ఉయ్యాల
పట్టు పరికిణీ అంచులకి
చుట్టుకున్న మట్టి గీత..
నన్ను మళ్ళీ నీ వైపుకి లాగుతూ..
నీ సమక్షంలోనే కదా
నాన్న నాకు
ప్రపంచాన్ని పరిచయం చేసింది!
నా అలకలు తీర్చడానికి
నువ్వు తప్ప అమ్మకి
ఇంకో మార్గమెందుకు తోచలేదో!
నీలో కించిత్ గర్వం !!
నేస్తాల దగ్గర తప్పు లెక్కలు
నీతో ఇంకాసేపు గడపాలని...
ఎన్నెన్ని మందలింపులనీ!
'వోణీల వయసొచ్చినా
పిల్లలతో వంతులా!'
పక్కింటబ్బాయి అల్లరికి
నీ ముసి ముసి నవ్వులు..
మోచేతి మీద పాత గాయం
నీ ఉలికిపాటుని గుర్తు చేస్తూ..
అయితేనేం ..
జారిపడ్డ జాజుల దండకి
దుమ్ము అంటనీయలేదుగా!!
(తొలి ప్రచురణ)
2 comments:
అద్భుతం! ముఖ్యంగా ఆఖరి రెండు వాక్యాలు!
కధని కవితలా చెప్పినట్టుంది.nice image!
Post a Comment