Pages

Friday, January 4, 2013

మనో విహంగాలు

వసంతాలూ.. వెన్నెల నీడలూ.. వెదురు తోటలూ
అన్నిటినీ ఒకేసారి కావలించుకోవాలని
గూడువదిలిన సీతాకోకచిలకల్లా హడావిడి పడుతుంటాయి…

 
స్వప్నసంచారాల నిదురవేళల్లో
కొబ్బరాకుల చివుళ్ళపై
రేపటి కలల్ని పేరుస్తుంటాయి..

 
పొగమంచుని తాకిన
పొద్దుటెండలోని మెత్తదనం…

 
నల్లని వర్షపు రాత్రులలో
తడితడిగా మునకలేసిన మోహాలు…

తుంపులు తుంపుల జ్ఞాపకాలూ…
గాఢమైన దిగుళ్ళూ…

 
మనసు పట్టక.. దేహపు అంచుల్ని దాటేసి
నింపాదిగా ప్రవహించే భావాలెన్నో!
తెల్సిన అక్షరాలు మాత్రం గుప్పెడే!!

 
అనుభూతులన్నిటికీ అస్థిత్వాన్నిఅద్దుతుంటాయి…
అసంఖ్యాక చిత్రాలనెన్నిటినో ఆవిష్కరిస్తాయి!

 
కానీ..
 

నైరాశ్యపు క్షణాలు కొన్ని
అస్సలిష్టంలేని అగరుబత్తి ధూపంలా
చుట్టుముట్టునప్పుడు మాత్రం…..

 
శీతాకాలపు సాయంకాలాలలో
నిశ్శబ్దపు వాగుమీద
వంతెనొకటి పేర్చాలన్నా…

 
లోపలా.. బయటా..
తుళ్ళిపడే ప్రేమావేశ జలపాతాన్ని
దారిమళ్ళించాలన్నా…

 
అక్షరాలు అదృశ్యమైన భాష ఒకటి మిగులుతుంది!

-- మొదటి ప్రచురణ వాకిలి లో....