Pages

Monday, March 31, 2008

అది ఒక వెన్నెల రాత్రి..


వెన్నెల రాత్రిని తలుచుకోగానే ఎంత చికాకులో ఉన్నా క్షణకాలమైనా మనసుకి హాయిగా అనిపిస్తుంది.. ఎన్నో వెన్నెలరాత్రులు మనలని పలుకరించి వెళ్ళినా కొన్ని మాత్రం అందమైనవిగా, అపురూపమైనవి గా మనసులో నిలిచిపోతాయి..

చిన్నప్పుడు వెన్నెల రాత్రుల్ని బాగా ఎంజాయ్ చేసింది వేసవి సెలవులలో! చిన్నత్త వాళ్ళ ఊరుకి వెళ్లినప్పుడు నీళ్ళు లేని కృష్ణమ్మ ఇసుక తిన్నెల్లో అంటుకునే ఆట ఆడుకోవడం.. చెరువుగట్టు మీద కూర్చుంటే చంద్రుడు సరిగ్గా చెరువు మీద లైట్ వేసినట్లు నీళ్ళ తళతళలు.. ఆ మెరిసే నీళ్ళల్లోకి ఎవరెక్కువ దూరం విసురుతారో అని పందెం వేసుకుని రాళ్ళు విసరటం..

అదే ఏ ఊరుకీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే రాత్రి భోజనాలవ్వగానే పిల్లలందరం తలా ఒక పళ్ళెం, రసం మామిడికాయ తీసుకుని డాబా మీదకి చేరి చిన్న మామయ్య చెప్పే దెయ్యం కధలన్నీ భయపడుతూనే వళ్ళంతా చెవులు చేసుకుని వినడం.. తర్వాత చేతులు కడుక్కోవడానికి కిందకి ఒక్కళ్ళమే వెళ్ళాలంటే భయం.. వెన్నెల రాత్రి ఇంత వెలుగు ఉంటే మీకేం భయం అన్నా పెద్దవాళ్ళని ఎవరినో ఒకరిని కిందకి లాక్కెళ్ళడం.. ఇలా సరదా సరదాగా ఉండేవి...

యుక్తవయసుకి వచ్చాక అదే వెన్నెలరాత్రి ఆహ్లాదంగానే కాదు మధురంగా కూడా అనిపిస్తుంది.. తెలీకుండానే 'ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి ' అని మనసు ఆలాపిస్తూ ఉంటుంది.. అలాంటి రోజుల్లోదే ఈ వెన్నెల రాత్రి..

అదొక శరద్రాత్రి.. నాకసలు వసంతం కంటే శరదృతువంటే ఎక్కువ ఇష్టమేమో శరదృతువులో వెన్నెల ఇంకా ఇష్టం! నేనప్పుడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నాను.. దీపావళికి చాలా రోజులు సెలవు వస్తే ఇంటికి వచ్చాను.. మా పిన్ని వాళ్ళ అత్తగారి తరుపు ఎవరో చుట్టాల ఇంట్లో పెళ్ళికి వెళ్తూ నన్ను కూడా రమ్మంది.. పెళ్ళంటే నేనూ గెంతుకుంటూ సరే అన్నాను.. అదీకాక మా పిన్నికి వాళ్ళ అత్తగారి తరపువాళ్ళు అల్లుడి హోదాలో మర్యాదలు చేస్తారు.. ఇంక పక్కనే ఉన్న మనం యువరాణీ టైపన్న మాట!! ఇంతకీ మేమెళ్ళేది ఏ ఊరని అడిగితే 'వైజాగ్ దగ్గర ఉన్న పాడేరు ' అని చెప్పింది.. అంతకు మునుపెప్పుడూ ఆ పరిశరప్రాంతాలకి కూడా వెళ్ళి ఉండకపోవటం చేత బాగా ఊషారుగా బయలుదేరాను..

మేము అనకాపల్లిలో ట్రైన్ దిగి, మా బాబాయి వాళ్ళ చుట్టాలు పంపిస్తానన్న జీప్ కోసం ఎదురుచూస్తున్నాము.. గంటన్నరైనా జీప్ జాడ లేకపోయేసరికి బాబాయి ఫోన్ చేసి కనుక్కుంటే అది ఎప్పుడో బయలుదేరి మా కోసం వచ్చిందని చెప్పారు.. మా బాబాయి ఇంక చీకటి పడితే కష్టమని బస్ కి వెచ్చేస్తామని చెప్పారు..

బస్ స్టేషన్ కి వచ్చి మేము ఎక్కాల్సిన బస్ చూసేసరికి నా పై ప్రాణం పైనే పోయింది! గంపలు.. కోళ్ళు.. బస్తాలు.. బొచ్చెలు.. వందల కొద్దీ అన్నట్లు జనాలు.. ఎలాగొలా లోపలికి వెళ్ళామనిపించుకుని పై రాడ్ పట్టుకుని నిల్చున్నాం .. పెళ్ళికి అనగానే టింగురంగా మంటూ వచ్చినందుకు నా మీద నాకే భలే కోపం వచ్చింది.. కానీ బస్ బయలు దేరిన అరగంట తర్వాత అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు నెమ్మదిగా సీట్లలో ఇరుక్కున్నాము..

అలా కూర్చుని కిటికీలోంచి బయటకి చూసిన నాకు ఆశ్చర్యం తో మాట రాలేదు.. ఆ ఊరు బాగా ఎత్తులో కొండ పైన ఉంటుందని విన్నాగానీ అంతటి ప్రకృతి సౌందర్యాన్ని అసలు ఊహించలేదు.. చుట్టూ పచ్చగా, చల్లని గాలి వీస్తూ ఉంటే నన్ను నేనే మర్చిపోతున్న సమయం లో నెత్తిమీద 'టంగ్ ' మని ఎవరిదో మోచేయి తగిలింది.. ఆ నొప్పి తట్టుకోలేక కోపంగా ఏదో అంటానికి నోరు తెరిచేలోగా ఒక మగ కంఠం 'సారీ అండి ' అని సభ్యత గా వినిపించింది.. ఈ బస్ లో ఇంగ్లీషు మాట్లాడేదెవరా అని తలెత్తి చూస్తే నూనూగు మీసాల యువకుడు అభ్యర్ధనగా చూస్తూ కనిపించాడు.. చూడటానికి చదువుకుంటున్న అబ్బాయిలా అనిపించాడు.. పైగా సారీ కూడా చెప్పాడని ఇక పట్టించుకోకుండా తిరిగి నా ప్రకృతి లో మునిగిపోయాను..

మేము ఊరు చేరుకున్న మరుసటిరోజు ఆ ఊర్లో సంవత్సరానికొకసారి జరిగే జాతర రోజని తెల్సింది.. ఆ రోజు సాయంత్రం పెళ్ళికి వచ్చిన చుట్టాలందరం జాతరకి వెళ్ళాలనుకున్నాం.. నా సిటీ ఫ్యాషన్ చూపించి ఫోజు కొట్టాలని నేను పెట్లోంచి చుడీదార్ తీస్తే మా పిన్ని గుర్రుమని చూసింది.. ఇక ఓణీ కట్టుకోక తప్పలేదు! అప్పుడప్పుడే చలి మొదలైనా అది ఏజెన్సీ ప్రాంతం అవ్వటం వలన మాములు కంటే చలి ఎక్కువగానే ఉంది.. రోడ్డుకి రెండు పక్కలా పెద్ద చెట్లు.. చెట్ల మధ్య నించి వెన్నెల మసగ్గా పిండిలా జారుతుంటే, చలికి కాస్త వణుకుతూ వోణీ ని చుట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడవటం మళ్ళీ నేనెప్పటికీ ఆస్వాదించలేని అద్భుతమైన అనుభవం..

జాతర జరిగేచోట అంతా కోలాహలంగా ఉంది.. అంతా అరుపులు, డప్పుల ధ్వని.. అంతలో మా పిన్ని వాళ్ళ అబ్బాయికి బెలూన్ మీద మనసు పోయింది.. పిన్ని వాడిని నాకు అప్పగించేసి ఇక నీ ఖర్మ అన్నట్లు చూసింది.. అ బెలూన్ వాడి దగ్గర బోల్డంతమంది జనం.. మనమేమో పెద్దగా అరిస్తే నామోషీ అనుకునే రకం.. అలా అక్కడే తచ్చట్లాడుతుంటే ఎవరో పక్కనించి వచ్చి 'ఉండండి నేను తెచ్చిస్తాను ' అని అర నిమిషంలో బెలూన్ తో మాముందు ఉన్నాడు.. అమ్మయ్య అనుకుంటూ అతని వంక చూస్తూనే గుర్తు పట్టా, పొద్దున్న బస్ లో నాకు మొట్టికాయ ఇచ్చిన శాల్తీ అని.. వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంటే 'భలేవారే ఈ మాత్రం దానికి డబ్బులు ఎందుకండి ' అంటూ నవ్వాడు.. అబ్బాయిలు కొంటెగా, వంకరగా, అల్లరిగా ఇంకా నానారకాలుగా నవ్వగలరుగానీ అందంగా మాత్రం నవ్వలేరనే నా నమ్మకానికి అదే ఆఖరి క్షణం అనుకుంటా!!

వెన్నెల్లో.. ఆ అబ్బాయి నవ్వు... 'అమ్మో! ఎటో వెళ్ళిపోతోంది మనసు ' అనుకుంటూ అతను ఏదో అంటున్నా వినిపించుకోకుండా మా వాళ్ళు ఉన్నచోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.. కానీ ఆ నవ్వు దగ్గర చిక్కుకుపోయిన నా కళ్ళు వెనక్కి రావడానికి రెండు మూడు రోజులు పట్టింది!!

పెళ్ళైన కొత్తల్లో అంటే ఒకానొక ప్రాచీనకాలంలో ఇలాంటి వెన్నెల రాత్రి సమయంలో నేనూ, మావారూ జర్నీ చేస్తుంటే పై కధంతా చెప్తే 'మరి పెళ్ళికి ముందు నా నవ్వు తెగ నచ్చిందన్నావ్.. ఇప్పుడేమో నాకంటే ముందు ఏవడో బెలూన్ బచ్చాగాడి నవ్వు బావుందంటున్నావ్ ' అని బాధగా, దిగులుగా అన్నారు.. 'అయ్యో, అలా దిగులు పడకండీ మీ నవ్వే ఎక్కువ నచ్చింది. అందుకే మిమ్మల్ని చేసుకున్నా' అని అనునయించాను.. అప్పటినించీ ఆయనకి వెన్నెలరాత్రి నన్ను ఒంటరిగా ఎక్కడికన్నా పంపాలంటే భయం.. మళ్ళీ ఎవరిదన్నా నవ్వు నచ్చిందంటానేమో అని!!

(Posted in Telugupeople.com)

21 comments:

Rajendra Devarapalli said...

హూ ప్చ్ ప్చ్ ఇంతకన్నా ఎక్కువగా నిట్టూర్చటం తెలీక ముఖ్యంగా అరసున్నలు హూ పక్కన పెట్టటం రాక ప్చ్ ప్చ్ అన్నా.ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళారు??కంటి చూపుతో చంపేస్తా అన్న మాట విన్నా కానీ ఇలాంటి బ్లాగులనే మెత్తటి కత్తులతో ఇలా పాతజ్ఞాపకాలనే పాశాలతో చంపొచ్చు అని మీరు మళ్ళీమళ్ళీ నిరూపిస్తున్నారు.టోపీలు తీయటం కాదు కొన్ని సార్లు తలలూ తీసికలాల ముందు ఉంచాల్సిన సందర్భాలున్నాయి ఇలాంటివి.

కొత్త పాళీ said...

ఇలాంటి టపాలకి బదులుగా అసలేం చెప్పలేం. ఉన్నదేదో రాజేంద్ర చెప్పేశారు. బ్యూటిఫుల్!

Unknown said...

మీ అనుభవాలను చాలా హృద్యంగా రాశారు.
చక్కని వ్యక్తీకరణ. భేష్.

నిషిగంధ said...

ధన్యవాదాలు రాజేంద్ర గారు, కొత్తపాళీ గారు, ప్రవీణ్ గారు :)

Anonymous said...

ఏదో మాటవరసకు మొహమాటంగా డబ్బులు వద్దన్నాననే అనుకోండి, మరీ మీరలా (మిగిలిందికదా అని పర్స్లో రూపాయ దాచుకుని),ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా? ఆరోజు ఎర్ర బస్సు చార్జీ తక్కువై మావూరికి నడుచుకుంటూ వెళ్ళాను, తెలుసా?
పోన్లెండి, నా రూపాయ ఇప్పుడిచ్చేయండి, సంతోషిస్తాను. :) :p

బాగా రాశారు, గుడ్!

ఏకాంతపు దిలీప్ said...

హె హె... భలే ఉంది... కొత్త పాళీ గారు అన్నట్టు అసలు ఎమీ చెప్పలేము... :-)

"అప్పుడప్పుడే చలి మొదలైనా అది ఏజెన్సీ ప్రాంతం అవ్వటం వలన మాములు కంటే చలి ఎక్కువగానే ఉంది.. రోడ్డుకి రెండు పక్కలా పెద్ద చెట్లు.. చెట్ల మధ్య నించి వెన్నెల మసగ్గా పిండిలా జారుతుంటే, చలికి కాస్త వణుకుతూ వోణీ ని చుట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడవటం మళ్ళీ నేనెప్పటికీ ఆస్వాదించలేని అద్భుతమైన అనుభవం.."
ఆ దృశ్యం కళ్ళ ముందు కదులుతుంది ఇంకా...
నా "ప్రకృతి నీతో మమేకమవుతుంటే" పోస్ట్లో ఒక వరసలో అలాంటి దృశ్యాన్నే చూసినట్టు రాసుకున్నాను...

అన్నట్టు మీరు Leo నా? అది కాకపోతే Libra నా? అది కాకపోతే Gemini? :-)

manipravalam said...

Beautiful!!!

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Super

నిషిగంధ said...

నెనర్లు Anonymous గారు, దీపు, మణిప్రవాళం గారు, కిరణ్ గారు :-)

@Anonymous, ఆ రూపాయి కోసమన్నా మళ్ళీ కనబడతారని దాన్ని పర్సులో పెట్టుకుని తిరుగుతున్నా.. చెప్పండి ఏ బాంక్ కి ట్రాన్స్ఫర్ చేయాలో! :)

@దీపు, మీరు చెప్పిన మూడిట్లో ఏదీ కాదు.. మీకు 'కనుగొనుటకు కాదేదీ అసాధ్యం' కదా.. ఇది కూడా ఇట్టే చెప్పేయగలరు :))

రాధిక said...
This comment has been removed by the author.
Anonymous said...

April 9, 2008 11:03 AM

థాంక్స్! ఆ రూపాయ ఈ అనామకుడి పేరు మీద హుండీలో వేసి ' గోవిందా ' అని అనేయండి, చాలు. :)

Ravi Kanth said...

bavundi..:)

sriram velamuri said...

excellent narration!keep it up.nishigandha ante meaning dayachesi chepparoo plz

నిషిగంధ said...

నెనరులు..
నిషిగంధ (Fragrance of the Night) అంటే white scented flower.. మూలం - మరాఠీ

Bhanu Chowdary said...

Emandi Vennela ratri gurinchi chadivaka naku chinnappudu current poinappudu pakka illallo friends to kalasi aadukunna rojulu gurtukochhai.
really nice.

Shakthi said...

కుశలమా...నిషి....కుశలమేనా...
ఇన్నినాళ్ళు నీ BLOG చూడలేక
ఎదోలాగున్నాను అంతే అంతే అంతే....

ఎటో వెళ్ళి పోయింది మనసూ....
నీ కవితా గానానికి
పరిగిడిపోతుంది మనసూ....
నీ BLOG చూదటానికీ....

ఎంతవారుగాని వేదాంతులైన గాని
నిషి కవిత చదవగానే సోలిపోదురోయ్
హాపిగా...జల్సగా...ఉల్లాసంగా...

వస్తా..వెల్లోస్తా... రేపు మళ్ళి వస్తా

హాయ్...డియర్ ..ఇప్పటికే నే నెవరో తెలిసే వుండాలి
చెప్పు చూద్దాం :)

చాలా చాలా బావున్నాయి అన్నీ........

ప్రేమతో......??? :)

Anonymous said...

inka mi kadhalo twist ivvalante mi hubby mito aa roju nuvvu aa abbayi navvu chustu vunte baloon lu ammukuntunnadi nene antaranna mata. mari oka baloon la abbayi us lo job chstunarenty ante adi inko mandutenda kadha ani rasukovachhu yemantaru? malli mi abhimane (ravigaru)just navvukuni oka hasya kadha ki idea kosame nandi.

నిషిగంధ said...

:)))) మండుటెండ కధా! అయినా హాస్యాన్ని జస్ట్ చూసి/చదివి/విని ఎంజాయ్ చేయడమే కానీ నా చేతిలో హాస్యనరం లేదండీ.. ప్చ్...

శేఖర్ పెద్దగోపు said...

>>అబ్బాయిలు కొంటెగా, వంకరగా, అల్లరిగా ఇంకా నానారకాలుగా నవ్వగలరుగానీ అందంగా మాత్రం నవ్వలేరనే నా నమ్మకానికి అదే ఆఖరి క్షణం అనుకుంటా!!..

:) భలే చెప్తారు నిషీ మీరు..

>>వెన్నెల్లో.. ఆ అబ్బాయి నవ్వు... 'అమ్మో! ఎటో వెళ్ళిపోతోంది మనసు ' అనుకుంటూ అతను ఏదో అంటున్నా వినిపించుకోకుండా మా వాళ్ళు ఉన్నచోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.. కానీ ఆ నవ్వు దగ్గర చిక్కుకుపోయిన నా కళ్ళు వెనక్కి రావడానికి రెండు మూడు రోజులు పట్టింది!!

ఎటువంటి హెసిటేషన్ లేకుండా చాలా చక్కగా వ్యక్తపరచడం నాకు బాగా నచ్చిందండీ...చాలా తక్కువ మంది అమ్మాయిలు ఇలా బయటకు చెప్తారేమో!!....అభినందనలు.

వీలు చిక్కినప్పుడలా ఇకపై మీ పాత టపాలు చూస్తుండాలి.

నిషిగంధ said...

శేఖర్, ఈ పాత టపా మీద మీరో లుక్కేయడం వలన నేను కూడా చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ చదువుతున్నాను.. అందుకు మీకు డబల్ థాంక్సులు :-)

ఇక హెసిటేషన్ సంగతంటారా.. మనం ఎన్నో అందమైన వాటిని చూస్తాం పువ్వులు, సెలయేర్లు, పచ్చిక మైదానాలు, కుక్కపిల్లలు, etc.. etc.. వాటన్నిటి గురించి చెప్పేటప్పుడు లేని సంకోచం పాపం అబ్బాయి నవ్వు గురించి చెప్పేటప్పుడు మాత్రం ఎందుకండి?! :))

krishna said...

మహాపట్టణాల రణగొణధ్వనిలో మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాల గజిబిజిలో ఇటువంటి ఆహ్లాదకరమైన వెన్నెలరాత్రులని మిస్స్ చేసుకుంటున్న మన దౌర్భాగ్యం ప్చ్.. ఏం చేస్తాం ! ఇలాంటి రచనల్లో అనుభవిస్తాం.. థాంక్యూ.