
శరీరమంతా శాంతి పిక్సీ డస్ట్‌లా జాలువారుతుంటే ఒక లలితమైన ఆనందం...
ఇల్లానే ఏకాంతంగా ఇంకాసేపు నవ్వుకుంటో ఉండాలనిపిస్తుంది కానీ...
ఈలోపు... 
సాయంత్రపు వానలో తడిచి, రాత్రి నీడల్లో దోబూచులాడే మరువపు సుగంధాన్ని దోసిళ్లకొద్దీ సర్ది, 'ఇష్టాన్ని ఇష్టంగా చెప్పలేని అశక్తిని క్షమిస్తావు కదూ?!' అని అపాలజటిక్ నోట్ పెట్టిన ఒక బహుమతిని నీ కోసం తప్పక వదిలి వస్తాను!
******************************************************************

 మొదటి ప్రచురణ ఫిబ్రవరి 2015 వాకిలిలో..........
   
  

Wednesday, March 11, 2015

గుల్జార్ కవితలు



*****
ఒక పురాతన ఋతువేదో తిరిగొచ్చింది
తోడుగా జ్ఞాపకాల తూరుపునీ తెచ్చుకుంది.
ఇలా అరుదుగా జరుగుతుంది,
తన సమక్షంలోనే విరహమూ వేధిస్తుంటుంది!!

*****
నా నిశ్శబ్దం నడిచేది
నీ సుదీర్ఘ మౌనంగుండానే!
అదేమంటుందో వింటాను....
నా గురించేవో కూడా చెప్పుకుంటూ!!

*****

Amaltas:
వెనకాల కిటికీ తెరిచినప్పుడల్లా
కాసేపు తదేకంగా చూస్తుంటాను
ఆ మోదుగపూల చెట్టుని..
కొమ్మలన్నీ రెక్కల్లా చాపుకుని
రోడ్డు పక్కనే ఠీవీగా...


ఎప్పుడు చూసినా ఒకటే కలకలం.....
తాము చేసొచ్చిన సుదూరాల ప్రయాణాల గురించీ
దాటొచ్చిన కొండలు, వాగుల గురించీ
పచ్చని మైదానాలూ, పూలవనాల పరిమళాల గురించీ...
ఊరిస్తూ పక్షులన్నీ ఆ చెట్టుకి ఎన్నెన్ని కధలు చెప్తుంటాయో!
ఇంకొన్ని తమ రెక్కల విన్యాసాలన్నీ ప్రదర్శిస్తుంటాయి కూడా
రివ్వున మేఘాల్లోకి దుసుకెళ్తూ.. అల్లరల్లరిగా గిరికీలు కొడుతూ!


పొద్దున్నే కిటికీ తెరిచినప్పుడు
రోడ్డుకి అడ్డంగా పడి ఉంది..
రాత్రి తుఫాను గాలి సాయంతో తానూ ఎగరాలని ఆశపడ్డట్టుంది!!



*****

Sunday, November 23, 2014

కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?


సాయంత్రాలెప్పుడూ ఇంతే
తెరిచిన కిటికీల్లోంచీ.. అలసిన మొహాలమీద నించీ
సుతారంగా నడిచెళ్ళిపోతుంటాయి..

కాంతిగా కదిలీ, ఊగీ, రెపరెపలాడీ, చెమ్మగిల్లిన ఒక పువ్వు
లోయలోకి జారిపడుతుంది
ఇంకొక సుదూర మౌన ప్రయాణం మొదలవుతుంది.
 
ఒడిసిపట్టుకున్న నీరెండల్ని తోసేసుకుంటూ
కొన్ని రాత్రిళ్ళు రాకపోతేనేం!?


మర్చిపోయాననుకున్న నవ్వుల్నీ
మామూలైపోయానుకున్న బెంగల్నీ
ఇష్టమైన పాటలోని నచ్చిన పదాల్లాగా
మళ్ళీ మళ్ళీ వినిపించకపోతేనేం!?


నాలోంచి తొణికిపోయిన పలు నేనులు
వేలవేలుగా చీలిన క్షణాల ఇసుకరేణువుల్లో
వెన్నెలకుప్పలు ఆడుతుంటాయి
వెదుకుతున్నదే తప్పిపోయిందని ఏ ఝాములో తెలుస్తుందో!?


వద్దు వద్దు ఈవేళప్పుడొద్దని మొత్తుకుంటున్నా
మొదలయ్యే వాన..
మాటల లెక్కలూ, పంతాల బేరీజులూ
లోపలంతా ఒకటే వాన
తడిచి తడిచి చిత్తడి అయినా
మట్టిపాత్ర దాహాన్ని తీర్చనూలేక.. ఒడుపుగా మూయనూలేకా
ఎందుకొస్తాయో కొన్ని రాత్రిళ్ళు!


ఏదో లేనితనమా లేక ఏమీ మారనితనమా?

సమాధానం ఏ నెలవంక నవ్వులానో రాలిపడుతుందని
చీకట్లోకి చాచీ చాచీ ఉంచిన చేతుల్ని
ఖాళీగా వెనక్కి తీసుకునేంతలో… 

ఆకుల మధ్యలో గాలీ
గూళ్ళల్లో పక్షులూ
విత్తనం చిట్లిన చప్పుడూ
అన్నీ సద్దుమణుగుతాయి.


లీలగా మెదిలే పేదరాసి పెద్దమ్మ కధ
మగత మబ్బులో మెల్లగా చుడుతుండగానే
ఉన్నట్టుండి అమ్మ గుర్తొస్తుంది
అమ్మ కొచ్చిన జొరమూ గుర్తొస్తుంది!
ఒక్కసారిగా వణికించిన దిగులుకైనా తెలుసో లేదో
కొన్ని రాత్రుళ్ళు ఎందుకొస్తాయో?
వచ్చి వలయాలై ఎందుకు తిరుగుతాయో!?

 
మొదటి ప్రచురణ సారంగలో.......
  
   

Sunday, September 14, 2014

నీకు తెలుసా!?



1.

పల్చని మేఘాల కింద
మెల్లగా ఊగే పూలని తాకుతూ
యధాలాపంగా నడుస్తున్న
ఒక తేలికపాటి సంతోషం..
ఒక అసంకల్పిత చిరునవ్వూ.. చిన్నపాటి బెంగా కూడా
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా!!



2.

నీ ఉనికి కోసం వెదకమని

మొన్నటి చలి రాత్రిలో

నే పంపిన వెన్నెల కిరణం

నీ వరకూ వచ్చిందో లేక,

నీ నవ్వులో కరిగిపోయిందో!?



3.

అయినా, అన్నిసార్లూ మాటలక్కర్లేదు....   

చాన్నాళ్ళ క్రితం నిన్ను హత్తుకున్నప్పటి

ఉపశమనం గుర్తొస్తే చాలు

ఒక అకారణ ఆనందం.. రోజంతా!!



4.

వర్షం వదిలెళ్ళిన కాసిన్ని లిల్లీపూలూ

సీతాకోకచిలకలు వాలిన చిక్కటెండా

ఇవి చాలవూ!?

రెండు చేతుల నిండా తెచ్చేసి, నిన్ను నిద్రలేపేసి

నా ప్రపంచానికి కాస్త కాంతిని ప్రసాదించుకోవడానికి!



5.

నువ్వు చదివేదేదీ నేను చదవలేను

కానీ చెప్పింది విన్నానా...

ఖాళీగా ముగిసే కలలు కూడా

మందహాసాన్నే మిగులుస్తాయి!



6.

లేకుండా కూడా ఉంటావా?

నిర్వచించలేని, నిర్వచించకుండా మిగిలిపోయిన

కొన్ని రహస్య ఖాళీలు

నీకే ఎలా కనబడతాయో!?



7.

అరచేతిలోంచి అరచేయి విడిపడింది గానీ
నిన్నటి ఆఖరి జ్ఞాపకం
ఇవ్వాళ్టి మొదటి ఆలోచనా
నీదే!


మొదటి ప్రచురణ సారంగలో...