Pages

Wednesday, August 30, 2017

పాట ఒకటి…ఖచ్చితంగా ఇలాంటప్పుడనేం కాదు కానీ
బద్దకపు మధ్యాహ్నాలు నింపాది నీడల్లోకి వాలుతున్నప్పుడో
నిదురించే ఆకుల మధ్య వెన్నెల విరిగిపడుతున్న సమయాల్లోనో
పాట ఒకటి గుర్తుకొస్తుంది, లీలగా.


మసకబారిన ఒకానొక సాయంత్రంలో ముడుచుకున్న టీకొట్టూ
ఓ మూల బరువుగా ఊగుతున్న రేడియో
మరుగుతున్న టీ లోంచి సుడులు తిరుగుతూ,
టప్… టప్… చూరు నీళ్ళని దాటుకొచ్చి
మొదటిసారిగా పలకరించిందీ పాట!


చెదురు మదురు వర్షాన్నో లేక చిందరవందర గాలినో
గబగబా దాటేస్తున్న అడుగులకి
అడ్డుపడి ఆపింది!

అత్యంత ప్రియమైన వ్యక్తి చెయ్యి పట్టి పిలిచినట్టు
కదలలేక… వదలలేక...
చినుకులతో చేయి కలిపి పాటలో ఒలికిపోయిన
అప్పటి నేను మొత్తంగా గుర్తొచ్చేశాను కానీ
పాట మాత్రం ఇంకా, లీలగానే!


పొడవాటి కాలేజీ కారిడార్లలో
ఈ పాటతో మొదలైన పరిచయాలు, పదిలపడ్ద ఇష్టాలు
చీకటి ఒంటరి వేళల్లో ఈ పాటనెక్కి
చేసిన పాలపుంతల ప్రయాణాలు
ధూళిలా సనసన్నగా రాలుతున్న జ్ఞాపకాలు


ఇన్నేళ్ళ పగుళ్ళలో చెల్లాచెదరయి ఎక్కడ ఇరుక్కుపోయిందో
పనుల మధ్య నిశ్శబ్దంలో ఇప్పుడు వుండుండీ ఊగులాడుతోంది!
నీళ్ళ చప్పుళ్ళనీ పిల్లల అల్లర్లనీ తన జట్టులోకి చేర్చుకుని
మొదలూ చివరా కాని రెండు మూడు పదాల పరదా చాటు నుండి
దొరికీ దొరక్కుండా దాగుడుమూతలాడుతూ…
ఈ పాట ఒకటి, ఉక్రోషాన్ని ఉదారంగా ఇస్తోంది!


కలత నిద్ర ఒత్తిగిలిలో ఏ నడిఝామునో
ఎక్కడిదో ఒక గాలి తెర మగత కళ్ళని తాకిపోతుందా,
గజిబిజి జ్ఞాపకాల ప్రవాహాల్ని తప్పించుకుని
పాట మొత్తం పెదవుల మీదకి చేరిపోతుంది!
మహా శూన్యంలోకి ఒక పక్షి ఈక జారుతున్నట్టు
పల్చటి తేలిక… కాస్త శాంతి… చిన్న నిట్టూర్పూ!(మొదటి ప్రచురణ ఈమాట లో)


9 comments:

Lalitha TS said...

భలే ఉంది మీ కవిత - ఇంతకీ ఏ పాటండీ అది?

నిషిగంధ said...


Thanks, Lalitha gaaru. It's 'suhaani dhal chuki' from Dulari :)

విన్నకోట నరసింహా రావు said...

పల్లవి లిరిక్స్ ఇవని జ్ఞాపకం.
-----------
సుహానీ రాత్ ఢల్ చుకీ
నా జానె తుం కబ్ ఆవొగే
జహా భీ రుత్ బదల్ చుకీ
నా జానె తుం కబ్ ఆవొగే
------------
చాలా చక్కటి, haunting పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

nmrao bandi said...

నిదురించే బ్లాగులోకి కైత ఒకటి వచ్చింది
వెన్నెల్లా హాయి గొలిపే కమ్మటి ఫీల్ ఇచ్చింది ...

ఎందుకండీ మీరు ఎప్పుడో గాని వ్రాయరు !?
వ్రాయరూ ...

ప్లీజ్ ...

Zilebi said...నిదురించే బ్లాగున కై
త దుముకుచు జిలేబి వచ్చె తరమై గనుమా
సదనము మానస వీణగ
చెదురు ముదురు వర్షముల కచేరీ గనుచున్ !

జిలేబి

Hima bindu said...

చాలా బాగుంది

నిషిగంధ said...


అవునండీ, నరసింహారావు గారు అవే లిరిక్స్! థాంక్యూ! :)

nmarao gaaru, బోల్డన్ని ధన్యవాదాలు. ఏంటో అలా గ్యాప్ వచ్చేస్తోందండీ!

వావ్! జిలేబీ గారు.. ఎన్నాళ్ళకి చూశాను మిమ్మల్ని మళ్ళీ! అంతా కుశలమే కదా? థాంక్యూ చిక్కని పద్యాన్ని కానుకగా ఇచ్చినందుకు. :)

ధన్యవాదాలు హిమబిందు గారూ... మీరు కూడా చాన్నాళ్ళకి! :)


Srini Chimata said...

ధూళిలా సనసన్నగా రాలుతున్న జ్ఞాపకాలు.. Amazing!! Kindly keep write more and more kavitalu like these ones!!!

Movie Masti said...

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/