1.
పల్చని మేఘాల కింద
మెల్లగా ఊగే పూలని తాకుతూ
యధాలాపంగా నడుస్తున్న
ఒక తేలికపాటి సంతోషం..
ఒక అసంకల్పిత చిరునవ్వూ.. చిన్నపాటి బెంగా కూడా
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా!!
మెల్లగా ఊగే పూలని తాకుతూ
యధాలాపంగా నడుస్తున్న
ఒక తేలికపాటి సంతోషం..
ఒక అసంకల్పిత చిరునవ్వూ.. చిన్నపాటి బెంగా కూడా
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా!!
2.
నీ ఉనికి కోసం వెదకమని
మొన్నటి చలి రాత్రిలో
నే పంపిన వెన్నెల కిరణం
నీ వరకూ వచ్చిందో లేక,
నీ నవ్వులో
కరిగిపోయిందో!?
3.
అయినా, అన్నిసార్లూ
మాటలక్కర్లేదు....
చాన్నాళ్ళ క్రితం
నిన్ను హత్తుకున్నప్పటి
ఉపశమనం గుర్తొస్తే చాలు
ఒక అకారణ ఆనందం..
రోజంతా!!
4.
వర్షం వదిలెళ్ళిన
కాసిన్ని లిల్లీపూలూ
సీతాకోకచిలకలు వాలిన
చిక్కటెండా
ఇవి చాలవూ!?
రెండు చేతుల నిండా
తెచ్చేసి, నిన్ను నిద్రలేపేసి
నా ప్రపంచానికి
కాస్త కాంతిని ప్రసాదించుకోవడానికి!
5.
నువ్వు చదివేదేదీ నేను
చదవలేను
కానీ చెప్పింది
విన్నానా...
ఖాళీగా ముగిసే కలలు
కూడా
మందహాసాన్నే
మిగులుస్తాయి!
6.
లేకుండా కూడా ఉంటావా?
నిర్వచించలేని,
నిర్వచించకుండా మిగిలిపోయిన
కొన్ని రహస్య ఖాళీలు
నీకే ఎలా కనబడతాయో!?
7.
అరచేతిలోంచి అరచేయి
విడిపడింది గానీ
నిన్నటి ఆఖరి జ్ఞాపకం
ఇవ్వాళ్టి మొదటి ఆలోచనా
నీదే!
నిన్నటి ఆఖరి జ్ఞాపకం
ఇవ్వాళ్టి మొదటి ఆలోచనా
నీదే!
మొదటి ప్రచురణ సారంగలో...
2 comments:
అన్నిసార్లూ ...నిజంగానే మాటలవసరం లేదు.
Post a Comment