Pages

Wednesday, August 30, 2017

పాట ఒకటి…



ఖచ్చితంగా ఇలాంటప్పుడనేం కాదు కానీ
బద్దకపు మధ్యాహ్నాలు నింపాది నీడల్లోకి వాలుతున్నప్పుడో
నిదురించే ఆకుల మధ్య వెన్నెల విరిగిపడుతున్న సమయాల్లోనో
పాట ఒకటి గుర్తుకొస్తుంది, లీలగా.


మసకబారిన ఒకానొక సాయంత్రంలో ముడుచుకున్న టీకొట్టూ
ఓ మూల బరువుగా ఊగుతున్న రేడియో
మరుగుతున్న టీ లోంచి సుడులు తిరుగుతూ,
టప్… టప్… చూరు నీళ్ళని దాటుకొచ్చి
మొదటిసారిగా పలకరించిందీ పాట!


చెదురు మదురు వర్షాన్నో లేక చిందరవందర గాలినో
గబగబా దాటేస్తున్న అడుగులకి
అడ్డుపడి ఆపింది!

అత్యంత ప్రియమైన వ్యక్తి చెయ్యి పట్టి పిలిచినట్టు
కదలలేక… వదలలేక...
చినుకులతో చేయి కలిపి పాటలో ఒలికిపోయిన
అప్పటి నేను మొత్తంగా గుర్తొచ్చేశాను కానీ
పాట మాత్రం ఇంకా, లీలగానే!


పొడవాటి కాలేజీ కారిడార్లలో
ఈ పాటతో మొదలైన పరిచయాలు, పదిలపడ్ద ఇష్టాలు
చీకటి ఒంటరి వేళల్లో ఈ పాటనెక్కి
చేసిన పాలపుంతల ప్రయాణాలు
ధూళిలా సనసన్నగా రాలుతున్న జ్ఞాపకాలు


ఇన్నేళ్ళ పగుళ్ళలో చెల్లాచెదరయి ఎక్కడ ఇరుక్కుపోయిందో
పనుల మధ్య నిశ్శబ్దంలో ఇప్పుడు వుండుండీ ఊగులాడుతోంది!
నీళ్ళ చప్పుళ్ళనీ పిల్లల అల్లర్లనీ తన జట్టులోకి చేర్చుకుని
మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి
దొరికీ దొరక్కుండా దాగుడుమూతలాడుతూ…
ఈ పాట ఒకటి, ఉక్రోషాన్ని ఉదారంగా ఇస్తోంది!


కలత నిద్ర ఒత్తిగిలిలో ఏ నడిఝామునో
ఎక్కడిదో ఒక గాలి తెర మగత కళ్ళని తాకిపోతుందా,
గజిబిజి జ్ఞాపకాల ప్రవాహాల్ని తప్పించుకుని
పాట మొత్తం పెదవుల మీదకి చేరిపోతుంది!
మహా శూన్యంలోకి ఒక పక్షి ఈక జారుతున్నట్టు
పల్చటి తేలిక… కాస్త శాంతి… చిన్న నిట్టూర్పూ!



(మొదటి ప్రచురణ ఈమాట లో)