Tuesday, January 15, 2008
ప్రియమైన శత్రువు
సెలయేరు చేతులు జాచిందో
లేక
చందమామే ముందుకు వంగాడో!
వేలికొసల చిరుస్పర్శలు..
ఎటుమళ్ళాలో తెలీక
పిల్లగాలి తత్తరపాటు..
కిటికీ అవతల
కొబ్బరాకుల దొంగచూపులు..
మందహాసంతో జారిపోతున్న క్షణాలు..
వెన్నెలెప్పుడు నిద్రపోయిందో
తెలీని అచేతనస్థితి!!
మంచం పక్కనే
వదిలేశాననుకున్న నిమిషాలన్నీ
మనసు పొరల్లోకి
ఎలా చేరాయసలు!?
నువ్వు వాకిలి దాటగానే
ఖాళీ చేయాలనుకుంటే
చుట్టూ నీ ఆలోచనల పహారా!
గేటు దగ్గర నిశ్చింతగా
నాట్యమాడుతున్న మాలతీతీవె
నీ నిష్క్రమణ నిజం కాదని
అభయమిస్తూ!!
(తొలిప్రచురణ)
Wednesday, January 9, 2008
ఊసులాడే ఒక జాబిలట (Jan 08)
...చిక్కని వెన్నెల రాత్రి మీ వాన చినుకులలో నిలువెల్లా తడిసిపోతున్నాను.. భావుకత అంటే చంద్రుడినీ, మల్లెల్నే కాదు రాళ్ళనీ, నీళ్ళనీ ఉపయోగించి మనసుని స్పందింపచేయడం.. కదూ! అందుకే మీకు రాయకుండా, నా ప్రశంశలందించకుండా ఉండలేకపోతున్నాను..
అంతే కాదు నాలో ఇంకో అత్యాశ కూడా మొదలయింది.. 'కుదరదేమో.. బాగోదేమో' అని మనసు నసుగుతుంటే చుట్టూ ఉన్న గాలి అలలు మాత్రం 'ఏం పర్లేదు అడిగెయ్యమని ' ముంగురులతో ధైర్యం చెప్పిస్తున్నాయి.. అందుకే అడిగేస్తున్నా, "మీ ఆటోగ్రాఫ్ కావాలి మేడం!"..
పూర్తిగా...
Subscribe to:
Posts (Atom)