Pages

Thursday, November 5, 2015

ఒకే ఒక్క శబ్దం 15 - ఇవన్నీ ఏమైపోతాయి!?

ఒకప్పుడు.. చాన్నాళ్ళ క్రితం పుస్తకాల షాపుకి వెళ్ళడమంటే చెప్పలేని ఉత్సాహం. దాచుకున్న పాకెట్‌మనీని ఒకటికి పదిసార్లు లెక్కపెట్టుకుని, కొనాల్సిన పుస్తకాల జాబితాని అరడజను సార్లైనా సరిచేసీ… తీరా అక్కడికెళ్ళాక ఇంకొన్ని పుస్తకాలు నచ్చేసీ, ఏది కొనాలో ఏది వాయిదా వేయాలో తేల్చుకోలేక అక్కడే అదేపనిగా తచ్చట్లాడిన పుస్తకాల రాక్‌లు గుర్తొస్తుంటాయి అప్పుడప్పుడూ!

కొత్త వాసనతో పెళపెళలాడే పేజీలు తిప్పుకుంటూ ఆ పుస్తకాల్ని చదవుకోవడం ఇంకో అనుభవం.. మనమూ, మన పుస్తకమూ తప్ప ఇంకేదీ ఉండని సమయాలూ, ప్రదేశాలూ వెదుక్కుని ఆ అక్షరాల్లో తప్పిపోవడం గమ్మత్తుగా ఉండేది.

పుస్తకమంటే ప్రాణం అయితే అది ఏ రూపంలో ఉన్నా ఇష్టం గానే ఉంటుంది.. కాయితమైనా, కంప్యూటర్ స్క్రీన్ అయినా! కాకపోతే ఇప్పుడంతా ఇన్‌స్టెంట్… ఎదురుచూడటమంటే మహాపరాధం చేసినట్టే! ప్లానింగులూ, షాపింగులూ అనే ప్రోసెస్ ఆప్టిమైజ్ చేశేయబడి ఒక క్లిక్ లో మన కళ్ళ ముందు ఉంటుంది. అయినా పెద్ద తేడా ఏం కనబడదు.. ఎలక్ట్రానిక్ బుక్ రీడర్ అయినా చేతిలో ఇమిడి పోయే ఒకలాటి అచ్చు పుస్తకమే!

వెల్లకిలానో లేక బోర్లానో పడుకునీ ప్రబంధ నాయికలా వేలికొసలతో వాలుజడని తిప్పుకుంటూ ఒక్క రీడర్‌తో బోల్డన్ని పుస్తకాలు చదివేసుకోవచ్చు!
కాకపోతే ముందుపేజీ తిప్పి అపురూపంగా చూసుకుంటే మన పేరో లేక ‘ప్రేమతో…’ అంటూ మనకిచ్చిన వారి పేరో కనబడదు! ఇంకా, గుల్జార్ అన్నట్టు చదువుతూ ఉంటే మధ్యలో ఉన్నట్టుండి నెమలీకలూ, ఎండిన పూలరేకుల జ్ఞాపకాలు రాలి పడవంతే!


పుస్తకాలు 

మూసిన అల్మరా అద్దాల్లోంచి తొంగి చూస్తుంటాయి పుస్తకాలు
చాలా నిరాశతో తదేకంగా చూస్తుంటాయి
నెలల తరబడి కలవనే లేదు
ఒకప్పుడు వాటి సమక్షంలో గడపబడే సాయంత్రాలన్నీ ఇప్పుడు తరచుగా
కంప్యూటర్ తెర మీదనే గడచిపోతున్నాయి!
ఎంతో అసౌకర్యంగా కదులుతుంటాయి ఆ పుస్తకాలు
వాటికిప్పుడు నిద్రలో నడిచే అలవాటు మొదలైపోయింది
చాలా నిరాశతో తదేకంగా చూస్తుంటాయి

అవి వినిపించే విలువలకి
ఎన్నడూ బ్యాటరీ అయిపోవడమనేది ఉండదు
ఏ బంధాల గురించి వివరించాయో
అవన్నీ విడివడి తెగిపోయాయి
ఏదైనా పేజీ తిప్పినప్పుడు ఒక నిట్టూర్పు వెలువడుతుంది
ఎన్నో పదాలకి అర్ధాలు రాలి పడిపోయాయి
ఆకులు రాలి, మోడు బారిన కొమ్మల్లా మిగిలాయి ఆ మాటలన్నీ ఇప్పుడు
వాటి మీద ఏ అర్ధాలూ మొలకెత్తవు!
ఎన్నో పరిభాషలున్నాయి
అవన్నీ పగిలిన మట్టి కుండల్లా చిందరవందరగా పడి ఉన్నాయి

ఒక్కొక్క పేజీ తిప్పినప్పుడల్లా
కొత్త రుచి ఏదో నోటికి తగిలిన అనుభూతి!
ఇప్పుడొకసారి వేలితో నొక్కగానే
ఓరచూపు మేరలో స్క్రీన్ మొత్తం పొరలు పొరలుగా బొమ్మలు పరుచుకుంటాయి

పుస్తకాలతో ఆ వ్యక్తిగత అనుబంధం తెగిపోయినట్లే ఉంది
ఒకప్పుడు వాటిని గుండెల మీద పరుచుకుని నిద్రలోకి జారుకునేవాళ్ళం
లేకపోతే ఒడిలో దాచుకునో
లేక మోకాళ్ళని బుక స్టాండ్ చేసుకుని
ఏదో ఒక దీర్ఘ పూజలో ఉన్నట్టు.. ఇంచుమించు నుదుటిని తాకిస్తూ.. తలలు వంచుకుని చదివేవాళ్ళం!
అ ప్రపంచ జ్ఞానం అంతా ఇప్పటికీ ఏదోరకంగా లభిస్తూనే ఉందనుకో
కానీ,
ఆ పేజీల మధ్యలో ఉన్నట్టుండి పలకరించే ఎండిన పూలూ, పాత ఉత్తరాల పరిమళాలూ,
పుస్తకాలు ఇచ్చిపుచ్చుకుంటూ కావాలని జారవిడిచీ,
కలిసి తీసుకునే నెపం మీద నిర్మించుకునే కొత్త బంధాలూ
ఇవన్నీ ఏమైపోతాయి!?
అవన్నీ ఇక మిగిలుండవేమో!?!?


మూలం:
Kitaaben

Kitaaben jhaankti hain band almaari ke sheeshon se
badi hasrat se takti hain
maheenon ab mulaqaaten nahin hoti
jo shaamen un ki sohbat main kataa karti thi,ab aksar
guzar jaati hain computer ke pardon par
badi bechain rehti hain kitaaben
Unhe ab neend mein chalne ki aadat ho gayi hai
badi hasrat se takti hain

jo qadren woh sunaati thi
ki jin ke cell kabhi marte nahin the
woh qadren ab nazar aati nahin ghar mein
jo rishte woh sunaati thi
woh saare udhde udhde hain
Koi safha palatTa hun toh ek siski nikalti hai
kayi lafzon ke maani gir pade hain
bina patton ke sookhe tund lagte hain woh sab alfaaz
jin par ab koi maani nahin ugte
bahut si istelaahen hain.
Jo mitti ke sakoron ki tarah bikhri padi hain
gilaason ne unhen matrook kar dala

zabaan par zaaiqa aata tha jo safhe palatne ka
ab ungli click karne se bas ek
jhapki guzarti hai
bahut kuchh tah-b-tah khulta chala jaata hai parde par.

Kitabon se jo zaati raabta tha kat gaya hai
kabhi seene pe rakh ke lett jaate the
kabhi godi mein lete the
kabhi ghutnon ko apne rahl ki soorat bana kar
neem sajde mein padha karte the, chhoote the jabhee se.

Woh saara ilm toh milta rahega aainda bhi
magar woh jo kitaabon mein mila karte the sookhe phool aur
mehke hue ruqe
kitaaben maangne, girne, uthaane ke bahaane rishte bante the
un ka kya hoga ?
woh shayad ab nahin honge!!





మొదటి ప్రచురణ సారంగలో...


3 comments:

Mohanatulasi said...

హ్మ్మ్! ... చెవి మెలిపెడితే మాట వినొచ్చు.కానీ మనసు మెలిపెట్టేసావుగా,కష్టం ఇక ఈరోజు గడవడం. I missed ur blog for a while.

Telugunetflix said...

Nice website...
reviews

Telugunetflix said...

Nice website...
reviews