Pages

Monday, March 31, 2008

అది ఒక వెన్నెల రాత్రి..


వెన్నెల రాత్రిని తలుచుకోగానే ఎంత చికాకులో ఉన్నా క్షణకాలమైనా మనసుకి హాయిగా అనిపిస్తుంది.. ఎన్నో వెన్నెలరాత్రులు మనలని పలుకరించి వెళ్ళినా కొన్ని మాత్రం అందమైనవిగా, అపురూపమైనవి గా మనసులో నిలిచిపోతాయి..

చిన్నప్పుడు వెన్నెల రాత్రుల్ని బాగా ఎంజాయ్ చేసింది వేసవి సెలవులలో! చిన్నత్త వాళ్ళ ఊరుకి వెళ్లినప్పుడు నీళ్ళు లేని కృష్ణమ్మ ఇసుక తిన్నెల్లో అంటుకునే ఆట ఆడుకోవడం.. చెరువుగట్టు మీద కూర్చుంటే చంద్రుడు సరిగ్గా చెరువు మీద లైట్ వేసినట్లు నీళ్ళ తళతళలు.. ఆ మెరిసే నీళ్ళల్లోకి ఎవరెక్కువ దూరం విసురుతారో అని పందెం వేసుకుని రాళ్ళు విసరటం..

అదే ఏ ఊరుకీ వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే రాత్రి భోజనాలవ్వగానే పిల్లలందరం తలా ఒక పళ్ళెం, రసం మామిడికాయ తీసుకుని డాబా మీదకి చేరి చిన్న మామయ్య చెప్పే దెయ్యం కధలన్నీ భయపడుతూనే వళ్ళంతా చెవులు చేసుకుని వినడం.. తర్వాత చేతులు కడుక్కోవడానికి కిందకి ఒక్కళ్ళమే వెళ్ళాలంటే భయం.. వెన్నెల రాత్రి ఇంత వెలుగు ఉంటే మీకేం భయం అన్నా పెద్దవాళ్ళని ఎవరినో ఒకరిని కిందకి లాక్కెళ్ళడం.. ఇలా సరదా సరదాగా ఉండేవి...

యుక్తవయసుకి వచ్చాక అదే వెన్నెలరాత్రి ఆహ్లాదంగానే కాదు మధురంగా కూడా అనిపిస్తుంది.. తెలీకుండానే 'ఇది తీయని వెన్నెల రేయి..మది వెన్నెల కన్నా హాయి ' అని మనసు ఆలాపిస్తూ ఉంటుంది.. అలాంటి రోజుల్లోదే ఈ వెన్నెల రాత్రి..

అదొక శరద్రాత్రి.. నాకసలు వసంతం కంటే శరదృతువంటే ఎక్కువ ఇష్టమేమో శరదృతువులో వెన్నెల ఇంకా ఇష్టం! నేనప్పుడు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నాను.. దీపావళికి చాలా రోజులు సెలవు వస్తే ఇంటికి వచ్చాను.. మా పిన్ని వాళ్ళ అత్తగారి తరుపు ఎవరో చుట్టాల ఇంట్లో పెళ్ళికి వెళ్తూ నన్ను కూడా రమ్మంది.. పెళ్ళంటే నేనూ గెంతుకుంటూ సరే అన్నాను.. అదీకాక మా పిన్నికి వాళ్ళ అత్తగారి తరపువాళ్ళు అల్లుడి హోదాలో మర్యాదలు చేస్తారు.. ఇంక పక్కనే ఉన్న మనం యువరాణీ టైపన్న మాట!! ఇంతకీ మేమెళ్ళేది ఏ ఊరని అడిగితే 'వైజాగ్ దగ్గర ఉన్న పాడేరు ' అని చెప్పింది.. అంతకు మునుపెప్పుడూ ఆ పరిశరప్రాంతాలకి కూడా వెళ్ళి ఉండకపోవటం చేత బాగా ఊషారుగా బయలుదేరాను..

మేము అనకాపల్లిలో ట్రైన్ దిగి, మా బాబాయి వాళ్ళ చుట్టాలు పంపిస్తానన్న జీప్ కోసం ఎదురుచూస్తున్నాము.. గంటన్నరైనా జీప్ జాడ లేకపోయేసరికి బాబాయి ఫోన్ చేసి కనుక్కుంటే అది ఎప్పుడో బయలుదేరి మా కోసం వచ్చిందని చెప్పారు.. మా బాబాయి ఇంక చీకటి పడితే కష్టమని బస్ కి వెచ్చేస్తామని చెప్పారు..

బస్ స్టేషన్ కి వచ్చి మేము ఎక్కాల్సిన బస్ చూసేసరికి నా పై ప్రాణం పైనే పోయింది! గంపలు.. కోళ్ళు.. బస్తాలు.. బొచ్చెలు.. వందల కొద్దీ అన్నట్లు జనాలు.. ఎలాగొలా లోపలికి వెళ్ళామనిపించుకుని పై రాడ్ పట్టుకుని నిల్చున్నాం .. పెళ్ళికి అనగానే టింగురంగా మంటూ వచ్చినందుకు నా మీద నాకే భలే కోపం వచ్చింది.. కానీ బస్ బయలు దేరిన అరగంట తర్వాత అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు నెమ్మదిగా సీట్లలో ఇరుక్కున్నాము..

అలా కూర్చుని కిటికీలోంచి బయటకి చూసిన నాకు ఆశ్చర్యం తో మాట రాలేదు.. ఆ ఊరు బాగా ఎత్తులో కొండ పైన ఉంటుందని విన్నాగానీ అంతటి ప్రకృతి సౌందర్యాన్ని అసలు ఊహించలేదు.. చుట్టూ పచ్చగా, చల్లని గాలి వీస్తూ ఉంటే నన్ను నేనే మర్చిపోతున్న సమయం లో నెత్తిమీద 'టంగ్ ' మని ఎవరిదో మోచేయి తగిలింది.. ఆ నొప్పి తట్టుకోలేక కోపంగా ఏదో అంటానికి నోరు తెరిచేలోగా ఒక మగ కంఠం 'సారీ అండి ' అని సభ్యత గా వినిపించింది.. ఈ బస్ లో ఇంగ్లీషు మాట్లాడేదెవరా అని తలెత్తి చూస్తే నూనూగు మీసాల యువకుడు అభ్యర్ధనగా చూస్తూ కనిపించాడు.. చూడటానికి చదువుకుంటున్న అబ్బాయిలా అనిపించాడు.. పైగా సారీ కూడా చెప్పాడని ఇక పట్టించుకోకుండా తిరిగి నా ప్రకృతి లో మునిగిపోయాను..

మేము ఊరు చేరుకున్న మరుసటిరోజు ఆ ఊర్లో సంవత్సరానికొకసారి జరిగే జాతర రోజని తెల్సింది.. ఆ రోజు సాయంత్రం పెళ్ళికి వచ్చిన చుట్టాలందరం జాతరకి వెళ్ళాలనుకున్నాం.. నా సిటీ ఫ్యాషన్ చూపించి ఫోజు కొట్టాలని నేను పెట్లోంచి చుడీదార్ తీస్తే మా పిన్ని గుర్రుమని చూసింది.. ఇక ఓణీ కట్టుకోక తప్పలేదు! అప్పుడప్పుడే చలి మొదలైనా అది ఏజెన్సీ ప్రాంతం అవ్వటం వలన మాములు కంటే చలి ఎక్కువగానే ఉంది.. రోడ్డుకి రెండు పక్కలా పెద్ద చెట్లు.. చెట్ల మధ్య నించి వెన్నెల మసగ్గా పిండిలా జారుతుంటే, చలికి కాస్త వణుకుతూ వోణీ ని చుట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ నడవటం మళ్ళీ నేనెప్పటికీ ఆస్వాదించలేని అద్భుతమైన అనుభవం..

జాతర జరిగేచోట అంతా కోలాహలంగా ఉంది.. అంతా అరుపులు, డప్పుల ధ్వని.. అంతలో మా పిన్ని వాళ్ళ అబ్బాయికి బెలూన్ మీద మనసు పోయింది.. పిన్ని వాడిని నాకు అప్పగించేసి ఇక నీ ఖర్మ అన్నట్లు చూసింది.. అ బెలూన్ వాడి దగ్గర బోల్డంతమంది జనం.. మనమేమో పెద్దగా అరిస్తే నామోషీ అనుకునే రకం.. అలా అక్కడే తచ్చట్లాడుతుంటే ఎవరో పక్కనించి వచ్చి 'ఉండండి నేను తెచ్చిస్తాను ' అని అర నిమిషంలో బెలూన్ తో మాముందు ఉన్నాడు.. అమ్మయ్య అనుకుంటూ అతని వంక చూస్తూనే గుర్తు పట్టా, పొద్దున్న బస్ లో నాకు మొట్టికాయ ఇచ్చిన శాల్తీ అని.. వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంటే 'భలేవారే ఈ మాత్రం దానికి డబ్బులు ఎందుకండి ' అంటూ నవ్వాడు.. అబ్బాయిలు కొంటెగా, వంకరగా, అల్లరిగా ఇంకా నానారకాలుగా నవ్వగలరుగానీ అందంగా మాత్రం నవ్వలేరనే నా నమ్మకానికి అదే ఆఖరి క్షణం అనుకుంటా!!

వెన్నెల్లో.. ఆ అబ్బాయి నవ్వు... 'అమ్మో! ఎటో వెళ్ళిపోతోంది మనసు ' అనుకుంటూ అతను ఏదో అంటున్నా వినిపించుకోకుండా మా వాళ్ళు ఉన్నచోటుకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను.. కానీ ఆ నవ్వు దగ్గర చిక్కుకుపోయిన నా కళ్ళు వెనక్కి రావడానికి రెండు మూడు రోజులు పట్టింది!!

పెళ్ళైన కొత్తల్లో అంటే ఒకానొక ప్రాచీనకాలంలో ఇలాంటి వెన్నెల రాత్రి సమయంలో నేనూ, మావారూ జర్నీ చేస్తుంటే పై కధంతా చెప్తే 'మరి పెళ్ళికి ముందు నా నవ్వు తెగ నచ్చిందన్నావ్.. ఇప్పుడేమో నాకంటే ముందు ఏవడో బెలూన్ బచ్చాగాడి నవ్వు బావుందంటున్నావ్ ' అని బాధగా, దిగులుగా అన్నారు.. 'అయ్యో, అలా దిగులు పడకండీ మీ నవ్వే ఎక్కువ నచ్చింది. అందుకే మిమ్మల్ని చేసుకున్నా' అని అనునయించాను.. అప్పటినించీ ఆయనకి వెన్నెలరాత్రి నన్ను ఒంటరిగా ఎక్కడికన్నా పంపాలంటే భయం.. మళ్ళీ ఎవరిదన్నా నవ్వు నచ్చిందంటానేమో అని!!

(Posted in Telugupeople.com)