Pages

Saturday, January 30, 2010

Thursday, January 28, 2010

ఒట్టేసి చెప్పవా!

      
నువ్వు ముందా? రాత్రి ముందా?
సాయంసంధ్యతో నా రహస్య పందెం...

ఫలితం ముందే తెలిసినట్టు
మరపునపడ్డ పాట ఒకటి తోడు కూర్చుంది!

ఆకాశదీపాలన్నీ వెలిగాక
నీ ఆనవాలేదో
తలుపు తోసుకుంటూ చుట్టుముడుతుంది..

కళ్ళూ కళ్ళూ కలవగానే
సిద్ధంగా ఉన్న సగం నవ్వు
పెదవులపైకి జారుతుంది...
అలసట జతగా తెచ్చుకున్న అసహనం
మాటల్ని ముక్కలు చేసి విసిరేస్తోంది..

మెడ వంపులోనో నడుము మడతపైనో
నడిరేయిన వేలికొసల పలకరింపులు..
నిర్లిప్తత వాగు దాటాలంటే
శరీరాలు మాట్లాడుకోక తప్పదనుకుంటా!

స్పర్శ ఇచ్చిన భరోసానేమో
హఠాత్తుగా నా హృదయమంతా నీ ఊపిరి!

నిద్రదుప్పటి కప్పుతున్న నీ పరిమళం సాక్షిగా
ఒక్కమాట తీసుకోనీ..

చీకటిని కాకున్నా ప్రతి వేకువనీ
కలిసే ఆహ్వానిద్దాం!!


(తొలి ప్రచురణ ఆవకాయలో...)