Pages

Friday, March 14, 2014

లోపలి లోకం...



ఈ ఋతువుకి రాలాల్సిన ఆఖరి ఆకు ఏదో
నేల తాకిన నిశ్శబ్దశ్శబ్దం..


ఏవీ కాకపోడానికీ.. అంతా అయిపోడానికీ మధ్య
కనురెప్పలు ఒకట్రెండు సార్లు కొట్టుకుంటాయంతే!

విరిగిపడిన మహానమ్మకం శకలాలన్నీ సెలయేట్లో గులకరాళ్ళల్లా
గుండె లోతుల్లో సర్దుక్కూర్చున్నాక
మిగిలేది సుదీర్ఘ మౌనం!


ఆఖరి శ్వాస తోటే అంతమయ్యే శిక్ష
ఒకటి విధించబడ్డాక
అదృష్టరేఖలెన్ని ఉన్నా అర్ధరహితాలే! 


వద్దనుకున్న ప్రయాణంలో తోవ తప్పినా
మధ్యలో మజిలీ ఏదో ఇష్టమౌతుంది..
పొగమంచు వదలని రహదారి పక్కన్నించి
లిల్లీకాడల చేతులు రెండు
పట్టి లాగి కూర్చోబెట్టుకుంటాయి..
కాస్త శాంతినీ.. కొంచెం ఆశనీ
నుదుటి మీద దయగా అద్దుతుంటే
నొప్పేసిన నిమిషాలన్నీ ఈసారి నవ్విస్తాయి...

తర్వాతెప్పుడో
తూరుపు జ్ఞాపకాలన్నీ
కాగితప్పడవలోకి ఎక్కించి
ఒక్కళ్ళమే వాన వింటున్న క్షణాల్లోకి జారవిడిచామా
నీరెండ నిర్మలత్వం
లోపలి లోకాన్ని
ఆదరంగా అలుముకుంటుంది!

 
 
మొదటి ప్రచురణ సారంగ లో...