Pages

Wednesday, August 7, 2013

కొంచెం పని.. కాసిన్ని నవ్వులు -- 3(Part -1      Part - 2)ఉద్యోగం చేసేవాళ్ళందరికీ ఒక సౌలభ్యం ఉంటుంది. దేవుడు మనకి రెండు జీవితాలని ఇస్తాడు. ఒకదాంట్లో కాకపోయినా ఇంకోదాంట్లో నిర్వాణంకి ట్రై చేయమని! అంటే ఏదో ఒక దాంట్లోంచి వచ్చే స్పూర్తితో ఇంకో దాంట్లో వచ్చే సమస్యలని బ్యాలన్స్‌డ్‌గా సరిదిద్దుకోమని! రెండూ ఒకేలా తంతుంటే పరిస్థితేంటీ అని అడిగితే మాత్రం మీరు ఈ బ్లాగులు చదవడానికే అర్హులు కారు.. ఆ! అసలు సోషల్ నెట్‌వర్కింగ్ అనే ఇంకో ఉతృష్టమైన జీవితం గురించి మీకు తెలీకపోతే ఈ ఆన్లైన్ పరిశరాల్లోనే ఉండటానికి తగరన్నమాట. :)

సుభాషితాలు ఆపి అసలు విషయంలోకి వస్తే.... 

రిక్‌కి నేనో నిక్‌నేమ్ పెట్టాను. ఎక్కడ కాస్త చూడముచ్చటగా ఉన్న అమ్మాయి కనబడ్డా చాలు ముచ్చట్లు పెట్టేస్తాడు.. ఐదునిమిషాల్లో ఆ అమ్మాయి కుక్కపిల్ల పేరు దగ్గర్నుండీ డెంటిస్ట్ ఆఫీస్ అడ్రెస్ వరకూ వివరాలు లాగేస్తాడు.. ఆ అమ్మాయికి తెలీకుండానే ఆమె మాటల్తోనే ఆమెకో ప్రోబ్లెమ్ క్రియేట్ చేశేస్తాడు.. 'అయ్యో, ఇందులో ఆలొచించడానికేముంది, అది చాలా చిన్న సమస్య.. నీకెందుకు భయం, మై హూ నా!' అని అభయహస్తమిస్తాడు! అలా ఏ డిపార్ట్‌మెంట్‌కి వెళ్ళినా, కెఫెటేరియా, జిమ్, పార్కింగ్ లాట్ ఎక్కడబడితే అక్కడ అమ్మాయిలు 'హాఆఆఅయ్ రిక్' అని పలకరిస్తారు.. సో, తనకి నే పెట్టిన పేరు కేసనోవా. మా ఇంటాయన మా ఆఫీసు వైపు పనుండి వచ్చినప్పుడు రెండు మూడు సార్లు అందరం కలిసి లంచ్‌కి వెళ్తే, ఈ అమ్మాయిల సమూహాన్ని చూసి తెగ ఆశ్చర్యపోయారు (అబ్బే, అది అసూయ అస్సలు కాదు!) నేను పెట్టిన పేరు పూర్తిగా న్యాయభరితమైనదేనని సెలవిచ్చారు కూడా!

ఈ సదరు కేసనోవా గారు, నైస్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తానన్న మరుసటిరోజు నించీ పద్దతిగా good morning... do you want me to bring you some coffee.. should I prepare the meeting notes for you.. hope you had a nice lunch లాంటి ప్రశ్నలు/పరామర్శలు అదేపనిగా అడుగుతుంటే ముందు బానే ఉంది కానీ ఒక వారం రోజులయ్యాక మొదలైంది బుర్రలో దురద!!!

మాట్లాడితే 'may I...?' or 'let me please....' అంటూ సంభాషణ మొదలుపెడుతుంటే ఎవరో చేతులు కట్టేసి నోట్లో అదేపనిగా మైసూర్ పాక్ లు కుక్కుతున్న ఫీలింగ్..

తను కనిపించగానే నేను పక్కకి తప్పుకుంటుంటే అక్కడికి కూడా వచ్చి, "Is there something wrong? can i help you?" అనే ప్రశ్న బుద్దిగా నోట్లోంచి వస్తున్నా కళ్ళల్లో పట్టలేని అల్లరి!!

ఈ కుశల ప్రశ్నలు ఓకే.. ఆ తర్వాత మొదలైంది అసలు 'నైస్ ' ట్రీట్‌మెంట్!! మీటింగ్స్ కి వెళ్తే ముందుకి దూకి కుర్చీ లాగి, చేత్తో గబగబా శుభ్రం చేసి "here.. have a seat" అని చూపిస్తే అందరూ వింతగా నా వంకే చూడటం!! 


లంచ్‌కి బయటకి వెళ్తే కార్‌లో తను ఏ సీట్‌లో కూర్చున్నా పరిగెత్తుకుని నా సీట్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి పట్టుకోవడం..

బ్రేక్ పాయింట్ ఏమిటంటే, ఒకసారి తన కార్లోనే వెళ్తే, నా డోర్ దగ్గర కింద తన జిమ్ టవల్ పరిచి మరీ అప్పుడు ఓపెన్ చేశాడు.. "I can't see your feet touching this dirty parking lot" అని అనగానే నేనిక చేతులెత్తేశాను!!  

'బాబ్బాబూ, నీ నార్మల్ ట్రీట్‌మెంటే చాలా బెటర్.. ఈ నైస్ ట్రీట్‌మెంట్ భరించడం నా వల్ల కాదు' అని అక్కడే పార్కింగ్ లాట్లోనే బతిమాలుకుంటుంటే "are you sure?" అని ఒక పది సార్లు అడిగి, మళ్ళీ తన అసలు రూపంలోకి షిఫ్ట్ అయిపోయాడు.

కాకపోతే ఆ తర్వాత నించీ నాక్కొంచెం ప్రమోషన్ ఇచ్చి, వేరేవాళ్లని ఏడిపించడంలో నా చేత కూడా ప్లాన్లు వేయించేవాడు. మనకి మొదటి సంవత్సరం రాగింగ్ ఎందుకు ఉంటుంది? అందులో బాధలున్నా భరించి, నేర్చుకుని, వచ్చే సంవత్సరానికి మనమే ర్యాగింగ్ చేయగల పరిణితి సాధించాలని కదా! అలా అన్నమాట.. 


వాటిల్లో అన్నిటికంటే పెద్దది -- వేరే టీమ్‌లో ఉన్న ఇద్దరు అప్పుడే జస్ట్ డేటింగ్ మొదలుపెట్టారు.. వాళ్ళిద్దరికీ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ అయిపోయిందని చెప్పి మా టీమ్‌లో ఇంకో అతని అపార్ట్మెంట్లో సర్‌ప్రైజ్ పార్టీ అరేంజ్ చేయించాం.. అందరం వచ్చాం కానీ ఆ ఎంగేజ్‌మెంట్ కపుల్ ఇంకా రాకపోయేసరికి మా టీమ్మేట్ వాళ్ళకి ఫోన్ చేయబోతుంటే అప్పుడతనికి ఇచ్చాం పెద్ద సర్‌ప్రైజ్, ఆ పార్టీ కేవలం మా టీమ్ కోసమేనని!! :) :)ఒకసారి ఈ రిక్‌గారే వెకేషన్‌కి వెళ్ళొచ్చేసరికి తన క్యూబికల్‌ని చిన్నగా చేసేసి లోపల నానా జంక్ నింపేసి, పెపర్ డోర్‌తో మూసేశాం.. ఇలా...

మామూలుగా బర్ట్‌డే బెలూన్లు రంగు పేపర్లతో డెకరేట్ చేస్తాం కదా.. ఒక కొలీగ్ ఆఫీస్ ని మాత్రం వాల్ టూ వాల్ రీసైకిల్ పేపర్‌తో అతికించేశాం...

ఇలా ఎప్పటికప్పుడు ఒక్కళ్ళమీద ఒకళ్ళం ప్రాంక్స్ ప్లే చేసుకుంటూ, మిగతావాళ్లని ఎలా one upping చేయాలా అని మాస్టర్ ప్లాన్స్ వేస్తూ ఉంటాం. బెస్ట్ థింగ్ ఏంటంటే, అందరూ జీవియల్‌గా ఉండి ఇలాంటివి ఎంజాయ్ చేశేవాళ్ళే కానీ ఎవరూ పర్సనల్‌గా తీసుకుని ఫీలయ్యేవాళ్ళు కాదు. ఎప్పుడన్నా ఎవరి మీదన్నా కొంచెం హార్ష్ జోక్ ప్లే చేసినట్లు అనిపించగానే, అందరూ నన్నే ఆదర్శంగా తీసుకునేవాళ్ళు 'ఆడపిల్ల అంత స్పోర్టివ్‌గా తీసుకుంటుంది, వై కాంట్ వియ్!' అని అంతలోనే సమాధానపడి నవ్వేసేవాళ్ళు..

అంతలో ఒకసారేమయిందంటే...........

అప్పటికి సుమారుగా ఒక నాల్రోజుల నించీ మా కాసనోవా ఎటువంటి అల్లరీ చేయకుండా చాలా సీరియస్‌‌గా పని చేసుకుంటున్నాడు.. సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు తను అలానే తన చుట్టూ ఒక ఇన్విజిబుల్ గోడ్ కట్టేసుకుంటాడు కాబట్టి మేమూ పెద్ద పట్టించుకోకుండా మా పని మేం చేసుకుంటూ, లోపల్లోపల కాస్త సంతోషంగా ఉన్నాం కూడా. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద ప్రాక్టికల్ జోక్ ప్రయోగింపబడుతుందనే టెన్షన్ ఉండదు కాబట్టి!

అలాంటి వర్కింగ్-విత్-ఏన్-యాటిట్యూడ్ ఫేజ్‌లో ఒకానొక ఉదయాన్న తను నాదగ్గరికి వచ్చి, వేరే డిపార్ట్‌మెంట్‌లో మీటింగ్ ఉందనీ, ఆ సమయంలో కొన్ని యూజర్ కాల్స్/ఈమెయిల్స్ రావొచ్చనీ, కొంచెం అటెండ్ చేయమని చెప్పాడు.. 'తప్పకుండా' అని హామీ ఇచ్చాను.. తను టకటకా హడావిడిగా వెళ్ళిపోయాడు.. అతను వెళ్ళాల్సిన డిపార్ట్మెంట్ ఉన్న బిల్డింగ్ చాలా దూరంలో ఉంటుంది, అందుకే కాస్త తిట్టుకుంటూ కూడా వెళ్ళాడు..

నేను మళ్ళీ నా పనిలో మునిగిపోయాను. ఇంతలో ఇంకో కొలీగ్ నించి ఫోన్.. నీకో ఈమెయిల్ ఫార్వార్డ్ చేశాను, కంగారుపడకుండా చూడు అని! ఎవరన్నా కంగారుపడొద్దు అని స్పెసిఫిక్‌గా చెప్తే అది ఖచ్చితంగా కంగారుపడే మేటరే అయి ఉంటుందని మళ్ళీ వేరే చెప్పాలా!!! సో, బ్రహ్మాండంగా భయపడుతూనే ఓపెన్ చేశాను.. అది, రిక్ నించి ఆ ఇంకో కొలీగ్‌కి వచ్చిన ఈమెయిల్.. దాని సారాంశం ఇది...
'డూడ్.. నేను మీటింగ్ కోసం పరుగులు పెడుతుంటే పార్కింగ్‌లాట్లో ఈ కార్ కనిపించింది. ఇది మన బ్యాంబి (నాకు మా వాళ్ళు పెట్టిన పేరు) కారు కదా! ఎవరో రివర్స్ చేస్తూ ఈ కార్ ని గుద్దేసి వెళ్ళిపోయినట్లున్నారు.. నేను హర్రీలో ఉన్నాను కాబట్టి తనకి నువ్వే నెమ్మదిగా చెప్పు ' .

వెంటనే నేను ఆ ఈమెయిల్‌కి ఉన్న ఎటాచ్‌మెంట్ ఓపెన్ చేశాను... యెప్ప్.. అది నా కారే.. సైడ్ కి అంతా పెద్ద చొట్టపడి, బాక్ మిర్రర్ క్రాక్ ఇచ్చేసి!!!! నాకు గుండె జారిపోయింది.. ఇదేంటి బంగారంలాంటి కారు, కొని ఇంకా సంవత్సరం కూడా అవలేదు అనుకుంటూ మా ఇంటాయన గారికి కాల్ చేశాను.. తను సరిగ్గా ఫ్లైయిట్‌లో బోర్డింగ్ అయిపోయి కూర్చున్నారు.. నేను ఆల్మోస్ట్ ఏడుస్తూ విషయం చెప్పాను.. తనేమో ముందు పోలీస్‌లకి కాల్ చేసి, వాడి దగ్గర రిపోర్ట్ తీసుకుని ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ వాడికి విషయం చెప్పమని గబగబా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు.

(ఆరోజు వాళ్ళు నాకు పంపిన నా కార్ ఫోటో)అంతలో అసలు ఈమెయిల్ ఫార్వార్డ్ చేసిన కొలీగ్ వచ్చి, ఆర్యూ ఓకే, అది నీ కారే కదా, అని అడిగి... ముందు పార్కింగ్‌లాట్‌కి వెళ్ళి పోలీస్‌కి కాల్ చేయ్యమని చెప్పాడు.. ఇహ, అదే ఏడుపు ఫేస్ కంటిన్యూ చేస్తూ నేను గబగబా బయటకి రాబోతుంటే కుండపోతగా వర్షం. అప్పుడది వర్షాకాలం కానేకాదు.. సో, గొడుగు హ్యాండీగా లేదు.. చచ్చినట్టు మళ్ళీ బిల్డింగ్ లోపలికొచ్చి గొడుగు కోసం జనాల్నందరినీ అడుక్కుని బయటపడ్డాను..

ఆల్మోస్ట్ పరిగెడుతున్నట్టే నడుస్తుంటే వెనక నించి పిలుస్తున్నట్టు వినిపించి, తిరిగి చూస్తే రిక్! ఇదేంటీ, మీటింగ్‌లో ఉండాల్సినవాడు ఇక్కడున్నాడు అనుకుంటూ, ఆ మరుక్షణంలోనే గుర్తొచ్చింది తనే కదా అసలు కార్ ఫోటో పంపింది అని! వెంటనే అడిగాను, ఇలా కార్ దగ్గరికి వెళ్తున్నాను.. పోలీస్‌లకి కాల్ చేయాలి, కాస్త హెల్ప్ చేస్తావా? అని.

"ఓ తప్పకుండా.. ముందు ఇవ్వాళ డేటేంటో చెప్పు ' అన్నాడు.. ఇప్పుడు డేట్‌తో పనేంటీ అని చిరాగ్గా మొహం పెడుతూ, డేట్ చెప్పబోతూ ఆగిపోయాను... ఓ.. మై... గాడ్!! ఏప్రిల్ ఫస్ట్!!! 

ఎదురుగా ఆ మహానుభావుడు కెరటమేదో బర్స్త్ అయినట్టు విరగబడి నవ్వుతున్నాడు.. నాకు అప్పటికీ నమ్మకం కుదరలేదు.. 'మరి నా కార్.. ఆ డెంట్.. పిక్చర్..' అని అంటున్నా.. 'అది నీ కారే కానీ, దానికేమీ అవ్వలేదు.. ముందు లోపలికెళ్దాం పద, వర్షం చాలా ఎక్కువగా పడుతోంది ' అని బిల్డింగ్ లోపలికి లాక్కొచ్చాడు..

నాకు లోపల కుతకుతా ఉడికిపోతూఉంది.. మనసులో నాకొచ్చిన తిట్లన్నీ ఇన్‌ఫైనైట్ లూప్‌లో పెట్టేశానప్పటికే!

మా ఫ్లోర్‌లోకొచ్చి మా ఆఫీస్ తలుపు తీయగానే ఎదురుగా మా టీమంతా వెయిటింగ్.. నన్ను చూడగానే ఎవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు నవ్వడం మొదలుపెట్టారు...

అప్పుడొచ్చాయి నాకు కళ్ళల్లో నీళ్ళు!!

అంతే, అలా నించుండిపోయానసలు ఏమీ మాట్లాడకుండా!! తర్వాత నెమ్మదిగా నా డెస్క్ దగ్గరకొచ్చి క్వైయిట్‌గా కూర్చుండిపోయాను..

అతగాడు పక్కన్నుంచుని అసలు తనకి ఆ డెంట్ iPad App గురించి ఎప్పుడు తెలిసింది, దాన్ని నామీద ప్రయోగించడానికి ఎంతలా వెయిట్ చేసిందీ, అనుమానం రాకుండా వారం నించీ ఏదో సీరియస్ పని ఉన్నట్టు యాక్ట్ చేసిందీ, పొద్దున్నే నేను వచ్చాక పార్కింగ్‌లాట్ కి వెళ్ళి నా కార్ ఫోటో తీసేప్పుడు ఎంత ఎగ్సైటింగ్‌గా అనిపించిందీ... తన ప్లాన్‌కి పూర్తిగా సహకరించిన మిగతావాళ్ళందరికీ ఎంతలా ఋణపడిపోయిందీ --- ఇత్యాది వివరాలన్నీ కధలుకధలుగా చెప్తున్నాడు.. 


బట్, కాసేపటికి రియలైజ్ అయ్యాడు, నేను మామూలుగా లేనని.. వెంటనే వచ్చి చాలా సిన్సియర్‌గానే బతిమాలుకున్నాడు.. తనే మాయింటాయన గారికి మెసేజ్ కూడా పెట్టాడు, నథింగ్ టూ వర్రీ అని.

నేను ఆరోజు మరుసటిరోజు కూడా చాలా అంటే చాలా సీరియస్‌గానే ఉన్నాను.. కానీ ఆ తర్వాత రోజు నేను ఓట్‌మీల్ వేడి చేసుకోడానికి కిచెన్లోకి వెళ్ళగానే నా వెనకాలే వచ్చారు మా వాళ్ళందరూ.. నేను అసలు పట్టించుకోనట్టు మైక్రొవేవ్‌ని లాగి పీకుతున్నాను.. 

'చూడు నీకోసం నిన్నటి నించీ మేం ఏం ప్రాక్టీస్ చేశామో! డాలర్ మెండీ పాట.. టునాక్ టునాక్ టున్..' అని లైన్‌గా నుంచుని డ్యాన్స్ మొదలుపెట్టారు... ఒక పది సెకన్లు అవ్వగానే నాకు అదేం పాటో అర్ధమై I bursted into laughter! అది మన దలేర్ మెహందీ సాంగ్ తుణక్ తుణక్ తున్ :))

ఆ తర్వాత అరగంటలోనే మామూలైపోయాను కానీ ఒక రెండు వారాల పాటు మహారాణీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫ్రీ లంచ్, స్టార్‌బక్స్ ఫ్రాపచీనోలు, అడపాదడపా డెస్క్ మీద సర్‌ప్రైజ్ ఇచ్చే పెద్ద క్యాండీ బార్స్.. ఇలా! :)
మరి ఇలాంటి వాతావరణం ఉంటే ఎవరికి మాత్రం వర్క్ ఎగ్గొట్టడానికి మనసు ఒప్పుతుంది చెప్పండి.. అది జ్వరమైనా, తుఫానైనా ఎలాగొలా పడిలేస్తూ, ఈదుకుంటూ అయినా వెళ్ళిపోవాలనిపిస్తుంది.. ట్రాఫిక్‌ని తిట్టుకుంటూ వస్తామా ఆ తర్వాత అసలు 9-10 గంటలు ఎలా గడిచిపోతాయో తెలీదు! ఇలా ఒకరిద్దరు సరదా టీమ్మేట్స్ ఉన్నా మొత్తం టీం అంతా ఎంత లైవ్లీగా ఉంటుందో!

నన్నడిగితే మా అందర్లోకీ గ్రేట్ స్పోర్ట్ మా బాస్... the coolest boss we all have ever had.. ఆయన ఏ కాస్తా 'ఆహా.. ఊహూ ' అన్నా ఇంత అల్లరి అస్సలు కుదిరేది కాదు!! అందరం ఎంతో క్లోజ్ గా ఉండటమే కాదు అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా క్లోజ్ గా పరిచయం.. ఆయనే ఫ్యామిలీ గెట్‌టూగెదర్‌లు మొదలుపెట్టింది... సంవత్సరానికి రెండుసార్లైనా ఎవరో ఒకరి ఇంట్లో గెట్ టుగెదర్ ఉంటుంది... అందరం ఫ్యామిలతో కలుస్తాము.. 

కానీ, ఒకటే సమస్య -- ఇంత ఆత్మీయంగా, సరదాగా ఒక కుటుంబంలా ఉన్న గ్రూప్‌లోంచి ఎవరన్నా వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు విపరీతమైన బాధగా ఉంటుంది. ఇంతలా అల్లరి చేస్తూనే రిక్ రెండు MBAs, Six Sigma, PMP, ఇలా ఏదో ఒకటి చదువుతూనే ఉండేవాడు..  తను వెళ్ళిపోయినప్పుడైతే మేమందరం చాలా రోజుల వరకూ డల్‌గా ఉండేవాళ్ళం.. ముఖ్యంగా మా ఇద్దరివీ పక్క పక్క డెస్క్శ్ కాబట్టి నేను చాలా రోజులు డిప్రెషన్‌లోకి వెళ్ళినంత బాధ ఫీలైయ్యాను.. బజ్‌లో కూడా పోస్టేసుకుని అందరి సానుభూతినీ పొందాను. తను వెళ్ళింది సేమ్ ఆర్గనైజేషన్‌లో వేరే డిపార్ట్‌మెంట్ అయినా అది కంప్లీట్‌గా వేరె లొకేషన్ అవ్వడంతో ఫ్రీక్వెంట్‌గా కలవడానికి కుదరదు.. మొదట్లో రెండు వారాలకోసారి లంచ్‌కి, హాపీ అవర్స్‌కి కలిసినా తర్వాత్తర్వాత తగ్గిపోయింది. ఎప్పుడన్నా ఫోన్లూ, టెక్స్ట్‌లే!

మొత్తానికి శ్రావ్య పుణ్యమా అని I revisited all those days. ఇప్పుడు టీమ్ లో అమ్మాయిలూ అబ్బాయిలూ సగం సగం ఉండటంతో పెద్ద ఎత్తున ప్రాక్టికల్ జోక్స్ ఏమీ నడవవు కానీ..... We still are the loudest team in our building and fun happens in other ways...

(Yea, The End పడినట్లేనండీ.. ఇంక లేవచ్చు సీట్లోంచి! :)) )

Thank you all so much! :-)
      
    
   

30 comments:

Praveena said...

3 posts bagunnayi.Office lo pranks,mischievous acts ila kuda chestaaru ani ippude thelisindi :)

Chandu S said...


'ఎవరో చేతులు కట్టేసి నోట్లో అదేపనిగా మైసూర్ పాక్ లు కుక్కుతున్న ఫీలింగ్..'
ఈ వాక్యం బాగా నచ్చింది.
The End పడినట్లే...
అట్లా అంటే ఎట్లా?
నాకు సరిపోలేదు. ఇంకా కావాలి మైసూర్ పాక్ లు.

Vasu said...

టీం ఇలా ఉంటే ఎంత బావుండు అనిపించేంత బావున్నాయి మీ జ్ఞాపకాలు

ఆపకుండా చదివించారు .

తృష్ణ said...

ఫూల్ అవ్వడం వల్ల ఇన్ని ఉపయోగాలుంటాయన్నమాట :) nice to know about ur friends!

sreelu said...

వావ్ మహారణి యోగం......మంచి టీం.....బాగున్నాయి మీ ఙాపకాలు....

రాజ్ కుమార్ said...

అదృష్టవంతులు.. నేను కుళ్ళింగ్స్.. ;)

సిరిసిరిమువ్వ said...

అప్పుడే అయిపోయాయా! ఉహూ...ఇక్కడితో ఎండ్ చెయ్యటం బాలేదు కానీ ఈ సిరీస్ కి అప్పుడప్పుడు నీకు బుద్దిపుట్టినప్పుడు..నీకు గుర్తుకొచ్చిన జ్ఞాపకాలు యాడ్ చేస్తూ ఉండు.

మధురవాణి said...

Hmm.. Even good things has to end some day! :-(
​​
సీట్లోంచి లేచే ఉద్దేశ్యం అస్సలు లేదు.. నెక్స్ట్ షో కి టికెట్ ఇచ్చెయ్యండి ఇప్పుడే.. :-)​

Sravya V said...

Too Good Nishi !
నాకైతే మీతో పాటు అక్కడే ఉండి అంతా చూస్తునట్లే ఉంది :-)ఎన్ని సార్లు చదివానో ఈ పోస్టులు !
రిక్ అయితే బోలెడు నచ్చేసాడు నాకు :-) అలా pranks ప్లే చేసి తమాషా చేసేవాళ్ళు ఉంటారు కానీ, చాలా కొద్ది మంది మాత్రమే హర్ట్ అయ్యాం అని తెలిసినప్పుడు మనల్ని మళ్ళీ మామూలు స్టేట్ కి వచ్చేట్లు చేసి మనం కూడా ఎంజాయ్ చేయగలిగేట్లు చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మందే ఉంటారు అనుకుంటాను . హ హ కాసనోవా నా :-)
ఈసారి రిక్ కలిసినప్పుడు చెప్పూ exact గా భూమికి అవతల వైపు తనకొక fan ఉంది అని :-)
Thank you very much for sharing all this us !

Sravya V said...

I forgot to mention about you in above comment !
I loved your attitude seriously ! You deserve all this fun and love !

వేణూశ్రీకాంత్ said...

ఎక్కువగా వెయిట్ చేయించకుండా వెంటవెంటనే పోస్ట్ చేసినందుకు పేద్ద థాంక్స్ నిషీ.. అండ్ ఈ పోస్ట్ రాయడానికి ప్రోత్సహించిన శ్రావ్యక్కూడా థాంక్స్.
ఈ సిరీస్ వలన నీకో బాధ్యత పెరిగింది ఇకమీదట కవితలతో పాటు అపుడపుడూ ఇలాంటి చక్కని జ్ఞాపకాలను మాతో పంచుకోవాలి.
నువ్ చెప్పింది అక్షర సత్యం ఇంత చక్కని వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటే అసలు మానేయాలని ఎందుకనిపిస్తుందీ. బెస్ట్ పార్ట్ చెప్పాలంటే మహరాణి ట్రీట్మెంట్ :-)) శ్రావ్య చెప్పినట్లు ప్రాంక్స్ వేసేవాళ్ళు చాలామందే కనిపించినా నిజంగా హర్ట్ అయ్యామని తెలిస్తే అంతలా బుజ్జగించే సెన్సిబిలిటీ అలా ప్రాంక్స్ వేసే వారిలో అతి కొద్దిమందిలోనే ఉంటుంది. హాట్సాఫ్ టు రిక్ అండ్ యువర్ టీం. (ఏంటో ఈ పోస్ట్స్ చదివాక తను మాకు కూడా క్లోజ్ ఫ్రెండ్ అయినట్లనిపించి 'గారు' పెట్టాలనిపించట్లా :)

Sunita Manne said...
This comment has been removed by the author.
Sunita Manne said...

Thaaaaaaaaaaaaaanks Nishi:)))

స్ఫురిత మైలవరపు said...

మొత్తం పార్ట్స్ అన్నీ చదివేశాక పెడదాం కామెంట్ అని చూస్తున్నా...త్వర త్వరగా రాసేసినందుకు మొదట థాంకులు....నిజంగా I feel so jealous now

నా మొదటి వుజ్జోగం లో when we were kids, చేసే వాళ్ళం అల్లరి...తర్వాత అంతా సీరియస్సు ఫేసులు, బోలెడు రాజకీయాలు...మీ రిక్ అసలు తెగ నచ్చేసాడు...కానీ అంత మంచి ఎన్విరాన్మెంట్ లో ఏ వొక్కళ్ళు వెళ్ళిపోయినా, మనమే వెళ్ళిపోవాల్సొచ్చినా చాలా కష్టం...

Edge said...

1st టైం మీ బ్లాగ్ చడవడం, పోస్ట్ చాలా బాగుంది!

“అది నా కారే.. సైడ్ కి అంతా పెద్ద చొట్టపడి, బాక్ మిర్రర్ క్రాక్ ఇచ్చేసి!!!! నాకు గుండె జారిపోయింది.. ఇదేంటి బంగారంలాంటి కారు, కొని ఇంకా సంవత్సరం కూడా అవలేదు అనుకుంటూ -----------మా ఇంటాయన గారికి కాల్ చేశాను------------”

ఇదిగో ఈ రియాక్షన్నే, ముద్దుగా మేము 1-800-Call-Husband అని పిలుచుకుంటాం. మన భారత భార్యామణుల అతి సాధారణ సహజ ప్రతిస్పందన...

బాల said...

ఆఫీసులో ఇంత అల్లరి చెయ్యొచ్చని మీ పోస్ట్ చూసిన తరవాతే తెలిసింది. మీ అంతా కాకపోయినా కొంతైనా అల్లరి చెయ్యడానికి try చేస్తా....

ఫోటాన్ said...

బాగుందండీ :)

నిషిగంధ said...

@ Praveena gaaru - అవునండీ, ఇలా చేస్తారనీ, చేయొచ్చనీ నాకు మా ఆఫీసులో జాయిన్ అయ్యాకే తెలిసింది. ధన్యవాదాలు :-)

@ Chandu S - శైలజ గారు, లేదండీ.. ఇంకా కంటిన్యూ చేస్తే చదువుతున్న మీక్కూడా సేమ్ ఫీలింగొచ్చేస్తుందండీ.. అందుకే ఆపేశా! థాంక్యూ సో మచ్ :-)

@ వాసు గారు - బావున్నారా? థాంక్సండీ :-)

@ తృష్ణ గారు - అవునండీ, ఒక ఐదు నిమిషాలు వేరేవాళ్ల లైఫ్‌లో ఉన్నామనుకుని అడ్జస్ట్ అయిపోతే తర్వాతంతా సందడే! :-)

@ Sreelu - ధన్యవాదాలు :-)
నిజంగా అద్దే ఫీలింగ్ అండీ!

నిషిగంధ said...

@ రాజ్ కుమార్ - హమ్మయ్య! mission accomplished!! :)) Thank You :-)


@ సిరిసిరిమువ్వ గారు - చిన్నచిన్నవి చాలానే ఉన్నాయి కానీ మరీ బోరింగ్‌గా అనిపిస్తుందండీ, అవన్నీ రాస్తే.. వస్తూనే చక్కగా అన్ని పార్ట్స్ చదివేసి మెచ్చుకున్నందుకు మీకు బోల్డన్ని థాంక్సులు :-)

@ మధురవాణి - unfortunately yes, dear.. there will always be an end to good things... hmmm.. we just have to wait and see for another.. if we are lucky enough we will encounter one or that's it!
ఏంటీ, బాగా ఎక్కువైందా??? మరి నెక్స్ట్ షో కి కూడా టికెట్ కావాలన్నావు కదా ;) ;)
థాంక్యూ సో మచ్! :)

నిషిగంధ said...

@ శ్రావ్య -- తప్పకుండా చెప్తాను, శ్రావ్యా.. అసలే తనకి మన అమ్మాయిలంటే చాలా ఇష్టం.. 'You Raa girls are special' అంటాడు. :)) అల్లరే కాదు, ప్రొఫెషనల్ యాటిట్యూడ్ గురించి కూడా చాలానే నేర్చుకున్నా తన దగ్గర. యా, జెన్యూన్లీ కేరింగ్ వ్యక్తులే అలా ఏడిపించనూగలరు, ఆపైన బుజ్జగించనూ గలరు!
అసలు ఇదంతా టైప్ చేసే రోజుల్లో అస్సలనుకోలేదు పోస్ట్ చేద్దామని.. అందరూ చాలా బోరింగ్ గా ఫీలౌతారనుకున్నాను.. అందుకే నాకోసం రాసుకుని అలా ఉంచేశాను! కేవలం నీ వల్లనే ఇది బయటకి వచ్చింది! ఆపైన అందరి ఫీడ్‌బాక్ చదివాక మాత్రం మొత్తం క్రెడిట్ నీకే చెందుతుందనిపిస్తుంది!
THANK YOU, Dear!

@ వేణూశ్రీకాంత్ - బాధ్యత అదీ ఇదీ అని బరువైన మాటలు చెప్తే నేను మళ్ళీ డింగ్ అంటాను :)) లెదులే, గారు అంత సీన్ అక్కర్లేదు.. థాంక్స్, వేణూ.. సిరీస్ అంతా ఎంజాయ్ చేసినందుకు.. మీ కామెంట్స్ ఇచ్చిన ప్రొత్సాహంతోనే వరుసగా పోస్ట్ చేశేశాను :-)

@ సునీత గారు - అదేంటీ.. నేనే మీకు చాఆఆలాఆ పెద్ద థాంక్స్ చెప్పాలి.. చక్కగా చదివిపెట్టినందుకు.. మరి మా టీమ్‌లో ఒక ఖాళీ ఉంది, కర్చీఫ్ వేసి ఉంచమంటారా? :))

@ స్ఫురిత మైలవరపు - అవునండీ, నా పాత కంపెనీలో కూడా అంతే అందరూ పొడిపొడి నవ్వులుతో, ఎప్పుడూ ఎవరోఒకళ్ళని ఆడిపోసుకోవడంలో బిజీగా ఉండేవాళ్ళు.. ఇక్కడికొచ్చిన మొదట్లో అయితే ఇంకా సీరియస్ గా అనిపించేది ఇక్కడి వాతావరణం..
మీకు ధన్యవాదాలండీ, ఓపికగా, గబగబా అన్నీ చదివేసినందుకు :-)

నిషిగంధ said...

@ Edge gaaru - మీ కామెంట్ చదివి ఎంతసేపు నవ్వుకున్నానోనండీ! భలే పెట్టారుగా పేరు! మొదటిసారి వింటున్నా నేను! :)))
ధన్యవాదాలు :-)

@ బాల గారు - మరి వెంటనే మీరు కూడా మీదైన రీతిలో అల్లరి చేసేసి, ఆ విశేషాలన్నీ మాతో పంచుకోండీ. ధన్యవాదాలు :-)

@ ఫోటాన్ - థాంక్యూ.. థాంక్యూ! :-)

Anonymous said...

Nice post. You finally made me comment on your blog (familiar with your work in Koumudi)

Very funny and interesting too. Not very common to come across such people. Wonder how did he learn your ringtone song?

-SJ

MURALI said...

ఎప్పుడో ట్రైనింగ్‌లో చేసామేమొ ఇంత అల్లరి తర్వాత ఆ అవకాశమే రాలేదు. అందులోనూ ఇండియాలో ఇంత స్పోర్టివ్ అట్మాస్ఫియర్ దొరకదు కూడా. మీరు నిజంగా చాలా లక్కీ.

నిషిగంధ said...

@ SJ gaaru, true! not common at all.. I felt like I was reliving my college days..
As soon as my phone starts ringing he used to humm "DabaDaba Daba DADA..." and it used to irritate the hell out of me.. so, I showed him the youtube link a couple of times... He practiced it from there.
Thanks so much, for finally commenting on my blog.. Thank you! :))

@ Murali - ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా చాలా కష్టం, మురళీ! అందులో ఇక్కడ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నించి కూడా ఉంటారు కదా! నిజం చెప్పాలంటే ఏదో గ్రహాలన్నీ అలా కలసి వచ్చాయంతే!
థాంక్యూ.. :-)

మేధ said...

మొత్తానికి శుభం కార్డ్ వేసేశారన్నమాట.. ఇంకో రెండు-మూడు భాగాలన్నా ఉంటే బావుండేది :)

నేను ఉద్యోగంలో చేరేవరకూ అనుకునేదాన్ని ఆఫీస్‌లో స్నేహాలు కేవలం హలో-బాయ్ కి మాత్రమే పరిమితం అని.. కానీ చేరిన తరువాత ఇక్కడ కూడా మంచి స్నేహాలు ఏర్పడతాయని అనుభవమైంది.. ఒక్క కొరియా ట్రిప్ చాలు అందరినీ దగ్గర చేసేయ్యడానికి ;)

మా టీం కూడా మీ టీం అంత అల్లరి కాకపోయినా, ఓ 70% ఉంటుంది.. మా ఫ్లోర్‌లో సందడంతా మాదే.. ఎప్పుడూ ఎవరో ఒకరు బకరా అవుతూ ఉంటారు :P

And Yes, as you said, Boss plays a major role in making the team together

మేధ said...
This comment has been removed by a blog administrator.
నిషిగంధ said...

అవునండీ మేధా! పెట్టిన మైసూర్‌పాక్‌లు చాలు అనిపించి కార్డ్ వేశేశాను..
మీ పేరు చూస్తేనే కొరియా మేధ గారు అనుకుంటాను. మీ బ్లాగ్ అంటే, మీ తిరుపతి నడిచివెళ్ళిన పోస్ట్ గుర్తుకొస్తాయి :)

థాంక్యూ సో మచ్ :-)

Mehdi Ali said...

chala bagundi andi

నిషిగంధ said...

Thank you, Mehdi Ali garu.. :-)

Nmrao Bandi said...

like you said you owed it all to rick, the prankster...

like...
శ్రావ్య చెప్పినట్లు...

చాలా కొద్ది మంది మాత్రమే హర్ట్ అయ్యాం అని తెలిసినప్పుడు మనల్ని మళ్ళీ మామూలు స్టేట్ కి వచ్చేట్లు చేసి మనం కూడా ఎంజాయ్ చేయగలిగేట్లు చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ మందే ఉంటారు...
మళ్ళీ మామూలు మనిషిగా (కలిగిన మనఃక్షోబ నుంచి బయటపడి) కలసిపోగలగడం కూడా చిన్న విషయమేం కాదు...

its very nice to have a team like that...

your team made you live life to the fullest...

thanks for the post...
to a craftswoman of words
and...feelings...
turning reality into
magical interesting storytelling...
really enjoyed reading...