సగం వేసి వదిలేసిన బొమ్మల్లోకి
తోక లేని ఉడుతలూ.. పేరు తెలియని పువ్వులూ
వచ్చి చేరేలోపలే
రంగులన్నీ గోడలతోనూ.. గుమ్మాలతోనూ
గుసగుసలు మొదలు పెడతాయి..
అలసి అదమరిచిన
చిందరవందర ఇంద్రధనస్సు
మేలుకున్నప్పుడే
ఒక అంతఃపురంలో తెల్లవారుతుంది..
స్తబ్దత తెరలన్నీ
హడావిడిగా పక్కకి జరపబడతాయి..
శృతి చేయబడుతున్న పదాలు కొన్ని
పాల చినుకుల్లో మునకలేస్తుండగానే
చెలికత్తె రామచిలుకలు వాలతాయి..
నాలుగ్గోడల మధ్యనో
ఉద్యానవనం పరుచుకుంటుంది..
పరుగుల చివురాకు స్పర్శలూ
నవ్వుల కోయిల పాటలతో
ఉదయాల గుండా
వసంతం వీస్తుంటుంది!
కాగితపు పోగుల కేరింతల్లో
ఇష్టమైన పండగని జరుపుకుంటూ
అక్కర్లేని విరామమొకటి ప్రకటించి
కాళ్ళచుట్టూ చేతులేసి కావలించుకుంటుందా,
ఒకప్పుడెప్పుడో
చేస్తున్న పనాపి
బుగ్గలు పుణికి ముద్దెట్టుకున్న
అమ్మ చేతి తడి
మళ్ళీ కొత్తగా కళ్ళల్లో కమ్ముకుంటుంది!
మొదటి ప్రచురణ వాకిలిలో....