Pages

Thursday, June 27, 2013

చిటారుకొమ్మన గాలిపటం...

 
అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి
తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో
మహావృక్షాల ఆకుల చివర్లలో
ఒంటరిగా...
 

రెండు అనంతాల మధ్య
అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!
 
సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి
 
మెత్తని మసకదనంలో
పావురంలా.. లేదంటే పంకజమైపోయీ
రెక్కలు విప్పార్చుకుని
రహస్యంగా తేలిపోవాలి!
 
వరుస వానల తడిలోంఛి
శరత్కాలపు మధ్యాహ్నంలోకి జారిపొవాలి..
 
చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!
 
చిన్నపాటి జీవం కోసం
చిటారుకొమ్మన గాలిపటమై
తపస్సొకటి ఆరంభించాలనిపిస్తుంది!
 
పొందినదీ.. పోగొట్టుకున్నదీ
ఇబ్బందిపెట్టే లెక్కలెన్నో
అస్థిమితంగా ఛాతిని దువ్వుతున్నప్పుడు 
 
నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!

-------

మొదటి ప్రచురణ సారంగలో...

Tuesday, April 16, 2013

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!



".....సాయంత్రం నించీ కురుస్తున్న వర్షం ఆగిపోయిన నిశ్శబ్దంలోనో.. అర్ధమయ్యీ అవనట్టుండే బెంగ ఒకటి మన చుట్టూనే మసలుతున్నప్పుడో.. ఒంటరితనపు తెరలు దించేసుకున్న వ్యక్తిగతసమయాలు కొన్ని ఉంటాయి. పరిశరాలు నీరవమయినా మనసులో మాత్రం ఆలోచనల రహస్య కోలాహలం మొదలవుతుంది. అచ్చు సందెవేళకి గూటికి తిరిగొచ్చిన గువ్వల కువకువలతో నిండిన చెట్టల్లే తుళ్ళిపడుతుంటుంది. మరిచిపోయినవో.. మరిచిపోవాలనుకున్నవో జ్ఞాపకాలు ఆ రాత్రప్పుడు సుదూరాలనించి సమీపానికొస్తాయి........."

పూర్తి వ్యాసం  వాకిలి - నీరెండ మెరుపులో!

Wednesday, February 6, 2013

Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!


"..........
అసలు కవిత్వంలో abstractness ని concrete గా ఎలా చెప్పాలో నాకు రేవతీదేవి వాక్యాలే నేర్పాయి. ఆ విధంగా నాలోపల గూడు కట్టుకుంటున్న వొక abstract దిగులు నించి అవి నన్ను విముక్తుణ్ణి చేశాయి. వొక కవి తన దగ్గిర వున్న పిడికెడు మాటలతో గుప్పెడు గుండె గుట్టు ఎలా చెప్పగలదో, అసలు మనసు చిత్రం గీస్తే అది ఎలా వుంటుందో నేర్పింది కూడా  ఆమె కవిత్వమే!
దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా?
ఎందుకో చెప్పేవీలుంటే
దిగులెందుకు?
అన్న ఎరుక నాలో కలిగించి చాలా అనుభవాలు భాషలో వొదగవు అని ముమ్మాటికీ చెప్పే కవిత్వం ఆమెది. వొక అనుభవాన్ని కాన్వాస్ మీద రంగులుగానో, అక్షరాలుగానో పరుస్తున్నప్పుడు ఆ కాన్వాస్, ఈ అక్షరాలూ రెండూ ఎంత పరిమితమయిన ప్రపంచాలో మనకి ఇట్టే తెలిసిపోతుంది.
............."

-  


పూర్తి వ్యాసం --  Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!
  
  


Friday, January 4, 2013

మనో విహంగాలు

వసంతాలూ.. వెన్నెల నీడలూ.. వెదురు తోటలూ
అన్నిటినీ ఒకేసారి కావలించుకోవాలని
గూడువదిలిన సీతాకోకచిలకల్లా హడావిడి పడుతుంటాయి…

 
స్వప్నసంచారాల నిదురవేళల్లో
కొబ్బరాకుల చివుళ్ళపై
రేపటి కలల్ని పేరుస్తుంటాయి..

 
పొగమంచుని తాకిన
పొద్దుటెండలోని మెత్తదనం…

 
నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు…

తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ…

 
మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

 
అనుభూతులన్నిటికీ అస్థిత్వాన్నిఅద్దుతుంటాయి…
అసంఖ్యాక చిత్రాలనెన్నిటినో ఆవిష్కరిస్తాయి!

 
కానీ..
 

నైరాశ్యపు క్షణాలు కొన్ని
అస్సలిష్టంలేని అగరుబత్తి ధూపంలా
చుట్టుముట్టునప్పుడు మాత్రం…..

 
శీతాకాలపు సాయంకాలాలలో
నిశ్శబ్దపు వాగుమీద
వంతెనొకటి పేర్చాలన్నా…

 
లోపలా.. బయటా..
తుళ్ళిపడే ప్రేమావేశ జలపాతాన్ని
దారిమళ్ళించాలన్నా…

 
అక్షరాలు అదృశ్యమైన భాష ఒకటి మిగులుతుంది!

-- మొదటి ప్రచురణ వాకిలి లో....

Monday, October 22, 2012

Lost Soul





 మొదటి ప్రచురణ 2012 జులై-ఆగస్ట్ తెలుగుజ్యోతిలో....


Monday, July 16, 2012

తడి జ్ఞాపకం...


మారుతున్న మాసాల ఊసు వింటూ
కరుగుతున్న ఆఖరి మంచు జాడల
తడి.. చలి రాత్రిలో
జ్ఞాపకమొకటి చిటికినవేలు పట్టుకు ఆపింది..

రాత్రంటే నీ మాటలు మాయమవడమేగా!

దశాబ్దాల క్రితం వినబడ్డ నీ చివరి పలకరింపుతోనే
ప్రతి పగలునీ వెలిగించుకుంటాను..

మనసుకి పడ్డ నల్లరంధ్రం చుట్టూ
సంధిభావాల పూలపొదలు..
దోశెడు ఆశల నీళ్ళు
ఝాము ఝాముకీ చిలకరించక తప్పదు!
ఏ వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు
పరాకుగా వెళ్తున్న పడమటిగాలిని పట్టి ఆపగానే
ఒకప్పటి స్పర్శాక్షణాలన్నీ
చుట్టూ జలజలా రాలతాయి..

గూటిలోని గువ్వ పక్కకి వత్తిగిల్లిన చప్పుడు
నా కనురెప్పలపైన నీ పెదవుల ముద్ర
ఆనవాలుని వెదికి తెచ్చింది.. 
కన్నుల్లో చప్పున కదలాడిన
సెలయేటి కెరటాలు
కదలనంటోన్న కాలాన్ని
తడిపేస్తూ చెప్తున్నాయి....

నీ జాడ లేని ప్రపంచంలో
బ్రతకడం
సాధ్యమే కానీ సులభం మాత్రం కాదు!!


(మొదటి ప్రచురణ జులై-2012 కౌముదిలో )

English Translation by NS Murty gaaru...
 

Tuesday, July 3, 2012

మువ్వలూ.. ముత్యాలూ.. మనసెరిగిన ఎందరో స్నేహితులు...


మనం ఒక విషయాన్ని మనస్పూర్తిగా నమ్ముతాం.. ఆ నమ్మకం మీదే మన జీవితంలో చాలా ముఖ్యమైన పనులవ్వనీ, మన ఆలోచనలవ్వనీ తెలీకుండానే ఆధారపడిఉంటాయి.. అది దేవుడవ్వచ్చు.. స్నేహమవ్వచ్చు.. ఇంకేదైనా అవ్వొచ్చు.. ఉన్నట్టుండి, ఏదో సంఘటన జరుగుతుంది! ఆ నమ్మకానికి చిన్న బీట పడుతుంది.. ఇక రాత్రీ పగలూ.. ఏ పని చేస్తున్నా చేయకున్నా మనసు అదే ఆలోచిస్తూ ఉంటుంది.. 'అసలు ఆ విషయాన్ని ఇంతలా నమ్మకుండా ఉండాల్సిందేమో! దానివల్ల చివరికి నాకు మిగిలేది బాధేనేమో' అనే సందిగ్ధమో.. ఆందోళనో.. కుదురుగా ఉండనివ్వదు! అలాంటిదే నాకు మొన్న శంకర్ గారి హఠాన్మరణంతో అనుభవమైంది! ఈ ఆన్లైన్ స్నేహాలు, ఆప్యాయతలూ ఏదో ఒకరోజుకి దుఃఖాన్ని మాత్రం మిగిలుస్తాయేమో అనే భయం.. అంటే, ఎప్పుడూ ఇలా దురదృష్టకరమైన సంఘటనలే జరుగుతాయని కాదు.. కొంతమంది అనుకోకుండా ఏవేవో వ్యక్తిగత కారణాల వల్ల కూడా కనబడటం మానేస్తారు.. ప్రతిరోజూ వాళ్ళ ఐడిలో ముఖాల్నీ, అక్షరాల్లో వాళ్ళ ముఖకవళికల్ని చూసీ.. చూసీ అలవాటైపోయి.. ఒకట్రెండు రోజులు కనబడకపోతేనే అదోలాంటి బెంగ వచ్చేస్తుంది! అలాంటిది, ఇంకెప్పటికీ కనబడరంటే!!

నాకిది రెండో అనుభవం.. మొదటి వ్యక్తి విషయంలో అయితే ఇప్పటికీ అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు... అంతకుముందు రోజు సాయంత్రం వరకూ పాటలు పాడి, అల్లరి చేసిన మనిషి మరుసటిరోజు నించీ కంప్లీట్‌గా అదృశ్యం! ఐడి తప్ప ఏమీ తెలియని పరిస్థితిలో 'క్షేమంగా ఉంటే చాలు, భగవంతుడా!' అని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయస్థితి! ముఖ్యంగా, శంకర్ గారి  'పర్వాలేదు.. అస్సలు మొహమాట పడకండి.. ఏవేం పుస్తకాలు కావాలో చెప్పండి ' అన్న చివరి మాటలు తల్చుకుంటే ఇంకా బాధ.. ఇంకెవరు అడుగుతారు ఇలా అని! ఈ పరిచయాలు కలిగించే చిన్న చిన్న రోజువారీ సంతోషాల కంటే, అవి మిగిల్చే దీర్ఘకాలపు బాధని తలచుకుని కొంచెం దూరం జరగాలనిపించింది!

కానీ, ఆ బీటలు వారిన నమ్మకాన్ని అతికించే చిన్న సంఘటన...

నిన్న ఇంటికెళ్ళేసరికి, మా ఇంటాయన గారు ఒకింత ఆదుర్దానో, బాధో తెలీని ఒక మిక్స్‌డ్ ఎక్స్ప్రెషన్‌తో "నీకు మీ ఫ్రెండ్ నించి పుస్తకాలు వచ్చాయన్నారు!" ఆయన ఉద్దేశ్యంలో అవి శంకర్ గారు పంపారని.. ఎందుకంటే తనకి తెలిసీ నేను రీసెంట్‌గా పుస్తకాల గురించి మాట్లాడింది శంకర్ గారితోనే! అది అసంభవం అని మనసుకి తెలుస్తున్నా గభాల్న వెళ్ళి లేబుల్ చూశాను...ఎదురుగా, Sravya V. అని కనబడుతోంది! అసలు ఆ అమ్మాయే కళ్ళముందు నించున్నట్టు అనిపించేసి ఆ ప్యాకేజ్ నే హగ్ చేశేసుకున్నా.. అబ్బే, ఇది అతి అస్సలు కానే కాదు.. ఇలాంటి ఎక్సైట్‌మెంట్ అనుభవించిన వాళ్లకే నేను చెప్పేది అర్ధం అవుతుంది!! కలలో, ఇలలో, ఏ లోకాలలోనూ ఊహించలేదు ఇలా అడగకుండానే నాకెంతో ఇష్టమైన బహుమతిని, అదీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు బహుమతుల్ని ఇచ్చేవాళ్ళు ఉంటారని.. ఎగైన్, అ..డ..గ..కుం..డా..నే!!!!!!!!!


నీలాకాశాన్ని కప్పేసినందుకు కారుమబ్బుల్ని తిట్టుకుంటుంటే గుత్తులు గుత్తులుగా మోదుగపూలు ఫక్కున నవ్వినట్టు...
ఒక రంగు మాయమైతేనేం! ఇంకో రంగు మనసుని తడుముతోంది!!

ఈఅమ్మాయితో నా ములాఖాత్ సాయంకాలం నీరెండ లాంటిది! కలిసేది కాసేపే... కానీ ఆ కాస్తంతసేపూ నులివెచ్చని, మెత్తని స్పర్శ.. తన మాటల రూపంలో పలకరిస్తుంది.. ఆ కొద్దిసేపూ అల్లరీ..మెచ్చికోళ్ళూ.. పెద్దంతరం మీదేసేసుకుని జాగ్రత్తలూ.. దీవెనలూనూ! మాట్లాడిన ప్రతిసారీ, 'ఈ వయసులోనే ఎంత మెచ్యూరిటీ!' అని అనుకోకుండా ఉండలేను... 

శ్రావ్యా, నా కళ్ళు తడి చేయడం సాధ్యమే.. అంత కష్టం కాదు.. కానీ.... నాతో నిన్న తీన్‌మార్ వేయించావు చూడూ... చాలా తక్కువ మందికి సాధ్యం అది! నీ అభిమానానికి ప్రతిగా ఏమి చెబుదామన్నా తేలిపోతోంది.. ఏ పదానికి సరైన అర్ధం గోచరించడం లేదు! ఇంత దూరం నుంచి ప్రస్తుతం ఒట్టి థాంక్యూ తప్ప ఏమీ చెప్పలేకున్నాను.. THANK YOU SO MUCH FOR YOUR LOVE AND AFFECTION! MAY GOD BLESS YOU WITH ALL THE HAPPINESS, Dear!

బాధ.. సంతోషం.. పక్కపక్కనే ఉంటాయి.. పరిస్థితిని బట్టి ఒకదాని నుంచి ఇంకోదానికి గ్రేస్‌ఫుల్‌గా మారుతుండటమే మనం చేయాల్సింది! ఈ చిన్న విషయాన్ని నీ ద్వారా తెలుసుకున్నాను, శ్రావ్యా! Love you!

----------------------

ఎలాగో పుస్తకాలు.. స్నేహితులూ గురించి మాట్లాడుతున్నా కాబట్టి.....నా పుస్తకదాతలందరినీ ఒకసారి తలచుకోవాలనుంది..........

ఆ మధ్యనెప్పుడో నా ప్రాణస్నేహితురాలు శ్వేత, "నీ దగ్గర ఏమన్నా పాత నవల్స్ ఉంటే చారిటీగా డొనేట్ చేస్తావా, మా ఊళ్ళో తెలుగు లైబ్రరీకి" అని అడిగితే నేను సెకనులో సగం కూడా ఆలోచించకుండా "అబ్బే, అలాంటి పనులు నేను చేయను, కావాలంటే డబ్బులిస్తా" అన్నా.. అసలు తన దగ్గరికి మూణ్ణెల్లకోసారి వెళ్ళినప్పుడల్లా లడ్డూలు, మురుకులు, వడియాలు..etc etc అచ్చు అమ్మ దగ్గర్నించి ఎలా తెచ్చుకుంటామో అలానే మూటలు మూటలు తెచ్చుకుంటా!! అలాంటిది తను నోరు తెరిచి అడగ్గానే నేను ఖరాఖండిగా "నో" చెప్పేశాను.. ఎంత చిరిగి శిధిలావస్థలో ఉన్నా, అవి ఎలాంటి రచయిత(త్రు)లవైనా నా పుస్తకాలంటే నాకు ప్రాణం.. పైగా ఇలా దూరాభారాన ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు టకీమని కొనుక్కునే అవకాశం లేకపోవడం వల్ల ఈ పుస్తకాల పీనాసితనం బాగా హైట్స్ లోకి వెళ్ళిపోయింది.. కానీ, నేను ఆడగకుండానే/అడగ్గానే కాదనకుండా... అదీ ఇక అచ్చులో దొరకని పుస్తకాలని నాకు పోస్ట్ లో పంపి మరీ నన్ను ఆనందాశ్చర్యాలకు గురిచేశేసారు కొందరు స్నేహితులు!!

రెండు సంవత్సరాల క్రితం నేను గొల్లపూడి గారి 'ఎర్రసీత ' గురించి విని, ఆ పుస్తకం కోసం అన్ని రకాలా ప్రయత్నించి, విసిగి ఇక ఆశ వదిలేసుకున్నప్పుడు అప్పటికి నాతో ఏమాత్రం పరిచయం లేని స్నేహితురాలు సుధ, కౌముది కాంతి గారి ద్వారా నా ప్రయాసని విని రెండు రోజుల్లో 'ఎర్రసీత ' ని నాకు పంపించారు! నాకైతే కృతజ్ఞతలు చెప్పడానిక్కూడా నోరు పెగలని పరిస్థితి!!

అప్పటికే రెండు మూడు అరుదైన పుస్తకాలని అచ్చంగా ఇచ్చేసి... నేను స్వప్నరాగలీనని తెగ తలుస్తూ, తనని పరిచయంచేసుకునే వీలు నాకు లేదని వాపోతుంటే "ఎన్నాళ్ళు చదువుతావో నీ ఇష్టం" అని 'అనుక్షణికం'  దానం చేసిన కొత్తపాళీ గారి ధైర్యాన్ని తల్చుకుంటే నాకు ఇప్పటికీ భలే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ప్రింట్ లో లేని ఆ నవలని ఏ నమ్మకంతో నాకు పంపించారా అని!!

ఆ తర్వాత, తన బ్లాగులో జానపద నవల గురించి చెప్తూ, మనసులో మాట సుజాత, "ఎవరికైనా కావాలంటే...." అని ఇంకా వాక్యం పూర్తి చేయనేలేదు నేను బెంచీ ఎక్కి మరీ చేతులెత్తినంతపని చేశాను.. తను వెంటనే దానితో పాటు ఇంకో రెండు మంచి పుస్తకాలు కూడా వచ్చాయనీ అవికూడా పంపిస్తాననీ ఈమెయిల్ ఇచ్చింది.. ఆ జానపద నవల రాకున్నా ఇంకా బోల్డంత ఇష్టమైన 'మిధునం' మాత్రం పదిలంగా పంపింది.. అసలు తనంటేనే పుస్తకాల అక్షయపాత్ర అని నా నమ్మకం!

అప్పట్లో బజ్జులోకి ప్రవేశించి హాయ్, హల్లో అంటూ నెమ్మదిగా మొహమాటంగా తిరుగుతుంటే ఎక్కడ్నించి వచ్చిందో గానీ ఈ అమ్మాయి పద్మ ఉండవల్లి, చెయ్యి పట్టుకుని గబగబా మొత్తం బజ్జులన్నీ తిప్పేసింది.. మరుసటిరోజు కుప్పిలి పద్మా, శీతవేళ రానీయకు అంటూ ఏదో బజ్ రాసింది.. "రచయిత్రి పేరు సరే ఈ పుస్తకమెప్పుడూ చదివినట్లు లేదు " అని అన్నానో లేక అనుకున్నానో తెలీదు కానీ మళ్ళీ నాలుగు రోజుల్లో ఆ పుస్తకం మా మెయిల్ బాక్స్ లో ఉంది! అసలు అప్పటికి తనకి నా పేరు తప్ప పింక్ చుడీదార్ ఫేసూ, బ్లూ స్వెటర్ నవ్వూ, మా టైం జోనూ ఇవేవీ తెలీవు..

ఇక మొదటిసారి అచ్చంగా... బోలడన్ని పుస్తకాలు పంపింది మాత్రం మన శంకర్ గారే!!



e-copy లు పంచుకోవడానికి కంప్యూటర్ మెమరీ కాస్త ఎక్కువ ఉంటే సరిపోతుంది కానీ ఇలా పుస్తకాలంటే ఇష్టం ఉండీ వాటిని వేరేవాళ్ళతో పంచుకోవాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలో కదా అనిపిస్తుంది... అదీ ఒకే ఊరిలో ఉండి పుస్తకాలు పంచుకోవడం వేరు.. కాస్తో కూస్తో భరోసా ఉంటుంది. దూరాల్లో ఉన్న స్నేహితులకి పుస్తకాలు పంపాలంటే మాత్రం ఎంత నమ్మకం ఉండాలో!! మణులేలా మాణిక్యాలేలా ఇలాంటి స్నేహితులు నలుగురైదుగురు ఉంటే చాలదా అనిపించకమానదు!

 'శీతవేళ రానీయకు ' లో చదివిన కింది నాలుగు పంక్తులు అటూ ఇటూగా ఇలానే చెప్పాయి..

".......మన వెలుపల మనలాంటి మనుష్యుల కోసం, మన మనుష్యుల కోసం మనమెప్పుడూ వెతుకుతూ ఉంటాం.. మన భాష అర్ధమయ్యేవాళ్ళూ, మనతో మాట్లాడగలిగేవాళ్ళూ, మనం చెప్పకుండానే మనల్ని చదివేవాళ్ళూ, మనం చెప్పుకోగలిగేవాళ్ళూ, ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక స్పర్శతో మనకు ఉత్సాహం, ఉద్రేకం, ఉపశమనం పుట్టించేవాళ్ళు మనకెప్పుడూ కావాలి.. మనల్ని వాళ్ళలా మార్చుకోకుండా మనల్ని తమలోకి తీసుకోగలిగేవాళ్ళు, మనల్ని మనలా ఇష్టపడేవాళ్ళు కావాలి.. నిప్పుల వర్షంలో నడుస్తున్నప్పుడు కూడా ఎవరి స్ఫురణ మనల్ని చల్లగా చూస్తుందో వారి స్నేహం కావాలి.. అటుమటి మనుషులు మనకెంతగా కావాలంటే -- వాళ్ళు లేని మనం అరసున్నాలా అర్ధరహితంగా మిగిలిపోతాం....... "

Thank you all.. Thank you so much!!


పుస్తక దాతా సుఖీభవ!!!

Monday, June 18, 2012

ఆత్మీయ స్పర్శలు...


మొన్నటి వాన సాయంకాలపు
ఇంద్రధనస్సు నింగిలోకి ఇంకిపోయింది..
రంగుల్ని మాత్రం చుట్టూరా పరిచేసి!

అనుభవాల అల్మరా
అప్రయత్నంగా తెరుచుకున్నప్పుడల్లా
దాగిన స్పర్శల మొగలిరేకులు
గరుకుగా తగుల్తూనే గుభాళిస్తాయి..

కాలం క్రమబద్దంగా ఎండగట్టిన
గుండె పగుళ్ళ మీద ఉన్నట్టుండో
ఆత్మీయపు వేసవివాన
ఆసాంతం కురిసిపోతుంది..

ఎత్తుపల్లాల్లో నదిని వదలని తీరం..
గుప్పిటెప్పుడూ ఖాళీ కాదనే అరచేతిగీతలూ..
నిశ్శబ్దానికి రాగాలు నేర్పే చల్లని గాలీ..

స్నేహాలేవైనా సరే
అదృశ్యంగానో.. అంతర్లీనమయ్యో…

జీవితపు రహదారిలో
పరిహాసంగా పలకరించే
ముళ్ళూ రాళ్ళ మీద
మెత్తటి ముఖమల్ దుప్పటి కప్పుతూనే ఉంటాయి!


-- to ALL my wonderful friends and to 'bujjamma'!


(మొదటి ప్రచురణ ఆవకాయలో...)


Tuesday, June 12, 2012

ఒకానొక సాయంకాలం....



చిరుజల్లులు నింపాదిగా
స్పర్శిస్తుంటే
మల్లెమొగ్గలు కోసుకోవడం...

నీ చేతుల్లో భద్రంగా
ఒదిగి
నా పాటలో తప్పిపోవడం...

అవ్యక్తానుభూతికి
ఏది సరైన
నిర్వచనమంటావ్!?

  

Wednesday, November 16, 2011

One hell of a ‘Raa…’ party! -- II


అవ్విధంబుగా ముగ్గురం మొదలుపెట్టిన ఈవెంట్‌లో ఇద్దరమే మిగిలినా చకచకా ప్లానింగ్ చేస్తూ వస్తున్నామే కానీ చివరికి వచ్చేసరికి రాత్రిపూట నిద్ర పట్టని పరిస్థితి.. దానికి కారణం, కనబడ్డ ప్రతివాళ్ళూ "we can't wait for your event" అని రెస్ట్‌రూం లో కూడా వదలకుండా చెప్పడం! ఆ పైన అబ్బాయిలు వచ్చి "ఏం చేస్తారో ఏమిటో, టికెట్లు మాత్రం బోల్డన్ని అమ్మేశారు!" అని ఒకటే ఆటపట్టించడం!!
ఆఖరి వారంలో నాకో ఆలోచన వచ్చి నా పార్ట్‌నర్, డార్లీన్ కి చెప్పాను.. తనకి కూడా ఆ ఆలోచన నచ్చి తలూపడంతో ఆ అరేంజ్‌మెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టాం.. అదేమిటంటే మొత్తం దృష్టంతా ఫుడ్ మీద కేంద్రీకరించకుండా ఇంకా ఏమన్నా సరదా అంశాలు పెట్టాలని! అందులో భాగంగా..

·         ఇండియన్ డ్రెస్‌లు వేసుకోవడానికి ఎంకరేజ్ చేయడం
·         ఆర్ట్ పీసెస్, వస్తువుల్లాంటివి డిస్ప్లే చేయడం
·         ప్రొజెక్టర్ తో స్క్రీన్ మీద మన బాలీవుడ్ (నాట్ ఐటెమ్) సాంగ్స్ ప్లే చేస్తూ మధ్య మధ్య trivia quiz  పెట్టడం
·         చివర్లో, raffle ప్లే చేసి డోర్ ప్రైజెస్ ఇవ్వడం
వీటికి తర్వాత అనుకోకుండా చేరిన అంశాలు --
      ·        మా పెద్ద బాసిణి saree draping demonstration కి అంగీకరించడం
        ·         ఒక లోకల్ ఇండియన్ షెఫ్ వచ్చి ఇండియన్ కుకింగ్ మీద చిన్న లెక్చర్ ఇవ్వడం

ఇక ఈవెంట్ రోజునైతే ఇద్దరమల్లా ఇరవైమందిమయ్యాం!! అందరూ తలా ఒక చెయ్యీ వేయడం మొదలుపెట్టి రూం డెకరేట్ చేశారు.. అసలైన సందడి ఏమిటంటే, అమ్మాయిలందరూ చుడీదార్లు వేసుకుని మ్యాచింగ్ బొట్లు, గాజులు, చున్నీల కోసం ఒక ఆఫీసు నించి ఇంకో ఆఫీసు రూంకి పరుగులు పెడుతుంటే అచ్చు మన పెళ్ళి ఇల్లే గుర్తుకువచ్చింది!! వాళ్ళని చూస్తూ అబ్బాయిల చెణుకులూ.. అసలు ఎంత కళకళలాడిపోయారో! కాకుంటే అబ్బాయిల్లో ఒకరికే మన కుర్తా పైజమా సెట్ అయింది.. అయినా గోపికల మధ్య కన్నయ్యలా తను కూడా పొద్దున్నించీ సాయంత్రం వరకూ చక్కగా వెలిగిపోయాడు :-)

Italian guy with a Columbian girl... serving Indian Mango Lassi :-)


ఫుడ్ సర్వ్ చేయడం, క్విజ్, raffle నిర్వహించడం ఇలాంటి పనులన్నీ అడగకుండానే అలా చేతుల్లోకి తీసుకుని నిర్వహించారు! మామూలుగా అయితే ఈ ఈవెంట్స్ లో టికెట్ చూపించి తమకి రావాల్సిన ఫుడ్ ప్లేట్ తీసేసుకుని వెళ్ళిపోతారు.. కానీ ఇక్కడ మాత్రం వచ్చినవాళ్ళెవరూ బయటకి అడుగుపెట్టలేదు.. ఫుడ్ గురించి వివరంగా తెల్సుకుంటూ, డిస్ప్లేలో ఉన్న వస్తువుల్ని పరీక్షగా, ఆసక్తిగా చూస్తూ, స్క్రీన్ మీద వస్తున్న పాటలకి డ్యాన్స్ చేస్తూ (చాలామందికి షారుఖ్ బాగా నచ్చేశాడు, వింటున్నారా మంచు గారూ? :-) ) అసలు కదల్లేదు..

Mixing Bhel Puri chat...



Awesome models.... :-)



మేము సరిగ్గా అంచనా వేయక చిన్న రూం బుక్ చేయడంతో చాలా మంది కాసేపు వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు :-) చాలా డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు మేము ప్రతి ఫ్లోర్‌లో పెట్టిన ఫ్లైయర్స్‌ని పెద్దగా పట్టించుకోకున్నా, మా చుడీదార్ భామలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్‌కి తమ డ్రెస్ చూపించడానికి అన్ని ఫ్లోర్స్ చుట్టేస్తుండటంతో వాళ్ళకీ ఉత్సాహం కలిగి అప్పటికప్పుడు వచ్చి టికెట్స్ కొనడం మొదలుపెట్టారు.. టికెట్స్ ప్రింట్ చేయడం మన చేతుల్లో ఉన్న పని కాబట్టి బోల్డన్ని ఎక్స్‌ట్రా ఉన్నాయి.. సమస్య అది కాదుగా! మేము 100 మందికి అనుకుని, ఎందుకైనా మంచిదని 120మందికని చేసుకొచ్చిన స్నాక్స్ సరిపోయేట్లు లేవు! ఏదైతే అది అయిందని వచ్చినవాళ్ళకి వచ్చినట్లు సర్వ్ చేస్తూనే ఉన్నాం :-)
డిస్ప్లే లో పెట్టిన కొన్ని బొమ్మలు...


ఈవెంట్ మొదలైన గంటన్నరకి బయటనించి వచ్చిన ఇండియన్ షెఫ్ మన భారతీయ ఆహారపు అలవాట్లూ, ఉత్తర దక్షిణాల్లో ఉండే వివిధ రకాల ఆహారదినుసుల వాడకం గురించి చాలా బాగా చెప్పారు.. ఆవిడ మనం వాడే పోపులపెట్టె, కరివేపాకు, పసుపు కొమ్ముల్లాంటివి కూడా వెంట తెచ్చి, అవి ఎప్పుడెప్పుడు ఎలా వాడతారో చక్కగా వివరించారు! తను వివరిస్తున్నంతసేపూ అందరూ నిశ్శబ్దంగా భలే విన్నారు!

Chef Ayesha.....


ఆ తర్వాత అసలైన్ ఫన్ పార్ట్ -- చీరకట్టు గురించి చెప్పి, ఎలా కట్టుకుంటారో చూపించడం.. చాలామందికి 'శారీ' అంటే ఏదో కొద్దిగా అవగాహన ఉంది కానీ అది ఎంత పొడవు ఉంటుంది అనేది నేను చీరని పూర్తిగా మడతలు విప్పి చూపించగానే నిజంగానే అవాక్కయ్యారు :-) ఇంత పొడవున్న ఫ్యాబ్రిక్ ని ఎలా కట్టుకుంటారు, కట్టుకున్నాక ఎలా నడుస్తారు అనేది వాళ్ళకి చాలా ఆశ్చర్యార్ధకంగా అనిపించింది! కట్టుకుని నడవడమేమిటి, మా దేశంలో పొద్దున్న లేచిన దగ్గర్నుంచీ సర్వకాల వ్యవస్థల్లోనూ చీరనే ధరిస్తారు అని చెప్పి వాళ్ళ నోళ్ళు ఇంకాస్త తెరిచేలా చేసి, మా బాసిణి గారికి మొత్తానికి చీరకట్టి, చక్కగా పూలూ, బొట్టూ, నగలూ.. అన్నిటితో అలంకరింపజేశాం.. నిజం చెప్పాలంటే ఆవిడతో మాట్లాడాలంటేనే మాకు భయం... ఆవిడ అడిగిన ప్రశ్నకి 'యెస్ ' అన్నా 'నో' అన్నా అందులోనే తప్పు చూపించే రకం.. చాలా స్త్రిక్ట్ AVP (associate vice president) అని పేరు.. అలాంటిది ఆవిడ ఆరోజు చాలా సరదాగా మామధ్య తిరిగారు :-)
గోపాల కృష్ణుడు, బాసిణి....



ఈ ఫొటో తీస్తున్నప్పుడే అనుకోకుండా మా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వచ్చి పూర్తిగా సర్‌ప్రైజ్ చేశారు.. ఆయన ఆఫీస్ మా ఫ్లోర్‌లోనే అయినా ఎప్పుడూ ఉండరు.. అలాంటిది అనుకోకుండా వచ్చి అందర్నీ అభినందించి వెళ్ళారు! ఇక తర్వాత నించీ ఫుడ్ ట్రేలన్నీ ఖాళీ అయ్యేవరకూ అందరూ చాలా ఎంజాయ్ చేశారు.. చివర గంటలో టికెట్ కొన్నవాళ్ళకి పాపం అన్ని ఐటెంస్ లేకపోయినా "నో ప్రోబ్లెం.. నో ప్రోబ్లెం" అని పెద్దమనసు చేశేసుకుని పెట్టినవాటినే ఆరగించారు!
మా గ్యాంగ్ ఈవెంట్ అంతా అయిపోయాక సర్దడంలో కూడా బోల్డంత హెల్ప్ చేసి, అలసిపోయి గుంపుగా కూర్చుని డిస్కషన్ మొదలుపెట్టారు -- వచ్చే సంవత్సరం ఇంకా ఎంత బాగా చేయాలో, ఇంకా ఏమేమి సరదా సంగతులు కలపొచ్చో అని నన్నూ, డార్లీన్ నీ అడుగుతూ -- "ఈసారి అందరం చీరలు కట్టుకుందాం" అని డిక్లేర్ చేశేశారు.. మా ఇద్దరికీ నవ్వూ, సంతోషం రెండూ ఆగలేదు :))
ఆ రోజు పొద్దుటినించీ రెండు కప్పుల కాఫీ తప్ప ఇంకో పదార్ధం లోపలికి వెళ్ళకపోయినా చివరికి అంతా పూర్తయ్యి డెస్క్ దగ్గరికి వచ్చేసరికి ఎంత ఉత్తేజభరితంగా అనిపించిందో! 6:30 దాటింది, ఇక ఇంటికి బయలుదేరుదామని ఎందుకో ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేశేసరికి వరుసగా 20కి పైగా ఈమెయిల్స్, ఈవెంట్ సక్సెఫుల్ గా జరిగినందుకు అభినందిస్తూ!! ఎక్కువగా ఆశ్చ్ర్యమూ ఆనందమూ కలిగించింది మా VP రాసిన ఈమెయిల్.. అందులో 'రా ' అని చూడగానే నాకు నవ్వు పొంగుకొచ్చింది.. యా.. యా.. మీకు చెప్తానన్న పిట్టకధ విషయం గుర్తుంది.. :-)

ముందు మా పెద్దవాళ్ళు మమ్మల్ని ఎలా పొగిడేశారో మీకు వినిపించేసీ... JJ
--------------------
It was one hell of a Raa party. Great job, you both! ------ from our VP
 
Congratulations and thank you for a great event for United Way! ---- -- from our AVP (బాసిణి)

It was a classy, interesting, dynamic and fun party.  Good food, too.  Really good. I know that you got some help from folks, but you two were the engines. ----- from my boss
Your Diwali celebration was awesome!  The food, music and decorations… WOW! I was thrilled to see you had such a great turnout.  Hopefully it’s the start of a new UM tradition! ----- from an employee outside our dept.

---------------------------------

ఈ యునైటెడ్ వే ఫండ్ రైజింగ్‌లో మా యూనివర్సిటీ వరుసగా నాలుగు సంవత్సరాల నించి $1 మిలియన్ (cash wise)మార్క్ దాటుతూ వస్తోంది.. అందులో మేము పోగుచేసినవి సముద్రంలో నీటిబొట్టంత మాత్రమే! అయినా, 'మేము సైతం' అన్న సంతృప్తి అణువణువునా నిండిపోయింది.. ఆ భావన ఇచ్చే/ఇస్తున్న ecstasy ని వర్ణించడానికి నాకు సరైన పదాలు దొరకడంలేదు.. just feeling great!
ఇంతకీ మేము ఎన్నుకున్న అంశం -- Healthcare for kids. J
వడ్డించిన పదార్ధాలు -----
       ·         సమోసా
       ·         వెజ్ పకోడీలు
       ·         భేల్ పూరీ
       ·         గులాబ్ జామూన్
       ·         బాదుషా
       ·         మ్యాంగో లస్సీ

ఈ కార్యక్రమంలో చాలానే లోటుపాట్లు దొర్లాయి -- రూమ్ చిన్నది కావడం, ఫుడ్ చివర్లో అందరికీ సమానంగా అందకపోవడం, డెకరేషన్ సంతృప్తికరంగా చేయలేకపోవడం.. etc.. etc.. ఇవి మేము సమీక్షించుకుంటే అనిపించిన లోపాలు కానీ ఎవ్వరూ కనీసం మాటమాత్రమైనా ప్రస్తావించలేదు.. అలానే అంతా ముగిసాక, ఆ మరుసటి 2,3 రోజులూ కనిపించినవాళ్ళల్లా నన్నూ, డార్లీన్ ని పొగిడారు కానీ, it was such a team work! అందరూ ఉత్సాహం పాల్గొనడంవల్ల దివాలీ అనే విదేశీ అంశానికి అంతటి ప్రాముఖ్యత వచ్చింది.. ఇక్కడ చాలా ఊళ్ళల్లో భారతీయ జనాభా ఎక్కువ ఉండటం వల్ల వేరే సంస్కృతుల వారికి మన పండగలు, అలవాట్ల మీద చాలానే అవగాహన ఉంటుంది!

కానీ మా వర్క్ ప్లేస్‌లో మన వాళ్ళు బహుతక్కువ ఉండటంవల్ల భారతీయత అంటే పూర్తిగా విదేశీ సంస్కృతే! కాబట్టి, అమ్మాయిలు పెట్టుకునే బొట్టుబిళ్ళల దగ్గర్నుంచీ, మనం అన్నం చేత్తో తినే విషయం వరకూ అన్నీ వింతలే.. ఆసక్తి కలిగించేవే! అందుకే ఒక కొత్త కాన్సెప్ట్ కావడంవల్ల ఈ ఈవెంట్ కి రావాల్సినదానికన్నా ఎక్కువ గుర్తింపు వచ్చిందనిపించింది!

ఆ రోజు నాకు బజ్‌లో, ఈమెయిల్లోనూ విషెస్ చెప్పిన స్నేహితులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు.. 

అలానే మీ అందరి నించీ చిన్న సహాయం కావాలి.. మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ ఈవెంట్ నిర్వహించడానికి మా కోవర్కర్స్ అందరూ ఇప్పటినించే సిద్ధమైపోతున్నారని చెప్పాను కదా.. కాబట్టి ఈసారి మన సంస్కృతి తగ్గ సరదా ఐటెమ్‌స్ ఏమైనా మీకు తోస్తే షేర్ చేసుకోండి, ప్లీజ్ :-)
ఆల్రెడీ మా వాళ్ళనించే వచ్చిన ఒక సూచన, సమోసాలు ఎలా చేయాలో demonstrate చేయడం..
ఇంకొక సూచన, అబ్బాయిలు ఒక షారుఖ్ పాటకి డ్యాన్స్ చేయడం...
ఆపైన, నిన్న కుమార్ గారి బజ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ చూశాక నాకొచ్చిన ఆలోచన Koffee with Kumar అనే ఆక్షన్ నిర్వహించడం.. ఇందులో మా వర్క్ ఫ్రెండ్సే కాదు మన బ్లాగరు/బజ్జ్ ఫ్రెండ్స్ కూడా పాల్గొనవచ్చు :)))))


ఒక చిన్న ఈవెంట్ గురించి ఇంత సుదీర్ఘంగా ప్రసంగించాక, అందర్నీ ఇక వదిలేద్దామని బలంగా అనిపిస్తున్నా, నేను మొదట్లోనే మీకు గట్టిగా ఒట్టు పెట్టి చెప్తానన్న పిట్టకధ గురించి చెప్పకపోతే మళ్ళీ నా మనసు చిన్నబుచ్చుకుంటుంది.. సో, ఆ కధ క్లుప్తంగా....

నేను వర్క్‌లో ఉన్నప్పుడు, కొలీగ్స్ మధ్య ఉన్నప్పుడు ఫోన్ మోగుతుంది... పిక్ చేసి నేను "ఆ చెప్పరా.. లేదు రా.. అబ్బా, అలా కాదురా.. నిజం చెప్తున్నాను రా.. నమ్మ రా.. బై రా" ఈ లెవల్లో మాట్లాడి పెట్టేస్తాను.. కొన్ని రోజులు వదిలేసినా ఒక 3 ఇయర్స్ నించి మాత్రం నా ఫోన్ మోగడం ఆలశ్యం నా డెస్క్ చుట్టుపక్కలనించి "హా.....య్ రా...." అని ఒక 3,4 గొంతులు వినబడతాయి.. ఆ పైన "బ్లా బ్లా బ్లా రా".. అనో లేకపోతే "యాడ యాడ యాడ రా" అనో ఇంకొక్కళ్ళు కంటిన్యూ చేస్తారు (మా బాస్ తో సహా!).. దాంతో నేను నా ఫోన్ ని సైలెంట్ మోడ్ లో పెట్టేసుకున్నాను.. ఆ సమస్య అలా సాల్వ్ అయిపోయినా ఎప్పుడన్నా బయటకి లంచ్ కో ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు ఎవరన్నా మన ఇండియన్ ఫీచర్స్ తో కనిపిస్తే చాలు టక్కున నా పక్కకొచ్చి "Is he/she a Raa?" అని అడుగుతారు.. అప్పటికి వాళ్ళందరికీ చిలక్కి చెప్పిన్నట్టు చెప్పాను, 'రా అనేది జస్ట్ ఒక స్లాంగ్ లాంటిదని.. ఇండియాలో అందరూ వాడరని ' అయినా అబ్బే! అబ్బాయిలు కదా పట్టిన కుందేలు కాళ్ళ లెక్క తప్పనివ్వరు కదా.. అలా అలా మా వాళ్ళసలు ఇండియన్ అనే పదాన్ని 'రా..' అనే పదంతో రిప్లేస్ చేశేశారు... మా బాస్ తను వెళ్ళిన మీటింగ్స్ అన్నిట్లో మా ఈవెంట్ గురించ్ చెప్పాడని అన్నాను కదా, అలా మా VP కి కూడా చెప్పాడు.. ఆయన కూడా ఇదో 'రా' పార్టీ అనేసుకున్నారు.. మరి ఆయనకి 'రా ఏంటి.. రా కీ దివాలీకీ సంబంధం ఏంటీ..' అని అడిగే తీరికా ఓపికా రెండూ లేవయ్యే!! So, ఆయన ఈమెయిల్ కూడా one hell of a Raa party అని ఇచ్చారు..:)))

(ఇక్కడ పెట్టిన ఫోటోలు కేవలం అనుమతి ఇచ్చినవాళ్ళవే!)