Pages

Tuesday, August 12, 2014

వలసపక్షి

కొన్నిసార్లు ఏదనీ చెప్పడానికేముండదు..

వద్దనుకున్నవో.. వదిలేసుకున్నవో
పాత బంధాలు
కొత్త బెంగలై
లోపల్లోపల పేరుకోకముందే
తటాలున విదిలించేసుకున్నా
అకారణ దిగులేదో
ఇంటిచూరు పట్టుకుని వేళ్ళాడే మధ్యాహ్నపుటెండలా
ఉత్తినే వేధిస్తుంటుంది..


పచ్చపూలవనాల్లో
అలక్ష్యంగా ఎగిరీ..
ఆగి ఆగి నవ్వుతున్న నక్షత్రాల ఆకాశాన్ని
భుజాన వేసుకుని..
ఎప్పటికీ తిరిగి రాని రెండు ఝాముల కోసం
ఒక వలస పక్షిలా
మళ్ళీ వెళ్ళి వెదుక్కున్నా
పలకరించేది
గోడలు కూలిన రహస్యగృహమే!


ఎందుకో మాట్లాడలేక.. మాట్లాడి ఏమవ్వనూ లేక
మౌనంగానే తేలికవ్వాలంటే..

ఎవరినీ చేరని కలలా
చీకటి చివర్లలో
ఊగుతూ ఒద్దికగా ఉండిపోవాలంతే!


ఉండడమేవిటో…
అంతలోనే లేకపోవడమేవిటో
మృదువుగా కదిలెళ్ళే మేఘంలో
లిఖించబడి ఉంటుంది!
అర్ధమయితే చాలు..
అసహనపు వల వీడిపోతుంది!


విచ్చుకుంటున్న స్వాతిశయపు పూలగుత్తుల్లోంఛి
తోవ చేసుకుంటూ
ఆకాశం సముద్రస్నానం చేస్తున్న
ఆవలి తీరానికి
ఇంకొక సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది!!


మొదటి ముద్రణ: 13వ (జులై 2014) ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, అక్షరలో బహుమతి పొందిన కవిత.

4 comments:

nmrao bandi said...

wow...
and wow...
nice as ever ...

తృష్ణ said...

ఎంత బాగుందో...

నిషిగంధ said...


ఎప్పటికప్పుడు చక్కగా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు nmrasobandi గారు.. :)

థాంక్యూ సో మచ్, తృష్ణ గారూ :)

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది నిషీ...