Pages

Monday, October 13, 2008

ఏకాంతార్ణవం..


అతనితో గడపాలనిపిస్తుంది..

ఎవ్వరూ లేని ఏకాంతంలో..
చీకటి పరిమళాన్ని వెలుగురేఖలు
ఒక్కొక్కటిగా చుట్టుముడుతుండగా...

అనంతమనిపిస్తున్నఅతని అస్థిత్వాన్ని
దోసిళ్ళతో దొంగిలిద్దామని
ముందుకెళ్ళబోతే
అతని చిరునవ్వొకటి
పాదాలని తడిపి వెళ్ళింది!

పొగమంచు వలువల్ని విడుస్తున్న
రెల్లుగడ్డితో పరాచికాలాడుతున్న పిల్లగాలి
అతని నవ్వు హోరుతో కలిపి
వింత సవ్వడి చేస్తుంటే..

వెన్నెల స్నానం చేసిన
తెల్లటి తివాచీ మీద
మెత్తగా వత్తిగిల్లుతూ
తదేకంగా చూస్తున్న నా చూపుల్లోంచి
అతని ఒంటి నీలం
గుండెల్లోకి ఇంకుతున్న అనుభూతి..

చేతనాచేతనాల అవస్థ దాటిన మనసు
అతనిలో మునకలు వేస్తూ
అమరత్వాన్ని అనుభవిస్తుంటే

అప్పుడెప్పుడో మధ్యలో ఆగిపోయిన
స్వప్నమొకటి
అరమోడ్పులైన కనుల వెనుక
మళ్ళీ మొదలైంది!!

41 comments:

Purnima said...

Beauty! కవిత్వంలో ఉన్న అందమే ఇది. అన్నీ ఉంటాయి కానీ ఎక్కడో దాక్కుని అప్పుడప్పుడూ కనిపిస్తూ మురిపిస్తాయి.

నా మనసుకి చాలా దగ్గరైన భావన! విపరీతంగా నచ్చేసింది.

ఏకాంతపు దిలీప్ said...

ఏదో ఉంది.. అది ఇంకోసారి నా అంతట నేను కనిపెట్టాలని ఉంది... పౌర్ణమి సమీపించే ప్రతి నాటికి అందరి భావుకుల్లో కలిగే భావనేనా ఇది?
నాకు నచ్చిందని, చాలా బాగుందని నేను ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు... కానీ తెలుసుకోవాలనుకుంటుందేంటంటే నేను కూడా ఇలాంటి భావం తోనే ఎందుకు రాసాను అని... మీరు కూడా వెన్నెల ఉన్నప్పుడే ఎక్కువ రాస్తారా? అందరూ అంతేనా? ఇక్కడ సైన్సు పని చేస్తుందా? ఇది కేవలం ప్రకృతిని చూసి పులకించి భావుకత ఉప్పొంగడం కాదేమో కదా?

సుజాత వేల్పూరి said...

ఇంత అందమైన భావాలు ఎలా ప్రవహిస్తాయి నిషి నీ కలంలోకి? మీరే కాదు మేమూ తిరిగి కంటున్నాం ఆగిపోయిన స్వప్నాల్ని!

Bolloju Baba said...

చాలా అద్భుతంగా ఉంది.
పొగమంచు వలువలు,
చీకటి పరిమళం
వంటి నీలం గుండెల్లోకి ఇంకటం
చాలా మంచి భావాలు. అద్బుతంగా ఉన్నాయి.

అతని చిరునవ్వొకటి
పాదాలని తడిపి వెళ్ళింది!
వై పాదాలూ?

పెదవులు, కళ్లు, హృదయం, చూపులు, తలపులు, కో్ర్కెలు, అందం ఉన్నాయిగా
వై పాదాలూ?

సుజ్జి said...

మత్తు ఇవ్వక ముందు ఎలా ఉంటుందొ తెలీదు..!
మత్తు వదిలాక ఏం జరిగిందొ చెప్పలేం..!
ఇవ్వాళే తెలిసింది.. ఆ మథ్యలొని అవస్థ..
మీ కవిత లా ఉంటుందని..!!

కొత్త పాళీ said...

బాగు బాగు. ఇలాగే కరిగి నీరై ప్రవాహం కడితే .. కలిసి లీనమయ్యేది అతనిలోనే మరి :)

భావకుడన్ said...

చాలా బావుంది.

"నాతొ నేనే అనుగమిస్తూ ....." అన్న కవి మాటకు అద్దం పట్టేలా ఉంది మీ భావోద్వేగం.


"పొగమంచు వలువల్ని విడుస్తున్న
రెల్లుగడ్డితో పరాచికాలాడుతున్న పిల్లగాలి" అదిరింది.

ఇరవై ముప్పయ్ ఏళ్ళనాటి మా రామంతపూర్ గుర్తుకు వచ్చింది.

Srividya said...

"అప్పుడెప్పుడో మధ్యలో ఆగిపోయిన
స్వప్నమొకటి
అరమోడ్పులైన కనుల వెనుక
మళ్ళీ మొదలైంది!! "

చాలా బావుంది. మీ పదాలు మెల్లగా మనసుని తట్టి, సుతిమెత్తగా హత్తుకుంటాయి..

Ramani Rao said...

"అప్పుడెప్పుడో మధ్యలో ఆగిపోయిన
స్వప్నమొకటి
అరమోడ్పులైన కనుల వెనుక
మళ్ళీ మొదలైంది!! "
చాలా బాగుంది.
వెన్నెల్లో స్నానం చేసిన తెల్లని తివాచి... అద్భుతమైన భావం. చాలా బాగుంది.

Kathi Mahesh Kumar said...

ఈ కవిత చదవగానే సడన్ గా మీరాబాయి గుర్తుకొచ్చిందెందుకబ్బా!!

Anonymous said...

Nice one...

నిషిగంధ said...

ముందుగా ఓ మాట..
ఈ కవితకి ప్రేరణ అప్పుడెప్పుడో నా 'కౌముది' కవితకి రఘు గారు రాసిన కామెంట్లో చెప్పిన అంశం "భానోదయం in a beach!"
నిజానికి నాకు బీచ్ లో సూర్యోదయము, సూర్యాస్తమయము రెండూ ఒకేలా ఇష్టం.. కానీ అంతకంటే ఇష్టమైంది ఒంటరిగా, ప్రశాంతంగా సముద్రపుటొడ్డున గడపడం.. అలా చేయగలిగేది చీకట్లు విడీ వీడని తెల్లవారుఝామునే! అందుకే అతనితో ఏకాంతాన్ని వర్ణించాలనిపించింది..

నెనరులు పూర్ణీ, దీపు, సుజాత, బాబా గారు, సుజ్జి, కొత్తపాళీ గారు, భావకుడన్ గారు, శ్రీవిద్య, రమ్ము, మహేష్, కల :-)

@పూర్ణీ, అలా మురిపిస్తుందనే కవితని ప్రేయసితో పోలుస్తారు :-)

@దీపు, very glad to see you around! ఇంతకీ నువ్వు కనుక్కోవాలనుకుంది ఏమిటి?? బాబూ, నేను నీకు కొంపదీసి పున్నమి నాగినిలా కనిపిస్తున్నానా!? పౌర్ణమి రాగానే 'పున్నమి రాత్రీ' అని పాడుకుంటూ పుస్తకం పెన్నూ పట్టుకుని బరబరా బరికేస్తున్నట్లైతే ఊహించుకోవడంలేదు కదా! :))) ఒక్క 'వెన్నెల స్నానం' తప్ప ఈ కవితకీ, వెన్నెలకి ఇంకేం సంబంధం లేదు.. ప్లీజ్ నన్ను నమ్ము :-)

@సుజాతా, పనీపాటా లేనప్పుడు తీరిగ్గా కూర్చుని, తల ఒక్కసారి గట్టిగా విదిలించి, ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచి, శూన్యంలోకి అదేపనిగా చూస్తుంటే ఇలాంటి భావాలన్నీ ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ అయిపోతాయి.. ఇదే నా సీక్రెట్ :-)

@బాబా గారు, అతని చిరునవ్వు = అల.. పొద్దుపొద్దున్నే 'అతనిలో' మునకలేస్తే చలికి ఒళ్ళు జివ్వుమంటుందని తెలివిగా పాదాలకి పరిమితమైపోయా :))

@ సుజ్జి, అంత గందరగోళంగా ఉందన్నమాట ఈ కవిత :-)

@ కొత్తపాళీ గారు, ఒక్క వాక్యంలో భావం మొత్తం కరెక్ట్ గా చెప్పారు! మీరు మీరే!! :-)

@ భావకుడన్ గారు, నిజంగా కొన్ని కొన్ని దృశ్యాలు ఎంత అందమైనవి అయినా రోజూ చూస్తుంటే పెద్ద పట్టించుకోము కానీ కొన్ని ఏళ్ళ తర్వాత అవి గుర్తుకొస్తే 'ఆ రోజులే' వేరనిపిస్తుంది!!

@ మహేష్, మీరాబాయిని గుర్తుచేసుకుని నాకింకో మమచి ఐడియా ఇచ్చారు.. ధన్యవాదాలు :-)

@ స్రీవిద్య, రమణి, కల.. Thank you again! :-)

సుజ్జి said...

ayyo.. meeku ala ardham aiinda??:(
kavitha chala baagundi ani cheppatam kooda ravatam ledu naaku..:((

కొండముది సాయికిరణ్ కుమార్ said...

ఏమీ అనుకోరు కదా :)
'ఏకాంతార్ణవము' కన్నా, 'ఒంటరి సముద్రం' సింపుల్ గా ఉంటుందని నా అభిప్రాయమండి.
ఏకాంతము అంటేనే ఎవ్వరూ లేని సమయమని అర్ధం. కాబట్టి, ఎవ్వరూ లేని ఏకాంతం అనే మొదటి వాక్యంలోనే దోషం కనిపిస్తుంది.
మొత్తం మీద ముగింపు బాగున్నా, మీ కవితల్లోని వస్తువు ఎప్పుడూ ఒకేరకంగా ఉండటంతో కొద్దిగా అసంతృప్తి అనిపిస్తున్నది.

Anonymous said...

బిజీగా వుండి ఆలస్యం గా చూస్తున్నాను.ప్రతీ సారీ చాలా బాగుంది అని రాయడానికి నాకు బోరు గా వుంది నిషీ.మరి ప్రతీ సారీ బాగా రాయడానికి నీకు బోరుగా లేదూ?

Niranjan Pulipati said...

కామెంట్ రాయటం లో నేను ఎప్పుడూ లేటే , నేను చెప్పాలనుకున్నవీ అందరూ ముందే చెప్పేస్తున్నారు. ఇకనుండి నీ బ్లాగు ని రోజూ చూడాలి, అప్పుడైతే తొందరగా కామెంటచ్చు.
షరా మామూలుగానే చక్కటి కవిత, ఆ పదాల అల్లిక లో ఏదో మాయ వుంది.

Unknown said...

నిషి గారు కరిగి పోఇన కల మళ్ళి అక్కడనుంచి మొదలవడం అసాధ్యమని నా అభిప్రాయం.అలాగే రెల్లి గడ్డి సముద్రపు ఒడ్డున వుంటుందా ?కొంచెం అనుమానమే.విందుభోజనం లో రాళ్ళు అడ్డురాకుదడనే ఈ చిన్ని లోపాల్ని(?) ఎత్తి చూపడం జరిగింది. అభినందనలు.

ప్రతాప్ said...

సముద్రం లాంటి ఏకాంతం..
చిరునవ్వులాంటి అలలు..
అద్భుతమైన కలల శరీరవర్ణం..
ఇన్ని ఆనందాల మధ్య అతని/ఆమె తో ఏకాంతాన్ని గడపాలని ఎవరు కోరుకోరు? నేను కోరుకొంటున్నానండోయ్.

@సాయి కిరణ్ గారు,
"అతనితో గడపాలనిపిస్తోంది", "ఎవరూ లేని ఏకాంతంలో" (ఎవరూ లేని ఏకాంతం అంటే, నేను అన్న భావన కలిగించని ఏకాంతం అతనితో ఉన్నప్పుడు అన్న భావం కనిపిస్తోంది. మరి మీకు?)అన్న ఈ రెండు వాక్యాలని కలిపి చదివి అన్వయించుకోండి, అప్పుడు మీకు ఎటువంటి దోషమూ కనిపించదు.

నా ఉద్దేశ్యం ప్రకారం ఒంటరి సముద్రం అన్న దాంట్లో ఏదో తెలియని విషాదం(!) నాకు కనిపిస్తోంది, వినిపిస్తోంది. కవితకు సరైన టైటిల్ నే పెట్టారు నిషి గారు.

ఇక మీ చివరి దానికి, ఒకసారి ఇది చదవండి.

@నిషి గారు,
మీ సమాధానాలు కూడా వినాలని వుంది.

నిషిగంధ said...

@సుజ్జి, నేను సర్దాగానే అన్నాను.. నీ భావం అర్ధం అయింది, ఒట్టు :-)

@ కిరణ్ గారు, బోల్డన్ని అనేసుకున్నా :)) మీరు మరీను! First of all, thanks for the feedback!

'అర్ణవం' లాంటి పదాలు కాస్త క్లిష్టంగా అనిపించినా ఒక్కోసారి అనుకున్న భావానికి సముద్రం వంటి పదాలు మరీ సరళంగా అనిపిస్తాయి (నాకు)..
'ఏకాంతం', 'ఒంటరితనం' ఒకే అర్ధాన్ని స్ఫురింపచేసినా ప్రతాప్ గారన్నట్లు 'ఒంటరి ' అనగానే తెలీని దిగులు వినిపిస్తుంది! అది ఈ కవితలో వినిపించిన భావాలకి సరిపోదేమో!?

'ఎవ్వరూ లేని ఏకాంతంలో' - ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్.. నేను 'ఎవ్వరూ లేని ' జతపర్చింది ''ఏకాంతానికి ' గాఢతనివ్వడానికి.. like, 'నేను ఒంటరిని ' , 'నేను ఎవరూ లేని ఒంటరిని ' రెండూ ఒకటే అయినా భావతీవ్రతలో తేడా ఉంటుంది..

ఇక కధా వస్తువు విషయానికొస్తే, I'm sorry if I disappointed you, but నేను రాసే నాలుగక్షరాలకీ బలమూ, బలహీనత అదే!

@రాధిక, సరే ఈసారి ఇలా ఎప్పటిలా బోరుగా కాకుండా నీకోసం సంచలనంగా రాస్తాను :-)

@ నిరంజన్, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి!! Thanks for the feedback. ఈసారి నించి నేను పోస్ట్ చేయగానే నీకు చెప్తాలే :))

@రవి గారు, నెనరులు.. మళ్ళీ అదే సన్నివేశం/దృశ్యం నించి మొదలవ్వకపోయినా కలలు కంటిన్యూ అవుతాయని నా అభిప్రాయం.. కవితాత్మక దృష్టితో చూడండి మీకూ అనిపిస్తుంది..
beachgrass ని తెలుగులో ఏమంటారో తెలీదు.. చూడటానికి అలా ఉంటుందని రెల్లుగడ్డి అన్నాను.. మికు తెలుస్తే చెప్పండి.. This is what I'm talking about..
http://en.wikipedia.org/wiki/Marram_grass

@ప్రతాప్, All I can say right now is, THANK YOU! ఒక్క 'ఎవ్వరూ లేని ఏకాంతంలో' విషయం లో తప్ప మీరనుకున్నవే నా భావాలూను.. :-)

Rajendra Devarapalli said...

ఆర్నెల్ల క్రితందో,తొమ్మిది నెలల క్రితందో సరిగ్గా గుర్తు లేదు గానీ అదే ఇక్కడా,రానున్న మీ పదహారు టపాలకూ ఖాయం చెయ్యండి .

Anonymous said...

Life is something which has so many dimentions! These small things you talk about all the time in your poetry are the things which make life live worthy!
pedda rachaitha vaipotha vemo thondaralone!

వేణూశ్రీకాంత్ said...

నిషిగంధ గారు ముందు గా మీ బ్లాగ్ గురించి అంధ్రజ్యోతి లో ప్రచురించబడినందుకు అభినందనలు. మీ కవిత ఎప్పటి లాగే చాలా బాగుంది. కూడలి కి దూరం గా ఉండటం వల్ల మీ టపాను మిస్ అయ్యాను కానీ ఇదీ ఒకందుకు బాగుంది అనిపించింది :-) చక్కగా బ్లాగరుల కామెంట్లను వాటికి మీ స్పందనను అన్నీ కలిపి ఒకే సారి చదవగలిగే అవకాశం దొరికింది.

నిషిగంధ said...

రాజేంద్ర గారూ, మీరు కూడా.... మారరు.. మానరు! :))

మధూ, నువ్వు.. ఇక్కడ!!!! సూపర్ హాపీస్ :-)

నెనరులు వేణు గారు :-)

Anonymous said...

Nishi,

Wonderful kavita.. again ardham ayyee, avvanaTTugA unDi kAsEpu nannu eppaTi lAgAnE ee kavita kUDA AlOchanalalO paDEsindi.

Keep going..

Cheers,
Srini
www.ChimataMusic.com

ABHIMAANI said...
This comment has been removed by the author.
ABHIMAANI said...

"NISHIGANDHA......"
apudeppudo "VENNELLO AADAPILLANI" chusanu.
malli ennallaki..
'kallu chesukunna punyamo
kalalu raasukunna kaavyamo.....'
malli ni 'srivariki premalekha' ni chusanu chala bagundi.

Abhinandisthu...
'ABHIMAANI'
9866889944

ABHIMAANI said...

'NISHI..'
వెన్నెల స్నానం చేసిన
తెల్లటి తివాచీ మీద
మెత్తగా వత్తిగిల్లుతూ...
mari edi "anubhuthaaa, anubhavamaa"

yeduruchusthu.....
"ABHIMAANI"
9866889944

Anonymous said...

chala manchi bhavana.....kris

నిషిగంధ said...

నెనరులు శ్రీని గారు, అభిమాని గారు, క్రిస్ గారు..

అభిమాని గారు, అది అనుభవంలోంచి కలిగిన అనుభూతండి :-)

Bolloju Baba said...

radhika gari kaamemTu adiriMdi

ABHIMAANI said...

"NISHIGANDHA..."
modpu kanulu aramodupulepudavthai...?
athanitho gadapalane ni 'NIRIKSHANA' nijamepudavthundi...

nishi...
ni nirikshana nijamy
swapnam 'sajeevam' ayyedepudu...

-ABHIMAANI...!
9866889944

ABHIMAANI said...

"NISHIGANDHA......"
apudeppudo "VENNELLO AADAPILLANI" chusanu.
malli ennallaki..
'kallu chesukunna punyamo
kalalu raasukunna kaavyamo.....'
malli ni 'srivariki premalekha' ni chusanu chala bagundi.

Abhinandisthu...
'ABHIMAANI'
9866889944

ABHIMAANI said...

NISHI...
'SHUBHODAYAM'
---;-<@

నిషిగంధ said...

థాంక్సండీ.. మీక్కూడా అనొచ్చా?

మీ కామెంట్స్ చూస్తుంటే మీరు కూడా కలం ఝుళిపించి కవితలూ, అవీ ఇవీ రాసేయొచ్చనిపిస్తుది! అన్నిటికీ ఒకేసారి ధన్యవాదాలు :)

ABHIMAANI said...

aybaabo yetandi alaganesaru...

'NISHIGANDHA...!!
poyina yedu 'aametho' kalisi vasanthanni
chusanu...
kaani aame vellipoyaka ade vasantham
greeshmamla anipinchindi...
malli ennallaki ni 'kavithallo' vasanthanni
chusthunnanu chusthunnanu..
yeppatiki elage chu..s..thu..ne....
vuntanu..!

malli elage kaluddam
selava mari...
-NEE...!
'ABHIMAANI'
9866889944

Anonymous said...

"అప్పుడెప్పుడో మధ్యలో ఆగిపోయిన
స్వప్నమొకటి
అరమోడ్పులైన కనుల వెనుక
మళ్ళీ మొదలైంది!! "

చాలా మంచి భావన.
తలపుల తలుపులు తెరుచుకుని
స్వప్నలోకాల్లో మేలు కుంటాం..

నిషిగంధ said...

Thank you Saisahithi gaaru :-)

Mohanatulasi said...

Toooooooooooooo Muchhhhhhhhhhhhhhhhhhhhhhhh

bachi145 said...

ఎవ్వరూ లేని ఏకాంతంలో..

చీకటి పరిమళాన్ని వెలుగురేఖలు

ఒక్కొక్కటిగా చుట్టుముడుతుండగా...


అనంతమనిపిస్తున్నఅతని అస్థిత్వాన్ని

దోసిళ్ళతో దొంగిలిద్దామని

ముందుకెళ్ళబోతే

అతని చిరునవ్వొకటి

పాదాలని తడిపి వెళ్ళింది!

''కవీంద్రుడు రవీంద్రుడి గీతాంజలి గుర్తొచ్చింది '' ....ఒక్కటిమాత్రం నిజం ఎక్కడో ఖండాల ఆవలుండి కూడా

మీలాంటి భాషాభిమానులు జీవం పోస్తుండబట్టే మా తృ భాష తన అస్థిత్వాన్ని నిలుపుకొంటూ అజరామరంగా వెలిగిపోతోంది ....ధన్యవాదాలు ..వినమ్రతతో ...భాస్కర్ రెడ్డి ...

bachi145 said...

ఎవ్వరూ లేని ఏకాంతంలో..

చీకటి పరిమళాన్ని వెలుగురేఖలు

ఒక్కొక్కటిగా చుట్టుముడుతుండగా...


అనంతమనిపిస్తున్నఅతని అస్థిత్వాన్ని

దోసిళ్ళతో దొంగిలిద్దామని

ముందుకెళ్ళబోతే

అతని చిరునవ్వొకటి

పాదాలని తడిపి వెళ్ళింది!

''కవీంద్రుడు రవీంద్రుడి గీతాంజలి గుర్తొచ్చింది '' ....ఒక్కటిమాత్రం నిజం ఎక్కడో ఖండాల ఆవలుండి కూడా

మీలాంటి భాషాభిమానులు జీవం పోస్తుండబట్టే మా తృ భాష తన అస్థిత్వాన్ని నిలుపుకొంటూ అజరామరంగా వెలిగిపోతోంది ....ధన్యవాదాలు ..వినమ్రతతో ...భాస్కర్ రెడ్డి ...

krishna said...

తెలుగులో మునిగి తేలుతున్నట్లు మీ భాషాసౌందర్యం చూసి ఇంత బాగా వ్రాయలేని నా అశక్తత నన్ను వెక్కిరించి ఎగతాళి చేస్తుంటే కొంత మీ నుంచి దొంగిలించుకుని పోవాలనుంది. కానీ ఎలా? అది కూడా వచ్చేడవాలి కదా! చదివి తరించడం కూడా ఒక అదృష్టంగా భావించి సంతోషిస్తున్నాను.