Pages

Friday, January 4, 2013

మనో విహంగాలు

వసంతాలూ.. వెన్నెల నీడలూ.. వెదురు తోటలూ
అన్నిటినీ ఒకేసారి కావలించుకోవాలని
గూడువదిలిన సీతాకోకచిలకల్లా హడావిడి పడుతుంటాయి…

 
స్వప్నసంచారాల నిదురవేళల్లో
కొబ్బరాకుల చివుళ్ళపై
రేపటి కలల్ని పేరుస్తుంటాయి..

 
పొగమంచుని తాకిన
పొద్దుటెండలోని మెత్తదనం…

 
నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు…

తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ…

 
మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

 
అనుభూతులన్నిటికీ అస్థిత్వాన్నిఅద్దుతుంటాయి…
అసంఖ్యాక చిత్రాలనెన్నిటినో ఆవిష్కరిస్తాయి!

 
కానీ..
 

నైరాశ్యపు క్షణాలు కొన్ని
అస్సలిష్టంలేని అగరుబత్తి ధూపంలా
చుట్టుముట్టునప్పుడు మాత్రం…..

 
శీతాకాలపు సాయంకాలాలలో
నిశ్శబ్దపు వాగుమీద
వంతెనొకటి పేర్చాలన్నా…

 
లోపలా.. బయటా..
తుళ్ళిపడే ప్రేమావేశ జలపాతాన్ని
దారిమళ్ళించాలన్నా…

 
అక్షరాలు అదృశ్యమైన భాష ఒకటి మిగులుతుంది!

-- మొదటి ప్రచురణ వాకిలి లో....

10 comments:

సవ్వడి said...

" తుంపులు " అంటే...

ఎన్ని రోజుల తరువాత ఇలాంటి కవితను చూసానండి. చాలా బాగుంది.
ఆ పదాలేంటండి... ఎలా దొరికిపోతాయి మీకు.
వెన్నెల నీడలూ, కొబ్బరాకుల చివుళ్ళపై..., పొద్దుటెండలోని మెత్తదనం… చాలా బాగున్నాయి.
మీ కవితల్లోని భావాన్ని ఊహించుకుంటూ మళ్లీ మళ్లీ చదివేస్తాను.

చివర లైన్ ని కొంచెం మార్చితే బాగుంటుందేమో చూడండి.

chinni v said...

చాల బాగుంది

Narayanaswamy S. said...

nice

నిషిగంధ said...

సవ్వడి గారూ, చాలా రోజులైందండీ మిమ్మల్ని చూసి.. అంతా కుశలమే కదా?
తుంపులు అంటే చిన్న చిన్న ముక్కలు అని అర్ధమండీ..
మీ స్పందనకు ధన్యవాదాలు :)

చిన్ని గారూ, నారాయణస్వామి గారూ ధన్యవాదాలండీ :)

Srini Chimata said...

Excellent Nishi gaaru.. muTTinappuDu v/s muTTunappaDu.. E padamainA correct E anipistundi.

savvaDi gaaru,
chUSAnanDi balugugA chUsAnaDi ani chUstE naa gunDe kalukkumanTundi. bahuSA, only ShA is used for meliSa SA in your transiliterated tool.

లక్ష్మీదేవి said...

భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!
నిజం!!!!!!!!!!!!

Anonymous said...

nice kavita. chala rojula tarwata
oka manchi kavita chadivina feeling

revati

పూర్వ ఫల్గుణి(poorva phalguni) said...

చాల బావుంది,ఎక్కడో అమెరికాలో వున్నా కూచొని పక్కనే వున్నట్లు ఈ వెన్నెల.కొబ్బరి చెట్టు,గోదావరి.ప్రేయసి/ప్రియతముడు గురుంచి ఎంత బాగా కవితలల్లారు. ఇవన్నీ వుంటేనే జీవితం అనిపిస్తుంది నాకు.ఒక్కసారి .బాపిరాజుగారు,కృష్ణశాస్త్రిగారు అల కళ్ళ ముందు మెదిలారు. ఇవన్నీ కూడా ఇంకా మనం కొంతైన అనుభవం ,అనుభూతి పొందుతున్నఅందుకు నిజంగ ధన్యులమే

నవజీవన్ (NAVAJEEVAN) said...

మీ మనోవిహంగాలు బహు ముచ్చటగా ఉన్నాయి నిషిగంధ గారు ..

వేణూశ్రీకాంత్ said...

రెండునెలలుగా నేను చదవాల్సిన టపాలు రెండొందలు పైగా ఉన్నాయని నా గూగుల్ రీడర్ హెచ్చరిస్తున్నా అలక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించాననే అనిపిస్తుంది, ఇంత మంచి కవితను ఇంత ఆలశ్యంగా చదివి.