Part 1: ఒక చిన్నమాట... మీకు చెప్పాలని… (ముందో చిన్న కధ)
......... నామీద నాకు ఒక తప్పు అభిప్రాయం ఉండేది; సమయం, మూడ్ రెండూ ఉంటే నేను రాయగలనని.. కానీ ఈ కవితలపై కసరత్తు చేస్తున్నప్పుడు అర్ధమైంది ఆ రెండూ ఉన్నా నేను రాయలేనని!! ఒకసారి వెనక్కి వెళ్ళి పాతవన్నీ చదువుకుంటూ అవి రాసినప్పటి మనఃపరిస్థితిని గుర్తు చేసుకుంటుంటే తెలిసింది వాటిలో ఎక్కువభాగం జ్ఞాపకాలకీ, పొందిన అనుభవాలకీ, చూసిన సంఘటనలకీ మనసు ఉన్నట్టుండి మరల స్పందించడంవల్ల రాసినవే కానీ రాయాలన్న తపనతో శ్రమించి రాసినవి కావని!!
మొన్నొకరోజు "ఫ్రీక్వెంట్ గా రాయడానికికి నాకు కుదరడం లేదండీ!" అని నా మీద నేనే జాలిపడిపోతూ ఒక సన్నిహితుని దగ్గర వాపోతే ఆయన "గంగిగోవు పాలు సామెత గుర్తు తెచ్చుకోండి" అన్నారు... "ఏంటో ఆయన అభిమానం!" అనుకుంటూ నాపని నేను చేసుకోబోతుండగా ఒక్కసారిగా ఆయనలానే అభిమానంగా నా రాతల్ని పలుకరించే పాఠకులందరూ గుర్తొచ్చారు!
నేను రెండు నెల్లకో, నాలుగు నెల్లకో నా సమయమూ, మూడ్, స్పందన ఇత్యాది గ్రహాల కలయికకి అణుగుణంగా ఒక పదిలైన్లు రాసి 'ఇదుగోండహో' అని అందించగానే ఎంతో అభిమానంగా స్పందించే పాఠకులందరికీ అంటే మీ అందరికీ నేనెంతో ఋణపడిఉన్నాను.. నాకు పదివేలు, నాకు ఏభై అని మళ్ళీ మీరందరూ రెడీ అయిపోతారేమో అందుకే ముందే చెప్తున్నాను, "ఈ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనిది!" నిజ్జంగా!!
ఉద్యోగినిగా, గృహిణిగా ఏదో నాపని నేను చేసుకుంటూ గుంపులో కొట్టుకుపోతున్న నన్ను మీ అభిమానపూర్వక స్పందనలు ప్రత్యేకంగా నిలబెట్టాయి.. నాకెంతో ఇష్టమైన పుస్తక/రచనా ప్రపంచంలో నేనూ ఓ భాగమవ్వగలననే ఆత్మవిశ్వాసం కలిగించారు!! పాఠకులు అభిమానులయ్యారు.. అభిమానులు ఆప్తమిత్రులుగా మారితే.. ఆప్తమిత్రులు సన్నిహితులై కుటుంబ సభ్యుల్లా ఒదిగిపోయారు!! ఇలా కుటుంబంలో భాగంలా మారిపోయిన కొందరి గురించి ఇంకోసారి తప్పక రాస్తాను కానీ అసలు ఈ టపా ముఖ్యోద్దేశ్యం, నిషిగంధగా నాకో అస్థిత్వాన్నిచ్చిన మీ అందరినీ పేరుపేరునా తలచుకుని కృతజ్ఞతలు చెప్పడం!
అదే నే చెప్పాలనుకున్న చిన్నమాట...... Thank you! Thank you all very much!!
ఇక నేనెవరెవర్ని తల్చుకున్నాను అనేది చూడాలంటే కాఫీ/టీ లేదా మీకిష్టమైన పానీయం తెచ్చుకుని ఈ ఇమేజెస్ క్లిక్కండి :-)
నా జ్ఞాపకశక్తి మీద నాకున్న ప్రగాఢ నమ్మకంతో చెప్తున్నాను, తప్పకుండా కొన్నిపేర్లు మర్చిపోయి ఉంటాను.. వారికి నా ముందస్తు క్షమాపణలు... కానీ అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది అస్సలు కాదనీ, ఈమధ్య వదలకుండా నా కొంగుపట్టుకు తిరుగుతున్న మతిమరుపు కారణంగా అని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి మరీ చెప్తున్నాను..
అలా మర్చిపోయినవారందరికీ మా పండు గాడితో నా స్పెషల్ థాంక్స్ పంపుతున్నాను..
అందరినీ ఒకసారి తలుచుకుని కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఈ Thanksgiving టపా రాయడం వెనుక వేరే కారణమేమీ లేదని నొక్కి వక్కాణిస్తూ.. సెలవు...
:-)