Pages

Tuesday, March 17, 2015

కహా సే ఆయే బద్‌రా…


అద్భుతాలన్నీ తాత్కాలికాలేనని నమ్ముతాను కానీ అవి పునరావృతమూ అని ఖచ్చితంగా ఎవరూ చెప్పరెందుకనీ!?
ఝూటా
హీ తో సహీ... ఒక భరోసానెందుకివ్వరూ!?!? 


నాకు తెలుసు.. ఈపాటికే వచ్చి ఉంటావనీ... గుప్పెడు గింజలు పోగేసి పెట్టి, అలసటగా ముడుచుకుని కూర్చుని ఉంటావనీ తెలుసు.. ముఖ్యంగా, నే వచ్చేదీ లేదీ తెలియడం నీకు చాలా ముఖ్యమని  కూడా తెలుసు...
కానీ.....
ఇంకా ఏదో తెలియంది మిగిలుందనే చూస్తున్నా! వచ్చే ముందు ఇక్కడ దిగుడు బావిలో వెదుక్కోవాల్సింది ఇంకేదీ లేదని ఇంకోసారి ఖచ్చితంగా తేల్చుకోక తప్పదు! 


అసలు ఎప్పుడైనా అనుకున్నామా!? ఇంత అందమైన ఊరిలో మనిద్దరం కలిసి ఒక ముచ్చటైన ఇల్లు కట్టుకుంటామని!
ఒద్దికగా, ఓపిగ్గా గోడల నిండా మనకిష్టమైన బొమ్మలేసుకున్నాం...
పల్చని మబ్బుల పైకప్పు నించి అనామక పూలతీగల  షాండిలియర్ వేళ్ళాడదీయడానికి ఎన్నెన్ని బద్దకపు మధ్యాహ్నపు నిచ్చెనలు ఎక్కామో!! కిటీకీలన్నిటికీ నీరెండల, చిరుజల్లుల తెరలు కడుతున్నప్పుడల్లా ముందురోజు ఆపిన పాట మొదలుపెట్టమంటావు..
జీవితమేమో లేత వేళ్ళతో అక్కడో దీపం, ఇక్కడో పూలపాత్రా సర్ది పెట్టేది!  
ఇంటికి చేరుకోవడంలో ఎంత ఆత్రుతా... ఆనందమూనూ!
సందు మలుపులోనే కలుసుకుని, కనుబొమ్మలెగరేసి నవ్వుకుని, వేళ్ళల్లో వేళ్ళు జొనిపి, పరుగులాంటి నడకతో ముందు తలుపు తోయడంతోనే కాలం ఆగి, ఊపిరి మొదలవుతుంది!
ముందుగా కూజాలో నీళ్ళు నింపడం నా వంతే.. అప్పుడు గానీ చెప్పడం మొదలుపెట్టవు, ఏదైనా... ఆ, అంతకుముందు నీ వేళ్ళతో నానుదిటి మీద జుట్టుని సరిచేయడం కూడా అవుతుందనుకో! 


వద్దని వారించుకుంటూనే అలలతో అవసరమైనదానికంటే ఎక్కువగా ఆడుకుంటాను కదా!
తిరిగొచ్చి మూలమూలలకీ అంటుకున్న ఇసుకంతా దులుపుకోలేక అవస్థ పడుతుంటే 'సముద్రాన్ని దూరం నించే చూడమని చెప్పలేదూ?' నీ చిన్నపాటి మందలింపూ, చిరునవ్వూ కలిసిపోయి గాలి మువ్వలు కదులుతాయి.
అప్పటికప్పుడు నాలుగు మాటలేవో చాలా ఇష్టంగానూ, బోల్డంత ప్రేమతోనూ చెప్పాలని ప్రయత్నిస్తుంటాను.. పక్కనెక్కడో ఆకుల్తో ఆడుకుంటున్న పిట్టలూ.. ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న గడ్డిపూవూ కూడా టక్కున నా వంక చూసి 'గుడ్ లక్!' అని ఫక్కున నవ్వేసుకున్నట్లనిపిస్తాయి!!
ఉక్రోషమో.. నిస్సహాయాత్వమో.. కళ్ళల్లోంచి నాలుగు బిందువులు గురుత్వాకర్షణ శక్తికి దాసోహమంటూ చిట్లుకుంటూ నేలరాలతాయి!
అంతా అర్ధమైనట్టే పిడికిలి తెరిచి, అరచేతిలో ముద్దుపెడతావు సరే... మౌనాన్ని మోహనంగా మార్చడం కేవలం నీకు మాత్రమే తెల్సిన మాయాజాలమని చెప్పినట్లే గుర్తులేదు!
 


రోజువారీ అసహనాలూ అసంతృప్తుల్లో నలుగుతూ, నీరసపడుతూ మనల్ని ఇంటికి చేర్చే వంతెన నెర్రులివ్వడం చూసుకోనేలేదు... చూసినప్పుడైనా ఒక ఊదా సాయంత్రాన్ని వెంటేసుకుని బావురుమన్నానే కానీ నీలోంచి నన్నూ, నాలోంచి నిన్నూ కాస్త కాస్తా తవ్వి తీసి పలకలుగా పరుచుకుందామని తోచనేలేదు... నువ్వేమో బాగుచేయడమనేదే బాగోదంటావు! అవతలివయిపు ఉన్ననాలుగు గోడల అంతస్థు మనకోసమేనని ఎప్పటికప్పుడు మార్దవంగానే గుర్తుచేస్తుంటావు.. అట్నించీ బారుగా నన్ను తాకే నీ నీడనీ, దాని వడలిన పాదాలనీ తల్లడిల్లుతూ చూస్తున్నప్పుడే తేల్చేసుకోవాలనిపిస్తుంది, కదలి ముందుకు వెళ్ళడమా? మరలి వెనక్కి వెళ్ళడమా?
ఆ గరుకు ఆలోచనకే గుండెలో ఒక సుదీర్ఘ హేమంత రాత్రినాటి వణుకు!


గుర్తొస్తుంది ఇహ అప్పుడు నీ గొంతు... 'జన్మజ దుఃఖ వినాశక.....' లా నాలోని ప్రాచీన విచారాన్నంతా అలవోకగా అరనిమిషంలో మరుగున పెట్టేసే నీ గొంతు! ఆ సవ్వడి కోసం...దాని జాడ కోసం... అర్ధరాత్రి సముద్రంలో దారితప్పిన జాలరిలా ఆత్రంగా వెదుక్కుంటుంటాను... కానీ, కనుచూపుమేరా పరిచి ఉంచబడింది నీ రాహిత్యమే! దూరం స్పష్టంగా లిఖిస్తున్న దగ్గరతనమే!
మూసిన తలుపుల్లోంచి సునాయాసంగా దారి చేసికొచ్చిన తూనీగలా వెంటనే ఒక విషయం తాకి పోయిందప్పుడే.. చిత్రంగా చిన్న నవ్వూ చేరుతుంది...
లోయల్లో ఇంద్రధనస్సులు వెదుక్కుంటూ... రికామీ రాత్రులకి కురిసెళ్ళిన చినుకుల్ని వేళాడదీస్తూ... అలసిపోయినతనంలో అవసరమైనవి విరామాలు కానీ ముగింపు కాదు!!
శరీరమంతా శాంతి పిక్సీ డస్ట్‌లా జాలువారుతుంటే ఒక లలితమైన ఆనందం...
ఇల్లానే ఏకాంతంగా ఇంకాసేపు నవ్వుకుంటో ఉండాలనిపిస్తుంది కానీ...
ఈలోపు... 
సాయంత్రపు వానలో తడిచి, రాత్రి నీడల్లో దోబూచులాడే మరువపు సుగంధాన్ని దోసిళ్లకొద్దీ సర్ది, 'ఇష్టాన్ని ఇష్టంగా చెప్పలేని అశక్తిని క్షమిస్తావు కదూ?!' అని అపాలజటిక్ నోట్ పెట్టిన ఒక బహుమతిని నీ కోసం తప్పక వదిలి వస్తాను!
******************************************************************

 మొదటి ప్రచురణ ఫిబ్రవరి 2015 వాకిలిలో..........
   
  

2 comments:

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

కురిసెళ్ళిన చినుకుల్ని వేళాడదీస్తూ.. padaprayOgam chAlA bAgundi and it has been haunting me since the other day evening (when I read it for the first time).. eppuDO chidivina Tilak's amRtam kurisina rAtri gurtukocchindi ee "yAntrikamaina urukulu, parugula bratuku" madhya..