అనేక రకమైన భావాలు.. కరుణా, చిరాకూ, ఆహ్లాదమూ, భరించలేని బాధా, తట్టుకోలేని ప్రేమా, ప్రాణం పోయేంతటి నొప్పీ, సేద తీర్చే హాయీ……
కవులు కవిత్వాన్ని ఎక్కడినించో పుట్టించరు. మన చుట్టూ ఉన్న సమాజాన్నే, ప్రకృతినీ, మనుషుల్నీ వాటితో పెనవేసుకున్న
అనుభవాల్ని అనుభూతి చెంది తన పదాలతో, పదబంధాలతో వ్యక్తపరుస్తారు. ఆ రాతలు
పాఠకుల మనసు పొరల్లో అణిగిపోయి మరుగునపడ్డ ప్రపంచాన్ని వెలికిదీయడం గానీ
లేక ప్రపంచాన్ని కొత్తగా చూడగలిగే దృష్టిని గానీ ఇవ్వగలిగితే అవి
సార్ధకమైనట్టే.
కవి తన భావజాలాన్నీ లేదా జీవలక్షణాన్నీ తను వాడే పదాలలోనో
లేక మెటాఫర్ ల లోనో చూపించడంవల్ల ఆ కవిత్వ ప్రభావం మన మీద వివిధ రకాలుగా
ఉంటుంది. ఉదాహరణకి మహాప్రస్థానం చదివి మూసేసాక సమభావ సమాజం కోసం కవి పడ్డ
ఆవేదన మనలో ఒక ఇన్స్టెంట్ విప్లవావేశాన్ని పుట్టిస్తుంది. అదే, గీతాంజలి
చదివాక ఒక సాధారణ జీవితంతో మమేకమైన ఈశ్వరప్రేమ ఆర్ధ్రంగా మనసుని
కమ్మేస్తుంది!
కానీ శ్రీకాంత్ కవిత్వం పూర్తిగా విరుద్ధం. అతను కవిత్వం రాస్తాడో లేక
కధలకి కవిత్వాన్ని అలంకరిస్తాడో మరి ఒక్కొక్కటీ చదివాక ఒక దీర్ఘమైన పురాతన
గాధ ఏదో విన్నట్టు మనసు వివిధ పోకడలు పోతుంది!!
అలుపు తీర్చుకోడానికి అరుగు మీద చేరగిలబడ్డ అమ్మ పైట కొంగు అధాటున ముఖం మీద వాలినట్టూ..
మనసంతా బురద కాళ్ళతో చిత్తడి చిత్తడి గా తొక్కినట్టూ…
అప్పుడే కడిగిన నాపరాయి మీద నాలుగైదు పారిజాతాలు జలజలమని రాలినట్టూ…
ఎవరో తీరిగ్గా మణికట్టు నరాన్ని సన్నగా కోస్తున్నట్టూ…
అప్పటికప్పుడు లేచెళ్ళి బాకీ ఉన్న ముద్దు లెక్కలన్నీ తేల్చు కోవాలన్నట్టూ…
గుండ్రాయితో బాదంకాయికి బదులు వేలు మీద చితక్కొట్టుకున్నట్టూ..
దారితప్పి గంధర్వుల గాన కచ్చేరీలోకి వచ్చినట్టూ..
అనేక రకమైన భావాలు.. కరుణా, చిరాకూ, ఆహ్లాదమూ, భరించలేని బాధా,
తట్టుకోలేని ప్రేమా, ప్రాణం పోయేంతటి నొప్పీ, సేద తీర్చే హాయీ…… ఏ కవిత ఏ
అలౌకికానుభూతిని వదిలి వెళ్తుందో చదవడమయ్యేవరకూ చెప్పలేము.
సాధారణ
జీవితాన్ని అబ్బురమైన మాటల్లో ఎలా చెప్తాడో అసాధారణ సంఘటల్ని అంతే
సావకాశంగానూ అలజడి లేకుండానూ వివరిస్తాడు!
శ్రీకాంత్ కవిత్వంలో పిల్లలు మూడడుగుల మల్లెపూవులవుతారు… వృద్ధాప్యపు
అరచేతుల అమ్మ ఓర్పుతో పలకరిస్తుంది… స్త్రీలు చితికిన యోనిలాగా, నమిలి
ఊసేసిన పెదాలులాగా ఉండనివ్వమంటారు… వర్షం కురిసే కళ్ళుంటాయు.. స్వప్న
సువాసనలని అనువదించే నవ్వులుంటాయి!
‘ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు’ తో పరిచయమయ్యాడు. ఆ ఉలికిపాటుని
ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ అందులోని ‘ ఎందుకో కానీ నీకు మృత్యువుని
పరిచయం చేసి మృత్యుంజయులుగా మిగిలిపోతారు స్త్రీలు’ అన్న వాక్యం
గొణుక్కుంటూనే ఉంటాను. తేలికగా ఎలా ఉండాలో తెల్సుకోవాల్సిందేనని పట్తుదలతో
తన ‘పురాకృతం’ గాఢతలో ఎప్పటికప్పుడు మునిగిపోతూనే ఉంటాను.
నా వరకూ శ్రీకాంత్ కవిత్వం అంటే ఒక మిస్టీరియస్ అరణ్యంలో తప్పిపోవడం లాంటిది.. దారి దొరికి బయటకొచ్చేలోపల అంతులేనన్ని భావోద్వేగాలు పలకరించి వెళ్తాయి.
I am glad he happened to us!
– నిషిగంధ
శ్రీకాంత్ కొత్త కవిత్వ సంపుటి నుంచి కొన్ని కవితలు:
December moon
సన్నగా గాలి తాకిడి, నా భుజంపై
నువు తలను వాల్చినట్లు –
చుట్టూ, రాత్రి కురుల సువాసన!
ప్రచురణ: సారంగ
No comments:
Post a Comment