Pages

Monday, December 17, 2007

కౌముది

చుక్కల నవ్వుల్ని తోడిచ్చి
జాబిలి దోసిలి నించి
జారవిడిచింది..
హిమసమీరాన్ని వెంటేసుకుని
విహారం మొదలుపెట్టాను..

మల్లెపందిరిని తడిమిన చేత్తోనే
ముళ్ళచెట్టునీ పలుకరిస్తే..

ఆమె ఆనందంగా నవ్వింది..
అతడామెను మురిపెంగా చూశాడు..

వాళ్ళిద్దరి మధ్యా
ఇక చోటు దొరక్క
ఏటి వైపుకి మళ్ళి
అలలపై రవ్వల్నిఆరబోస్తుంటే..

నిశీధి మలుపులో
చేతులు చాచి
ఆహ్వానిస్తున్న వేకువ!

సరిహద్దుల్ని దాటేస్తూ
ఆలింగనంలోకి చేరుకుంటుంటే
అప్పుడే నిద్ర లేచిన పావురమొకటి
వీడ్కోలు పలికింది..

(తొలి ప్రచురణ)

ఇంకా చాలా నేర్చుకోవాలి!


... నేను వెంటనే పరిగెత్తుకెళ్ళి వాడిని గట్టిగా గిచ్చి వచ్చాను.. మేము కొట్టుకున్నప్పుడల్లా వాడు పిడికిలి బిగించి గుద్దుతాడు.. భలే నెప్పి వేస్తుంది అసలు.. అంత బక్కగా ఉంటాడా, కొట్టేప్పుడు అసలు అంత బలం ఎక్కడినించి వస్తుందో మరి!! నేను కూడా అలానే కొడితే వాడికస్సలు తగలదనుకుంటా, నవ్వుతానే ఉంటాడు! అందుకే నేనైతే గట్టిగా గిల్లడమో, కొరకడమో చేస్తాను! వాడు గుద్దిన దెబ్బలు కనిపించవు కానీ నేను గిల్లినవి, కొరికినవి కనబడతాయి కదా.. అంతే, పెద్దగా ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరకో, నాన్న దగ్గరకో వెళ్తాత్డు.. ఇంక ఇద్దరూ నన్నే తిడతారు!!...


చిన్నారి సిరి - ఇంకా చాలా నేర్చుకోవాలి

Monday, November 12, 2007

నిన్నటి స్వప్నం


'ఇంత సుగంధం నీకెలా అబ్బింది?'

మునిమాపు వేళ మెచ్చుకోలు
నడుము చుట్టూ నీ చెయ్యి
మనసు దాయలేక
విచ్చుకున్న పెదాలు..

అలాంటి రాత్రే.. ఇంకాస్త సుగంధం..

తల కూడా తిప్పని నిర్లిప్తత
మెత్తగా చేస్తున్న గాయం
గుండె పట్టక
నిండుతున్న కళ్ళు..

ఆకాశమంత ఆనందం..
సముద్రమంత విషాదం..
సాంగత్యం మాత్రం నీదే!

దేని బరువెక్కువో
తలదించుకుని తప్పుకుంటున్న
ఈ ఘడియలకేమైనా తెలుసా!?


(తొలి ప్రచురణ)

English Translation by NS Murty gaaru

ఆశాకిరణం


ఎదురుచూపులు
వసంతం కోసమైతే
పరిహాసంగా
పలుకరిస్తూ గ్రీష్మం..

అప్రియమైన అతిధుల్లా
చీకటి పరదాలు దించేస్తూ
ఓటమి వెనుక విషాదం

జ్ఞాపకాల గాలితెరలు
కళ్ళ నిండుగా కురుస్తూ..

కొండచాటున
తొంగిచూస్తున్ననక్షత్రం
తడిరాత్రి వేళ
నువ్విస్తున్న భరోసా!


(తొలి ప్రచురణ)

Monday, November 5, 2007

ఏది పెద్ద తప్పు?


...నాకది నచ్చలేదు. క్రాంతి కూడా మా ఫ్రెండ్ కదా. ఆందుకే టీచర్ క్లాస్ లోకి వచ్చి మమ్మల్ని బుక్స్ తీయమని చెప్తుంటే నేను క్రాంతికి అరటిపువ్వు గురించి చెప్పేశా.

"అవును, మీరు చేసుకుంటారా దానితో కూర?" అనడిగితే తను మాత్రం "అమ్మో! అయితే మీరు దొంగతనం చేశారన్నమాట!" అని కళ్ళు ఇంత పెద్దవి చేసి నావంక చూసింది. క్రాంతి కళ్ళు అలా పెద్దవి చేస్తే నాకు చాలా భయం. సినిమాల్లో చూపించే అమ్మవారి కళ్ళు గుర్తొస్తాయి. ఇప్పుడు తను అన్నది వింటే ఇంకా భయం వేసింది!

"దొంగతనం ఏంటి!? అక్కడుంటే కోసుకొచ్చాం.. అంతే!" అని నేనంటే క్రాంతి వెంటనే "కానీ అది వేరే వాళ్ళ ఇంట్లోది కదా.. వాళ్ళని అడగకుండా కోసుకుంటే మరి అది దొంగతనమే కదా" అనడిగింది....

చిన్నారి సిరి - ఏది పెద్ద తప్పు?

అమ్మ ఒక బొమ్మ.. నాన్న ఒక బొమ్మ

..... ఎవరా అని చూస్తే అమ్మా నాన్నే! వాళ్ళే ఎందుకో గట్టిగా మాట్లాడుకుంటున్నారు.. నాన్న ఎప్పుడు అంత గట్టిగా మాట్లాడటం మేము వినలేదు.. "నీ మాట నీదే కానీ నేను చెప్పేది కాస్త కూడా పట్టించుకోవుగా!" అంటూ అమ్మని అంటుంటే, అమ్మ ఇంకా గట్టిగా "అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా.. నా మాట గురించి 1లోచించొచ్చు కదా!" అని అంది..

"ఇప్పటి వరకూ విన్నవి చాలుగానీ ఇంక మాట్లాడకు" అని ఇంకాస్త గట్తిగా అన్నారు.. నాకైతే చాలా భయం వేసింది.. నెమ్మదిగా వెళ్ళి బట్టలు మార్చుకుంటుంటే నానీ "సినిమాకి ఎన్నింటికి వెళ్దాం నాన్నా?" అని అడగటం వినిపించింది.. అంతే నాన్న కోపంగా "సినిమా లేదు గినిమా లేదు.. పోయి స్నానం చేసి పుస్తకాలు తియ్యండి ఇద్దరూ" అని గట్టిగా అరిచారు..

చిన్నారి సిరి - అమ్మ ఒక బొమ్మ.. నాన్న ఒక బొమ్మ

ఇంటా.. బయటా


.....నాకర్ధం కాలేదు! లోపల భోజనాల గదిలో కాకుండా ఇలా గేట్ ఎదురుగా వరండాలోనే పెట్టేస్తుందేమిటి అన్నం!! తాత అన్నం తినేసి నిమ్మచెట్టు మొదట్లో చేతులు కడుక్కుంటుంటే నేను తను తిన్న విస్తరాకు తీయడానికి వంగాను.. వెంటనే అమ్మమ్మ "సిరీ, లోపల మీ అమ్మఏదో అంటుంది చూడు" అని గట్టిగా అరిచినట్లు చెప్పింది..

నేను లొపలికెళ్ళగానే నా వెనకే వచ్చింది.. "నీకేం పని లేదా.. పోయి పోయి ఎంగిలి విస్తరాకు తీస్తున్నావ్" అని నెత్తి మీద మొడుతూ కోపంగా అడుగుతుంటే "అదేంటి అమ్మమ్మా, ఎప్పుడూ తాతయ్య విస్తరాకు తీయమని, అలా తీస్తే మంచిదని అంటావుగా!" నాకేమీ అర్ధం కాక అడిగాను.. "నీకు రాములు, మీ తాతయ్య ఓకరేనే!" ఇంకాస్త గట్టిగా అంటుంటే పక్కనించి అమ్మ "దానికి తెలీక చేసిందిలే అమ్మా.. ఇంక మేమెళ్తాము.. కాసేపు కునుకు తీస్తేగానీ ఆదివారం అనిపించదు" అంటూ నా చేయి పట్టుకుని అక్కడనించి లాక్కొచ్చేసింది..

చిన్నారి సిరి - ఇంటా బయటా

Friday, November 2, 2007

ఒంటరి రహస్యం

నేలకూ నింగికీ మధ్య
కడుతూ ఆపేసిన
ప్రాచీన వారధిలా..

కనుచూపుమేరలో గంభీరంగా!

ఏ ఝామున జాబిల్లితో
దోబూచులాటలో!
శిఖరాన సేద తీర్చుకుంటున్న
మబ్బు తునకలు..

మెలమెల్లగా అలుముకుంటున్న
పచ్చదనం ..

ఏ వింత అనుభవాన్ని
పంచుకుంటున్నాయో!
మూకుమ్మడిగా గువ్వల కిలకిలలు..

అలుపెరుగకుండా
పాదాలతో ఆడుకుంటున్నసెలయేరు..

ఆసాంతం చైతన్య ఝరి..
తను మాత్రం నిశ్చలంగా!
విశ్వరహస్యాలను భద్రపరుస్తూ!!

(తొలి ప్రచురణ)

బంగారుతల్లి


వొడిలో నా ప్రపంచం
ఆదమరిచి నిద్రపోతోంది..

తన గుప్పెట్లో
బిగుసుకున్న నా వేలు..
ఆలంబన అవసరం నాదేనన్నట్లు!!

నా పసితనపు
ఘడియల్ని మళ్ళీ చూపిస్తున్న
బుల్లిపాదాలు..
స్పృశించకుండా ఉండటంనా తరమేనా!?

ఏమనిపించిందో
నిద్రలో నిండుగా నవ్వింది..
గదిలో తెల్ల గులాబీలు విరబూసాయి!!

(తొలి ప్రచురణ)

Thursday, November 1, 2007

క్రికెట్ వీరుడు


...ఇక ఆరోజంతా ఎవరెవరు ఎలా ఆడారో.. రోడ్డు మీదకి పరిగెత్తి మరీ కాచ్ లు ఎలా పట్టుకున్నారో.. లాంటి విషయాలన్నీ చెప్తూనే ఉన్నాడు.. "గ్రౌండ్స్ లో అంత స్తలం ఉంటే రోడ్డు మీదకి వెళ్ళడం ఎందుకు" అని అడిగాను.. "మేమే కాదక్కా ఇంకా అక్కడ చాలా మంది ఆడతారు" అన్నాడు..

ఇంక ఇంట్లో, స్కూల్లో వీడి క్రికెట్ గురించి వినడం చూడడం సరిపోయింది.. బబుల్ గం తో పాటు వచ్చే క్రికెట్ ప్లేయర్ షీట్స్ దాయడం.. బాట్ మీద క్రికెట్ బొమ్మలు అతికించడం.. ఏ పుస్తకం లో అయినా క్రికెట్ బొమ్మలు కనబడితే కట్ చేసి ఒక పుస్తకం లో అతికించడం.. ఇంతే కాక ఈ మధ్య స్కూల్లో లంచ్ టైం లో అన్నం గబగబా తినేసి ఆడటం మొదలుపెట్టారు.. అప్పుడు తెలిసింది శ్రీధర్, నానీ ఏ కాకుండా ఇంకా చాలా మంది కూడా సండే గ్రౌండ్ కెళ్ళి ఆడతారని!....

చిన్నారి సిరి - క్రికెట్ వీరుడు

అడిగి తెలుసుకో


.... అసెంబ్లీ లో ప్రేయర్ అయిన తర్వాత మా హెడ్ మిస్ మైక్ లో నా పేరు చెప్పగానే నేను లేచి వెళ్ళాను.. మా రమ టీచర్ కూడా వచ్చి నా పక్కనే నిలబడ్డారు.. నేను చిన్నగా ఉన్నానని మైక్ ని కిందకి వంచేసారు.. టిచర్ పక్కనించి "ఒకసారి 'నమస్తే' అని చూడు సరిగ్గా పలుకుతుందో లేదో" అనగానే నేను ఒక్కసారే "నానీగా" అని అరిచినట్లు "నమస్తే" అన్నాను... అంతే మైక్ లోంచి ఎంత పెద్దగా వినిపించిందో! ఇంకా కుయ్య్ య్య్ మని శబ్దం కూడా వచ్చింది.. వెంటనే టీచర్ "ష్ ష్ ష్ అంత పెద్దగా కాదు.. నాతో ఏదన్నా చెప్తుంటే ఎలా మాట్లాడతావో అలా నెమ్మదిగా మాట్లాడు" అన్నారు.. అంతలో పిల్లల్లోంచి ఎవరో కొంతమంది నవ్వినట్లు కూడా అనిపించింది.. 'ఎవరా!?' అని ముందుకి చూసాను....

చిన్నారి సిరి - అడిగి తెలుసుకో


చిన్నత్త వాళ్ళ ఊరు


....పెదబాబు, చినబాబు మాకు రోజూ చాలా చాలా చూపించేవాళ్ళు.. పంటకాలువ, వేణుగోపాలస్వామి గుడి, గుడి పక్కన చెరువు, సంత, చిన్న మామయ్య వాళ్ళ పొలాలు, రాంబాబు వాళ్ళ రైస్ మిల్లు.. నాకన్నీ బాగా నచ్చాయి.. పొద్దున్నే గుడికి వెళ్ళి పంతులు గారు పెట్టిన కొబ్బరిముక్క ప్రసాదం తిని, వెనక్కి వెళ్ళి చెరువు గట్టు మీద కాళ్ళు ఆడించుకుంటూ కూర్చుంటాం.. అక్కడికి చాలా మంది వస్తారు.. నన్నూ, నానీ ని చూసి "ఎవరి పిల్లలు?" అని అడిగేవాళ్ళు.. వాళ్ళిద్దరూ "రాజేంద్ర మామయ్య పిల్లలు" అని చెప్పే వాళ్ళు.....


చిన్నారి సిరి - చిన్నత్త వాళ్ళ ఊరు

Wednesday, October 31, 2007

ఏకాంత యామిని


నీ తాలూకు జ్ణ్జాపకాల మూటను
కొండవతలకి విసిరేయబోయాను..

చుట్టూ ఆవరించిన
హిమసమీరం ఒకటి
అల్లరిగా నవ్వబోతూ..

కనుకొనల్లో ఏం కనిపించిందో
తలదించుకుని దారి మళ్ళింది..

ఏం లాభం !?
ముడి విడిపడి అన్నీ జారిపడ్డాయి!!

పర్వాలేదు...

మళ్ళీ ఒక్కొక్కటిగా
ఏరుకుంటూ పోగుచేయడమే నాకిష్టం!!


(తొలి ప్రచురణ)

ఆనతి నీయరా


ఏ దిగంతాల అవతల
నీ అడుగుల సడి వినబడిందో
పువ్వు నించి పువ్వుకి
ఆనందం వ్యాపిస్తోంది..

పూజాద్రవ్యాలు.. పారిజాతాలు
అవ్యాజమైన అనురాగంతో
సిద్ధంగానే ఉన్నాయి
నీ సేవకోసం..

నువ్వు పీఠం అధిష్టించక ముందే
జీవితం మొదటికంటా వెళ్ళి
కేవలం నీకోసమే
మళ్ళీ బ్రతికి రావాలనుంది...

(తొలి ప్రచురణ)

Tuesday, October 30, 2007

కిడ్డీ బాంక్

.... క్రాంతి చెప్పింది, కావాలంటే బొమ్మకి బుజ్జి బుజ్జి బట్టలు కుట్టించి వేసుకోవచ్చని.. ఇంకేమి! పక్క సందులో మా బట్టలు కుట్టే టైలర్ రమేష్ అంకుల్ దగ్గరికి వెళ్ళి, కత్తించిన ముక్కల్లో మంచి మంచివి నేను తీసుకుంటానని చెప్పాను.. అక్కడ నించి తిరిగి వస్తుంటే నానీ అడిగాడు, "అక్కా, నీ బొమ్మకి పేరేమి పెడతావు?" అని..

అవును కదా, చక్కగా నా బొమ్మని పేరు పెట్టి పిలుచుకోవచ్చు! "నువ్వేమన్నా పేర్లు చెప్పు నానీ" అని అడిగానో లేదో వాడు గబగబా "చిట్టి, పింకీ, హనీ, చిన్ని" అంటూ ఏవేవో పేర్లు మొదలుపెట్టాడు.. నాకైతే ఒక్కటి కూడా నచ్చలేదు.. 'అయినా వీడికి ఇంతమంది అమ్మాయిల పేర్లు ఎలా తెల్సో!?'......

చిన్నారి సిరి - కిడ్డీ బాంక్

పెద్దత్త-పద్మత్త


.....అమ్మ అయితే మామయ్య పక్కనే కూర్చుని వాళ్ళ చిన్నప్పటి కబుర్లు, చుట్టాల కబుర్లు, తన స్కూల్ కబుర్లు ఇంకా ఏంటేంటో మాట్లాడుతూనే ఉంది.. మధ్యలో మాత్రం "వదినా ఇంకో కప్ కాఫీ ఇవ్వవా.. ఇవాళ సాయంత్రానికి వంకాయ బజ్జీ చేయవా.. సినిమాకి వెళ్దామా" అంటూ పద్మత్త ని గట్టిగా ఏదో ఒకటి అడుతుండేది.. వచ్చేసేటప్పుడు మాత్రం మామయ్యని పట్టుకుని "వెళ్లొస్తానూ" అని అంటుంటే చూశాను, బుగ్గల మీద నీళ్ళు... అమ్మ ఏడుస్తుంటే నాకు, నానీకి కూడా బాగా దిగులేసి తననే గట్టిగా పట్టుకున్నాము..

చిన్నారి సిరి - పెద్దత్త-పద్మత్త

ఉప్పెనగాలి


"నాన్నా, వాళ్ళు నీలా, అమ్మలా ఉద్యోగం ఎందుకు చేయరు?" అంటున్న నా వంక చూసి అమ్మ చిన్నగా నవ్వుతూ "వాళ్ళకి ఉద్యోగాలు ఎవరిస్తారే!" అంది..

"ఏం? ఎందుకివ్వరు?" నాకేమీ అర్ధం కాలా.. "వాళ్ళకేమి చదువు ఉందని ఉద్యోగాలు ఇస్తారు!?" అంటున్న అమ్మని ఆపుతూ నాన్న "సిరి తల్లీ, ఉద్యోగం రావాలంటే చదువుకోవాలి.. డిగ్రీ తెచ్చుకోవాలి" అంటుంటే "మరిప్పుడు చదువుకుని డిగ్రీ తెచ్చుకోవచ్చుగా?" .......

చిన్నారి సిరి - ఉప్పెనగాలి

Monday, October 29, 2007

మనిద్దరం

ఇంత మార్పు ఎప్పుడు వచ్చిందంటావ్!?

నా అలకలు.. నీ బుజ్జగింపులు
నీ అల్లర్లు.. నా మందలింపులు
వెన్నెల్లో గోరుముద్దలు.. దిండు పక్కన సంపెంగలు
ఒకరి చుట్టూ ఒకరం ..

ఇదే కదా నేనెరిగిన
మన ప్రపంచం!!

మరి ఇప్పుడు..

నీ చివాట్లు.. నా సంజాయిషీలు
నా కోపాలు.. నీ నిరాసక్తతలు
అది నీ పని.. ఇది నాకే తెల్సు
ఒకరి పక్కన ఒకరం ..

రైలుపట్టాల్లా
సమాంతరంగా ఎపుడయ్యామో
నీకైనా గుర్తుందా!?

నాకేం బాధేయటం లేదు.. చిత్రంగా!
ప్రతి మలుపులో నాపక్కనే నువ్వు..
మజిలీలన్నీ ఒక్కొక్కటిగా దాటుకుంటూ!!


(తొలి ప్రచురణ)

వాన వెలసిన వేకువ

నాకు సంబంధించిన సూర్యుడు
ఇంకెక్కడోఉదయిస్తూ..

బయట చీకట్లో
అనుకోని అతిధుల ఆల్లరి..
నిద్ర పట్టని నా మనసులానే
సతమతమవుతున్న సెలయేరు!

చెంపను తాకిన
తొలి కిరణ స్పర్శతో
కళ్ళెదురుగా
నిజమౌతున్న స్వప్నాలు..

అభిషేకం నచ్చినట్లుంది..
సంతృప్తిగా
రంగులు మార్చుకుంటున్న చెట్టు..
పూలపొద నించి
బయటపడ్డ గువ్వని ఆహ్వానిస్తూ..

కాస్త ఆలస్యమైందేమో
చుక్కల్నివెలుగు దుప్పటి కింద
దాచేయడానికి హడావిడి పడుతున్న
బాలభానుడు..

ఇక్కడా సూర్యోదయం అవుతుంది..
అచ్చు నాక్కావాల్సినట్లే!!

(తొలి ప్రచురణ)

Saturday, October 27, 2007

బొజ్జ గణపయ్య


"ఫస్ట్ పీరియడ్ లోనే పోటీలని చెప్పి బొమ్మలు వేసేవాళ్ళందరినీ దూరం దూరంగా కూర్చోబెట్టి వేయించేశారు. క్లాసు కొచ్చేసాక క్రాంతి చెప్పింది తను మొక్కలు, పక్షులు, ఆడుకుంటున్న పిల్లలు, గడ్డి మేస్తున్న ఆవులు, ఇంకా పైన సూర్యుడిని వేశానని. పైగా సూర్యుడిని కాస్త నవ్వుతున్నట్లు గీశానని కూడా అంది.. 'ఓ అంతేనా' అనుకున్నా. అయినా సూర్యుడు నవ్వడమేంటి అనిపించింది! అప్పుడింకా అనిపించింది నాకు తప్పకుండా ప్రైజ్ వస్తుందని..."

చిన్నారి సిరి - బొజ్జ గణపయ్య

Thursday, October 18, 2007

ఉయ్యాల


పట్టు పరికిణీ అంచులకి
చుట్టుకున్న మట్టి గీత..
నన్ను మళ్ళీ నీ వైపుకి లాగుతూ..

నీ సమక్షంలోనే కదా
నాన్న నాకు
ప్రపంచాన్ని పరిచయం చేసింది!

నా అలకలు తీర్చడానికి
నువ్వు తప్ప అమ్మకి
ఇంకో మార్గమెందుకు తోచలేదో!

నీలో కించిత్ గర్వం !!

నేస్తాల దగ్గర తప్పు లెక్కలు
నీతో ఇంకాసేపు గడపాలని...
ఎన్నెన్ని మందలింపులనీ!

'వోణీల వయసొచ్చినా
పిల్లలతో వంతులా!'
పక్కింటబ్బాయి అల్లరికి
నీ ముసి ముసి నవ్వులు..

మోచేతి మీద పాత గాయం
నీ ఉలికిపాటుని గుర్తు చేస్తూ..

అయితేనేం ..

జారిపడ్డ జాజుల దండకి
దుమ్ము అంటనీయలేదుగా!!

(తొలి ప్రచురణ)

తొలి స్పర్శ


చుట్టూ అర్ధం కాని సందడి
ఇవాళ నువ్వొస్తున్నావంట కదా!

మల్లెలా? కనకాంబరాలా??
నిర్ణయాలు తీసుకోవడంకష్టమే సుమా!

ఎక్కడా నిలువని
నా చూపులు
అస్థిరత్వానికి నిర్వచనంలా..

నిన్ను చూస్తూనే
గడపని దాచేసిన చమత్కారం
చీర కుచ్చిళ్ళదా!?

నేల మీదుండాల్సిన
నేను నీ చేతుల్లో..
నీ తాలూకు పరిమళంనా ఊపిరిలో..
నింగి వంగి నుదుటిపై ముద్దు పెట్టినట్లు!!


(తొలి ప్రచురణ)

Tuesday, October 16, 2007

నగల పెట్టె

ఎన్నేళ్ళ అపురూప సేకరణో
పెట్టె నిండి పోతోంది!

అనుభూతుల హారాలు
భావాల బంగారు గాజులు
ఆలోచనల లోలాకులు
ఊహల వడ్రాణం
అక్కడక్కడా
కలల రవ్వలద్ది...అచ్చంగా నీ కోసమే!

అన్నీ ధరించి
ఆకస్మిక వైభవాన్ని
నీకు పరిచయం చేస్తే..
ఏదీ నాక్కావాల్సిన ఆమోదం ??

తిరిగి అవన్నీ
పెట్టెలోకి యధాతధంగా..
నన్ను నేను బందీ చేసుకున్నట్టు..

తాళాన్నిజీవనారణ్యంలోకి విసిరేసి
విజయగర్వంతో
నన్ను చూసిన నీ కళ్ళలో విస్మయం..

అస్తిత్వానికి ప్రతీకగా
ఇంకా నా ముక్కున
మెరుస్తున్న ముక్కుపుడక!!

(తొలి ప్రచురణ)

నానీగాడు


ఒక్కదాన్నే
ఆడుకోవటం చూసిందేమో
వెంటనే నిన్ను
తెచ్చేసింది అమ్మ!

రోడ్డు దాటేటప్పుడు
అప్రయత్నంగా నా చేతిలో
బిగుసుకున్న నీ చేయి..

మంచు దుప్పటిలో
తోడుగా వుండి
నువ్వేయించిన
సంక్రాంతి ముగ్గులు..

వాన నీటిలో మనం
విడిచిన కాగితపు పడవల్లా
ఇంకా కళ్ళ ముందే
గింగిరాలు తిరుగుతున్నాయి!

కలిసి ఎదుగుతూ
నేర్చుకున్న విషయాలు ఎన్నో!
ముఖ్యంగా..
మనసుతో ఆలోచించడం!
స్వప్నాల్ని గెల్చుకోవడం!!

పెళ్ళి మండపంలో
వీడ్కోలు పలికేప్పుడు
నీ కళ్ళలో ఉన్న చెమ్మ
నా కళ్ళలోనూ చేరింది..
జీవితంలో నువ్వింకో
మెట్టు ఎక్కుతున్నావనితెల్సినప్పుడు!

అంతలోనే
చిన్నగా మొట్టి
చెప్పాలనిపిస్తుంది..
ఎన్ని మెట్లెక్కినా
నాకంటే నువ్వెప్పుడూ
చిన్నవాడివేనని!!


(తొలి ప్రచురణ)

Friday, October 12, 2007

చంద్రోదయం


నువ్వు రాలేదెందుకని?

పక్షం రోజుల ఎదురుచూపులు
వెనుదిరిగి ప్రశ్నిస్తుంటే
అమ్మ వడే శరణ్యమైంది..

డాబా మీద
నీతో కబుర్లు చెబుతూ
పెట్టుకోవాలనుకున్నగోరింటాకు
చిన్నబుచ్చుకుని
ముఖం నల్లబర్చుకుంది...

అలల్ని తోసుకుని
కడలి లోతుల్న
స్పృశించే నీ చూపులకి
మబ్బుల పరదాలు
ఇనప గోడలయ్యాయా!!

తలపై మెత్తని స్పర్శ..
కళ్ళెత్తి చూస్తే
అమ్మ నవ్వుతోంది
నిశ్శబ్దంగా.. ఆత్మీయంగా..
అంతా అర్ధమైనట్లుగా!

వెండి కిరణమొకటి
కొబ్బరాకుల సందులోంచి
దూసుకెళ్లింది..
చంద్రోదయమయింది అనడానికి సూచనగా!!


(తొలి ప్రచురణ)

నందివర్ధనాలు


తెలిమంచులో
పవిత్రస్నానాలు చేసేసి
ఇంట్లోకి ఆత్రంగా
చూస్తున్నాయి..
పూజకి వేళైంది కాబోలు!

రంగవల్లిని
కుశలప్రశ్నలు అడుగుతూనే
చిరుగాలితో సమాలోచనలు..
ఆ వర్ణాల్ని తమకికాస్త అద్దమని!

కిరణాలతో
ఎడతెగని ఊసులనుకుంటా..
అలసటతో తలలు వంచి
ఆఖరి మజిలీకిసిద్ధమౌతున్నాయి!


(తొలి ప్రచురణ)

Friday, October 5, 2007

ఏకాంతవేళ


నువ్వటు వెళ్ళగానే
నీ ఆలోచనలన్నీ
నా ముందు కుప్పగా..
అప్పుడే విచ్చుకుంటున్న
మల్లెమొగ్గల్లా..

నువ్వొచ్చేలోగా
ఒక్కొక్కటిగా విడదీసి..
మాల కట్టాలని
మనసు చేసే
విశ్వప్రయత్నం..

నా జాడనే మరచిన
ఏకాగ్రతలో
చిన్న తొట్రుపాటు..
ఎగిరే నా ముంగురుల్ని
తడుముతున్న నీ
చిరునవ్వు..


(తొలి ప్రచురణ)

ఊహాసుందరి


కిలకిలమంటూ సందడి చేస్తున్న
గువ్వల్ని గూటికి పంపాలని
హడావిడిగా ఇంటికి బయలుదేరుతున్న
భానునికి గుడ్ నైట్ చెప్తూ
యధాలాపంగా ఇటు తిరిగి చూసానా!

కలల చివుళ్ళ ముంగురుల మీద నర్తించి
కనుబొమ్మల్లో కాసేపు చిక్కుకుని
కళ్ళల్లో మిస్టీరియస్గా మాయమైపోయినట్లుండే
మధుర స్వప్న శాఖ లాంటి ఆమె!
నా ఊహాసుందరి నా ఎదురుగా!!

ఏదో అద్భుతాన్ని చూసినట్లు ఆశ్చర్యంతో
బిగిసిపోయిన నాకు
కలా.. నిజమా అన్న భావం..
వెన్నెల రేఖలాంటి ఆమె చిన్న చూపుకే
నా హౄదయంలో పారిజాత దడి కదలికలు..

'నీ కోసమే ఒచ్చాను ' అని గొంతు తగ్గించి..
పెదవులు బిగించి.. చిలిపిగా నవ్వుతూ..
మరో అడుగు ముందుకు వేసి
మరింత చేరువగా వచ్చింది...

ఆమెనే చూస్తూ తన వెంట్రుకల్లో
దాగిన చీకటి నిశ్శబ్దంలో ఒదిగిపోవాలనుంది..
కానీ..అమ్మా నాన్నల కలల్ని నిజం చేయమని
పుస్తకాలు పిలుస్తున్నాయి..

నాలో మేల్కొన్న వివేకాన్నిఉక్రోషంగా చూస్తూ
అప్పటికి నన్ను విడిచి వెళ్ళిపోయింది
నా ఊహాసుందరి, నిద్రాదేవి!!!


(ఈ కవిత నేను ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నపుడు రాసింది.. తెల్లవారుఝామునే లేచి ట్యూషన్లకి, కాలేజీకి, అదవ్వగానే మళ్ళీ సాయంత్రం ట్యూషన్లకి ఊపిరి సలపకుండా పరిగెత్తటంతో ఇంటికొచ్చి పుస్తకాలు ముందేసుకోగానే తెగ నిద్రొచ్చేది :-) )

(తొలి ప్రచురణ)

Tuesday, July 17, 2007

నిరీక్షణ


జ్ఞ్జాపకాల రాపిడికి
తృణపత్రంలా శుష్కిస్తూ
అనిమేషనై నేను..
చీకటి దుప్పటిలో
అసహనంగా కదులుతున్న రాత్రి..
ప్రేమ అనేది ఉత్త నీహారిక కాదు కదా!?

కోనేట్లో స్నానమాడిన పిల్లగాలి
గుడిమెట్లు ఎక్కివచ్చి
కుతూహులం గా చూస్తుంటే
ఇంకా ప్రభుదర్శనం కాలేదని
ఎలా చెప్పను!?

జారే భాష్పబిందువును
కొనగోట ఆపడానికో
చిటికనవేలు..
పొరలే దుఃఖానికి
చెలియలికట్టలా
ఓదార్చే ఓ స్పర్శా..
నన్ను చేరేదెప్పుడో!?

కంటి చివర
హిమాలయం కరుగుతున్నవేళ
ప్రాణసఖుని జ్ఞ్జాపకం నాలో...
పైకిమాత్రం
పెదవి నించి చిరునవ్వు
రేపొచ్చే ఉదయం మీద కొత్త ఆశతో...


(తొలి ప్రచురణ)

Monday, July 16, 2007

నీవు లేని క్షణాన...


ఇదిగో.. ఇప్పుడే..
నువ్వటు వెళ్ళావో లేదో..
మనస్సంతా ఏదో చెప్పలేని వెలితి
అంతా శూన్యం.. భరించలేని శూన్యం

ఇప్పటివరకూ నువ్వెదురుగానే వున్నావుగా!
అయినా చూడు ఇంతలోనే…
నరాల్లో ప్రవహించే రక్తంలా..
మనసు అట్టడుగు పొరల్లోకి
నువ్వసలుఇంతలా ఒదిగొదిగి పోయావని..
ప్చ్ ! ఈ క్షణం వరకు తెలీనే తెలీదు!!

నువ్వెదురుగా వున్నపుడు
ఊరికూరికే నీ మీద కోపం..
ఆపైన కొంచెం విసుగు..
మరి కాస్త దబాయింపు కదూ!!
ఓహ్ ! తలచుకుంటేనే మనసుని
మెలిపెట్టినట్లు బాధ..
నీ సాహచర్యాన్ని.. క్షణ క్షణం గుండెల నిండా
అనుభవించలేదేమోనన్న బాధ...

అయినా నీ మాట.. నీ చూపు..నీ స్పర్శ కోసం
మనసెందుకిలా కొట్టుకుపోతోంది!
మరోక్షణం కూడా ఉండలేనంటోంది!?!?


(తొలి ప్రచురణ)

స్నేహ మాధురి


సాయంత్రాన్ని సముద్రంలో రంగరించి
వెన్నెల పర్వతం మీద నుండి గంధాన్ని మోసుకొస్తూ..
ఆహ్లాదమైన పిల్లగాలి అమాయకంగా అడిగింది..
ఎందుకు నేస్తం నీకింత సంతోషం అని!?

వెండికిరణం పెదవి అంచున చెదరినట్టు..
కొండచివరన సంధ్య నీడ పాకినట్టు
ఒక అమృత హృదయంతో స్నేహం దొరికినప్పుడు...

అక్షరాల బరువుతో అలసిన పుస్తకానికి
అరక్షణం విశ్రాంతినిచ్చి..
కళ్ళు వొళ్ళు విరుచుకునే సమయాన--
ఎండుటాకుల వెనుక చిరుగాలి కదలికలా
ఒక జ్ణ్జాపకం...
నిలువెల్లా పాకి వ్యాపిస్తుంటే..
సంతోషం కాక మరేమిటమ్మా అన్నాను...

వెన్నెల విస్తుపోయింది..
కన్నెలా సిగ్గుపడి నన్నిలా వదిలి వెళ్ళిపోయింది...
చీకటి కూడా అలసి నిద్రపోయాక
రాస్తున్న ఈ కవిత్వం..
నా ఒంటరితనాన్ని ఓదార్చే నీ స్నేహం...

(తొలి ప్రచురణ)