Pages

Tuesday, August 6, 2013

కొంచెం పని.. కాసిన్ని నవ్వులు -- 2


(Part - 1)


"I think she is calling you" రిసెప్షనిస్ట్ వైపు చూపించాడు.. 

'ఇతను ఎప్పుడొచ్చాడబ్బా ఇక్కడికి!?' అనుకుంటూ గభాల్న లేచి ఫ్రంట్ డెస్క్ దగ్గరికి వెళ్ళాను.. ఇంకో ఐదు నిమిషాల్లో లోపలికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పింది! మళ్ళీ వచ్చి నా ప్లేస్లోనే కూర్చుంటూ, 'థాంక్యూ' కాస్త నవ్వుతూ అతనికి చెప్పాను...

"నో ప్రోబ్లెం" అనేసి చూపు వాల్ టూ వాల్ గ్లాస్ విండో వైపుకి తిప్పేసుకున్నాడు! 

ఆహా, అమ్మాయిలంటే ఎంత మర్యాద, అసలు సూటిగా కూడా చూడలేదు! అనుకుని, నేను మాత్రం చక్కగా, పరిశీలనగా తననే చూశాను..

డార్క్ బ్లూ సూట్, సిల్వర్, లైట్ బ్లూ కాంబినేషన్ నెక్ టై.. చక్కగా జెల్ పెట్టుకుని నున్నగా వెనక్కి దువ్వుకున్న జుట్టు, అచ్చమైన నీలి కళ్ళు, రెగ్యులర్ వర్కౌట్ చేస్తున్నట్టు ఇట్టే చెప్తున్న బ్రాడ్ షోల్డర్స్... వెరసి ఒక వైట్ అమెరికన్.... అనుకుంటూ మళ్ళీ ఇంకోసారి అతని ఫేస్ వైపు అస్సలు మొహమాట పడకుండా చూశాను... అసలా శరీరానికీ, ఫేస్‌కీ సంబంధమే కనిపించలేదు.. సల్మాన్ ఖాన్ బాడీకి ఎవరో టీనేజర్ ఫేస్ పెడితే ఎలా ఉంటుందీ! అలా అమాయకంగా.. బోల్డంత అమాయకంగా!!! 

'ఏ ఇరవై ఏళ్ళుంటాయేమో.. స్టూడెంట్ అనుకుంటా.. ఎంత పద్దతిగా ఉన్నాడు పిల్లాడు!' అని మనసులోనే బోల్డన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నాను.. నాకు తెలీకుండానే మరీ చాలాసేపట్నించీ చూస్తున్నానేమో అతనికి కూడా అర్ధమై నావైపు తిరిగి మొహమాటంగా ఒక చిన్న నవ్వు నవ్వి, మళ్ళీ తలని విండో వైపుకి తిప్పేసున్నాడు.. "ఎంత బుద్దిమంతుడో" ఇంకోసారి అనుకోకుండా ఉండలేకపోయాను!!

అలా మొదటిసారి చూశానతన్ని... ఆ రోజునీ, ఆ మొదటి అభిప్రాయాన్నీ నేనెప్పటికీ మర్చిపోలేను.. మర్చిపోను కూడా!

అతని పేరు రిచర్డ్.. అందరూ రిక్ అని పిలుస్తారు.. ఆరోజు ఇద్దరమూ మా ఫైనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము.. ఒకే టీంలో రెండు వేరు వేరు పొజిషన్లలో జాయినయ్యాం.. నాకు క్యాంపస్ తెలీదని ఐడి కార్డ్, వెల్‌నెస్ కార్డ్, ఓరియెంటేషన్ ఇలా క్యాంపస్ లోని అన్ని బిల్డింగ్స్ కీ తనే తీసుకెళ్ళి చూపించాడు.. నేనేమో మనసులో అతన్ని బుద్దిమతుడు నించి అతి బుద్దిమంతుడు, మహా బుద్దిమంతుడు, అరివీర బుద్దిమంతుడు అని స్టార్స్ కౌంట్ పెంచేసుకుంటూ ఉన్నా!! 

ఇంకా గుర్తు, మొదటి రెండుమూడు వారాల్లో వర్క్‌‌కి రావడం అంటే ఎంతలా హేట్ చేసేదాన్నో! చాలా పొద్దున్నే లేవాల్సి రావడం, లాంగ్‌ డ్రైవ్, అప్పటి వరకూ అస్సలు అలవాటులేని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అన్నిటికంటే ముఖ్యంగా టీమ్ మొత్తానికి నేనొక్కదాన్నే అమ్మాయినవడం.. ప్రతిరోజూ కార్ పార్క్ చేస్తూ అనుకోవడమే, 'అబ్బా ఈవినింగ్ ఎప్పుడైపోతుందా!' అని.

ఒక నెలా నెలన్నర గడిచాయేమో... వర్కూ, వాతావరణమూ అంతా అలవాటవుతూ మెల్లగా టీంలోని అందరితో జెల్ అవుతూ ఉన్నరోజులు... మన ఆన్లైన్ తెలుగు పత్రికలన్నీ బుక్‌మార్క్ చేసేసుకునేంత కంఫర్టబిలిటీ పెరిగిన రోజులు..

ఒకానొక ఉదయం...మొదటి కప్ కాఫీ తాగుతూ, మెల్లగా ఈనాడు పేపర్ ఓపెన్ చేసి, కొంచెం చిన్న విండోగా కుదించి చదువుతున్నా...

వెనకనించి దగ్గరగా రిక్ పిలుపు...
పక్కవాళ్ళ బౌల్లోంచి ఐస్‌క్రీమ్ దొంగతనం చేస్తూ పట్టుబడినట్టు ఉలిక్కిపడి టక్కున ఆ విండో మూసేశా.

అనవసరంగా దడుచుకున్నందుకేమో "ఆర్యూ ఓకే?" అని నావైపో వింత లుక్ వేసి, "You know our boss is a Cuban" అన్నాడు.. తెలుసని చెప్పాను.

ఒక ఐదు నిమిషాలపాటు క్యూబన్ మగవాళ్ళు ఎంత నిష్టాగరిష్టులో, ఎంత పద్దతిగా ఉంటారో, ఎంత గౌరవబద్దంగా జీవిస్తారో లెక్చర్ ఇచ్చి.. "I just want you to be a little familiar with their culture. Also, I think he will be very happy if we greet him in Spanish once in a while" అని సలహా ఇచ్చాడు.. నాకు స్పానిష్ రాదుగా అని దీనంగా చూశాను.. 

తనేమో "Don't worry, I know a little" అంటూ అభయమిచ్చి, "Mr. Mierda would be a good one" అని, ఒకసారి నాతో చెప్పించాడు..

కెనేడియన్ అయినా ఇంత చక్కని స్పానిష్ వచ్చినందుకు మనసులో అతన్ని మళ్ళీ మెచ్చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టి, ఇక నేను మా బాస్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూసి, ఆయన వచ్చి నన్ను విష్ చేయగానే నేను "Good morning, Mr. Mierda" అన్నా.. ఆయన అర్ధం కానట్టు చూశాడు..

ఓ, నా ఏక్సెంట్ సరిగ్గా లేక ఆయనకి నేనన్నది అర్ధం కాలేదని, ఇంకాస్త గట్టిగా, సాగదీస్తూ "GOOOOOD MOOOOORNING, Mr. Mierda"  అన్నా.. తల అటూ ఇటూ కాకుండా ఊపేసి వెళ్ళిపోయాడు!!

నేను రిక్ దగ్గరికెళ్ళి ఇలా బాస్ నా గ్రీటింగ్‌ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాను.. తను సాలోచనగా చూసి "May be it's too strong for him!" అన్నాడు..

అప్పుడు కానీ నాకు వెలగలేదు... ఇంతకీ ఆ మాటకి మీనింగేమిటని సూటిగా ప్రశ్నించాను!

"Oh, I didn't tell you!? It means Mr.Perfect" అన్నాడు... బుద్దిగా నేను అవునవును టూ స్ట్రాంగ్ గానే ఉంది, అని ఒప్పేసుకున్నాను..

నేను వెళ్ళిపోబోతుంటే చెయ్యి పట్టుకు ఆపి, "How about this? Mr. Viejo.. Mr. Decent??" మళ్ళీ ఇంకో గ్రీటింగ్ చెప్పాడు..

పర్ఫెక్ట్ కంటే డీసెంట్ కాస్త డోస్ తక్కువగానే ఉందనిపించింది.. మరీ బాస్‌ని కాకా పట్టేలా లేదని కూడా అనిపించి, సరే సరే అంటూ బేషరతుగా అంగీకారాన్ని తెలిపాను...

అలాంటి ఉదయమే.. మరుసటి రోజు.. మళ్ళీ బాస్ విష్..

నేను పేద్ద స్మైల్ ఇస్తూ "Good morning MR. Viejo!“
 
ఈసారి ఆయన తలూపి వెళ్ళిపోలేదు.. అక్కడే ఆగి "What did you just say?" అని అడిగాడు.. అబ్బో, నా పిలుపు ఆయనకి తెగ నచ్చేసిందని మళ్ళీ రిపీట్ చేశాను..

"You know what it means?" ఆయన ప్రశ్న..

"Oh yea, Mr. Decent" నా నవ్వుని ఎక్కడా సడలనీయకుండా చెప్పాను..

అంతే! అక్కడే ఉన్న ఒక చెయిర్లో కూలబడి అదేపనిగా నవ్వడం మొదలుపెట్టాడు!! ఒక రెండు నిమిషాలు నవ్వి మరి నిన్న చెప్పినదానికి అర్ధం అంటే, రిక్ నాకు చెప్పిందే మళ్ళీ నేను ఒబీడియంట్ గా అప్పగించాను...

ఇక ఆయనైతే "ఓ మ్యాన్!" అనేసి ఇంకా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు... కలుగులో ఉన్న ఎలుకలు బయటకు వచ్చినట్టు మా టీమ్మేట్సందరూ బయటకి వచ్చి  ఆయనతో జత కలిశారు.. 


నాకేమో ఒళ్ళు మండిపోతోంది.. రిక్ అయితే సరే సరి, నేల మీద దొర్లి దొర్లి నవ్వుతున్నాడు!!!!

మా బాస్ నవ్వడం ఆపి "who made you to say these?" అనడిగితే లిటరల్గా నేలమీద పడిపోయి ఉన్న రిక్‌ని చూపించాను.

"Oh My! How could you just believe him?! There is a thing called Google, you know!" అని నన్ను పట్టుకు ఊపేస్తూ మళ్ళీ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు!!

'Because I trusted him...' నేను అస్పష్టంగా చెప్పినా వినిపించినట్టే వచ్చి రిక్, 'ఐ యాం సో సారీ... " అంటూ చేతులు పట్టుకుని దీనంగా చూశాడు...

ఇంతకీ మీనింగేమిటని అడిగితే వాళ్ళు చెప్పింది విని నాకూ నవ్వాగక వాళ్ళకంటే ఎక్కువగా నవ్వడం మొదలుపెట్టాను... 

'ఈ అబ్బాయి ఎంత బుద్దిమంతుడో!' అన్న నా మొట్టమొదటి అభిప్రాయాన్ని రిక్ ఈ స్పానిష్ గ్రీటింగ్ డైనమైట్‌తో ముక్కలు ముక్కలు చేశాడు... 

And, the sad/funny part is, that was only the beginning........................



(FYI..... Mierda (మియర్డా) = s**t ......... Viejo (వియహో) = old man) 

వయసు ఏ ఎర్లీ ఇరవైల్లో ఉంటాయనుకున్న అతను నాకంటే రెండేళ్ళు పెద్ద అని, తను అమెరికన్ కాదు కెనేడియన్ అని, మాస్టర్స్ చదవడం కోసం మా యూనివర్సిటీకొచ్చి ఇక్కడే జాబ్ లో సెటిల్ అయిపోయాడని నెమ్మది నెమ్మదిగా వివరాలన్నీ తెలుస్తున్నాయి.. అంతే కాదు పని చేసేప్పుడు ఎంత సీరియస్ గా, పూర్తి ఏకాగ్రతతో చేస్తాడో అల్లరి కూడా అంతే డెడికేషన్‌తో చేస్తాడు.. చెప్పానుగా మా టీంలో ఆరుగురు అబ్బాయిలు, నేనొక్కదాన్నే అమ్మాయినని.. అందుకే తన అల్లరికి ఎప్పుడూ నేనే టార్గెట్ అయ్యేదాన్ని!

ఉదాహరణకి ----

** ప్లాస్టిక్ గ్లాస్ నిండుగా నీళ్ళు పోసి ఆఫీస్ డోర్ పైన పెట్టి, అతి నెమ్మదిగా దగ్గరికి లాగి ఉంచేవాడు.. ఆ టైం కి నాకు వేరే డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళాల్సిన పని 'కాకతాళీయంగా' వచ్చేది! మనం ముందూ వెనకా చూసుకోకుండా లేచి ఆ తలుపు దఢాలున లాగేసరికి గ్లాసు నీళ్ళూ నన్ను అభిషేకం చేయడంలో పూర్తిగా సఫలం అయ్యేవి! తర్వాత మనం ఎంత ఫుల్ బాటిల్ నీళ్ళు తనపై గుమ్మరించినా అది లెక్కలోకి రాదు కదా!

** ఇంకోసారి, ఇంటికి బయలుదేరే సమయానికి భోరున వర్షం పడుతుంటుంది.. 'ట్రాఫిక్ ఎంత స్లోగా ఉంటుందో' అని వేరే ఫ్రెండ్స్‌తో మొరపెట్టుకుంటూ, బిల్డింగ్ బయటకి వచ్చి గొడుగు ఓపెన్ చేయగానే దాన్లోంచి ఒక బుట్టెడు ష్రెడ్ చేసిన పేపర్ ముక్కలు భళ్ళున నవ్వుకుంటూ మనమీద కురిస్తే ఎలా ఉంటుంది!? ఆ మరుసటిరోజు తన ఫైల్ కాబినేట్స్ నిండా అవే పేపర్ ముక్కలు పూర్తిగా నింపేసినా నా గొప్పతనం తను ఒప్పుకోడుగా!!

** అప్పుడే లంచ్ నించి వచ్చి, పూర్తిగా పనిలో మునిగిపోయిన బిజీ మధ్యాహ్నం.. వచ్చి ప్రోజెక్ట్ గురించి ఏవో సీరియస్ ప్రశ్నలు అడుగుతాడు.. నేనేమో 'ఐ నో ఇట్ ఆల్ ' లెవల్లో ప్రతీదీ ఆవేశంగా వివరిస్తున్న సమయం... ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ మోగుతుంది.. స్క్రీన్ మీద నించి దృష్టి మరల్చకుండా ఫోన్ లిఫ్ట్ చేసి 'హలో' అనగానే అటు నించి 'హి గాట్ హర్ ఎగైన్ ' అని పెద్దగా నవ్వులు... కాస్త అయోమయగా అనిపిస్తుండగానే చెవులకి ఏదో మెత్తగా గ్లూయీగా అతుక్కున్న చల్లదనం.. కెవ్వున రిసీవర్ చేతిలోంచి పడేస్తే దాని హెడ్ పీస్ కి ఇంత మందాన పూసి ఉన్న క్లియర్ షేవింగ్ జెల్!! తర్వాత అతని డెస్క్ మీద అదే షేవింగ్ జెల్ తో పేద్దగా 'I HATE YOU! అని రాస్తే, క్లీన్ చేసుకుంటూనే "You know! Hate is a strong word. I'm sure you don't hate me" అంటూ నవ్వుకున్నాడు..

ఇలా ఎప్పుడూ ఏడిపిస్తూనే, "you are such a good sport and are so sweet" అని కాస్త పొగిడేశేవాడు.. తనకే అప్పుడప్పుడూ అనిపిస్తుండేదేమో కాస్తెక్కువే ఏడిపిస్తున్నానని.. అలాంటప్పుడు భలే విచిత్రమైన పనులు చేశేవాడు.. నేను కాస్త సీరియస్ అయ్యానని అర్ధమైనప్పుడోసారి ఉదయం రాగానే, ముందు నించుని 'this is for you' అంటూ నా ఫోన్ రింగ్‌టోన్ సాంగ్ 'కలసిన సమయాన.. కనులకు ఓ వాన' (ఈ పాట చాలా ఇయర్స్ నా రింగ్‌టోన్‌గా ఉండేది!) పాట పల్లవి మొత్తం పాడి వినిపించాడు... ఆరోజు మాత్రం భలే మూవ్ అయిపోయాను!

అలా చేసిన రెండో రోజు నించే మళ్ళీ ఏదో ఒక అల్లరి!

ఒకసారి మాత్రం నాకు చాలా కోపం వచ్చి 'అసలు నీకు మామూలుగా, నైస్ గై లా ఉండటం రాదా!' అని గయ్యిమని అరిచాను.. ఒక 2 నిమిషాలు ఏం ఆలోచించుకున్నాడో ఏమో! "You are right. you deserve to be treated nice. I will be nice to you until you ask me to stop!" అని ఒక వింత చాలెంజ్‌లాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడు..

నేనేమో 'ఇంకా నయం! స్టాప్ బీయింగ్ నైస్ అని చచ్చినా అనను ' అని డిక్లేర్ చేశాను.. తను నవ్వేసి వెళ్ళిపోయాడు..

బట్, అది ఇంకో రకమైన టార్చర్ అని అర్ధమవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు!!!


**********************************************************************************************************
ఎప్పుడూ కవితలే కాకుండా మానవాళి క్షేమం కోరి అప్పుడప్పుడూ మామూలు విషయాల గురించి కూడా టపాలు రాయమని అడిగే శ్రావ్య కోసం ఈ పోస్ట్. :-)
*********************************************************************************


(Pictures - Courtesy Google Images) 
   

Monday, August 5, 2013

కొంచెం పని.. కాసిన్ని నవ్వులు -- 1




యది హ్యహం న వర్తేయం --- అర్జునా, నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే,మనుష్యులు అన్ని విధాల నామార్గమే అనుసరిస్తారు.

ఉత్సీదేయురిమే లోకా --- నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి.వర్ణ సంకరానికి కారకుడనౌతాను.ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.

---- భగవద్గీత

అబ్బే, నేను చెప్పబోయే విషయానికీ ఈ శ్లోకానికి అంత సంబంధం లేదు. చాల్రోజుల తర్వాత రాస్తున్నా కదా, ఇలా శ్లోకాలతో మొదలుపెడితే కాస్త గంభీరత్వం వస్తుందని.. అంతే! :-)

ఇహ విషయానికొస్తే....
అనగనగా ఒకానొకరోజు పొద్దున్నే..
తను: ఏంటీ అప్పుడే లేచావ్? రాత్రంతా సరిగ్గా పడుకోనేలేదు!
నేను: టైమవ్వట్లా! అలారం మోగి అరగంట పైనే అయింది.
తను: అయితే! అంతలా వంట్లో బాలేకపోతే ఎలా వెళ్తావ్? సిక్ కాల్ చెయ్యి..
నేను: ఇంకా నయం, ఇవ్వాళ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయ్.. వెళ్ళక తప్పదు..
(అటేపునించి సమ్ గొణుగుడు -- ఈ డెడికేషనేదో కాస్త వీకెండ్ వంట మీదకూడా చూపిస్తే బావుండు!)
నేను: ఆ!? ...
తను: ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళిరా అంటున్నా..

నిజంగానే అసలు వంట్లో బాలేదు.. లేచి తయారవడమే గగనమనుకుంటే ఆపైన బోల్డంత దూరం డ్రైవ్ చేయాలి. అయినా కష్టపడి ఎలాగొలా ఆఫీస్‌కి చేరుకున్నాను.. అసలు విషయం, ఆరోజు నాకేమీ మీటింగ్స్ లేవు.. Big fat lie అన్నమాట! అలాంటి ఉదయాలు ఎన్నోసార్లు రిపీట్ అయ్యాయి.. ఒక్కోసారి గొణుగుళ్ళు తమ స్థాయిని పెంచుకుని అరుపుల్లాగా కూడా రూపాంతరం చెందేవి. ఆహ, మనం పట్టించుకుంటేగా!

ఉద్యోగం మనిషి లక్షణమైన ఈ రోజుల్లో మనం మెలకువగా ఉండే భాగంలో డెబ్భైఐదు శాతం ఆఫీస్‌లోనే గడిచిపోతుంది.. ఆఫీసంటే ఇష్యూలు, డెడ్‌లైన్లూ, చాంతాడంత మీటింగ్ మినిట్సూ..
ఇవికాక మైక్రోమేనే‌జ్‌మెంట్‌లో పండిపోయిన బాస్‌లూ, వాళ్లని కాకా పట్టడమే తమ అసలైన ఉద్యోగమనుకునే కొందరు టీమ్మేట్సూ. మరి ఫ్రెడేలన్నీ జాలీ డేలు గా... ఆదివారం సాయంత్రాలన్నీ ఆత్మహత్య ముందరి దిగాలు ఘడియల్లా అనిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు.



ఏదో ఉద్యోగధర్మంగా పనిని ప్రేమించగలం గానీ పనితో పాటు పక్కనుండే అనేకరకాల మనస్తత్వాల్నీ, వాళ్ళ సడెన్ మూడాఫ్స్‌నీ కూడా మామూలుగా తీసుకోవాలంటే చాలా సహనం ఉండాలి. అంటే మన కొలీగ్స్‌లో కూడా ఫ్రెండ్స్ ఉండరని కాదు. కానీ, ఆ బంధాల్లోని దగ్గరతనం ప్లెజెంట్ గుడ్‌మార్నింగ్  నవ్వులూ, ఫ్రెండ్లీ హాండ్‌షేక్‌లని దాటివెళ్ళడం బహుతక్కువ. ఆ చేయిచాచిన దూరం వరకే మన దగ్గరతనం! అందుకే ఆ యాంత్రికతని ఎగ్గొడ్డానికి ఎన్నెన్ని దారులు ఉంటే అన్నీ ఏమాత్రం సందేహించకుండా (సిగ్గుపడకుండా) ఉపయోగించేసుకుంటుంటాం..

అలాంటిది వంట్లో అస్సలు బాలేకున్నా లాంగ్‌డ్రైవ్ లు చేసి, కర్తవ్యం విజయశాంతిలా ఫీలై ఎందుకు వెళ్ళడం!? పైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు, నేను కాసేపు పని చేయడం మానేస్తే మా కొలీగ్స్ అందరూ దిక్కుతోచని వాళ్ళైపోతారనీ, ఆర్గనైజేషనే మూలబడుతున్నంత బిల్డప్ ఎందుకు??

చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చినరోజుల్లో నేను ఇంట్లో ఉండకుండా స్కూల్‌కి వెళ్తానని చేసిన గొడవ గుర్తొస్తుంటుంది. అప్పట్లో అందరూ నాకు చదువు మీద అంత ఇష్టం అనేసుకున్నారు. అచ్చు ఇప్పుడు మా ఇంటాయన నాకు పని పట్ల బోల్డంత డెడికేషన్ ఉందనుకున్నట్టు!
పాపం, అమాయకులు :) :)
అసలు విషయం ఏంటంటే -- ఫ్రెండ్స్.. మనతోపాటు ఎగిరిగంతులేసి, అల్లరి చేసే ఫ్రెండ్స్! వాళ్లని ఒక్కరోజుక్కూడా మిస్సవ్వడం ఇష్టముండదు!

చిన్నప్పుడు సరే.. ఇప్పుడు, ఈ వయసులో కూడానా!! అదీ ఆఫీసులోనా!! అని ఆశ్చర్యపోతే కంగారేంలేదు.. కావాల్సినంతగా ఆశ్చర్యపోండి..
ఇప్పుడు నెమ్మదిగా 'అసలు అలా ఎలా?' అన్న వివరాల్లోకి వెళ్దాం....

********

58 మైళ్ళు... రష్ అవర్ ట్రాఫిక్.. పార్కింగ్ లాట్‌కీ, ఆఫీస్ బిల్డింగ్‌కీ రమారమీ అరమైలు పైనే ఉన్న దూరం.. వేసుకున్న మందపాటి ఫార్మల్ బట్టలూ... 4 ఇంచ్ హీల్ షూస్... గాలికి అదేపనిగా ఎగురుతూ చిరాకు పుట్టిస్తున్న ఫ్రీ హెయిర్.... ఒకదాని తర్వాత ఒకటి చిద్విలాసంగా ఆజ్యం పోస్తూ నా అసహనపు జ్వాలని  అదేపనిగా పెంచుతున్నాయి గానీ అప్పటిక్కావాల్సిన ప్రశాంతతని నా దరిదాపుల్లోకి కూడా రానివ్వడంలేదు.

 "టేక్ ఏ డీప్ బ్రెత్.." మెయిన్ డోర్ తలుపు తోస్తూ నాకు నేనే అనునయంగా చెప్పుకున్నాను... అప్పటికే ఒక నాలుగుసార్లు కలిసిన స్వల్ప పరిచయమేమో రిసెప్షనిస్ట్ నన్ను చూసి చిన్నగా నవ్వింది.. "I'm here to see..." అని నేను వాక్యం నిర్మిస్తుండగానే ఆమె "I know.. She will be with you shortly.. Please, take a seat" అని లౌంజ్ ఏరియా వైపు చూపించింది..

'థాంక్ గాడ్, కాస్త టైముంది...'  అనుకుంటూ ఒక కుర్చీ చూసుకుని కూలబడ్డాను...


కాస్త స్థిమితపడటానికి నేనెప్పుడూ వాడే మంత్రం --- కళ్ళు మూసుకుని, నాకు నచ్చే పాటని అతి చిన్నగా పాడుకోవడం..

‘నువ్వేం మాయ చేశావో గానీ... ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ' --- ఇక్కడ ఇది నాలుగోసారి ఇంటర్వ్యూ.. ఇదైనా ఆఖరుది అయితే బావుండు..

'గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులా వచ్చాడమ్మా... వద్దన్నా.. రావద్దన్నా' --- అయినా ఈ సుత్తి ఉద్యోగానికి ఇంతమంది ఇన్నిసార్లు పిలవాలా! ఇదేమన్నా రాకెట్ సైంటిస్ట్ పోస్టా ఏమిటీ!!


నా మొట్టమొదటి ఇంటర్వ్యూ మళ్ళీ గుర్తొచ్చింది.. ఇలా ఎప్పుడు ఇంటర్వ్యూలకి అటెండ్ అయినా ఆ వెయిటింగ్ టైమ్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తురాకుండా అస్సలుండదు.. ఆ క్రితం రోజే ఫైనల్‌ ఇయర్ పరీక్షలు రాసొచ్చాను.. అప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చి మాటల్లో చెప్పింది, ఫలానా కాలేజీలో కంప్యూటర్‌సైన్స్ లెక్చరర్‌కి అర్జెంట్ నీడ్ ఉందని, వెంటనే వెళ్ళి కలవమని! సరే అసలుద్యోగం వచ్చేవరకూ ఇది చేద్దామని డిసైడ్ అయ్యి మరుసటి రోజే వెళ్ళాను.. గంజిపెట్టి ఇస్త్రీ చేసిన కాటన్‌చీర, తలంటి స్నానం చేసిన జడా, ఒక మూర కనకాంబరం మాల.. వెరసి లేని పెద్దరికాన్ని, హుందాతనాన్ని మాస్క్‌లా తొడుక్కుని ప్రిన్సిపాల్‌ని కలవడం అనే ఇంటర్వ్యూకి వెళ్ళడం గుర్తొచ్చింది.. ఎందుకో నవ్వు కూడా వచ్చింది, అప్పట్లో పూలు పెట్టుకోకుండా బయటకి వెళ్ళడం అంటే ప్రాణం పోయిన పనయ్యేది!

అవునూ, ఇందులో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వడానికి కుదరదంటే ఏమంటారో!? మళ్ళీ టెన్షన్ మొదలు...ఇంతకీ ఇందాక ఏ పాట దగ్గరున్నాను!?!?

'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై' --- ఇంకా ఎంతమంది ఈ కాంపిటీషన్లో ఉన్నారో ఏమిటో.. భలే, ఎవరూ ఎవరినీ కలవకుండా కంప్లీట్‌గా వేరువేరు టైమ్స్‌లో పిలుస్తున్నారుగా!!

'మసక మసక చీకటిలో.. మల్లెతోట వెన...'  ---
"ఎక్స్క్యూజ్..."
'కాలా... మాపటేళ కలుసు….'
"ఎక్స్క్యూజ్...మీ" --- ఈసారి కాస్త గట్టిగా వినిపించేసరికి కళ్ళు తెరిచా...
 
ఎదురుగా అతను!

********************************************************************************

ఎప్పుడూ కవితలే కాకుండా మానవాళి క్షేమం కోరి అప్పుడప్పుడూ మామూలు విషయాల గురించి కూడా టపాలు రాయమని అడిగే శ్రావ్య కోసం ఈ పోస్ట్. :-)
*********************************************************************************

(Pictures - Courtesy Google Images)

Tuesday, July 16, 2013

ఈ రాత్రి…


మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!

కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..

జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!

నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!

పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు
ఉండుండి వీచేగాలికి
వళ్ళు విరుచుకుంటుంటే..
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!

మనస్థాపాల మసకతెరలని తప్పించి
అతన్ని ఐదునిమిషాలన్నా
చుంబించాలి…
ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!

వీచే నింగి కింద
గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…
అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…
ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..
ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!

గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!

-------

NATS వారి సాహిత్య పోటీలలో రెండవ బహుమతి పొందిన కవిత, మొదటి ప్రచురణ వాకిలిలో... 

English Translation by NS Murty gaaru...



Thursday, June 27, 2013

చిటారుకొమ్మన గాలిపటం...

 
అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి
తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో
మహావృక్షాల ఆకుల చివర్లలో
ఒంటరిగా...
 

రెండు అనంతాల మధ్య
అతి ముఖ్యమైన అణువులా వేళ్ళాడాలి!
 
సెలయేటి పొగమంచులో చిక్కుకుపోవాలి
 
మెత్తని మసకదనంలో
పావురంలా.. లేదంటే పంకజమైపోయీ
రెక్కలు విప్పార్చుకుని
రహస్యంగా తేలిపోవాలి!
 
వరుస వానల తడిలోంఛి
శరత్కాలపు మధ్యాహ్నంలోకి జారిపొవాలి..
 
చూరు నించి చిన్నగా బయటకొచ్చిన చీమలానో
ముడుచుకున్న సవ్వడిలేని పువ్వుల్లానో!
 
చిన్నపాటి జీవం కోసం
చిటారుకొమ్మన గాలిపటమై
తపస్సొకటి ఆరంభించాలనిపిస్తుంది!
 
పొందినదీ.. పోగొట్టుకున్నదీ
ఇబ్బందిపెట్టే లెక్కలెన్నో
అస్థిమితంగా ఛాతిని దువ్వుతున్నప్పుడు 
 
నాది కాని ప్రతి చిన్న జీవితంలోకీ
నెమ్మదిగా నడచి వెళ్ళిపోవాలనిపిస్తుంది!

-------

మొదటి ప్రచురణ సారంగలో...

Tuesday, April 16, 2013

ఆ ఆప్తక్షణాల యధాతధ అనువాదమే ఈ ఇంద్రగంటి కవిత!



".....సాయంత్రం నించీ కురుస్తున్న వర్షం ఆగిపోయిన నిశ్శబ్దంలోనో.. అర్ధమయ్యీ అవనట్టుండే బెంగ ఒకటి మన చుట్టూనే మసలుతున్నప్పుడో.. ఒంటరితనపు తెరలు దించేసుకున్న వ్యక్తిగతసమయాలు కొన్ని ఉంటాయి. పరిశరాలు నీరవమయినా మనసులో మాత్రం ఆలోచనల రహస్య కోలాహలం మొదలవుతుంది. అచ్చు సందెవేళకి గూటికి తిరిగొచ్చిన గువ్వల కువకువలతో నిండిన చెట్టల్లే తుళ్ళిపడుతుంటుంది. మరిచిపోయినవో.. మరిచిపోవాలనుకున్నవో జ్ఞాపకాలు ఆ రాత్రప్పుడు సుదూరాలనించి సమీపానికొస్తాయి........."

పూర్తి వ్యాసం  వాకిలి - నీరెండ మెరుపులో!

Wednesday, February 6, 2013

Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!


"..........
అసలు కవిత్వంలో abstractness ని concrete గా ఎలా చెప్పాలో నాకు రేవతీదేవి వాక్యాలే నేర్పాయి. ఆ విధంగా నాలోపల గూడు కట్టుకుంటున్న వొక abstract దిగులు నించి అవి నన్ను విముక్తుణ్ణి చేశాయి. వొక కవి తన దగ్గిర వున్న పిడికెడు మాటలతో గుప్పెడు గుండె గుట్టు ఎలా చెప్పగలదో, అసలు మనసు చిత్రం గీస్తే అది ఎలా వుంటుందో నేర్పింది కూడా  ఆమె కవిత్వమే!
దిగులు
దిగులుదిగులుగా దిగులు
ఎందుకా?
ఎందుకో చెప్పేవీలుంటే
దిగులెందుకు?
అన్న ఎరుక నాలో కలిగించి చాలా అనుభవాలు భాషలో వొదగవు అని ముమ్మాటికీ చెప్పే కవిత్వం ఆమెది. వొక అనుభవాన్ని కాన్వాస్ మీద రంగులుగానో, అక్షరాలుగానో పరుస్తున్నప్పుడు ఆ కాన్వాస్, ఈ అక్షరాలూ రెండూ ఎంత పరిమితమయిన ప్రపంచాలో మనకి ఇట్టే తెలిసిపోతుంది.
............."

-  


పూర్తి వ్యాసం --  Abstract నుంచి concrete కి ఈ ముగ్గురి ప్రయాణం!