Sunday, November 22, 2009
అదే వాన...
జోరుగా మొదలైన వాన
ఆగకుండా..నిలకడగా పడుతూనే ఉంది..
మన పరిచయంలానే!
రోడ్డు చివరి ఒంటరి పాకలో
తగిలీ తగలకుండా...
హడావిడి పడుతున్న చీకటిలో
నింపాదిగా తడుస్తున్న కొండని చూస్తూ..
ఒకరికొకరమని తెలుస్తున్న తొలినాళ్ళవి..
ఉరుము ఉలికిపాటుకి
తగులుతున్న భుజం
సంకోచపు సరిహద్దుని
చెరిపి వేస్తుంటే..
అవసరమైన సందేశమేదో అందినట్టు
గాలితెర దీపం కళ్ళు మూసింది..
ఉన్నట్టుండి వంద పారిజాతాల
వత్తిడి.. పెదవులపైన!
హృదయాన్ని వెలిగించి
శరీరాన్ని మండించిన ఒక జ్వాల!
అప్రయత్నంగా ఇద్దరం వాన కింద..
జీవితానికి కొత్తచిరునామా నిర్ణయమైన క్షణాలవి!
ఇప్పుడూ అదే వాన.. కిటికీ అవతల..
పుస్తకం చదువుకుంటూ..
కాలివేళ్ళతో నా చేతిగాజులు లెక్కబెడుతూ..
పక్కనే నీ వెచ్చటి ఉనికి!
అనుభవం ఏదైనా
నీ సాంగత్యం ఇస్తున్న అనుభూతిలో
మళ్ళీ తడిసిపోతున్నాను!
(తొలి ప్రచురణ ఆవకాయలో...)
Monday, November 9, 2009
జలపాతం
దేవతలు ధరణి పైకి
జారవిడిచిన ఒక ధవళవస్త్రం..
తడబడుతూ.. తేలుతూ.. పరుగులు పెడుతూ..
మబ్బులు మురిపెంగా జార్చిన
చినుకు పోగులను కలుపుకుంటూ
అడుగు అడుగుకీ
తుళ్ళిపడుతున్న చిలిపిదనం..
తన్మయత్వంతో తాకబోతే
మనసంతా తడిపేసింది..
కదలని బండరాయి కరుకుదనం..
రాలిపడిన పూల నైరాశ్యం..
వేటినీ అంటనీయక
ఎగుడుదిగుడుల అనుకోని మలుపుల్లోకి
అలవోకగా జారిపోతోంది!
ఆకతాయిగా అడ్డుకుంటున్న
రాళ్ళగుట్టలపై అలిగి..
ఆకుపచ్చని ఆత్మీయత ఒడిలోకి
అధాటున దూకేస్తుంటే
పయ్యెద సర్దుకుంటూ ప్రకృతి
ఫక్కున నవ్వుతోంది!
కాంతిగారూ, చాలా రోజులకి పూసిన పువ్వు.. ఇది మీకోసం :-)
(తొలి ప్రచురణ ఆవకాయలో...)
Subscribe to:
Posts (Atom)