Pages

Tuesday, July 16, 2013

ఈ రాత్రి…


మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!

కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..

జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!

నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!

పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు
ఉండుండి వీచేగాలికి
వళ్ళు విరుచుకుంటుంటే..
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!

మనస్థాపాల మసకతెరలని తప్పించి
అతన్ని ఐదునిమిషాలన్నా
చుంబించాలి…
ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!

వీచే నింగి కింద
గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…
అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…
ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..
ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!

గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!

-------

NATS వారి సాహిత్య పోటీలలో రెండవ బహుమతి పొందిన కవిత, మొదటి ప్రచురణ వాకిలిలో... 

English Translation by NS Murty gaaru...