Pages

Tuesday, August 6, 2013

కొంచెం పని.. కాసిన్ని నవ్వులు -- 2


(Part - 1)


"I think she is calling you" రిసెప్షనిస్ట్ వైపు చూపించాడు.. 

'ఇతను ఎప్పుడొచ్చాడబ్బా ఇక్కడికి!?' అనుకుంటూ గభాల్న లేచి ఫ్రంట్ డెస్క్ దగ్గరికి వెళ్ళాను.. ఇంకో ఐదు నిమిషాల్లో లోపలికి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పింది! మళ్ళీ వచ్చి నా ప్లేస్లోనే కూర్చుంటూ, 'థాంక్యూ' కాస్త నవ్వుతూ అతనికి చెప్పాను...

"నో ప్రోబ్లెం" అనేసి చూపు వాల్ టూ వాల్ గ్లాస్ విండో వైపుకి తిప్పేసుకున్నాడు

ఆహా, అమ్మాయిలంటే ఎంత మర్యాద, అసలు సూటిగా కూడా చూడలేదు! అనుకుని, నేను మాత్రం చక్కగా, పరిశీలనగా తననే చూశాను..

డార్క్ బ్లూ సూట్, సిల్వర్, లైట్ బ్లూ కాంబినేషన్ నెక్ టై.. చక్కగా జెల్ పెట్టుకుని నున్నగా వెనక్కి దువ్వుకున్న జుట్టు, అచ్చమైన నీలి కళ్ళు, రెగ్యులర్ వర్కౌట్ చేస్తున్నట్టు ఇట్టే చెప్తున్న బ్రాడ్ షోల్డర్స్... వెరసి ఒక వైట్ అమెరికన్.... అనుకుంటూ మళ్ళీ ఇంకోసారి అతని ఫేస్ వైపు అస్సలు మొహమాట పడకుండా చూశాను... అసలా శరీరానికీ, ఫేస్కీ సంబంధమే కనిపించలేదు.. సల్మాన్ ఖాన్ బాడీకి ఎవరో టీనేజర్ ఫేస్ పెడితే ఎలా ఉంటుందీ! అలా అమాయకంగా.. బోల్డంత అమాయకంగా!!! 

' ఇరవై ఏళ్ళుంటాయేమో.. స్టూడెంట్ అనుకుంటా.. ఎంత పద్దతిగా ఉన్నాడు పిల్లాడు!' అని మనసులోనే బోల్డన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నాను.. నాకు తెలీకుండానే మరీ చాలాసేపట్నించీ చూస్తున్నానేమో అతనికి కూడా అర్ధమై నావైపు తిరిగి మొహమాటంగా ఒక చిన్న నవ్వు నవ్వి, మళ్ళీ తలని విండో వైపుకి తిప్పేసున్నాడు.. "ఎంత బుద్దిమంతుడో" ఇంకోసారి అనుకోకుండా ఉండలేకపోయాను!!

అలా మొదటిసారి చూశానతన్ని... రోజునీ, మొదటి అభిప్రాయాన్నీ నేనెప్పటికీ మర్చిపోలేను.. మర్చిపోను కూడా!

అతని పేరు రిచర్డ్.. అందరూ రిక్ అని పిలుస్తారు.. ఆరోజు ఇద్దరమూ మా ఫైనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాము.. ఒకే టీంలో రెండు వేరు వేరు పొజిషన్లలో జాయినయ్యాం.. నాకు క్యాంపస్ తెలీదని ఐడి కార్డ్, వెల్నెస్ కార్డ్, ఓరియెంటేషన్ ఇలా క్యాంపస్ లోని అన్ని బిల్డింగ్స్ కీ తనే తీసుకెళ్ళి చూపించాడు.. నేనేమో మనసులో అతన్ని బుద్దిమతుడు నించి అతి బుద్దిమంతుడు, మహా బుద్దిమంతుడు, అరివీర బుద్దిమంతుడు అని స్టార్స్ కౌంట్ పెంచేసుకుంటూ ఉన్నా!! 

ఇంకా గుర్తు, మొదటి రెండుమూడు వారాల్లో వర్క్‌‌కి రావడం అంటే ఎంతలా హేట్ చేసేదాన్నో! చాలా పొద్దున్నే లేవాల్సి రావడం, లాంగ్డ్రైవ్, అప్పటి వరకూ అస్సలు అలవాటులేని ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, అన్నిటికంటే ముఖ్యంగా టీమ్ మొత్తానికి నేనొక్కదాన్నే అమ్మాయినవడం.. ప్రతిరోజూ కార్ పార్క్ చేస్తూ అనుకోవడమే, 'అబ్బా ఈవినింగ్ ఎప్పుడైపోతుందా!' అని.

ఒక నెలా నెలన్నర గడిచాయేమో... వర్కూ, వాతావరణమూ అంతా అలవాటవుతూ మెల్లగా టీంలోని అందరితో జెల్ అవుతూ ఉన్నరోజులు... మన ఆన్లైన్ తెలుగు పత్రికలన్నీ బుక్మార్క్ చేసేసుకునేంత కంఫర్టబిలిటీ పెరిగిన రోజులు..

ఒకానొక ఉదయం...మొదటి కప్ కాఫీ తాగుతూ, మెల్లగా ఈనాడు పేపర్ ఓపెన్ చేసి, కొంచెం చిన్న విండోగా కుదించి చదువుతున్నా...

వెనకనించి దగ్గరగా రిక్ పిలుపు...
పక్కవాళ్ళ బౌల్లోంచి ఐస్క్రీమ్ దొంగతనం చేస్తూ పట్టుబడినట్టు ఉలిక్కిపడి టక్కున విండో మూసేశా.

అనవసరంగా దడుచుకున్నందుకేమో "ఆర్యూ ఓకే?" అని నావైపో వింత లుక్ వేసి, "You know our boss is a Cuban" అన్నాడు.. తెలుసని చెప్పాను.

ఒక ఐదు నిమిషాలపాటు క్యూబన్ మగవాళ్ళు ఎంత నిష్టాగరిష్టులో, ఎంత పద్దతిగా ఉంటారో, ఎంత గౌరవబద్దంగా జీవిస్తారో లెక్చర్ ఇచ్చి.. "I just want you to be a little familiar with their culture. Also, I think he will be very happy if we greet him in Spanish once in a while" అని సలహా ఇచ్చాడు.. నాకు స్పానిష్ రాదుగా అని దీనంగా చూశాను.. 

తనేమో "Don't worry, I know a little" అంటూ అభయమిచ్చి, "Mr. Mierda would be a good one" అని, ఒకసారి నాతో చెప్పించాడు..

కెనేడియన్ అయినా ఇంత చక్కని స్పానిష్ వచ్చినందుకు మనసులో అతన్ని మళ్ళీ మెచ్చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టి, ఇక నేను మా బాస్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూసి, ఆయన వచ్చి నన్ను విష్ చేయగానే నేను "Good morning, Mr. Mierda" అన్నా.. ఆయన అర్ధం కానట్టు చూశాడు..

ఓ, నా ఏక్సెంట్ సరిగ్గా లేక ఆయనకి నేనన్నది అర్ధం కాలేదని, ఇంకాస్త గట్టిగా, సాగదీస్తూ "GOOOOOD MOOOOORNING, Mr. Mierda"  అన్నా.. తల అటూ ఇటూ కాకుండా ఊపేసి వెళ్ళిపోయాడు!!

నేను రిక్ దగ్గరికెళ్ళి ఇలా బాస్ నా గ్రీటింగ్‌ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాను.. తను సాలోచనగా చూసి "May be it's too strong for him!" అన్నాడు..

అప్పుడు కానీ నాకు వెలగలేదు... ఇంతకీ మాటకి మీనింగేమిటని సూటిగా ప్రశ్నించాను!

"Oh, I didn't tell you!? It means Mr.Perfect" అన్నాడు... బుద్దిగా నేను అవునవును టూ స్ట్రాంగ్ గానే ఉంది, అని ఒప్పేసుకున్నాను..

నేను వెళ్ళిపోబోతుంటే చెయ్యి పట్టుకు ఆపి, "How about this? Mr. Viejo.. Mr. Decent??" మళ్ళీ ఇంకో గ్రీటింగ్ చెప్పాడు..

పర్ఫెక్ట్ కంటే డీసెంట్ కాస్త డోస్ తక్కువగానే ఉందనిపించింది.. మరీ బాస్‌ని కాకా పట్టేలా లేదని కూడా అనిపించి, సరే సరే అంటూ బేషరతుగా అంగీకారాన్ని తెలిపాను...

అలాంటి ఉదయమే.. మరుసటి రోజు.. మళ్ళీ బాస్ విష్..

నేను పేద్ద స్మైల్ ఇస్తూ "Good morning MR. Viejo!“
 
ఈసారి ఆయన తలూపి వెళ్ళిపోలేదు.. అక్కడే ఆగి "What did you just say?" అని అడిగాడు.. అబ్బో, నా పిలుపు ఆయనకి తెగ నచ్చేసిందని మళ్ళీ రిపీట్ చేశాను..

"You know what it means?" ఆయన ప్రశ్న..

"Oh yea, Mr. Decent" నా నవ్వుని ఎక్కడా సడలనీయకుండా చెప్పాను..

అంతే! అక్కడే ఉన్న ఒక చెయిర్లో కూలబడి అదేపనిగా నవ్వడం మొదలుపెట్టాడు!! ఒక రెండు నిమిషాలు నవ్వి మరి నిన్న చెప్పినదానికి అర్ధం అంటే, రిక్ నాకు చెప్పిందే మళ్ళీ నేను ఒబీడియంట్ గా అప్పగించాను...

ఇక ఆయనైతే " మ్యాన్!" అనేసి ఇంకా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు... కలుగులో ఉన్న ఎలుకలు బయటకు వచ్చినట్టు మా టీమ్మేట్సందరూ బయటకి వచ్చి  ఆయనతో జత కలిశారు.. 


నాకేమో ఒళ్ళు మండిపోతోంది.. రిక్ అయితే సరే సరి, నేల మీద దొర్లి దొర్లి నవ్వుతున్నాడు!!!!

మా బాస్ నవ్వడం ఆపి "who made you to say these?" అనడిగితే లిటరల్గా నేలమీద పడిపోయి ఉన్న రిక్ని చూపించాను.

"Oh My! How could you just believe him?! There is a thing called Google, you know!" అని నన్ను పట్టుకు ఊపేస్తూ మళ్ళీ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు!!

'Because I trusted him...' నేను అస్పష్టంగా చెప్పినా వినిపించినట్టే వచ్చి రిక్, ' యాం సో సారీ... " అంటూ చేతులు పట్టుకుని దీనంగా చూశాడు...

ఇంతకీ మీనింగేమిటని అడిగితే వాళ్ళు చెప్పింది విని నాకూ నవ్వాగక వాళ్ళకంటే ఎక్కువగా నవ్వడం మొదలుపెట్టాను... 

' అబ్బాయి ఎంత బుద్దిమంతుడో!' అన్న నా మొట్టమొదటి అభిప్రాయాన్ని రిక్ స్పానిష్ గ్రీటింగ్ డైనమైట్తో ముక్కలు ముక్కలు చేశాడు... 

And, the sad/funny part is, that was only the beginning........................(FYI..... Mierda (మియర్డా) = s**t ......... Viejo (వియహో) = old man) 

వయసు ఏ ఎర్లీ ఇరవైల్లో ఉంటాయనుకున్న అతను నాకంటే రెండేళ్ళు పెద్ద అని, తను అమెరికన్ కాదు కెనేడియన్ అని, మాస్టర్స్ చదవడం కోసం మా యూనివర్సిటీకొచ్చి ఇక్కడే జాబ్ లో సెటిల్ అయిపోయాడని నెమ్మది నెమ్మదిగా వివరాలన్నీ తెలుస్తున్నాయి.. అంతే కాదు పని చేసేప్పుడు ఎంత సీరియస్ గా, పూర్తి ఏకాగ్రతతో చేస్తాడో అల్లరి కూడా అంతే డెడికేషన్తో చేస్తాడు.. చెప్పానుగా మా టీంలో ఆరుగురు అబ్బాయిలు, నేనొక్కదాన్నే అమ్మాయినని.. అందుకే తన అల్లరికి ఎప్పుడూ నేనే టార్గెట్ అయ్యేదాన్ని!

ఉదాహరణకి ----

** ప్లాస్టిక్ గ్లాస్ నిండుగా నీళ్ళు పోసి ఆఫీస్ డోర్ పైన పెట్టి, అతి నెమ్మదిగా దగ్గరికి లాగి ఉంచేవాడు.. టైం కి నాకు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన పని 'కాకతాళీయంగా' వచ్చేది! మనం ముందూ వెనకా చూసుకోకుండా లేచి తలుపు దఢాలున లాగేసరికి గ్లాసు నీళ్ళూ నన్ను అభిషేకం చేయడంలో పూర్తిగా సఫలం అయ్యేవి! తర్వాత మనం ఎంత ఫుల్ బాటిల్ నీళ్ళు తనపై గుమ్మరించినా అది లెక్కలోకి రాదు కదా!

** ఇంకోసారి, ఇంటికి బయలుదేరే సమయానికి భోరున వర్షం పడుతుంటుంది.. 'ట్రాఫిక్ ఎంత స్లోగా ఉంటుందో' అని వేరే ఫ్రెండ్స్తో మొరపెట్టుకుంటూ, బిల్డింగ్ బయటకి వచ్చి గొడుగు ఓపెన్ చేయగానే దాన్లోంచి ఒక బుట్టెడు ష్రెడ్ చేసిన పేపర్ ముక్కలు భళ్ళున నవ్వుకుంటూ మనమీద కురిస్తే ఎలా ఉంటుంది!? మరుసటిరోజు తన ఫైల్ కాబినేట్స్ నిండా అవే పేపర్ ముక్కలు పూర్తిగా నింపేసినా నా గొప్పతనం తను ఒప్పుకోడుగా!!

** అప్పుడే లంచ్ నించి వచ్చి, పూర్తిగా పనిలో మునిగిపోయిన బిజీ మధ్యాహ్నం.. వచ్చి ప్రోజెక్ట్ గురించి ఏవో సీరియస్ ప్రశ్నలు అడుగుతాడు.. నేనేమో ' నో ఇట్ ఆల్ ' లెవల్లో ప్రతీదీ ఆవేశంగా వివరిస్తున్న సమయం... ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ మోగుతుంది.. స్క్రీన్ మీద నించి దృష్టి మరల్చకుండా ఫోన్ లిఫ్ట్ చేసి 'హలో' అనగానే అటు నించి 'హి గాట్ హర్ ఎగైన్ ' అని పెద్దగా నవ్వులు... కాస్త అయోమయగా అనిపిస్తుండగానే చెవులకి ఏదో మెత్తగా గ్లూయీగా అతుక్కున్న చల్లదనం.. కెవ్వున రిసీవర్ చేతిలోంచి పడేస్తే దాని హెడ్ పీస్ కి ఇంత మందాన పూసి ఉన్న క్లియర్ షేవింగ్ జెల్!! తర్వాత అతని డెస్క్ మీద అదే షేవింగ్ జెల్ తో పేద్దగా 'I HATE YOU! అని రాస్తే, క్లీన్ చేసుకుంటూనే "You know! Hate is a strong word. I'm sure you don't hate me" అంటూ నవ్వుకున్నాడు..

ఇలా ఎప్పుడూ ఏడిపిస్తూనే, "you are such a good sport and are so sweet" అని కాస్త పొగిడేశేవాడు.. తనకే అప్పుడప్పుడూ అనిపిస్తుండేదేమో కాస్తెక్కువే ఏడిపిస్తున్నానని.. అలాంటప్పుడు భలే విచిత్రమైన పనులు చేశేవాడు.. నేను కాస్త సీరియస్ అయ్యానని అర్ధమైనప్పుడోసారి ఉదయం రాగానే, ముందు నించుని 'this is for you' అంటూ నా ఫోన్ రింగ్‌టోన్ సాంగ్ 'కలసిన సమయాన.. కనులకు ఓ వాన' (ఈ పాట చాలా ఇయర్స్ నా రింగ్‌టోన్‌గా ఉండేది!) పాట పల్లవి మొత్తం పాడి వినిపించాడు... ఆరోజు మాత్రం భలే మూవ్ అయిపోయాను!

అలా చేసిన రెండో రోజు నించే మళ్ళీ ఏదో ఒక అల్లరి!

ఒకసారి మాత్రం నాకు చాలా కోపం వచ్చి 'అసలు నీకు మామూలుగా, నైస్ గై లా ఉండటం రాదా!' అని గయ్యిమని అరిచాను.. ఒక 2 నిమిషాలు ఏం ఆలోచించుకున్నాడో ఏమో! "You are right. you deserve to be treated nice. I will be nice to you until you ask me to stop!" అని ఒక వింత చాలెంజ్లాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు..

నేనేమో 'ఇంకా నయం! స్టాప్ బీయింగ్ నైస్ అని చచ్చినా అనను ' అని డిక్లేర్ చేశాను.. తను నవ్వేసి వెళ్ళిపోయాడు..

బట్, అది ఇంకో రకమైన టార్చర్ అని అర్ధమవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు!!!


**********************************************************************************************************
ఎప్పుడూ కవితలే కాకుండా మానవాళి క్షేమం కోరి అప్పుడప్పుడూ మామూలు విషయాల గురించి కూడా టపాలు రాయమని అడిగే శ్రావ్య కోసం ఈ పోస్ట్. :-)
*********************************************************************************


(Pictures - Courtesy Google Images) 
   

17 comments:

Sravya V said...

హ హ నిషి , నాకు మౌనరాగం సినిమా గుర్తుకు వచ్చింది ! పాపం మీరు :-)

అవునూ , అప్పుడెప్పుడో ఒక బజ్ లో మీ కొలీగ్ ఒకరు జాబ్ చేంజ్ అవుతున్నారు అని మాట్లాడుకున్నాం ఇతనేనా అతను :-) బట్ భలే ఉన్నాయిలే మీ ఎక్స్పీరియన్సెస్ :-)

Chandu S said...

నిషీ, సూపర్ గా ఉంది. Thanks to Sravya.

MURALI said...

వావ్ సూపర్, కానీ మొత్తంగా ఒకేసారి కాకుండా ఇలా భాగాలుగా వ్రాసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అండమాన్ జైళ్ళో పడేయాలి.

తృష్ణ said...

ఎంత సహనమండీ మీకు! నీళ్ళు మీద పొయ్యటమే... నాకు చదవడానికే కోపం వచ్చేస్తోంది :) అసలు ఇంట్లో సరదాగా ఎవరన్నా నీళ్ళు చల్లితేనే నాకు చిరాకు. మా అమ్మతో కూడా పోట్లాడేసేదాన్ని.మీ ప్లేస్ లో నేనుండి ఉంటే అని ఊహించుకున్నా...పాపం ఆ కెనడియన్ పని అయిపోయేది :-)
Actually i've to agree, am a bad sport. అందుకే పాపం..'తల్లీ నువ్వు ఉద్యోగానికి మాత్రం వెళ్ళకు. ఎవడిమీదైనా కోపం వచ్చి ఏ పేపర్వెయిటో విసిరేసావంటే నా పని గోవిందా..' అంటూంటారు మా అయ్యగారు :-)

KumarN said...

Absolute fun to read :) Thank you.

రాజ్ కుమార్ said...

మీరెలా ఎంజాయ్ చేశారో గానీ,నా వరకూ ఎవరైనా ప్రాక్టీకల్ జోక్స్ చేస్తే అగ్గి రాలిపోద్ది.;)

పద్మ said...

LOL నిషీలూ. నాది శ్రావ్యా డౌటే. :)))))) ఆ మూమెంట్‌లో పిచ్చి కోపం వచ్చినా అలాంటి కంపనీ భలే ఎంజాయ్ చెయ్యచ్చే.

వేణూశ్రీకాంత్ said...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ నిషీ... అమ్మో మీ సహనం లెవల్స్ ఈ రేంజ్ లో ఉంటాయా :-) వర్క్ ప్లేస్ లో ఇంత సరదాగా ఉండడం ఇన్నేళ్ళలో నేనెక్కడా చూడలేదు :-) నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ :)

మధురవాణి said...

​​ఈ ​బ్రేక్లు ఎందుకమ్మా మధ్యలో.. రేపటి దాకా వెయిట్ చెయ్యాలా ఇప్పుడు.. ఒకోసారి విషయం తెలిసినా కూడా చదవడానికి వెయిట్ చెయ్యడం చాలా కష్టం కదా.. :P
ఆఫీసులో గ్లాసు నీళ్ళు మీద పొయ్యాడమా.. హమ్మో!! ఈ లెక్కన నాలాంటి వాళ్ళని bad sport అనో worst sport అనో అనాలేమో! :-)​

బంతి said...

ha ha super :)

మేధ said...

అప్పుడే రెండో భాగం కూడానా.. ఇందాకే మొదటి భాగం చూశాను :)
>>నీళ్ళు మీద పోయడమే!!
మీకు చాలా , చాలా అంటే చాలా సహనమండీ బాబూ :)

సిరిసిరిమువ్వ said...

:)..రిక్ భలే నచ్చేసాడు నాకు. ప్రాక్టికల్ జోక్సు ఎంజాయ్ చెయ్యటం కూడా ఒక కళే..సో నువ్వు కూడా భలే నచ్చేసావు నాకు ఆ విషయంలో!

నువ్వు తలుపు తియ్యగానే నీళ్ల గ్లాసు నీ మీద పడటం తలుచుకుంటే భలే నవ్వొస్తుంది:)

Sunita Manne said...

శైలజ గారి కామెంట్ కాపీ పేస్ట్ ఇక్కడ:)))

sreelu said...

హ హ హ హ.........

నిషిగంధ said...

@ శ్రావ్య -- థాంక్యూ.
నిజమే, నాక్కూడా ఆ ఇన్సిడెంట్ అయిపోయాక అదే గుర్తొచ్చింది! కాకపోతే బోల్డంత సీరియస్ లుక్స్ ఉండే ఇక్కడి ప్రొఫెషనల్ ఎన్విరాన్‌మెంట్‌లో అలా జరగొచ్చని అస్సలూహించలేదు!
అవునవును, అతనే! భలే గుర్తుందిగా నీకు! :)

@ చందు శైలజ గారు - మీ కామెంట్ చూసి ఆనందంతో కాసేపు సల్సా డాన్స్ చేసుకున్నానండీ! థాంక్యూ సో మచ్! :-)

@ మురళి -- హహాహ.. మరీ అండమాన్ వద్దు లేండీ, ప్లీజ్.. వెంటవెంటనే పోస్ట్ చేసినందుకైనా ఏ చర్లపల్లి జైలుకో పంపండి :)) థాంక్యూ!

@ తృష్ణ -- థాంక్సండీ! నిజమే, చాలామందికి నీళ్ళు మీద పడితే ఇష్టం ఉండదు. అదీ ఆఫీస్ ఎటైర్‌లో అసలు ఊహించలేము ఆ పరిస్థితి. నాది సహనమని చెప్పను కానీ ఫన్ అంటే చాలా ఇష్టమండీ.. పైగా చెప్పాను కదా, తను గ్లాస్ పొస్తే నేను బాటిల్ పోశానని! అప్పుడు తనూ సరదాగానే తీసుకున్నాడు.
లేదండీ, అలా అనుకుంటామంతే మనకి కోపం వస్తే ఆఫీస్‌లో వాళ్ళు అయిపోతారని.. ఎంతో పెద్ద విషమైతే తప్ప మన కోపాన్ని బయటకి డిస్ప్లే చేయము అక్కడ!

నిషిగంధ said...

@ KumarN --- VERY happy to see your comment, Kumar gaaru. Thanks so much! :-)

@ రాజ్ కుమార్ -- అనుకుంటాం కానీ ఆ కోపం రెండు మూడు సెకన్ల కంటే ఎక్కువుండదండీ.. ఎందుకంటే మళ్ళీ మామూలైపోయి మనమెలా ఎటాక్ చేయాలో ఆలోచించాలి కదా! :)) థాంక్యూ!

@ పద్మ -- ఎగ్జాక్ట్లీ పద్దూస్, ఎప్పుడూ ఏదో ఒక వ్యూహ రచనతో భలే ఎక్సైటింగ్‌గా ఉంటుంది. నీ డౌట్‌కి ఆన్సర్ ఇచ్చేశాను చూడు మరి. :-)

@ వేణూశ్రీకాంత్ -- దానికి సహనమంత పెద్ద పేరు వద్దులే వేణూ.. చిన్నప్పట్నించీ చుట్టూ కజిన్స్ అందరూ అబ్బాయిలైనందువల్ల కాస్త స్పోర్టివ్ అంతే! థాంక్యూ :-)

@ మధురవాణి -- అంతే అంతే.. మాటల్లో విన్నది, అక్షరాల్లో చదవడానికెలా ఉంటుందనే కుతూహలం ఉంటుంది కదా! నిన్ను మరీ వెయిట్ చేయిస్తే సారీ ;) థాంక్యూ.. :-)

నిషిగంధ said...

@ బంతి -- థాంక్యూ.. థాంక్యూ :-)

@ మేధ -- మీరు కూడా దాన్ని సహనమనేసుకున్నారా! లేదు లేదు.. పార్ట్ ఆఫ్ ద గేమండీ.. మనకి రెండు దెబ్బలు తగిలితే మనం నాలుగు వెనక్కి ఇస్తాం.. అంతే! థాంక్స్.. again, really happy to see you back..

@ సిరిసిరిమువ్వ -- రండి రండి వరూధిని గారూ, మీరు అర్ధం చేసుకున్నారు అందులో ఉన్న అసలు ఫన్.. నిజమండీ, ఆ రోజు నన్ను చూసుకుని నేనే నవ్వుకున్నా, 'భలే పెట్టాడే గ్లాస్ ' అనిపించింది కూడా.. ధన్యవాదాలండీ :-)

@ సునీత గారు -- అయితే శైలజ గారికిచ్చిన రెస్పాన్సే మీక్కూడా.. కాకపొతే డ్యాన్స్ మాత్రం తీన్మార్ వేసుకోండీ ;) థాంక్యూ థాంక్యూ :))

@ sreelu - ధన్యవాదాలు :))