నీ రాక కోసం..
చేతికంటిన ముళ్ళ గోరింటల
రంగు వెలిసిపోతోంది
ఈసారైనా కాస్త ముందొస్తావనుకున్నా..
నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది
మనసు ఆదమరిచేది..
ఒక్కోసారి మంచు తడియారకుండానే
కళ్ళ ముందుంటావ్..
ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?
కాలికింద నలిగిన ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..
ఇంకెన్నిరోజులిలా!?
దిగులుతో బాధేసి, కోపమొచ్చి
ఎదురుచూపుల్ని దుప్పట్లో కప్పేస్తుంటే
వినిపించింది నీ ఆగమన రాగం!
కిటికీ అవతల నిశాంతంలో
కొమ్మ కొమ్మకీ కొత్త ఆశల
చిగురులద్దుతూ నువ్వు!
నీ అడుగుల వెనుక
అలుముకుంటున్న రంగుల్లోకి
జారిపోయేముందు
అందరికీ చెప్పిరానీ
నా ప్రియసఖి వసంతమొచ్చిందని!!
తొలిప్రచురణ పొద్దులో..
20 comments:
చాలా బాగు౦ది.
కాలికింద నలిగిన ఎండుటాకుల నిర్లిప్తత
రాత్రంతా గుచ్చుకుంటూనే ఉంది..
వస౦తాన్ని రమ్మని చెప్పటానికి ఈ రె౦డు మాటలు సరిపోతాయన్న౦త బాగున్నాయి.ఈ వాక్యాలు.
బావుంది.
ఒక నిట్టుపిక్కు. ముళ్ళ గోరింట ఒక పూలుపూసే పొద. దీనికీ గోరింటాకుకీ ఏవీ సంబంధం లేదు. దీని రంగు చేతికి అంటుకోదు. నేనసలే బోటనీ మేష్టారి కొడుకుని :)
నువ్వొస్తేనే కదా స్వప్నాలు నిద్ర లేచేది అనడంలో ఎంతో ప్రేమ ఉంది.
అత్యద్భుతం
బొల్లోజు బాబా
"ఆ ఆకస్మిక ఆనందం మళ్ళీ ఎప్పుడో!?" నిజమే! ఈ ఆకస్మిక ఆనందానికేగా అందరూ ఎదురుచూసేది. బాగుంది.
నిషి,
ముందు టెంప్లేట్ తో, నెమ్మదిగా ఇలా కవితలతో ప్రాణాలు లాగేస్తున్నారు.
దిగులుతో....లైన్లు చాలా బాగున్నాయి.
రెండు లైన్లు చెపుతాను
నువ్వు రాలేదన్న నిజం చినుకంత చిన్నది
నువ్వు నిర్లక్ష్యం చేసావన్న ఆలోచన సముద్రమంత పెద్దది.
అవునా కాదా?
చాలా బాగు౦ది నిషిగంధ గారు.
నెనరులు క్రాంతి గారు, కొత్తపాళీ గారు, బాబా గారు, మహేష్ గారు, సుజాత :-)
@ కొత్తపాళీ - కరెక్ట్.. ఆ పూలకీ గోరింటాకుకీ ఏ సంబధమూ లేదు.. కానీ ముళ్ళగోరింట పూలు కోసాక చేతుల నిండా పసుపురంగు అతుక్కుపోతుంది.. అలానే ఆ మాల పెట్టుకుంటే జడ కి కూడా అతుక్కుంటుంది.. దీని మీద ఇంకా వివరణ 'పొద్దు ' లింక్ లో చూడండి :-)
@సుజాత - మీ లైన్స్ సూపర్!!
నెనరులు వేణూ గారు :-)
సుజాత గారు మీ లైన్స్ చాలా బావున్నాయండీ అక్షర సత్యాలు...
సుజాత గారు మీ లైన్స్ చాలా బావున్నాయండీ అక్షర సత్యాలు... నాదీ ఇదే మాట సుజాత గారు.
As always good one sakhi :)
intaku mundunna web design kannaa idi naaku chaalaa nachindi :D
Shwetha
ఎందుకు ఇది ఇంత అందంగా ఉంది?!!
చాలా అందం గా వుంది నిషి . అందం గా అని ఎందుకన్నానంటే ఈ కవిత చదువుతుంటే ప్రతి వాక్యం లో నూ ఆ దృశ్యం కళ్ళముందు కనిపిస్తున్నట్టే వుంది. "ఒక్కోసారి మంచు తడియారకుండానే కళ్ళముందుంటావు. " .. ఈ వాక్యం చాలా చాలా నచ్చింది. వసంతం వచ్చినా ఇంకా ఉదయపు మంచు అలాగే వున్నప్పుడు ఆ ఉషోదయం ఎంత అద్భుతంగా వుంటుందో కదా..
నిషి గారు,
నేనస్సలే బ్లాగులోకంలో కొత్త. ఎలాంటి(?) భావుకతలు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయో అనుకొంటూ ఉండేదాన్ని. కానీ మీ బ్లాగు చూసిన తర్వాత ఇంత భావుకత్వం కూడా ఉండే వాళ్ళు ఉంటారా అన్న సందేహం కలుగుతుంది. భావుకత్వం ఉండటం వేరు, దాన్ని అచ్చు అలానే పేపర్ మీద పెట్టడం వేరు. మీరు పేపర్ మీద ఇంకా అందంగా present చేస్తున్నారు. ముళ్ళగోరింటాకు నాకు తెలుసు కానీ దాన్ని ఇంత అందంగా అన్వయించడం మీకే చెల్లింది.
కలలు కన్నీటిని తుడుస్తూ
ఊహలు ఊరటానిస్తుంటే...
నీ రాక నిజమా భ్రమా....?
Thank you SO much Sakhi, Deepu, Niranjan, kala garu..
Good one Pratyusha gaaru :)
Nishigandha gAru,
The new look of this blog looks really awesome.. Hats-off to this kavita (as usual) :) Keep going!!
Srini Chimata
www.ChimataMusic.com
కవిత చాలా బాగుంది. కానీ 'నువ్వొస్తేనే కదా
స్వప్నాలు నిద్రలేచేది' అన్నది నాకు అభాసంగా అనిపిస్తోంది. వచ్చేంత వరకేగా కలలు! నిజంగా వచ్చిన తరువాత స్వప్నాలతో పనేముంది?
అభినందనలు!
నెనరులు చంద్రమోహన్ గారు, చాలా మంచి పాయింట్ చెప్పారు.. ఇక్కడ చెప్పిన 'స్వప్నాలు ' వసంతం కోసం చూస్తూ కనేవి కాదు.. వసంతాగమనంతో ప్రకృతి చేసే అద్భుతాలకి స్పందించిన మనసు కనే కలలు..
వసంతాన్ని ఆహ్వానించడం ఇంత అందంగా వుంటుందని నాకింతవరకు తెలియలేదు. అందులోనూ ఇంత అందమైన అచ్చతెనుగులో.
Post a Comment