Pages

Saturday, March 21, 2015

వసంతోత్సాహం


"మాసానాం మార్గశీర్షోహమ్ ఋతూనాం కుసుమాకరః"
శ్రీకృష్ణుడే చెప్పుకున్నాడు తాను మాసాల్లో మార్గశిరమూ, ఋతువుల్లో వసంతమూ లాంటివాడినని. అంతటి ఉత్కృష్టమైన ఋతువులో వచ్చే పండగ ఉగాది! లేత చివుళ్ళు, పక్షుల కిలకిలరావాలు, కోకిల గానాలూ అత్యంత రమణీమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ జరుపుకునే పండుగ... తెలుగు వారి నూతన సంవత్సరాది! కాకపోతే ప్రకృతిలో మార్పులూ, తెలుగు సాంప్రదాయమూ వంటి విషయాల ప్రాధాన్యత కాలేజీ రోజుల్లోకి వచ్చాక వరకూ పూర్తిగా అర్ధం కాలేదు కాబట్టి అంతకుముందు వరకూ ఉగాది అంటే మహిషాసుర వధ, నరకాసుర వధ వంటి సాహసోపేతమైన పురాణ కధలూ, భోగిమంటల సందడులూ, పత్రితో పాలవెల్లిని అలంకరించాలనే తాపత్రయమూ... ఇలా ఎలాంటి ఉత్సాహభరితమైన నేపధ్యమూ లేని పండగ!

చిన్నప్పుడు ఉగాది అంటే పెద్దవాళ్ళ పండగ అనే ప్రగాఢమైన నమ్మకంతో పాటు, మిగతా పండగల్లాగా ఈ రోజు కోసం అంతగా ఎదురు చూడకపోవడానికి నా వరకూ రెండు ముఖ్య కారణాలు. ఒకటి, ఇది పరీక్షల టైమ్ లో రావడం.. రెండవది, 'మొన్న సంక్రాంతికేగా రెండు జతలు కుట్టించిందీ!' అంటూ ఇంట్లో వాళ్ళు ఈ పండగకి ఎప్పుడూ కొత్తబట్టలు కొనకపోవడం!! కొత్త బట్టలు లేని పండగని అసలు ఒక పండగగా అంగీకరించడానికి మనసేమో ససేమిరా అనేది!  అప్పటికీ, 'తెలుగు న్యూ ఇయర్ కదా, ఈరోజు కొత్తబట్టలు వేసుకుంటే సంవత్సరమంతా వేసుకుంటామంట కదా!' అని సంస్కృతీ సాంప్రదాయాలని మేళవించిన ఒక సెంటిమెంట్ బాణాన్ని ప్రయోగించినా అమ్మ తాపిగా 'మనకేమన్నా బట్టలకొట్టు ఉందా సంవత్సరమంతా కొత్తబట్టలు వేసుకోడానికి? అయినా కొత్తది ఏదో ఒకటి ఉంటే చాలు.' అని రెండు మూడు కొత్త రిబ్బన్లు బయటకి తీసేది!

అయితే 'గారెలూ, పాయసమూ తప్ప ఇంకేముందీ రోజుకి ప్రత్యేకత!?' అని మేము మరీ నిరుత్సాహ పడిపోకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిల్లో అత్యంత ముఖ్యమైనది వేపపువ్వు పంచిపెట్టడం. షడ్రుచుల ఉగాది పచ్చడి ప్రాశస్త్యం అంతగా తెలియకపోయినా అందులో ఉపయోగించే పదార్ధాలలో వేపపువ్వు చాలా ప్రధానమైనదని తెలుసు. ఇంటి ఆవరణలో ఇంచుమించు ఇంటిని కప్పేసేంత పెద్ద వేపచెట్టు ఉండేది. ఉగాది సమయంలో వేపచెట్టు ఉన్న ఇంటివాళ్ళు హఠాత్తుగా సెలెబ్రిటీలు అయిపోతారు. రెండు మూడు రోజుల ముందునించే చుట్టుపక్కల వాళ్ళ పలకరింపుల్లో అదనపు గౌరవం, ఆప్యాయతలు చేర్చబడతాయి! ఉగాది రోజు పొద్దుపొద్దున్నే మా అమ్మమ్మ బోల్డంత ఉగాది పువ్వు మామయ్య చేత కోయించి, వరండాలో న్యూస్ పేపర్లు పరిచి, చిన్న చిన్న కుప్పలుగా వేరు చేసేది. దానికి నన్ను ముఖ్యాధికారిగా నియమించి, వేపపువ్వు కోసం వచ్చిన వాళ్ళందరికీ తలో కుప్ప పువ్వు ఇవ్వమనేది. ఇక యువరాణీ వారు తమ జన్మదిన సందర్భాన జనాలకి ఉచితంగా పట్టుబట్టలు దానం చేసిన లెవల్లో హుందాతో కూడిన ఆదరంతో ఆ వేపపువ్వును పంచిపెట్టడం చాలా అంటే చాలా ఇష్టమైన కార్యక్రమం.

చైత్ర శుద్ధ పాడ్యమీ... పంచాంగ శ్రవణం అంటూ తాతయ్య ఏవేవో చెప్తుండగానే పక్కింటి స్నేహితుల కోసం పరిగెత్తడం ఇంకా నిన్నా మొన్ననే జరిగినట్లుంది! ఆరోజు ఎవరింటికి ఎవరు వచ్చినా వెళ్ళినా ఉగాది పచ్చడి రుచి చూడటం తప్పనిసరి. పచ్చడి తయారుచేయడానికి అందరూ ఇంచుమించు అవే పదార్ధాలని ఉపయోగించినా రుచి మాత్రం ఏ రెండింట్లోనూ ఒకటిగా ఉండేది కాదు.. కొన్నిట్లో పులుపు ఎక్కువ.. ఇంకొన్నిట్లో చేదు ఎక్కువ... కొంతమందేమో ఇన్నిన్ని చెరుకు ముక్కలు వేసి తీపిగా చేసేవాళ్ళు! అదే విషయం ఇంట్లో చెప్తే ఏ రుచి ఎక్కువ తింటే సంవత్సరమంతా మనకి అలానే ఉండబోతుంది అనేవాళ్ళు!

ఉగాది అంటే ఇంకాస్త ఉత్సాహంగా అనిపించే ఇంకొక కారణం ఈ పండుగ వచ్చిన వారానికి శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి అంటే పందిళ్ళు, పానకాలూ, ఫ్రీ సినిమాలూ!! కజిన్సందరమూ మేడ మీద కూర్చుని పోయిన సంవత్సరం సినిమాలూ, ఈసారి ఏమేం తీసుకువస్తారు అనుకుంటూ చేసిన ఎడతెరిపిలేని సంభాషణల మధ్యలో  ఉగాది మెల్లగా నిష్క్రమిస్తుంది.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకి ఈ పండుగ ప్రతీక అని తెల్సిన తర్వాత మాత్రం ఈ పండుగ అంటే ఇంకాస్త శ్రద్ధ పెరిగిన మాట వాస్తవం. పండుగ ఎలా జరుపుకున్నా ఏదో ఒక కొత్త పని మాత్రం మొదలుపెట్టాలనే ఉత్సాహం తోడయింది. రాశిఫలాల మీద పూర్తి నమ్మకం లేకపోయినా గ్రహాలూ, వాటి స్థానాలు తెలుసుకోవడం సరదాగా అనిపిస్తుంది. ఉగాదికీ, సాహిత్యానికీ ఉన్న అసలు సిసలు సంబంధం ఏమిటో తెలియకపోయినా కవి సమ్మేళనాలు ఆసక్తిగా అనిపించడం మొదలయింది.

ఏ సంస్కృతిలోని అసలుసిసలు అందచందాలు అయినా గోచరమయ్యేది పండుగ సమయాల్లోనే. తలస్నానాలూ, మామిడి తోరణాలూ, కొత్త బట్టలూ వంటి విధిగా చేసే పనులే కాకుండా ఒక్కొక్క పండుగకీ ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది.. వాటి వెనుక వుండే విశిష్టతని అర్ధం చేసుకుని ఆచరించడం... ముందు తరాలకి ఈ ఆచారాలని అందజేయడం మన ప్రధాన బాధ్యత. స్థల కాలాలు మారినా, పండుగలు జరుపుకోవడంలో స్వల్ప తేడాలు వచ్చినా వీలైనంతవరకూ ఈ బాధ్యతని కొనసాగించగలగాలి.


---------------------------
     

మొదటి ప్రచురణ మార్చ్ 2015 తానా పత్రికలో..... 
   
   

2 comments:

వేణూశ్రీకాంత్ said...

బాగుంది నిషీ :-) వేపపువ్వు పంచి పెడుతున్న యువరాణీ వారు కళ్లముందుకొచ్చేశారు :-))

Unknown said...

Excellent..