Pages

Thursday, July 23, 2015

గుబురుకొమ్మల చెట్టు...

ఎందుకో ఎక్కడా ఆగబుద్దీ కాదు
అలా అని అంతా వదిలేసి వెళ్ళాలనీ ఉండదు..
లేతకాంతి చిన్నగా కుదిపి లేపడంతోనే
ఆకాశం ఆట మైదానం అవుతుంది...
గెలుపు అవసరం లేని నింపాది పరుగులు మొదలవుతాయో లేదో
వేధించే దాహాలన్నీ దారి తప్పుకుంటాయి!
 
కింద నించి చేతులు జాచి పిలుస్తున్న
పాపాయి నవ్వులన్నీ
మెత్తటి మట్టి వాసనని మోసుకొచ్చినప్పుడల్లా
ఇక ఉండలేక మహా ఇష్టంతోనే దిగి వస్తాను..
తెల్లటి గోడలమీదనో, పెరటి మొక్కల మధ్యనో
ఎంతో కొంతసేపు సావకాశంగానే గడుపుతాను కానీ
అక్కడా ఆగలేను..
ఒక అన్యమస్కపు క్షణం చివర్లో తటాలున లేచెళ్ళక ఉండలేను!
 
గోపురం గూడులో నింపాదిగా శ్వాస తీసుకుంటూ
దుమ్మూ దుమారమూ దాటేస్తుంటాను..
విసిరేసే ముసురొకటి వచ్చినప్పుడే
గుబురుకొమ్మల చెట్టొకటి ఆసరా ఇచ్చింది.
గూళ్ళు కట్టుకున్న జంటల గురించీ,
వాటిని వదిలి వెళ్ళిన గువ్వల గురించీ
చెమ్మగిల్లిన కధలెన్నో చెప్పింది.
ఇప్పటివో, గతజన్మవో తెల్చుకోలేని జ్ఞాపకాలలో
కరిగీ, కదిలీ వెక్కి వెక్కి ఏడ్చేశాననుకుంటా
మెత్తని ఆకుల మధ్యలోకి హత్తుకుంది!
 
గడ్డిపూల మైదానాలు దాటెళ్ళుతున్నాను
ఎప్పటి అసహనాలూ, అయోమయాలో
వేకువఝాము వెలుతురులో వదిలించేసుకుంటూ..
వీచే గాలుల మధ్య చిన్నగా చలించే లేత అకులూ,
చెట్టంతా అలుముకున్న గోరువెచ్చని శాంతీ గుర్తుకొస్తూనే
ఎందుకో అంతా వదిలేయాలనిపించింది..
అక్కడికే వెళ్ళిపోవాలనీ తెలిసిపోయింది!
 
రివ్వున తిరిగివెళ్ళానా
వేల కనురెప్పలై రాత్రంతా కాపాడిన పచ్చదనం
ఖండాలుగా కొట్టివేయబడి కనబడింది!
విరిగిన నీడలేమో బుగ్గలు తుడుచుకుంటున్నాయి!!
 
 
మొదటి ప్రచురణ TFAS 30th Anniversary Souvenir ప్రతిభ లో (pg. 113)




No comments: