Pages

Monday, July 16, 2012

తడి జ్ఞాపకం...


మారుతున్న మాసాల ఊసు వింటూ
కరుగుతున్న ఆఖరి మంచు జాడల
తడి.. చలి రాత్రిలో
జ్ఞాపకమొకటి చిటికినవేలు పట్టుకు ఆపింది..

రాత్రంటే నీ మాటలు మాయమవడమేగా!

దశాబ్దాల క్రితం వినబడ్డ నీ చివరి పలకరింపుతోనే
ప్రతి పగలునీ వెలిగించుకుంటాను..

మనసుకి పడ్డ నల్లరంధ్రం చుట్టూ
సంధిభావాల పూలపొదలు..
దోశెడు ఆశల నీళ్ళు
ఝాము ఝాముకీ చిలకరించక తప్పదు!
వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు
పరాకుగా వెళ్తున్న పడమటిగాలిని పట్టి ఆపగానే
ఒకప్పటి స్పర్శాక్షణాలన్నీ
చుట్టూ జలజలా రాలతాయి..

గూటిలోని గువ్వ పక్కకి వత్తిగిల్లిన చప్పుడు
నా కనురెప్పలపైన నీ పెదవుల ముద్ర
ఆనవాలుని వెదికి తెచ్చింది.. 
కన్నుల్లో చప్పున కదలాడిన
సెలయేటి కెరటాలు
కదలనంటోన్న కాలాన్ని
తడిపేస్తూ చెప్తున్నాయి....

నీ జాడ లేని ప్రపంచంలో
బ్రతకడం
సాధ్యమే కానీ సులభం మాత్రం కాదు!!


(మొదటి ప్రచురణ జులై-2012 కౌముదిలో )

English Translation by NS Murty gaaru...
 

Tuesday, July 3, 2012

మువ్వలూ.. ముత్యాలూ.. మనసెరిగిన ఎందరో స్నేహితులు...


మనం ఒక విషయాన్ని మనస్పూర్తిగా నమ్ముతాం.. ఆ నమ్మకం మీదే మన జీవితంలో చాలా ముఖ్యమైన పనులవ్వనీ, మన ఆలోచనలవ్వనీ తెలీకుండానే ఆధారపడిఉంటాయి.. అది దేవుడవ్వచ్చు.. స్నేహమవ్వచ్చు.. ఇంకేదైనా అవ్వొచ్చు.. ఉన్నట్టుండి, ఏదో సంఘటన జరుగుతుంది! ఆ నమ్మకానికి చిన్న బీట పడుతుంది.. ఇక రాత్రీ పగలూ.. ఏ పని చేస్తున్నా చేయకున్నా మనసు అదే ఆలోచిస్తూ ఉంటుంది.. 'అసలు ఆ విషయాన్ని ఇంతలా నమ్మకుండా ఉండాల్సిందేమో! దానివల్ల చివరికి నాకు మిగిలేది బాధేనేమో' అనే సందిగ్ధమో.. ఆందోళనో.. కుదురుగా ఉండనివ్వదు! అలాంటిదే నాకు మొన్న శంకర్ గారి హఠాన్మరణంతో అనుభవమైంది! ఈ ఆన్లైన్ స్నేహాలు, ఆప్యాయతలూ ఏదో ఒకరోజుకి దుఃఖాన్ని మాత్రం మిగిలుస్తాయేమో అనే భయం.. అంటే, ఎప్పుడూ ఇలా దురదృష్టకరమైన సంఘటనలే జరుగుతాయని కాదు.. కొంతమంది అనుకోకుండా ఏవేవో వ్యక్తిగత కారణాల వల్ల కూడా కనబడటం మానేస్తారు.. ప్రతిరోజూ వాళ్ళ ఐడిలో ముఖాల్నీ, అక్షరాల్లో వాళ్ళ ముఖకవళికల్ని చూసీ.. చూసీ అలవాటైపోయి.. ఒకట్రెండు రోజులు కనబడకపోతేనే అదోలాంటి బెంగ వచ్చేస్తుంది! అలాంటిది, ఇంకెప్పటికీ కనబడరంటే!!

నాకిది రెండో అనుభవం.. మొదటి వ్యక్తి విషయంలో అయితే ఇప్పటికీ అసలు ఉన్నారో లేదో కూడా తెలీదు... అంతకుముందు రోజు సాయంత్రం వరకూ పాటలు పాడి, అల్లరి చేసిన మనిషి మరుసటిరోజు నించీ కంప్లీట్‌గా అదృశ్యం! ఐడి తప్ప ఏమీ తెలియని పరిస్థితిలో 'క్షేమంగా ఉంటే చాలు, భగవంతుడా!' అని ప్రార్ధించడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయస్థితి! ముఖ్యంగా, శంకర్ గారి  'పర్వాలేదు.. అస్సలు మొహమాట పడకండి.. ఏవేం పుస్తకాలు కావాలో చెప్పండి ' అన్న చివరి మాటలు తల్చుకుంటే ఇంకా బాధ.. ఇంకెవరు అడుగుతారు ఇలా అని! ఈ పరిచయాలు కలిగించే చిన్న చిన్న రోజువారీ సంతోషాల కంటే, అవి మిగిల్చే దీర్ఘకాలపు బాధని తలచుకుని కొంచెం దూరం జరగాలనిపించింది!

కానీ, ఆ బీటలు వారిన నమ్మకాన్ని అతికించే చిన్న సంఘటన...

నిన్న ఇంటికెళ్ళేసరికి, మా ఇంటాయన గారు ఒకింత ఆదుర్దానో, బాధో తెలీని ఒక మిక్స్‌డ్ ఎక్స్ప్రెషన్‌తో "నీకు మీ ఫ్రెండ్ నించి పుస్తకాలు వచ్చాయన్నారు!" ఆయన ఉద్దేశ్యంలో అవి శంకర్ గారు పంపారని.. ఎందుకంటే తనకి తెలిసీ నేను రీసెంట్‌గా పుస్తకాల గురించి మాట్లాడింది శంకర్ గారితోనే! అది అసంభవం అని మనసుకి తెలుస్తున్నా గభాల్న వెళ్ళి లేబుల్ చూశాను...ఎదురుగా, Sravya V. అని కనబడుతోంది! అసలు ఆ అమ్మాయే కళ్ళముందు నించున్నట్టు అనిపించేసి ఆ ప్యాకేజ్ నే హగ్ చేశేసుకున్నా.. అబ్బే, ఇది అతి అస్సలు కానే కాదు.. ఇలాంటి ఎక్సైట్‌మెంట్ అనుభవించిన వాళ్లకే నేను చెప్పేది అర్ధం అవుతుంది!! కలలో, ఇలలో, ఏ లోకాలలోనూ ఊహించలేదు ఇలా అడగకుండానే నాకెంతో ఇష్టమైన బహుమతిని, అదీ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు బహుమతుల్ని ఇచ్చేవాళ్ళు ఉంటారని.. ఎగైన్, అ..డ..గ..కుం..డా..నే!!!!!!!!!


నీలాకాశాన్ని కప్పేసినందుకు కారుమబ్బుల్ని తిట్టుకుంటుంటే గుత్తులు గుత్తులుగా మోదుగపూలు ఫక్కున నవ్వినట్టు...
ఒక రంగు మాయమైతేనేం! ఇంకో రంగు మనసుని తడుముతోంది!!

ఈఅమ్మాయితో నా ములాఖాత్ సాయంకాలం నీరెండ లాంటిది! కలిసేది కాసేపే... కానీ ఆ కాస్తంతసేపూ నులివెచ్చని, మెత్తని స్పర్శ.. తన మాటల రూపంలో పలకరిస్తుంది.. ఆ కొద్దిసేపూ అల్లరీ..మెచ్చికోళ్ళూ.. పెద్దంతరం మీదేసేసుకుని జాగ్రత్తలూ.. దీవెనలూనూ! మాట్లాడిన ప్రతిసారీ, 'ఈ వయసులోనే ఎంత మెచ్యూరిటీ!' అని అనుకోకుండా ఉండలేను... 

శ్రావ్యా, నా కళ్ళు తడి చేయడం సాధ్యమే.. అంత కష్టం కాదు.. కానీ.... నాతో నిన్న తీన్‌మార్ వేయించావు చూడూ... చాలా తక్కువ మందికి సాధ్యం అది! నీ అభిమానానికి ప్రతిగా ఏమి చెబుదామన్నా తేలిపోతోంది.. ఏ పదానికి సరైన అర్ధం గోచరించడం లేదు! ఇంత దూరం నుంచి ప్రస్తుతం ఒట్టి థాంక్యూ తప్ప ఏమీ చెప్పలేకున్నాను.. THANK YOU SO MUCH FOR YOUR LOVE AND AFFECTION! MAY GOD BLESS YOU WITH ALL THE HAPPINESS, Dear!

బాధ.. సంతోషం.. పక్కపక్కనే ఉంటాయి.. పరిస్థితిని బట్టి ఒకదాని నుంచి ఇంకోదానికి గ్రేస్‌ఫుల్‌గా మారుతుండటమే మనం చేయాల్సింది! ఈ చిన్న విషయాన్ని నీ ద్వారా తెలుసుకున్నాను, శ్రావ్యా! Love you!

----------------------

ఎలాగో పుస్తకాలు.. స్నేహితులూ గురించి మాట్లాడుతున్నా కాబట్టి.....నా పుస్తకదాతలందరినీ ఒకసారి తలచుకోవాలనుంది..........

ఆ మధ్యనెప్పుడో నా ప్రాణస్నేహితురాలు శ్వేత, "నీ దగ్గర ఏమన్నా పాత నవల్స్ ఉంటే చారిటీగా డొనేట్ చేస్తావా, మా ఊళ్ళో తెలుగు లైబ్రరీకి" అని అడిగితే నేను సెకనులో సగం కూడా ఆలోచించకుండా "అబ్బే, అలాంటి పనులు నేను చేయను, కావాలంటే డబ్బులిస్తా" అన్నా.. అసలు తన దగ్గరికి మూణ్ణెల్లకోసారి వెళ్ళినప్పుడల్లా లడ్డూలు, మురుకులు, వడియాలు..etc etc అచ్చు అమ్మ దగ్గర్నించి ఎలా తెచ్చుకుంటామో అలానే మూటలు మూటలు తెచ్చుకుంటా!! అలాంటిది తను నోరు తెరిచి అడగ్గానే నేను ఖరాఖండిగా "నో" చెప్పేశాను.. ఎంత చిరిగి శిధిలావస్థలో ఉన్నా, అవి ఎలాంటి రచయిత(త్రు)లవైనా నా పుస్తకాలంటే నాకు ప్రాణం.. పైగా ఇలా దూరాభారాన ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు టకీమని కొనుక్కునే అవకాశం లేకపోవడం వల్ల ఈ పుస్తకాల పీనాసితనం బాగా హైట్స్ లోకి వెళ్ళిపోయింది.. కానీ, నేను ఆడగకుండానే/అడగ్గానే కాదనకుండా... అదీ ఇక అచ్చులో దొరకని పుస్తకాలని నాకు పోస్ట్ లో పంపి మరీ నన్ను ఆనందాశ్చర్యాలకు గురిచేశేసారు కొందరు స్నేహితులు!!

రెండు సంవత్సరాల క్రితం నేను గొల్లపూడి గారి 'ఎర్రసీత ' గురించి విని, ఆ పుస్తకం కోసం అన్ని రకాలా ప్రయత్నించి, విసిగి ఇక ఆశ వదిలేసుకున్నప్పుడు అప్పటికి నాతో ఏమాత్రం పరిచయం లేని స్నేహితురాలు సుధ, కౌముది కాంతి గారి ద్వారా నా ప్రయాసని విని రెండు రోజుల్లో 'ఎర్రసీత ' ని నాకు పంపించారు! నాకైతే కృతజ్ఞతలు చెప్పడానిక్కూడా నోరు పెగలని పరిస్థితి!!

అప్పటికే రెండు మూడు అరుదైన పుస్తకాలని అచ్చంగా ఇచ్చేసి... నేను స్వప్నరాగలీనని తెగ తలుస్తూ, తనని పరిచయంచేసుకునే వీలు నాకు లేదని వాపోతుంటే "ఎన్నాళ్ళు చదువుతావో నీ ఇష్టం" అని 'అనుక్షణికం'  దానం చేసిన కొత్తపాళీ గారి ధైర్యాన్ని తల్చుకుంటే నాకు ఇప్పటికీ భలే ఆశ్చర్యం వేస్తుంది, అసలు ప్రింట్ లో లేని ఆ నవలని ఏ నమ్మకంతో నాకు పంపించారా అని!!

ఆ తర్వాత, తన బ్లాగులో జానపద నవల గురించి చెప్తూ, మనసులో మాట సుజాత, "ఎవరికైనా కావాలంటే...." అని ఇంకా వాక్యం పూర్తి చేయనేలేదు నేను బెంచీ ఎక్కి మరీ చేతులెత్తినంతపని చేశాను.. తను వెంటనే దానితో పాటు ఇంకో రెండు మంచి పుస్తకాలు కూడా వచ్చాయనీ అవికూడా పంపిస్తాననీ ఈమెయిల్ ఇచ్చింది.. ఆ జానపద నవల రాకున్నా ఇంకా బోల్డంత ఇష్టమైన 'మిధునం' మాత్రం పదిలంగా పంపింది.. అసలు తనంటేనే పుస్తకాల అక్షయపాత్ర అని నా నమ్మకం!

అప్పట్లో బజ్జులోకి ప్రవేశించి హాయ్, హల్లో అంటూ నెమ్మదిగా మొహమాటంగా తిరుగుతుంటే ఎక్కడ్నించి వచ్చిందో గానీ ఈ అమ్మాయి పద్మ ఉండవల్లి, చెయ్యి పట్టుకుని గబగబా మొత్తం బజ్జులన్నీ తిప్పేసింది.. మరుసటిరోజు కుప్పిలి పద్మా, శీతవేళ రానీయకు అంటూ ఏదో బజ్ రాసింది.. "రచయిత్రి పేరు సరే ఈ పుస్తకమెప్పుడూ చదివినట్లు లేదు " అని అన్నానో లేక అనుకున్నానో తెలీదు కానీ మళ్ళీ నాలుగు రోజుల్లో ఆ పుస్తకం మా మెయిల్ బాక్స్ లో ఉంది! అసలు అప్పటికి తనకి నా పేరు తప్ప పింక్ చుడీదార్ ఫేసూ, బ్లూ స్వెటర్ నవ్వూ, మా టైం జోనూ ఇవేవీ తెలీవు..

ఇక మొదటిసారి అచ్చంగా... బోలడన్ని పుస్తకాలు పంపింది మాత్రం మన శంకర్ గారే!!



e-copy లు పంచుకోవడానికి కంప్యూటర్ మెమరీ కాస్త ఎక్కువ ఉంటే సరిపోతుంది కానీ ఇలా పుస్తకాలంటే ఇష్టం ఉండీ వాటిని వేరేవాళ్ళతో పంచుకోవాలంటే ఎంత పెద్ద మనసు ఉండాలో కదా అనిపిస్తుంది... అదీ ఒకే ఊరిలో ఉండి పుస్తకాలు పంచుకోవడం వేరు.. కాస్తో కూస్తో భరోసా ఉంటుంది. దూరాల్లో ఉన్న స్నేహితులకి పుస్తకాలు పంపాలంటే మాత్రం ఎంత నమ్మకం ఉండాలో!! మణులేలా మాణిక్యాలేలా ఇలాంటి స్నేహితులు నలుగురైదుగురు ఉంటే చాలదా అనిపించకమానదు!

 'శీతవేళ రానీయకు ' లో చదివిన కింది నాలుగు పంక్తులు అటూ ఇటూగా ఇలానే చెప్పాయి..

".......మన వెలుపల మనలాంటి మనుష్యుల కోసం, మన మనుష్యుల కోసం మనమెప్పుడూ వెతుకుతూ ఉంటాం.. మన భాష అర్ధమయ్యేవాళ్ళూ, మనతో మాట్లాడగలిగేవాళ్ళూ, మనం చెప్పకుండానే మనల్ని చదివేవాళ్ళూ, మనం చెప్పుకోగలిగేవాళ్ళూ, ఒక్క చూపుతో, ఒక్క మాటతో, ఒక స్పర్శతో మనకు ఉత్సాహం, ఉద్రేకం, ఉపశమనం పుట్టించేవాళ్ళు మనకెప్పుడూ కావాలి.. మనల్ని వాళ్ళలా మార్చుకోకుండా మనల్ని తమలోకి తీసుకోగలిగేవాళ్ళు, మనల్ని మనలా ఇష్టపడేవాళ్ళు కావాలి.. నిప్పుల వర్షంలో నడుస్తున్నప్పుడు కూడా ఎవరి స్ఫురణ మనల్ని చల్లగా చూస్తుందో వారి స్నేహం కావాలి.. అటుమటి మనుషులు మనకెంతగా కావాలంటే -- వాళ్ళు లేని మనం అరసున్నాలా అర్ధరహితంగా మిగిలిపోతాం....... "

Thank you all.. Thank you so much!!


పుస్తక దాతా సుఖీభవ!!!