Pages

Sunday, November 22, 2009

అదే వాన...


జోరుగా మొదలైన వాన
ఆగకుండా..నిలకడగా పడుతూనే ఉంది..
మన పరిచయంలానే!

రోడ్డు చివరి ఒంటరి పాకలో
తగిలీ తగలకుండా...

హడావిడి పడుతున్న చీకటిలో
నింపాదిగా తడుస్తున్న కొండని చూస్తూ..

ఒకరికొకరమని తెలుస్తున్న తొలినాళ్ళవి..

ఉరుము ఉలికిపాటుకి
తగులుతున్న భుజం
సంకోచపు సరిహద్దుని
చెరిపి వేస్తుంటే..

అవసరమైన సందేశమేదో అందినట్టు
గాలితెర దీపం కళ్ళు మూసింది..
ఉన్నట్టుండి వంద పారిజాతాల
వత్తిడి.. పెదవులపైన!

హృదయాన్ని వెలిగించి
శరీరాన్ని మండించిన ఒక జ్వాల!
అప్రయత్నంగా ఇద్దరం వాన కింద..

జీవితానికి కొత్తచిరునామా నిర్ణయమైన క్షణాలవి!

ఇప్పుడూ అదే వాన.. కిటికీ అవతల..

పుస్తకం చదువుకుంటూ..
కాలివేళ్ళతో నా చేతిగాజులు లెక్కబెడుతూ..
పక్కనే నీ వెచ్చటి ఉనికి!

అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!


(తొలి ప్రచురణ ఆవకాయలో...)

Monday, November 9, 2009

జలపాతం


దేవతలు ధరణి పైకి
జారవిడిచిన ఒక ధవళవస్త్రం..
తడబడుతూ.. తేలుతూ.. పరుగులు పెడుతూ..

మబ్బులు మురిపెంగా జార్చిన
చినుకు పోగులను కలుపుకుంటూ
అడుగు అడుగుకీ
తుళ్ళిపడుతున్న చిలిపిదనం..

తన్మయత్వంతో తాకబోతే
మనసంతా తడిపేసింది..

కదలని బండరాయి కరుకుదనం..
రాలిపడిన పూల నైరాశ్యం..
వేటినీ అంటనీయక
ఎగుడుదిగుడుల అనుకోని మలుపుల్లోకి
అలవోకగా జారిపోతోంది!

ఆకతాయిగా అడ్డుకుంటున్న
రాళ్ళగుట్టలపై అలిగి..
ఆకుపచ్చని ఆత్మీయత ఒడిలోకి
అధాటున దూకేస్తుంటే
పయ్యెద సర్దుకుంటూ ప్రకృతి
ఫక్కున నవ్వుతోంది!


కాంతిగారూ, చాలా రోజులకి పూసిన పువ్వు.. ఇది మీకోసం :-)
(తొలి ప్రచురణ ఆవకాయలో...)

Tuesday, May 26, 2009

మనోనేత్రం



తెలుగుజ్యోతి రజతోత్సవ ప్రత్యేక సంచికలో ప్రచురించబడిన కవిత...

రెండేళ్ళ చిట్టి నవ్వినప్పుడల్లా
తెల్లదనం తెరలు తెరలుగా విచ్చుకుంటుంది

కొసరి తినిపించే
అమ్మ చేతివేళ్ళ మీదుగా
పసుపు పవిత్రంగా అతుక్కుంటుంటే

కాలికి గుచ్చుకున్న ముల్లు నొప్పి
గుండెకి చేరనివ్వని నేస్తం స్పర్శ
హరితమై ప్రవహిస్తుంది..

తుంటరి చినుకుల చక్కిలిగింతలకి
తుళ్ళిపడుతున్న సెలయేరు
నీలాలు రువ్వుతోంది..

గ్రీష్మ కిరణాల
గాఢ చుంబనమే కదా ఎరుపంటే!

అపజయం పరిహసించినప్పుడల్లా
కాషాయం అభిమానంగా చుట్టుకుంటుంది..

సన్నజాజి సందెగాలుల ప్రణయావేశం
తలత్ గజల్ తో కలిసినప్పుడేగా
ఊదారంగు వింతహొయలేమిటో తెలిసేది!

ఇక..అన్ని రంగులూ కలిసిన నలుపు
కళ్ళెదురుగా కావాల్సినంత!!

మనోఫలకం పై చెక్కుకున్న
ఈ వర్ణమాలికని తాకినవారెవరనగలరు
నాకు చూపులేదని!?


Friday, April 10, 2009

పుష్పవిలాసం

గుడిలోకి కాకున్నా
ఆమె జడలోకైనాఎంచుకోలేదు!

ఇక నీ లోకమిదేనని
సహచరులు వెక్కిరిస్తూ వెడలిపోయారు..

రంగో.. రూపమో.. లోపమెక్కడుందో!

అస్పష్ట సందేహమేదో

ఒంటరిని చేస్తుంటే
ఏటవాలు కిరణమొకటి
వెచ్చగా హత్తుకుంది..
తెమ్మెరేమో బుగ్గ తడిమి వెళ్ళింది..

తల్లిపొదనే తనువు చాలించే
స్వేచ్ఛ ఇపుడు నా సొంతమనే
కోయిల సందేశం చేరుతుండగానే
తుమ్మెద తొలిముద్దు పెట్టింది!


(పొద్దు వారి ఉగాది వచన కవి సమ్మేళనం 'తామస విరోధి' కొరకు వ్రాసిన కవిత.. చిన్న మార్పుతో)

Thursday, March 26, 2009

కవిత్వం నుంచి కవిత్వంలోకి..




టాగోర్ Stray Birds కు బొల్లోజు బాబా గారు చేసిన తెలుగు అనువాదం 'దారి తప్పిన పక్షులు ' పై పొద్దు లో ప్రచురించబడిన సమీక్ష...

కవిత్వం నుంచి కవిత్వంలోకి.. 'దారి తప్పిన పక్షులు '


ఈ కవితా సంకలనం మొత్తం ఇక్కడ చదవొచ్చు..
మూలము - Stray Birds
అనువాదము - దారి తప్పిన పక్షులు




Friday, January 23, 2009

'జాజుల జావళి' పై భావకుడన్ గారి సమీక్ష



పువ్వులు.. వెన్నెల.. చిట్టితల్లి.. చందమామ.. ఏకాంతం.. ఆవేదన.. విషయం ఏదైనా దానిని హృదయం అనుభవించగానే కొన్ని కవితలు పుట్టాయి.. కొందరు చాలా బావున్నాయన్నారు.. ఇంకొందరు పర్వాలేదంటే మరికొందరు ఇంకా బాగా రాయొచ్చన్నారు.. పాఠకుల స్పందన ఏదైనా చాలా సంతోషంగా అనిపించేది.. 'ఇదే కదా గుర్తింపంటే!' అనిపించేది.. ఇంతకన్నా ఎక్కువగా ఆశించలేదు.. అసలు వస్తుందనీ అనుకోలేదు!

ఉన్నట్టుండి సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తూ సాహితీ ప్రేమికుడైన 'భావకుడన్ ' గారు జావళి ఆలపిస్తున్న ఈ కవితలను అనూహ్యమైన రీతిలో సమీక్షించి వాటికొక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు భాగాలుగా సాగిన సమీక్ష నా కవితల్లో నాకే అందని ఎన్నో విషయాలని తెలియజేసింది.. కొత్త కోణాలను స్పృశిస్తూ సమీక్షించిన భావకుడన్ గారికి ప్రత్యేక కృతజ్ఞాభివందనలు తెలుపుకుంటున్నాను.


నిషిగంధగారి "జాజుల జావళి" :-కవితా సమీక్ష -మొదటిభాగం

"జాజుల జావళి"-సమీక్ష, రెండవ భాగం

నిషిగంధగారి "జాజుల జావళి" :-కవితా సమీక్ష-3 జాజుల జావళిలో ప్రకృతి-స్త్రీ

నిషిగంధగారి "జాజుల జావళి"-సమీక్ష-4 జాజుల జావళిలో "సహచర్యం"

'ఊసులాడే ఒక జాబిలట!' పూర్తి నవలా రూపంలో..

కౌముది వారు విన్నూత్నంగా ప్రవేశపెట్టిన 'ఇంటింటా కౌముది ఉచిత గ్రంధాలయం' అనే అంశంలో భాగంగా 'ఊసులాడే ఒక జాబిలట!' లోని అన్ని భాగాలు కలిపి, చక్కని ముఖచిత్రంతో ఒకే పి.డి.ఎఫ్ ఫైలుగా మార్చి, పుస్తక రూపంలో అందిస్తున్నారు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.


Thursday, December 11, 2008

ఊసులాడే ఒక జాబిలట! - కార్తీక ఉత్తరాలు



అభిమానిగా పరిచయమై.. ఆత్మీయంగా పలుకరించి.. అందమైన స్నేహాన్ని అందించి.. అల్లరి చిందించి.. అంతలోనే అనూహ్యంగా మాయమైన కార్తీక అసలు సిసలైన హృదయాక్షరాలివి!!

అడగగానే మనందరితో తన నేస్తం చెప్పిన కొన్ని ఊసులను పంచుకోవడానికి అంగీకరించిన కిరణ్ ప్రభ గారికి, స్కాన్ చేసి పంపిన కాంతి గారికీ కృతజ్ఞతలు!









నాకెంతో ఇష్టమైన.. ఈ కధకి తగిన టైటిల్ని అందించిన పాట..


Tuesday, December 2, 2008

ఊసులాడే ఒక జాబిలట! (నవంబర్ & డిసెంబర్ 2008)



"......మా కార్తీకకి మీ అంతటి ఆప్తులైన స్నేహితులు లేరు.. మీమధ్య ఏర్పడిన ఆత్మీయత కేవలం ఉత్తరాల ద్వారానే అంటే నమ్మశక్యం కాదసలు! తనకి మీరంటే వల్లమాలిన గౌరవం, అభిమానం.. ఎప్పుడూ చెప్తుంది, 'నేను దిగులుగా ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు కేవలం స్నేహితుడిగానే కాకుండా ఒక గైడ్ గా నాకు సహకరించిన మాస్టారు మా కవిగారూ అని! మరి మీ సహకారం ఇప్పుడు కొంచెం కావాలి మాస్టారూ.. ఈసారి మాఇద్దరికీ!!...

..... నాకు అది కావాలి, ఇది కావాలి అని ప్రత్యేకంగా దేవుడికి మొక్కుకున్న సందర్భం లేదు. లేని దాని గురించెప్పుడూ ఆలోచించకుండా అవసరంలో ఉన్నవాళ్ళకి నాకు వీలైనంత సాయం చేయడమే నాకు తెల్సిన పూజైనా, పునస్కారమైనా. కానీ ఈరోజు కార్తీక బాధని చూస్తూ నిస్సహాయంగా నిల్చోవడం తప్ప ఏం చేయలేని స్థితిలో ఉన్నాను....."

నవంబర్ పార్ట్ - పూర్తిగా...


".... ఈ ఆనందం మనసుని చేరి పారవశ్యంగా మారేలోపే మళ్ళీ సన్నగా నొప్పి మొదలవుతుంది.. హర్షని పట్టుకున్న చేతివేళ్ళ బిగువు సడలిపోతుంది.. కళ్ళు బాధతో అరమూతలవుతుంటాయి.. అంతలో "నొప్పిగా ఉందా?" అంటూ తల మీద అతి మృదువుగా వికాస్ నిమురుతుంటారు.. నా కంటినీళ్ళని తుడుస్తూ తన కళ్ళు చెమరుస్తున్న సంగతే తలంపుకి రాదు.. ఇంతకన్నా నరకం కూడదనిపిస్తుంది.. ఒక అందమైన బంధాన్ని పరిచయం చేస్తూ జీవితంలో మలిపొద్దు మొన్ననేగా మొదలైంది.. ఎన్నెన్ని కొత్త ఆశయాలు.. ఆలోచనలు.. చేతనైనంతగా అసహాయులకి కొత్తదారి చూపించాలనే తాపత్రయం.. బోల్డన్ని కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటుండగానే ఇలా మంచానికి అతుక్కుపోవడంతో అప్పుడే ఆఖరిపొద్దు వచ్చేసిందా అనే ఆందోళనొకటి మనసుని పట్టి ఊపేస్తోంది....."

డిసెంబర్ పార్ట్ - పూర్తిగా...

Friday, October 31, 2008

ఊసులాడే ఒక జాబిలట! (సెప్టెంబర్ & అక్టోబర్ 2008)


"....ఇక ఇంటి పనుల విషయాలకొస్తే రాధికని సంప్రదించొచ్చు.. 'భర్తని సాధించడం ఎలా?' అన్న విషయం తోపాటు ఇంకెన్నో అవసరమైనవి చెప్పగలదు నీకు. నాకు తెల్సు, దగ్గర ఉంటే గనక కత్తీ డాలూ తీసుకుని నా మీద యుద్ధానికి వచ్చేదానివని.. అయినా గానీ నీకు పెళ్ళైపోయిందని తల్చుకుంటే భలే గమ్మత్తుగా ఉంది తెలుసా! ఇక నించీ నువ్వు కూడా అందరి లాగా 'ఈపూటకి ఏం వండాలి.. వడియాలు పెట్టుకోవాలి.. బూజులు దులపాలీ అనుకుంటూ ప్రణాళికల మీద ప్రణాళికలు వేసుకుంటావేమో!....."


సెప్టెంబర్ పార్ట్ - పూర్తిగా...


".....చుట్టూ పచ్చదనం, ఎప్పుడు చూశినా ఇప్పుడే ఊడ్చి తుడిచారా అన్నట్లుండే రోడ్లు, ఆకాశ హర్మ్యాలు, ఆ పక్కనే జలపాతాలు అన్నీ కలిసి ఏదో అల్లావుద్దీన్ సృష్టించిన ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగిస్తాయి.. కానీ కార్తీకా, సాయంత్రం ఆరు దాటంగానే ఒక్కసారిగా నిశ్శబ్దంగా అనిపించేది.. అప్పటి వరకూ ఆడుకున్న పిల్లలంతా వెళ్ళిపోగానే మిగిలిన ఖాళీ పార్క్ లా నిస్తేజంగా అనిపించేది.. కారణం రాధికా వాళ్ళు నాతో లేకపోవడమే కాదు అప్పటి వరకూ ఎంతో క్లోజ్ గా పని చేశిన సహాధ్యాయులు ఐదవ్వగానే ఉన్నట్టుండి అపరిచితులుగా మారిపోతారు.. అక్కడ నించి వాళ్ళ జీవితంలో మనకేమాత్రం ప్రాముఖ్యం ఉండదు! పుట్టిన దగ్గర్నించీ మన చుట్టూ ఉన్నవారితో ఎటాచ్ మెంట్స్ పెంచుకుంటే పెరిగే మనలాంటి వారు ఈ డిటాచ్ మెంట్ కి అలవాటు పడటం కష్టమనిపిస్తుంది!....."

అక్టోబర్ పార్ట్ - పూర్తిగా...