Pages

Wednesday, August 13, 2014

డయాస్పోరా సాహిత్యంలో నేను...


మనందరికీ కేవలం మనవే అనిపించే కొన్ని అభిరుచులూ, అనుభవాలూ, స్థలాలూ ఉంటాయి. అవి అర్ధవంతమైనవీ, వ్యక్తిగతమైనవీనూ... ఒకప్పుడు వీటిని రాయొచ్చు, అందరితో పంచుకోవచ్చు అనే అవగాహన బహుతక్కువగా ఉండేది. నాకైతే దేశం విడిచి వచ్చిన తర్వాత కానీ నా అభిరుచులకు నేనివ్వాల్సిన విలువ అర్ధం కాలేదు!

స్వదేశంలో ఉన్నంతకాలం చదవడం మీద ఉన్న ఆసక్తి రాయడం మీద ఉన్నట్టు అస్సలు గుర్తులేదు. అసలు రాయడం అనేది మానవాతీతశక్తులు ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలిగేది అని నమ్మిన రోజులవి!
చిన్నప్పటి నించీ నేనూ పుస్తకాలు బానే చదివేదాన్ని.. చందమామ, బాలమిత్ర, శరత్ సాహిత్యం, ఆంధ్రజ్యోతి, అంధ్రభూమిలో బొమ్మదేవర నాగకుమారి సీరియల్స్, యండమూరి నవల్సూ.. ఇలా.. సరిగ్గా ఇదే వరుసలో!!

అరాకొరాగా ఏదో రాయడానికి ప్రయత్నించినట్లు మాత్రం గుర్తు. బాగా మనసులో నిలిచిపోయిన సందర్బం, ఐదో తరగతిలో అనుకుంటాను ఒకసారి నా బంగారు భవిష్యత్తుని నిర్ణయించే పరీక్షలేవో జరుగుతున్నాయని మా అమ్మానాన్నా నన్ను చదువుకోమని పక్కింట్లో మా అమ్మమ్మ దగ్గర వదిలేసి, తమ్ముడ్ని మాత్రం తీసుకుని సినిమాకి వెళ్ళినప్పుడు 'ఒంటరి నక్షత్రం' అనే కవిత రాసి, ఆ కాగితాన్ని రోజూ పొద్దున్న హోమ్ వర్క్ చెక్ చేసే మా అమ్మకి కనబడేలా పుస్తకంలో పెట్టాను.


మా అమ్మ అయితే ఆపకుండా చదివింది.. కాకపోతే అంతే ఏకాగ్రతతో మజ్జిగ కవ్వం తిరగేసి కొట్టింది కూడాను! అంతకు ముందు సంవత్సరం స్కూల్లో నేను రాసిన నాలుగు పేజీల 'అమ్మ ' కవితకి నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చినప్పుడు ఏమన్లేదు ఎందుకో!? పైగా 'మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాసినట్టు కనబడితే బడి మాన్పించి నాలుగిళ్లల్లో పాచిపనికి కుదురుస్తాను, జాగ్రత్త!' అని  బెదిరింపులు! 

అలా శరత్ సాహిత్యం ఒక్కటి చదవడం తప్ప సాహిత్యపరంగా నేను ఇండియాలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు! చదువుల పేరుతో పక్కరాష్టానికి వెళ్ళినప్పుడు భాష, ఎన్నో ఆచారవ్యవహారాలు భిన్నంగా ఉన్నా అక్కడ కలగలేదు తెలుగు మీదా, సాహిత్యం మీదా తపన, ఇంటికి దూరమైన భావన! కానీ, అమెరికాకి వచ్చాక, మొత్తానికి మొత్తంగా ఇంగ్లీష్ వాతావరణంలోనే ఉంటున్న రోజుల్లో మొదలైంది బెంగ లాంటిదేదో! ఇల్లో, పాటలో, పుస్తకాలో, బస్సుల రొదలో, మండుటెండల్లో నవ్వుతుండే మల్లెపూలో.. అన్నీ కలిపిన తెలుగుతనమో.. తెలీదు! ఒట్టి తెలుగుతనమేనా? అంటే కూడా సరిగ్గా చెప్పలేను.. వదిలొచ్చిన మూలాల విలువ అకస్మాత్తుగా అర్ధమైనట్లనిపించింది!

అప్పట్నించే ఇష్టమైన పాటల గురించీ, చదవాలనుకున్న పుస్తకాల గురించీ అన్వేషణ మొదలైంది! ఆన్లైన్ గ్రూపులనేవి పరిచయం అయ్యాయి.. సాహిత్యపరంగా ఆసక్తి కవిత్వం వైపు మళ్ళడానికి ఈ గ్రూపుల్లో జరిగిన/చదివిన చర్చలూ, వ్యాసాలూ, కవితలూ ముఖ్యకారణం. ఆపైన జాబిలీ, సెలయేరూ అంటూ నాకొచ్చిన పదాలతో వచ్చీరాని పూలమాల అల్లడం మొదలుపెట్టాను. ప్రశంసలూ, విమర్శలతో పాటు ఎన్నో ఉపయోగకరమైన సలహాలూ లభించాయి!

అవీ, ఆ తర్వాత రాసినవీ అయినా ప్రస్తుతం ఉంటున్న దేశం గురించో లేక ఇక్కడి మన స్వదేశీయుల జీవన పరిస్థితుల గురించో అయితే కాదు! ఒకప్పటి నేనున్న తీరాన నేను ఆస్వాదించిన విషయాలు కొత్తగా ఇంకొకసారి అవలోకించి రాసినవి. ఏదైనా డయస్పోరా రచన చదవగానే ఆ రచయిత(త్రి) స్వదేశానికి దూరంగా ఉంటున్న సంగతి ఖచ్చితంగా తెలియాలి, అలా అయితేనే అది ఆ విభాగం కిందకి వస్తుందనుకుంటే నేను నూటికి నూరుపాళ్ళు చెందను. కాకపోతే, అక్కడ ఉండి చేయలేనిది దూరం వచ్చాక చేయగలుగుతున్నాను.

ఇక్కడి సమకాలీన డయస్పోరా సాహిత్యం చదువుతుంటే తెలుగునాట లేని రచనా స్వాతంత్ర్యం, ఏ విషయాన్నైనా తడబాటు లేకుండా చెప్పగలిగే ధైర్యం ఈ రచనల్లో ఉన్నట్లనిపిస్తుంది. ఊహలూ, వర్ణనల కంటే వాస్తవిక సంఘటనలే ప్రధానంగా కనిపించడంవల్ల రచనల్లో ఒకలాంటి నింపాదితనం కనిపిస్తుంది. కాస్త భాషా పరిజ్ఞానం ఉన్నా ఎంతో చక్కని రచనలు చేయొచ్చని అర్ధమవుతుంది!

 కానీ కాలక్రమేణా తూర్పు పడమర దేశాల మధ్య జీవన పరిస్థితులలో బేధాలు తగ్గిపోతూ ఉండటం, ఎనభైయ్యవ దశకంలో మొదటి బారతీయ సంతతి ఎదుర్కొన్న సంఘర్ణల్లాంటివి ఇప్పుడు దాదాపు కనుమరుగైపోవడం వల్ల ఈ డయస్పోరా రచనలలో కావాల్సినంత చిక్కదనం కూడా తగ్గుతున్నట్లనిపిస్తోంది! ముఖ్యంగా ఆఫ్రికన్, లాటిన్/స్పానిష్ డయస్పోరా సాహిత్యంతో పోల్చినప్పుడు మొత్తమ్మీద భారతీయ రచయిత(త్రు)ల సంగతి ఎలా ఉన్నా మన తెలుగు రచనలను మాత్రం సరితూచలేకపోతున్నాము. ఎక్కువశాతం కుటుంబవిలువలు, మనోభావాలు, అంశాల మీదే ఆధారపడి ఉండటం.. అదీ దశాబ్దాల తరబడి ఈ రచనాంశాల్లో పెద్దగా మార్పు లేకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చుననిపిస్తుంది. 

అటు తల్లితండ్రులు, ఇటు పిల్లల మధ్య వారధిగా మొదటి తరం డయస్పోరా రచయిత(త్రు)లు తమ అనుభవాలని హాస్యభరితంగానో లేక ఆలోచనాపూరితంగానో చెప్పడంలో ఎక్కువశాతం సఫలమైనా, ఆ తర్వాత తరాల నీడలో ఈ సాహిత్యం భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనని చెప్పక తప్పదు!


మొదటి ప్రచురణ 13వ (జులై 2014) ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, అక్షరలో...

కవిత్వం నాకేమిస్తుంది?


చాలాసార్లే కూర్చుంటాను రాయాలని.. సమయాన్నే కాదు, చిందరవందర ఆలోచనల్లేని మనసునీ కూడా తోడు పెట్టుకుని.. కుదరదు.. రెండు మూడు పదాల కంటే ముందుకి జరగదు!

సంతోషమో.. బాధో.. కోల్పోయినతనమో.. గుండె అంచుల్నిండి రాలినప్పుడూ… సరైన పదాలు వాటిని పట్టుకోగలిగినప్పుడే కవిత్వం అనేదేదో నాకు రాయడానికి వస్తుంది!

అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే!? సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు..
సమూహంలో అప్పుడప్పుడూ అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!

మొదటి ప్రచురణ వాకిలిలో -- కవిత్వం నాకేమిస్తుంది?

Tuesday, August 12, 2014

వలసపక్షి

కొన్నిసార్లు ఏదనీ చెప్పడానికేముండదు..

వద్దనుకున్నవో.. వదిలేసుకున్నవో
పాత బంధాలు
కొత్త బెంగలై
లోపల్లోపల పేరుకోకముందే
తటాలున విదిలించేసుకున్నా
అకారణ దిగులేదో
ఇంటిచూరు పట్టుకుని వేళ్ళాడే మధ్యాహ్నపుటెండలా
ఉత్తినే వేధిస్తుంటుంది..


పచ్చపూలవనాల్లో
అలక్ష్యంగా ఎగిరీ..
ఆగి ఆగి నవ్వుతున్న నక్షత్రాల ఆకాశాన్ని
భుజాన వేసుకుని..
ఎప్పటికీ తిరిగి రాని రెండు ఝాముల కోసం
ఒక వలస పక్షిలా
మళ్ళీ వెళ్ళి వెదుక్కున్నా
పలకరించేది
గోడలు కూలిన రహస్యగృహమే!


ఎందుకో మాట్లాడలేక.. మాట్లాడి ఏమవ్వనూ లేక
మౌనంగానే తేలికవ్వాలంటే..

ఎవరినీ చేరని కలలా
చీకటి చివర్లలో
ఊగుతూ ఒద్దికగా ఉండిపోవాలంతే!


ఉండడమేవిటో…
అంతలోనే లేకపోవడమేవిటో
మృదువుగా కదిలెళ్ళే మేఘంలో
లిఖించబడి ఉంటుంది!
అర్ధమయితే చాలు..
అసహనపు వల వీడిపోతుంది!


విచ్చుకుంటున్న స్వాతిశయపు పూలగుత్తుల్లోంఛి
తోవ చేసుకుంటూ
ఆకాశం సముద్రస్నానం చేస్తున్న
ఆవలి తీరానికి
ఇంకొక సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది!!


మొదటి ముద్రణ: 13వ (జులై 2014) ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, అక్షరలో బహుమతి పొందిన కవిత.