Pages

Monday, November 9, 2009

జలపాతం


దేవతలు ధరణి పైకి
జారవిడిచిన ఒక ధవళవస్త్రం..
తడబడుతూ.. తేలుతూ.. పరుగులు పెడుతూ..

మబ్బులు మురిపెంగా జార్చిన
చినుకు పోగులను కలుపుకుంటూ
అడుగు అడుగుకీ
తుళ్ళిపడుతున్న చిలిపిదనం..

తన్మయత్వంతో తాకబోతే
మనసంతా తడిపేసింది..

కదలని బండరాయి కరుకుదనం..
రాలిపడిన పూల నైరాశ్యం..
వేటినీ అంటనీయక
ఎగుడుదిగుడుల అనుకోని మలుపుల్లోకి
అలవోకగా జారిపోతోంది!

ఆకతాయిగా అడ్డుకుంటున్న
రాళ్ళగుట్టలపై అలిగి..
ఆకుపచ్చని ఆత్మీయత ఒడిలోకి
అధాటున దూకేస్తుంటే
పయ్యెద సర్దుకుంటూ ప్రకృతి
ఫక్కున నవ్వుతోంది!


కాంతిగారూ, చాలా రోజులకి పూసిన పువ్వు.. ఇది మీకోసం :-)
(తొలి ప్రచురణ ఆవకాయలో...)

22 comments:

సుజాత said...

నిషిగంధ,
చాలా రోజులకు పూసిన పువ్వేమో, మరీ సుగంధాలు అపరిమితంగా విరజిమ్ముతోంది!

మీ ప్రతి కవితనూ visualise చేసుకుని ఆస్వాదించడం నాకలవాటు. చాలా రోజులకు చూసినా అలవాటు పడిన మెదడు మొదటి పదం చదవగానే అద్భుత వర్ణ చిత్రాన్ని మనో ఫలకం మీద ఆవిష్కరించింది.

హాట్సాఫ్ అమ్మాయ్! చాలా బావుంది. తీసుకున్న బ్రేకు చాలు గానీ పట్టాలెక్కించండి బండిని!

Anonymous said...

Awesome Nishi.

Keep going!!!

Cheers,
Srini Chimata
www.ChimataMusic.com

రవిగారు said...

'' ఎవరిని కవ్వించడానికో'' అని ముగిస్తే ఇంకా బావుండేదేమో .
ఎందుకంటె జలపాతపు జల్లు లో ప్రేమికులు మాట రాని వూసులు ఎన్నో చెప్పుకుంటే ,
భగ్న ప్రేమికులును అదే జలపాతం దూకమని కవ్విస్తుంది
పయ్యెద సద్దుకుంటున్న ప్రకృతి కాంత కవ్వింతను చూసి
మురిసి పోయే వన పురుషుడిలా .

సుభద్ర said...

తడబడుతూ,తేలుతూ,పరుగులు పెడుతూ

మబ్బులు మురెపె౦గా జారిన
చినుకుల పోగులను కలుపుతూ
అడుగు అడుగుకీ
తుళ్ళిపడుతున్న చిలిపితన౦..చాలా బాగు౦ది.

Vasu said...

చాలా బావుంది. నేను ఆవకాయ లో చదివాను మొన్న.
మీరు తెలుగు పీపుల్ డాట్ కాం లో కూడా రాస్తారా?

రాధిక said...

నిషీ నీ మీదున్న కోపమంతా ఎగిరిపోయింది.అక్షరాలతో మత్తు జల్లుతావు.[కోపం ఎందుకు అంటావా?ఇన్నాళ్ళు మాయం అయిపోయినందుకు]

నేస్తం said...

చాలా బావుంది నిషి..super

వేణూ శ్రీకాంత్ said...

ఆసాంతం అద్భుతం నిషిగంధ గారు, ఈ కింది లైన్లు మరింత బాగా నచ్చాయి.

"మబ్బులు మురిపెంగా జార్చిన
చినుకు పోగులను కలుపుకుంటూ
అడుగు అడుగుకీ
తుళ్ళిపడుతున్న చిలిపిదనం.."

చివరి ఆరు లైన్లు చదివితే ఎందుకో "వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం" పాట గుర్తుకొచ్చింది :-)

నిషిగంధ said...

అందరికీ ధన్యవాదాలు :-)

సుజాత, నయాగరా కూడా కలిగించని ఒక అనుభూతిని ఈ మధ్య చూసిన ఒక చిన్న జలపాతం కలిగించింది.. దాని ప్రేరణే ఇది.. చాలారోజులుగా నిలబడే ఉందేమో ఇప్పుడు కదలడానికి బండి కాస్త మొరాయిస్తోంది :-)

శ్రీని గారు, మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ చూడటం ముదావహం :-)

రవిగారు, మీ ఆలోచన బావుంది కానీ ఇది కేవలం 'జలపాతాన్ని ' ఉద్దేశించి చెప్పినదండి.. no hidden views :-)

సుభద్ర గారు, నాకు ఇష్టమైన వాక్యాలే మీక్కూడా నచ్చేశాయన్నమాట! మీ చేతిముద్రలు వేసినందుకు ధన్యవాదాలు :-)

వాసు గారు, ఒకప్పుడు రాసేదాన్నండీ తెలుగుపీపుల్ లో..

రాధిక, కోపమా! అసలు అలాంటి పదార్ధమొకటి ఉందని కూడా నీకు తెలీదు కదా!! :-)

నేస్తం, ఆహా! ఇలా మిమ్మల్ని పిలిచి ఎన్నాళ్ళైందో!! మరోసారి ధన్యవాదాలు :-)

వేణు, నిజంగా ఈ నదులు, జలపాతాలు, సెలయేర్లూ ఎంత వయ్యారంగా వ్యవహరిస్తాయో కదా! బ్లాగు మీద ఓ కన్నేసి ఉంచినందుకు థాంక్స్ :-)

మందాకిని said...

very nice.. simply superb!!
ur bhaavam is Dominating even in my visualisation.

జయ said...

మీ జలపాతం గుండెల్లో జల, జల జాలువారింది. చాలా అందమైన కవిత చదివిన తృప్తి కలిగింది.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగుంది..ముఖ్యంగా జలపాతాన్ని దేవతలు విడిచిన ధవళ వస్త్రం అన్నారు కదా..ఆ ఉపమానం నాకు భలే నచ్చింది.
అయినా మీరిలా చాలా రోజుల వరకూ కవితలు, కధలు ఏమీ లేకుండా బ్లాగుని ఉంచటం ఏమీ బాలేదండీ..అర్జంటుగా మా కోసం'ఊసులాడే ఒక జాబిలంట' లాంటి హార్ట్ టచింగ్ కధ ఒకటి రాసేయ్యాల్సిందే మరి!!..:)

కెక్యూబ్ వర్మ said...

చాలా కొత్తగా వుంది. హత్తుకుంది మదిని....

నిషిగంధ said...

ధన్యవాదాలు మందాకిని గారు, జయ గారు, శేఖర్ గారు, కెక్యూబ్ వర్మ గారు :-)

సేం పించ్ శేఖర్ గారు.. ఆ ఉపమానం ఒక్కటే మొదట తట్టింది.. బాగా నచ్చేసి కవితలా లాగి పీకానన్నమాట :))

Niranjan Pulipati said...

చాలా అంధం గా ఉంది.. నిషి... మనోహరమైన జలపాతం లో తడిసి ముద్దయ్యాము.. :) Good One

పద్మ said...

:) చాలా బావుంది. లాభం లేదు. తెలుగులో కొన్ని కొత్త పదాలు కనిపెట్టాలమ్మాయ్. బావుంది, అద్భుతం, కత్తి ఇలాంటివన్నీ రిపిటీటివ్ అనిపిస్తున్నాయి.

మురళి said...

"కదలని బండరాయి కరుకుదనం..
రాలిపడిన పూల నైరాశ్యం..
వేటినీ అంటనీయక
ఎగుడుదిగుడుల అనుకోని మలుపుల్లోకి
అలవోకగా జారిపోతోంది!"
ఎందుకో తెలీదు కానీ.. ఈ లైన్లు నాకు చాలా బాగా నచ్చేశాయండి.. ఆలస్యంగా వచ్చి అందరితో పాటూ చెబుతున్నా.. మీరు తరచూ రాయాల్సిందే..

నిషిగంధ said...

థాంక్యూ నిరంజన్, పద్మ, మురళి గారు :-)

నిరంజన్, అసలు ఎప్పుడైనా సరే జలపాతాన్ని తలచుకుంటే చాలు ఎగిరిపడుతున్న ఆ నీటితుప్పరలో నిజంగానే తడిచిన భావన కలుగుతుంది కదా!

పద్దమ్మా, నువ్వేమీ కొత్త పదాలు కనిపెట్టక్కర్లేదు.. జస్ట్ ఇక్కడకొచ్చి ఓ స్మైలీ పడేసి వెళ్ళిపో.. నాకు మాటర్ అర్ధమైపోతుంది :-)

మురళీ, ప్రయత్నిస్తానండి.. ఇప్పుడిప్పుడే ఈవీణ తీగలన్నీ సరిచూసుకుంటున్నాను :-)

రాకేశ్వర రావు said...

చాలా బాగుంది. పాటలా, సెలయేటిలా.
దీనికి ఏ విధంగానూ పేరుపెట్టడానికి లేదు. అంటే పేర్లు పెట్టడం నా ప్రవృత్తి అని అనుకునేరు. కాదు, అస్సలు కాదు.

నిషిగంధ said...

థాంక్యూ రాకేశ్వర రావుగారు.. అర్హులైనవాళ్ళు పేర్లు పెట్టినా పర్వాలేదండీ, ఊరికే పెట్టరు కదా! మీరు ఆ గ్రూప్ లోకే వస్తారు :-)

ప్రణీత స్వాతి said...

ప్రకృతిలో అందాల్ని చూసి అనుభూతించడం గొప్ప అదృష్టం ..ఆ అందమైన అనుభూతిని మరింత అందమైన మాటల్లోకి పొదగ గలగడం ఒక వరం. మీ కవిత అద్భుతం.. నిజంగా జలపాతం కళ్ళముందు సాక్షాత్కరింపజేశారు.

Kshanada said...

eenadu lo mee blog chusi open chesanu
mee sahityam, aasantam atimaduram,