Pages

Monday, August 5, 2013

కొంచెం పని.. కాసిన్ని నవ్వులు -- 1




యది హ్యహం న వర్తేయం --- అర్జునా, నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే,మనుష్యులు అన్ని విధాల నామార్గమే అనుసరిస్తారు.

ఉత్సీదేయురిమే లోకా --- నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి.వర్ణ సంకరానికి కారకుడనౌతాను.ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.

---- భగవద్గీత

అబ్బే, నేను చెప్పబోయే విషయానికీ ఈ శ్లోకానికి అంత సంబంధం లేదు. చాల్రోజుల తర్వాత రాస్తున్నా కదా, ఇలా శ్లోకాలతో మొదలుపెడితే కాస్త గంభీరత్వం వస్తుందని.. అంతే! :-)

ఇహ విషయానికొస్తే....
అనగనగా ఒకానొకరోజు పొద్దున్నే..
తను: ఏంటీ అప్పుడే లేచావ్? రాత్రంతా సరిగ్గా పడుకోనేలేదు!
నేను: టైమవ్వట్లా! అలారం మోగి అరగంట పైనే అయింది.
తను: అయితే! అంతలా వంట్లో బాలేకపోతే ఎలా వెళ్తావ్? సిక్ కాల్ చెయ్యి..
నేను: ఇంకా నయం, ఇవ్వాళ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయ్.. వెళ్ళక తప్పదు..
(అటేపునించి సమ్ గొణుగుడు -- ఈ డెడికేషనేదో కాస్త వీకెండ్ వంట మీదకూడా చూపిస్తే బావుండు!)
నేను: ఆ!? ...
తను: ఏం లేదు, జాగ్రత్తగా వెళ్ళిరా అంటున్నా..

నిజంగానే అసలు వంట్లో బాలేదు.. లేచి తయారవడమే గగనమనుకుంటే ఆపైన బోల్డంత దూరం డ్రైవ్ చేయాలి. అయినా కష్టపడి ఎలాగొలా ఆఫీస్‌కి చేరుకున్నాను.. అసలు విషయం, ఆరోజు నాకేమీ మీటింగ్స్ లేవు.. Big fat lie అన్నమాట! అలాంటి ఉదయాలు ఎన్నోసార్లు రిపీట్ అయ్యాయి.. ఒక్కోసారి గొణుగుళ్ళు తమ స్థాయిని పెంచుకుని అరుపుల్లాగా కూడా రూపాంతరం చెందేవి. ఆహ, మనం పట్టించుకుంటేగా!

ఉద్యోగం మనిషి లక్షణమైన ఈ రోజుల్లో మనం మెలకువగా ఉండే భాగంలో డెబ్భైఐదు శాతం ఆఫీస్‌లోనే గడిచిపోతుంది.. ఆఫీసంటే ఇష్యూలు, డెడ్‌లైన్లూ, చాంతాడంత మీటింగ్ మినిట్సూ..
ఇవికాక మైక్రోమేనే‌జ్‌మెంట్‌లో పండిపోయిన బాస్‌లూ, వాళ్లని కాకా పట్టడమే తమ అసలైన ఉద్యోగమనుకునే కొందరు టీమ్మేట్సూ. మరి ఫ్రెడేలన్నీ జాలీ డేలు గా... ఆదివారం సాయంత్రాలన్నీ ఆత్మహత్య ముందరి దిగాలు ఘడియల్లా అనిపించడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు.



ఏదో ఉద్యోగధర్మంగా పనిని ప్రేమించగలం గానీ పనితో పాటు పక్కనుండే అనేకరకాల మనస్తత్వాల్నీ, వాళ్ళ సడెన్ మూడాఫ్స్‌నీ కూడా మామూలుగా తీసుకోవాలంటే చాలా సహనం ఉండాలి. అంటే మన కొలీగ్స్‌లో కూడా ఫ్రెండ్స్ ఉండరని కాదు. కానీ, ఆ బంధాల్లోని దగ్గరతనం ప్లెజెంట్ గుడ్‌మార్నింగ్  నవ్వులూ, ఫ్రెండ్లీ హాండ్‌షేక్‌లని దాటివెళ్ళడం బహుతక్కువ. ఆ చేయిచాచిన దూరం వరకే మన దగ్గరతనం! అందుకే ఆ యాంత్రికతని ఎగ్గొడ్డానికి ఎన్నెన్ని దారులు ఉంటే అన్నీ ఏమాత్రం సందేహించకుండా (సిగ్గుపడకుండా) ఉపయోగించేసుకుంటుంటాం..

అలాంటిది వంట్లో అస్సలు బాలేకున్నా లాంగ్‌డ్రైవ్ లు చేసి, కర్తవ్యం విజయశాంతిలా ఫీలై ఎందుకు వెళ్ళడం!? పైన శ్రీకృష్ణుడు చెప్పినట్టు, నేను కాసేపు పని చేయడం మానేస్తే మా కొలీగ్స్ అందరూ దిక్కుతోచని వాళ్ళైపోతారనీ, ఆర్గనైజేషనే మూలబడుతున్నంత బిల్డప్ ఎందుకు??

చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చినరోజుల్లో నేను ఇంట్లో ఉండకుండా స్కూల్‌కి వెళ్తానని చేసిన గొడవ గుర్తొస్తుంటుంది. అప్పట్లో అందరూ నాకు చదువు మీద అంత ఇష్టం అనేసుకున్నారు. అచ్చు ఇప్పుడు మా ఇంటాయన నాకు పని పట్ల బోల్డంత డెడికేషన్ ఉందనుకున్నట్టు!
పాపం, అమాయకులు :) :)
అసలు విషయం ఏంటంటే -- ఫ్రెండ్స్.. మనతోపాటు ఎగిరిగంతులేసి, అల్లరి చేసే ఫ్రెండ్స్! వాళ్లని ఒక్కరోజుక్కూడా మిస్సవ్వడం ఇష్టముండదు!

చిన్నప్పుడు సరే.. ఇప్పుడు, ఈ వయసులో కూడానా!! అదీ ఆఫీసులోనా!! అని ఆశ్చర్యపోతే కంగారేంలేదు.. కావాల్సినంతగా ఆశ్చర్యపోండి..
ఇప్పుడు నెమ్మదిగా 'అసలు అలా ఎలా?' అన్న వివరాల్లోకి వెళ్దాం....

********

58 మైళ్ళు... రష్ అవర్ ట్రాఫిక్.. పార్కింగ్ లాట్కీ, ఆఫీస్ బిల్డింగ్కీ రమారమీ అరమైలు పైనే ఉన్న దూరం.. వేసుకున్న మందపాటి ఫార్మల్ బట్టలూ... 4 ఇంచ్ హీల్ షూస్... గాలికి అదేపనిగా ఎగురుతూ చిరాకు పుట్టిస్తున్న ఫ్రీ హెయిర్.... ఒకదాని తర్వాత ఒకటి చిద్విలాసంగా ఆజ్యం పోస్తూ నా అసహనపు జ్వాలని  అదేపనిగా పెంచుతున్నాయి గానీ అప్పటిక్కావాల్సిన ప్రశాంతతని నా దరిదాపుల్లోకి కూడా రానివ్వడంలేదు.

 "టేక్ డీప్ బ్రెత్.." మెయిన్ డోర్ తలుపు తోస్తూ నాకు నేనే అనునయంగా చెప్పుకున్నాను... అప్పటికే ఒక నాలుగుసార్లు కలిసిన స్వల్ప పరిచయమేమో రిసెప్షనిస్ట్ నన్ను చూసి చిన్నగా నవ్వింది.. "I'm here to see..." అని నేను వాక్యం నిర్మిస్తుండగానే ఆమె "I know.. She will be with you shortly.. Please, take a seat" అని లౌంజ్ ఏరియా వైపు చూపించింది..

'థాంక్ గాడ్, కాస్త టైముంది...'  అనుకుంటూ ఒక కుర్చీ చూసుకుని కూలబడ్డాను...


కాస్త స్థిమితపడటానికి నేనెప్పుడూ వాడే మంత్రం --- కళ్ళు మూసుకుని, నాకు నచ్చే పాటని అతి చిన్నగా పాడుకోవడం..

నువ్వేం మాయ చేశావో గానీ... ఓ మనసా చెప్పమ్మా నిజాన్నీ' --- ఇక్కడ ఇది నాలుగోసారి ఇంటర్వ్యూ.. ఇదైనా ఆఖరుది అయితే బావుండు..

'గోరువెచ్చని సూరీడమ్మా.. పొద్దుపొడుపులా వచ్చాడమ్మా... వద్దన్నా.. రావద్దన్నా' --- అయినా సుత్తి ఉద్యోగానికి ఇంతమంది ఇన్నిసార్లు పిలవాలా! ఇదేమన్నా రాకెట్ సైంటిస్ట్ పోస్టా ఏమిటీ!!


నా మొట్టమొదటి ఇంటర్వ్యూ మళ్ళీ గుర్తొచ్చింది.. ఇలా ఎప్పుడు ఇంటర్వ్యూలకి అటెండ్ అయినా ఆ వెయిటింగ్ టైమ్‌లో ఫస్ట్ ఇంటర్వ్యూ గుర్తురాకుండా అస్సలుండదు.. ఆ క్రితం రోజే ఫైనల్‌ ఇయర్ పరీక్షలు రాసొచ్చాను.. అప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చి మాటల్లో చెప్పింది, ఫలానా కాలేజీలో కంప్యూటర్‌సైన్స్ లెక్చరర్‌కి అర్జెంట్ నీడ్ ఉందని, వెంటనే వెళ్ళి కలవమని! సరే అసలుద్యోగం వచ్చేవరకూ ఇది చేద్దామని డిసైడ్ అయ్యి మరుసటి రోజే వెళ్ళాను.. గంజిపెట్టి ఇస్త్రీ చేసిన కాటన్‌చీర, తలంటి స్నానం చేసిన జడా, ఒక మూర కనకాంబరం మాల.. వెరసి లేని పెద్దరికాన్ని, హుందాతనాన్ని మాస్క్‌లా తొడుక్కుని ప్రిన్సిపాల్‌ని కలవడం అనే ఇంటర్వ్యూకి వెళ్ళడం గుర్తొచ్చింది.. ఎందుకో నవ్వు కూడా వచ్చింది, అప్పట్లో పూలు పెట్టుకోకుండా బయటకి వెళ్ళడం అంటే ప్రాణం పోయిన పనయ్యేది!

అవునూ, ఇందులో సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వడానికి కుదరదంటే ఏమంటారో!? మళ్ళీ టెన్షన్ మొదలు...ఇంతకీ ఇందాక ఏ పాట దగ్గరున్నాను!?!?

'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై' --- ఇంకా ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నారో ఏమిటో.. భలే, ఎవరూ ఎవరినీ కలవకుండా కంప్లీట్‌గా వేరువేరు టైమ్స్లో పిలుస్తున్నారుగా!!

'మసక మసక చీకటిలో.. మల్లెతోట వెన...'  ---
"ఎక్స్క్యూజ్..."
'కాలా... మాపటేళ కలుసు….'
"ఎక్స్క్యూజ్...మీ" --- ఈసారి కాస్త గట్టిగా వినిపించేసరికి కళ్ళు తెరిచా...
 
ఎదురుగా అతను!

********************************************************************************

ఎప్పుడూ కవితలే కాకుండా మానవాళి క్షేమం కోరి అప్పుడప్పుడూ మామూలు విషయాల గురించి కూడా టపాలు రాయమని అడిగే శ్రావ్య కోసం ఈ పోస్ట్. :-)
*********************************************************************************

(Pictures - Courtesy Google Images)

15 comments:

Sravya V said...

హ హ నిషీ , థాంక్ యు వెరీ మచ్ !

జ్వరమొచ్చినా స్కూల్ కి వెళ్ళడం ఇది .. నాకు బాగా అనుభవం . కానైతే మాఇంట్లో కూడా ఇది స్కూల్ కి వెళితేనే బాగుండురా బాబు అనుకునేవారు మన తడాఖాకి అది వేరే సంగతి :-)

భలే ఉంది ఆ పాటని డిస్ట్రబ్ చేసిన వారెవరో ఆ కథా కమామీషు ఏంటో తెలుసుకోవాలని సూపర్ anxiety గా ఉంది . ఈ ఉత్సాహం తో అసలు మైక్రో మానేజ్మెంట్ అంటే ఇంకో కొత్త కోణం చూపిస్తానో ఏంటో :-)

Unknown said...

:)))

తృష్ణ said...

ఇంతకీ... మనసైనది దొరికిందా లేదా :-)

రాజ్ కుమార్ said...

Kevvvvvvvv hahahahah :)

బంతి said...

నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్ అండి :)

వేణూశ్రీకాంత్ said...

హహహ బాగుంది నిషీ.. నాకు క్యాంపస్ సెలక్షన్స్ కోసం నేను అటెండ్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఆ తర్వాత నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ రెండూ గుర్తొచ్చాయి.
నేను నీకు పూర్తిగా రివర్స్.. స్కూల్ కానీ ఆఫీస్ కానీ మానేయాలంటే ఎగిరి గంతేస్తాను :-) నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్... బైదవే థాంక్స్ శ్రావ్యా :-))

బాల said...

శ్రావ్య గారు నిజమే చెప్పారు. కవితలు మాలాంటి వాళ్ళకి ఏమి అర్థమవుతాయి చెప్పండి?

..nagarjuna.. said...

:O

:)

ఫోటాన్ said...

హమ్మయా :)
ఇన్నాళ్ళకు మీ పోస్ట్ లో కామెంట్ పెట్టే అదృష్టం కలిగింది :)
నెక్స్ట్ పార్ట్ ప్లీజ్ :))

నవజీవన్ said...

బాగుంది మీ పొస్ట్..యాంత్రిక జీవితములో ఉద్యోగమును చక్కగా ఆస్వాదించడము కూడా కళే కదా..మీ మిగతా కథనం కోసం ఎదురు చూస్తూ.. సెలవు ..నవజీవన్

sreelu said...
This comment has been removed by the author.
sreelu said...

నేను కూడా నా మొదటి interview ని గుర్తు చేసుకున్నా.....చాల బాగుంది...

మేధ said...

పోస్ట్ ఓపెన్ చేయగానే, శ్లోకం చూసి, టపా టైటిల్ మళ్ళీ ఇంకోసారి చూసి, ఏమీ అర్ధం కాక, క్రిందకి వస్తే, సంగతి అర్ధమైంది :)

>>నేను కాసేపు పని చేయడం మానేస్తే మా కొలీగ్స్ అందరూ దిక్కుతోచని వాళ్ళైపోతారనీ, ఆర్గనైజేషనే మూలబడుతున్నంత బిల్డప్ ఎందుకు??
మీరు అలా నిజాలు బయటకి చెప్పేస్తే రేపటినుండి మేమందరం ఏమైపోవాలి :P

నిషిగంధ said...

@ శ్రావ్య -- వెల్కమ్ డియర్ :)
అయితే నువ్వు ఇల్లుపీకి పందిరి వేసే పిల్లల సంఘానికి నాయకురాలివన్నమాట :)))

@ సునీత గారు -- ధన్యవాదాలు :-)

@తృష్ణ -- దొరికింది దొరికింది... ధన్యవాదాలు :)

@రాజ్ కుమార్ -- :))) థాంక్యూ

@బంతి -- వెయిటింగ్ చేసేముందు ఒక పార్టీ సైజ్ పాప్‌కార్న్ తెచ్చేసుకోవాల్సింది.. థాంక్యూ :-)

నిషిగంధ said...

@ వేణూశ్రీకాంత్ -- నిజంగా ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రత్యేకం కదా! రియల్ లైఫ్‌లోకి ఎంట్రీ పాస్ అది.. నేనైతే ఓన్లీ ఇంటర్‌లోనే కాలేజ్ మానేయడానికి సవాలక్ష కారణాలు వెదుక్కునేదాన్ని!
థాంక్యూ :)

@ బాల గారు -- శ్రావ్యకి కవితలు చక్కగా అర్ధమవుతాయండీ.. కాకపోతే ఎప్పుడూ అవేనా అని తన రిక్వెస్ట్ :) కవితలు అర్ధం కాకపోతేనే బావున్నట్టు లెక్క ;) ధన్యవాదాలు..

@ నాగార్జున - థాంక్యూ :-)

@ ఫోటాన్ -- అదృష్టం మీది కాదు నాది.. మీ కామెంట్ నా బ్లాగ్‌లో చూడటం.. నిజ్జం! :)) థాంక్యూ..

@నవజీవన్ గారు -- ధన్యవాదాలండీ :-)

@Sreelu gaaru -- థాంక్యూ :)

@మేధ గారు - ఎన్నాళ్ళకెన్నాళ్ళకి!! అంతా కుశలమేనా? అయితే శ్లోకం చూసి కాస్త బరువైన పోస్ట్ అనేసుకున్నారా? :)) ధన్యవాదాలండీ.. so good to see you again!